విచారణకు హాజరైన పీఆర్కే సోదరులు | - | Sakshi
Sakshi News home page

విచారణకు హాజరైన పీఆర్కే సోదరులు

Sep 28 2025 7:25 AM | Updated on Sep 28 2025 7:25 AM

విచారణకు హాజరైన పీఆర్కే సోదరులు

విచారణకు హాజరైన పీఆర్కే సోదరులు

కూటమి ప్రభుత్వం వచ్చాకే అక్రమ కేసులు

మాచర్ల : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామానికి సంబంధించిన బోదిలవీడు సమీపంలో కొంతకాలం క్రితం జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో విచారణ జరిపేందుకు మాచర్ల రూరల్‌ పోలీసులు శనివారం హాజరు కావాలని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన నాయకులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రూరల్‌ పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. టీడీపీ నేతల హత్య కేసులో అంతర్గత ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ రెండు హత్యలు జరిగినా వీరు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్‌ వచ్చింది. శనివారం ఉదయం10.30 గంటల నుంచి రాత్రి వరకు పోలీసులు విచారిస్తున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్‌, రూరల్‌ సీఐ ఎన్‌.షఫితోపాటు ఇతర అధికారులు సుదీర్ఘంగా లాయర్ల సమక్షంలో విచారించారు. పీఆర్కే, పీవీఆర్‌, రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, రామలక్ష్మణరెడ్డి, న్యాయవాదులు బి.నాగిరెడ్డి, సీహెచ్‌ నాగిరెడ్డి, గుంజా ప్రసాద్‌, రామ్‌నాయక్‌తో కలిసి వారు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తరువాత విచారణ ప్రారంభించి అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి గురజాల డీఎస్పీ జగదీష్‌ ఆధ్వర్యంలో సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఆ సమయంలో మాచర్ల రూరల్‌ పోలీసు స్టేషన్‌ ముందు అర్బన్‌ సీఐ ప్రభాకర్‌, కారంపూడి సీఐ శ్రీనివాసరావులతోపాటు పలువురు పోలీసు అధికారులు వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు ఒకేచోట చేరకుండా వెళ్లిపోవాలని చెప్పారు. పూర్తిగా బస్టాండ్‌కు వెళ్లే రోడ్డు నుంచి పీఆర్కే ఇంటి వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు జంట హత్య కేసు విషయంలో తనకు, తన సోదరుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా కేసు పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పది గంటల విచారణ అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసి, పోలీసులకు విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో తాను, తన సోదరుడు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మాచర్ల రూరల్‌ పోలీసు స్టేషన్‌ పోలీసుల విచారణకు సంబంధించి సహకరించామన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. రానున్న రోజుల్లో కూడా పోలీసులు విచారణకు పిలిస్తే తాము సహకరిస్తామన్నారు. కేసుతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసు కావడంతో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement