
రజత కవచాలంకృతగా దర్శనమిచ్చిన బాలచాముండేశ్వరీదేవి
అమరావతి: ప్రఖ్యాత శైవక్షేత్రమైన అమరావతిలో వేం చేసియున్న శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీయిజశుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 9 రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ వేడుకలలో మొదటిరోజు రజతకవచాలంకృత అలంకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ ఆధ్వర్యంలో చండీ, రుద్రహోమాలు, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ అమ్మవారి అలంకార విశిష్టతను వివరించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో తొలిరోజు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం వాసవీ మహిళా మండలి సభ్యులు లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. మెయిన్ బజార్‌లోని సీతాసమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలోని శ్రీదేవీశరన్నవరాత్రమహోత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక బాలత్రిపురసుందరిదేవి అలంకారం చేశారు. గ్రామంలోని భక్తులు పెద్దసంఖ్యలో మూడుదేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు..
దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా తొలిరోజు ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, రుత్విక్కరణతో కలశస్థాపన నిర్వహించారు. జ్వాలాముఖి, బాలాచాముండేశ్వరి అమ్మవార్ల అలయాలలో త్రికాలర్చనలు నిర్వహించారు. భక్తులచే నిర్వహించబడే చండీహోమాలను ఉభయదాతలతో నిర్వ హించారు.