
కృష్ణానదిలో పెరిగిన వరద
దాచేపల్లి: కృష్ణానదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం మత్యకారుల కాలనీకి కూతవేటు దూరంలో నదిలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మత్స్యకారుల కాలనీకి కేవలం 10 అడుగుల దూరంలో వరద ప్రవహిస్తుండటం వలన వారు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల పెంచితే కాలనీలోకి వరద వచ్చే అవకాశం ఉంది. దాదాపు 50కిపైగా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. సామగ్రిని సర్దుకుని ఇళ్లు ఖాళీ చేసేందుకు ఇప్పటికే వారు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే పునరావాస కేంద్రానికి ముంపు ప్రాంతాల వారిని తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నాన్నారు. నదికి సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఇప్పటికే వరద నీరు ప్రవహిస్తోంది. రైతులకు నష్టం వాటిల్లింది.