
కార్యకర్తలకు డిజిటల్ బుక్‌తో న్యాయం
అన్యాయం చేసిన అధికారి ఎక్కడున్నా పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెడతాం కార్యకర్తల అనుమతి లేకుండా పార్టీలో ఎవర్నీ చేర్చుకునే ప్రసక్తే లేదు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే నంబూరు, సమన్వయకర్త డాక్టర్ గజ్జల జిల్లా పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరణ
అందరికీ అందుబాటులో యాప్
నరసరావుపేట: కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకి భవిష్యత్‌లో న్యాయం చేసేందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్‌ను ప్రవేశపెట్టారని పార్టీ జిల్లా నేతలు పేర్కొన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన యాప్ ఆవిష్కరణలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు.
వేధింపుల నుంచి కార్యకర్తలకు అభయం
మాజీ మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. రోజుల తరబడి జైళ్లపాలు చేస్తున్నారన్నారు. వీటిని సాక్ష్యాలతో డిజిటల్ బుక్‌లో నమోదు చేసుకునే అవకాశం పార్టీ అధ్యక్షులు కల్పించారన్నారు. డిజిటల్ బుక్ కార్యకర్తలకి ఓ పెద్ద అభయంగా అభివర్ణించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ బుక్ యాప్ ఆవిష్కరించటం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరిట అరాచకం
మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ రెడ్‌బుక్ పేరుతో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం ఏపీలో కూటమి నాయకులు వల్ల వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులు, కక్షతో వేధించటమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇది ఏమాత్రం మంచి సంస్కృతి కాదని పేర్కొన్నారు. డిజిటల్ బుక్‌తో కార్యకర్తలు, సానుభూతిపరులకు ఒక భరోసా కలుగుతుందన్నారు.
కార్యకర్తల కష్టాలకు గుర్తింపు
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బుక్ అంటే కార్యకర్తలు పడే కష్టాలకు ఒక గుర్తింపు కోసం మెమోరీ కార్డులాంటిదని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఇది రెడ్ బుక్ లాంటిది కాదని, డిజిటల్ లైబ్రరీలా పనిచేస్తుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఇబ్బందులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు జగనన్న ఇచ్చే నమ్మకం, రక్షణగా అభివర్ణించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఇంటలెక్చ్యువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం స్వామి, విద్యార్థి, యువత విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా కార్యదర్శి సుజాతాపాల్, అంగన్వాడీ విభాగ జిల్లా కార్యదర్శి హెల్డా ఫ్లోరెన్స్, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రొంపిచర్ల మండల కన్వీనర్ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్, జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ఈ యాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్మార్టు ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పేరు, వివరాలు నమోదు చేయాలన్నారు., జరిగిన అన్యాయానికి సంబంధించి ఫొటోలతో అప్‌లోడ్ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి జరిగిన అన్యాయం, గొడవలు, కొట్లాటలు, వేధింపులు మొత్తం వివరాలు నమోదు చేయాలని కోరారు. స్మార్టుఫోన్ లేని వారి కోసం ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారన్నారు. ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి ఆపరేటర్‌కు జరిగిన అన్యాయాన్ని తెలియజేసి వివరాలు నమోదు చేయించాలని సూచించారు.