రంజాన్ మాసంలో జకాత్‌తోపాటు ఫిత్రాను విధిగా చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబం యోగక్షేమం కోసం ప్రతి వ్యక్తి పేరు మీద కిలో 250 గ్రాముల గోదుమలు లేదా దానికి సమాన విలువ గల నగదును ఫిత్రాగా పేదలకు పంచుతారు. ఇవన్నీ రంజాన్ ముగింపు సందర్భంగా జరుపుకొనే ‘ఈదుల్ ఫితర్’ నమాజు కంటే ముందుగానే చెల్లించడం ఆనవాయితీ.
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ఇస్లాం ఐదు మూల సిద్ధాంతాల్లో ‘జకాత్’ కూడా ఒకటి. జకాత్.. ఈ పేరు వింటే యాచకులు, గరీబుల (పేదల) ఆనందానికి హద్దులు ఉండవు.. జకాత్ ఎక్కడ.. అంటూ ఆరా తీసి వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఓ స్థాయి దాటి డబ్బున్న ప్రతి ముస్లిం జకాత్ చెల్లించాలి. అదీ ఎవరికైతే డబ్బు అవసరమో వారికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆదుకోవడమే. మహ్మద్ ప్రవక్త (స.అస) కాలం నుంచే ఈ జకాత్ పద్ధతి కొనసాగుతోంది.
ఇదీ నిబంధన..
జకాత్ ఇవ్వడానికి ఒక ముస్లిం దగ్గర 60.755 గ్రాముల బంగారం, 425.285 గ్రాముల వెండి లేదా దీనికి సమాన విలువ గల నగదు (ఇళ్లు, భూమి, వాహనాలు, ఇతర వస్తువులు) ఏ రూపంలో ఉన్నా వారు జకాత్ ఇవ్వడానికి అర్హులు. ఉదాహరణకు ఒక్క ముస్లిం వద్ద రూ.16,200 కంటే ఎక్కువగా నగదు ఉండి ఏడాది దాటితే 40వ భాగం జకాత్‌గా
చెల్లించాలి. జకాత్ ఫిత్రాల వల్ల పుణ్యం లభిస్తుందని పలువురు మతపెద్దలు పేర్కొంటున్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథం కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రబోధించింది. మనుషుల్లోని పేద, ధనిక అసమానతలను పోగొట్టడానికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, కృతజ్ఞతభావం పెరగడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. పేదలకు దానం చేయడం వల్ల వారు కూడా ఈ మాసాన్ని సంతోషంగా జరుపుకొనే అవకాశం లభిస్తుంది.
నిరుపేదలకు మాత్రమే..
జకాత్ ప్రధానంగా పేదవారైన తమ బంధువులకు ఇస్తారు. అనాథలకు, వితంతువులు, వికలాంగులు, కడు పేదవారికి ఇస్తారు. సయ్యద్ వంశస్థులకు జకాత్ ఇవ్వరాదు. సయ్యద్‌లు మహ్మద్ ప్రవక్త (స.అస) సంతతికి (అహ్లెబైతె అతహార్) చెందిన వారు కావడంతో వారికి చెల్లించరాదు. సయ్యద్‌లను ఆపదలో ఆదుకోవచ్చు. కానీ జకాత్ పేరిటకాదు.
సేవా నిరతితో..
ఇస్లాం మతంలో జకాత్ డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది డబ్బున్న వారు ‘జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్టు’ పేరుతో ప్రతి ఏడాది రూ.కోట్లతో ఉచిత వివాహాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దుస్తులతోపాటు పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు.
విధిగా చెల్లించాల్సిందే..
ఇస్లాం ఫర్జులలో జకాత్ ఒకటి. జకాత్‌ను అర్హత ఉన్న ప్రతి ఒక్క ముస్లిం చెల్లించాలి. జకాత్‌ను చెల్లిస్తే అల్లా వారిని నరకం అగ్ని నుంచి కాపాడుతాడు. జకాత్‌ను చెల్లిస్తే మన ఆస్తిలో బర్కత్ లభిస్తుంది.
– మౌలానా మొహ్‌సిన్‌పాషా ఖాద్రీ,మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment