ఇంకొకరి ఆకలి తీర్చాలంటే మనకు ఆకలి తెలియాలి. మహ్మదీయులు ఈ మాసంలోఆకలితో ఉండేది.. ప్రేమను తీర్చేందుకే.ఇతరులకు మంచి చేసే సంకల్పంలోవారికి ఆకలి బాధే తెలియదు. అంత గొప్ప నియమం ఈ మాసం.అంత గొప్ప పుణ్యం ఈ ఆకలి.మహమ్మదీయుల దగ్గర ప్రపంచంనేర్చుకోవాల్సిన ధర్మం.. ఆకలి తీర్చే ఆకలి. రమజాను మాసం అనగానే ఉపవాసాలు గుర్తొస్తాయి. దేవుడిని ఆరాధించే మార్గాల్లో ఉపవాసం కూడా ఒకటి. ముస్లింలు ఉపవాసం ఎందుకు చేస్తారు? దేవుని వాక్కు అయిన దివ్య ఖుర్‌ఆన్ ఈ మాసంలోనేప్రవక్త ముహమ్మద్ ద్వారా మానవాళికి లభించింది. దానికి కృతజ్ఞతగా ఈ మాసంలో ముస్లిములు ఉపవాసాలు పాటిస్తారు. అదొక్కటే కాదు ఈ మాసం అంతా శిక్షణాకాలం లాంటిది. ఇస్లామీయ బోధనలు, ప్రమాణాల ప్రకారం ఈ నేల అంతా ముస్లింలు జీవించడానికి నిబద్ధులవుతారు. ఈ నెల రోజుల శిక్షణ తర్వాత మిగిలిన పదకొండు నెలల జీవితాన్ని క్రమబద్ధం చేస్తుందని ముస్లింల విశ్వాసం. ‘రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచెయ్యాలి’ అని ఖురానులో ఉంది. అందుకే ముస్లింలు దేవుని పట్ల భయభక్తులతో ఉపవాసాలు ఉంటారు. ఎవరు చూడని ఏకాంతంలో ఉన్నప్పటికీ పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిగ్రహాన్ని పాటిస్తారు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహæ దీనికి కారణం. భారతదేశంలో అయితే దాదాపు పధ్నాలుగు గంటల పాటు, ఇంగ్ల్లండు వంటి దేశాల్లో అయితే దాదాపు పద్ధెనిమిది గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. అందుకే మనిషి కడుపు నిండా తినరాదని మూడింట ఒక వంతు కడుపు ఖాళీగా ఉండాలని ప్రవక్త బోధించారు.
పంచుకునే మాసం
రంజాను మాసంలో అన్నపానీయాలకు దూరంగా ఉండడమే కాదు, తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ నెలలో చాలా సాధారణంగా కనబడే దృశ్యం. మసీదుల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఉపవాస విరమణ (ఇఫ్తార్) జరుగుతున్నప్పుడు చాలా మంది తమతో పాటు ఆహారపదార్థాలు తీసుకుని వస్తారు. కొందరు ఏమీ లేకుండానే వచ్చేస్తారు. తమ పక్కన ఉన్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరు పట్టించుకోరు. తన వద్ద ఆహారం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు పెడతాడు. అవతలి వ్యక్తి కూడా నిస్సంకోచంగా తీసుకుని తింటాడు. తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటాడు. ఇలా పంచుకుని తినే అందమైన వాతావరణం రమజానులో చాలా సాధారణంగా కనబడుతుంది. ఇదే పద్ధతి సంవత్సరమంతా ఉంటే ఆకలితో బాధపడే వారెవ్వరు సమాజంలో ఉండరు. రమజాను మాసంలో అన్నదానాలు, ఇఫ్తార్ విందులు జరుగుతూనే ఉంటాయి. అందులో పేదలు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం కూడా చూడవచ్చు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది.
పేదరికానికి జవాబు
పేదరిక నిర్మూలనకు ఇస్లామ్ ప్రతిపాదించే సూత్రం పంపిణీ. సమాజం వద్ద వ్యక్తుల వద్ద ఉన్న సంపదలో పేదసాదలకు కూడా హక్కు ఉందని ఇస్లాం చెబుతుంది. ఈ సంపద పంపిణీకి ఇస్లామ్ ప్రతిపాదించే గొప్ప నియమం జకాత్. ఆ మాటకు అర్థం ‘తప్పనిసరిగా చేయవలసిన దానం’. ‘తల్లిదండ్రులను, బంధువులను, అనాథలను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. జకాత్ ఇవ్వాలి’ అని ఖురానులో ఉంది. ఆ జకాత్ ఎలా ఇవ్వాలి? ‘కేవలం పరుల మెప్పును పొందటానికి ఇవ్వకండి. దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి ఇవ్వకండి. అలా చేస్తే మీ దానం మట్టిలో కలిసినట్టే‘ అని ఖురాన్‌లో ఉంది. రమజాను మాసంలో అందువల్లనే ముస్లిములు ఇతోధికంగా దానధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. దేవుని ప్రసన్నతతో పాటు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవిస్తారు.
జకాత్ అంటే శుభ్రం చేయడం
జకాత్ అంటే అసలు అర్థం శుభ్రం చేయడం. మనిషి తన సంపద నుంచి తాను శుభ్రపడాలి. ఉన్నసంపదలో రెండున్నర శాతం జకాత్‌గా చెల్లించాలి. ఎవరికి చెల్లించాలన్నది కూడా నిర్ధిష్టంగా ఉంది. రమజాను మాసంలో తప్పనిసరిగా చేసే మరో దానం ఫిత్ర్. ఇది పండుగ ముందు రోజు చేస్తారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే, తల ఒక్కింటికి రెండున్నర కిలోల ధాన్యం లేదా దాని సమాన వెల పేదలకు ఇవ్వాలి. పండుగ రోజున ఏ పేదసాదలు ఖాళీ కడుపుతో ఉండరాదని చేసిన ఏర్పాటిది. ఇవి కాకుండా ‘సదఖా’ రూపంలో స్వచ్ఛందంగా చేయవలసిన దానాలను కూడా ఇస్లాం ప్రోత్సహించింది. అందుకే రమజాను మాసంలో విస్తృతంగా దానధర్మాలు చేయడం మనకు కనబడుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, ఎమన్ దేశాల్లో ఏటా 38,088 కోట్ల రూపాయలు జకాత్ పేరుతో సమీకరణం అవుతున్నాయి. ఇవి ప్రపంచ దేశాలలో అవసరమైన మానవీయ సహాయానికి తోడ్పడుతున్నాయి. మతాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తమ సంపదలో రెండున్నర శాతం దానం చేయగలిగితే అసలు పేదరికం అనేదే ఉండదు. జకాత్‌లో గొప్ప ఆర్థిక సూత్రం ఇది.
దానం వల్ల కలిగే మేలు
ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహకారానికి జకాత్, సదకా నిధులను ఉపయోగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు 2013లో అంతర్జాతీయ మానవీయ సహకారానికి అందించిన మొత్తం 14,700 కోట్ల రూపాయలు. ముస్లిం దేశాల్లో జకాత్ వసూలు ప్రభుత్వ పరంగా జరుగుతుంది. ముస్లిమేతర దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు జకాత్ వసూలు చేసి సేవాకార్యక్రమాలకు, విద్య, వైద్యం తదితర కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతోంది. జకాత్ ఫౌండేషన్ భారతదేశంలో సివిల్ సర్వీసు కోచింగ్ వంటి సేవలు కూడా అందిస్తోంది. సిరియాలో అంతర్యుద్ధంలో దాదాపు రెండున్నర లక్షల మంది మరణించారు. టర్కీ తదితర దేశాలు అక్కడ భారీస్థాయిలో మానవీయ సహకారం జకాత్ నిధుల నుంచే అందిస్తున్నాయి. అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు, ఎబోలా వంటి వ్యాధులు ఇలా ఎన్నెన్నో కడగండ్లు. అంతర్జాతీయ మానవ సహకారానికి నిధులు సరిపోని పరిస్థితి. దానం చేయడం అంటే ఎదుటి వాడికి ఉపకారం చేయడం కాదు. అది పుచ్చుకునేవాడి హక్కు, ఇచ్చేవాడి బాధ్యత అన్న భావన ఇస్లామ్‌లో ముఖ్యమైనది.
– వాహెద్
ఆకలి తీర్చే ఆకలి
Published Fri, May 18 2018 12:12 AM | Last Updated on Fri, May 18 2018 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment