ఔన్నత్యానికి అనుగుణంగా నడచుకుంటేనే అల్లాహ్ అనుగ్రహం
అల్లాహ్ అమిత దయాళువు. ఆయన కరుణ, దయ అపారం. అనంతం. మొత్తం సృష్టిని, సృష్టిలోని సమస్తాన్నీ ఆయన కారుణ్యం పరివేష్టించి ఉంది. ఆయన దయానుగ్రహాలు అనునిత్యం సృష్టిలోని సమస్త జీవ, నిర్జీవ, వస్తు, ప్రాణి, పదార్థాలపై అనంతంగా వర్షిస్తున్నాయి. అందుకే ఈ విశ్వవ్యవస్థ ఎంతో సమతుల్యతతో, ప్రశాంతతతో ప్రణాళికాబద్ధంగా మనుగడ సాగిస్తోంది. ఇంతటి సమగ్ర పథకంతో సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దబడిన ఈ సృష్టివ్యవస్థకు మానవుడు కథానాయకుడు.
మానవుడు లేని సృష్టి ఆత్మ లేని దేహం లాంటిది. ఎందుకంటే, అత్యద్భుతమైన, అనుపమానమైన ఈ సృష్టిలో వేనవేల సృష్టిరాశులు, జీవరాశులు వున్నప్పటికీ ఒక్క మానవుడు కనుక లేకపోయినట్లయితే, ఈ సృష్టికి ఒక అర్థం కాని, విలువగాని ఉండేది కాదు. వాస్తవం ఏమిటంటే, దైవం ఈ సృష్టినంతటినీ మానవుడికోసమే సృజించాడంటే అతిశయోక్తి కాదు. ఇతర మరే ప్రాణికీ ప్రాప్తం కానటువంటి ఇంత గొప్ప గౌరవం, ఔన్నత్యం, ఆదరణ ఒక్క మానవుడికే దక్కిందంటే తప్పకుండా అతనిలో ఒక ప్రత్యేకత ఉండి తీరాలి. అదే బుద్ధిబలం. మంచీ చెడుల విచక్షణాజ్ఞానం. అందుకే మానవుడికి ఇంతటి ప్రత్యేకత, ప్రాముఖ్యత.
అల్లాహ్ తన అపార కరుణాకటాక్షాలతో మానవుడిపై ఇంతటి దయను, మమతానురాగాలను, కరుణానుగ్రహాలను కురిపిస్తే, మరి మానవుడు కూడా ఆ ప్రత్యేకతను, గౌరవాన్ని కాపాడుకుంటూ, హోదాకు తగినట్లు బాధ్యతగా మసలుకోవాలి. ఒకరకంగా ఇది అతనికి పరీక్ష. దీనిపైనే మానవ శ్రేష్ఠత, జీవన సాఫల్యం ఆధారపడి ఉన్నాయి. నిజానికి కారుణ్యగుణమన్నది అల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకం. కాని ఆయన సృష్టి ప్రారంభం నాడే కారుణ్యాన్ని నూరుభాగాల్లో విభజించి కేవలం ఒకే ఒక్క భాగాన్ని సమస్త సృష్టిపై చిలకరించాడు.
ఆ గుణ ప్రభావం కారణంగానే సృష్టిలోని జీవజాలంలో ప్రేమానురాగాలు, దయ, కరుణ కనిపిస్తున్నాయి. క్రూరమృగాలు, విషసర్పాల్లో కూడా మనం ఈ ప్రేమ, కరుణ, దయాగుణాలను గమనించవచ్చు. ఇతర జీవరాసులతో పోల్చుకుంటే మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత దృష్ట్యా ఈ సుగుణం అతనిలో విశాలంగా, విస్తారంగా ఉండాలి.
అందుకే ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి ఉండదో అలాంటివారిని అల్లాహ్ తన ప్రత్యేక కరుణకు దూరంగా ఉంచుతాడని కూడా ప్రవక్త మహనీయులు హెచ్చరించారు. ‘సృష్టి సమస్తం దేవుని కుటుంబం. కనుక మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో, కరుణ, వాత్సల్యాలతో, సహన, సానుభూతులతో వ్యవహరిస్తూ, సృష్టిలోని ఇతర జీవరాశులన్నిటి పట్లా దయతో, ప్రేమతో, బాధ్యతతో మసలుకోండి’ అని ఉపదేశించారు.
అంటే అల్లాహ్ తన అపార కరుణతో మానవుడికి ప్రసాదించిన ప్రత్యేకత దృష్ట్యా తనలాంటి ఇతర మానవులందరినీ సమానంగా చూస్తూ, నిర్మల మనసుతో ప్రేమిస్తూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, భువిపై నివసించే అన్ని రకాల జంతుజాలం, పశుపక్ష్యాదుల పట్ల కూడా దయ, కరుణ, సానుభూతి ప్రదర్శించాలి అని అర్థం. కనుక మానవుడు దైవచింతనకు అనుగ్రహించిన స్థాయిని, ప్రత్యేకతను, శ్రేష్టతను కాపాడుకుంటూ దైవోపదేశాలకు, ప్రవక్త హితోపదేశాలకు అనుగుణంగా మనుగడ సాగిస్తే ఇహలోకంతోపాటు పరలోకంలోనూ శాంతి సాఫల్యాలను సొంతం చేసుకోవచ్చు.
- యండీ ఉస్మాన్‌ఖాన్