తార్నాక: ఒకరు సినీహీరో.. మరొకరు సినీ అసిస్టెంట్. ఇద్దరూ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. వాటి నుంచి బయట పడేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. వీరిలో ఒకరు ఇళ్లల్లో చోరీలు చేస్తూ దోపిడీ దొంగగా మారితే.. ఆ సొత్తును మరొకరు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి పలు మార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా చోరీలు మాత్రం మానలేదు. తిరిగి దొంగతనాలు చేస్తున్న.. అతనికి సహరిస్తున్న వ్యక్తిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఓయూ పోలీసు స్టేషన్‌లో ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్, అడిషనల్ డీసీపీ గోవింద్‌రెడ్డి, కాచిగూడ డివిజన్ ఏపీసీ నర్సయ్య, ఓయూ ఇన్‌స్పెక్టర్ జగన్ ఆ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నాగారానికి చెందిన విక్కీ బలిజ, అలియాస్ విక్కీరాజ్ సిమాల్లో నాలుగేళ్లు అసిస్టెంట్‌గా పనిచేశాడు.
కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్.. విక్కీరాజ్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. కాగా మహేష్‌కు సినిమాలంటే పిచ్చి. ఈ క్రమంలో ‘నివురు’ అనే సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. అయితే ఆ చిత్రం బక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. దీంతో అప్పుల పాలయ్యాడు. విక్కీరాజ్‌కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. నగరంలో సంపన్నులుండే కాలనీల్లో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించే వాడు. తాను కేబుల్ ఆపరేటర్‌గా చెప్పుకుంటూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవాడు. రాత్రివేళల్లో ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. ఇలా తస్కరించిన సొమ్మును మహేష్‌కు తెచ్చివ్వగా అతడు విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకుని జల్సాలు చేయడంతో పాటు అప్పులు తీరుస్తూ వచ్చారు.
ఇలా దొంగతనాలకు పాల్పడుతూ విక్కీ 2016లో జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలు మానకపోగా 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలు ఇళ్లల్లో చోరీలకు తెగబడ్డాడు. ఇతనిపై ఓయూ పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, ఆ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా, విక్కీ బలిజ, మహేష్‌లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాము ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా విక్కీపై పీడీయాక్టు నమోదు చేసినట్లు ఓయూ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment