నాన్న ఊపిరి | Emotion that shows the hero | Sakshi
Sakshi News home page

నాన్న ఊపిరి

Published Sat, Nov 3 2018 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Emotion that shows the hero - Sakshi

జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి.ఊపిరి పీల్చివదలడం కూడా అంతే.ఒకటి నిలబెట్టేది, ఒకటి పడగొట్టేది కాదు. రెండూ ఉండాలి. ఈ రెండిటితో నడిచిన క్రైమ్‌ డ్రామా ‘బ్రీత్‌’. ఇందులో ఒక తండ్రి ఎమోషన్‌ ఉంటుంది. అతడు దుర్మార్గుడే అయినా.. హీరోగా చూపిస్తుంది ఆ ఎమోషన్‌. కొడుకు ఊపిరి కోసం  నాన్న తీసిన ఊపిరే.. ఈ కథ. చదవండి.

‘‘నాన్నా.. ఎన్నో కలలతో ముంబై వచ్చాను. ఇక్కడ నా ఒంటరి ప్రయాణం గురించి మీరెంత భయపడ్డారో.. కలత చెందారో నాకు తెలుసు. అనుకున్నది సాధించడం అంత ఆషామాషీ కాదని అర్థమైంది నాన్నా!
సారీ.. నాన్నా.. ఈ పని చేస్తున్నందుకు క్షమించండి’’ అంటూ కాళ్లను కట్టేసుకుని.. పాలిథిన్‌ కవర్‌ను ముఖానికి చుట్టేసుకుని.. తనంతట తానుగా చేతులనూ కుర్చీ వెనక్కి కట్టేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది పాతికేళ్ల ఓ అమ్మాయి. ఈ వ్యవహారాన్నంతా ఫోన్‌ వీడియోలో రికార్డ్‌ చేస్తుంది. నటి అవ్వాలనే ఆశయంతో ఆమె ముంబైకి వస్తుంది.
   
ట్రెడ్‌మిల్‌ మీద వేగంగా పరిగెడుతుంటాడు ఓ వ్యక్తి. ఎంతలా అంటే ఆ ఆయాసం ఆయనకున్న ఆస్తమాను ఎఫెక్ట్‌ చేసేంతగా. నా వల్ల కాదు.. ప్లీజ్‌ నన్ను వదిలేయ్‌.. అని బతిమాలుకుంటూ బతిమాలుకుంటూ ట్రెడ్‌ మిల్‌ మీదే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఈ విషయం అతని కొడుకుకి తెలిసి.. ఇంటికొచ్చి.. ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయినట్టు డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకు కార్డియాక్‌ అరెస్ట్‌ అయి చనిపోతాడు. అతను.. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌. ఆస్తమా తప్ప ఏ ఇబ్బంది, బాదరబందీ లేక సంతోషంగా లైఫ్‌ను లీడ్‌ చేస్తున్న వ్యక్తి. 
   
ఒక వర్షం రాత్రి.. బైక్‌ మీద వెళ్తున్న ఒకతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మరణిస్తాడు. హెల్మెట్‌ ఉంటే బతికేవాడే అనుకుంటారంతా. హెల్మెట్‌ ఉంటుంది. తన బైక్‌ వెనకాలే లాక్‌ చేసి! ‘‘సేఫ్టీ విషయంలో అతను చాలా అబ్సెసివ్‌. హెల్మెట్‌ లేకుండా వెళ్లడు. అలాంటిది హెల్మెట్‌ను బైక్‌ వెనకాల లాక్‌ చేసుకొని.. బైక్‌ రైడ్‌ చేయడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది..ఎంక్వయిరీ చేయించండి’’ అంటూ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌కి కంప్లయింట్‌ ఇవ్వడానికి వస్తుంది అతని గర్ల్‌ ఫ్రెండ్‌. ‘‘నీ బాధ అర్థమైంది.. ఈ మంచినీళ్లు తాగు.. అయినవాళ్లు పోతే.. ఇలాంటి మానసిక స్థితే ఉంటుంది. ధైర్యంగా ఉండాలి’’ అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు కాప్‌. ‘‘విషయం అది కాదు.. ’’ అని ఆమె ఏదో చెప్పబోతున్నా.. వినకుండా పంపించేస్తాడు ఇన్‌స్పెక్టర్‌. చనిపోయి కుర్రాడికి 28 ఏళ్లు. ఐటీ ప్రొఫెషనల్‌. ఇతనూ రిటైర్డ్‌ పర్సనే. దినచర్యలో భాగంగా కంట్రీక్లబ్‌కు వెళ్లి.. స్విమ్మింగ్‌ చేయడం అలవాటు. ఆ ప్రకారం ఆ రోజూ ఎప్పటిలాగే స్విమ్మింగ్‌ పూల్‌కి వెళ్లాడు. ఈత కొడ్తున్నప్పుడు కరెంట్‌ పోతుంది. నీళ్లల్లో ఉక్కిరిబిక్కిరై.. ఊపిరి ఆగిపోతుంది. 
   
ఆర్ట్‌ గ్యాలరీ స్టోర్‌ రూమ్‌లో.. ఒక లేడీ ఆర్టిస్ట్‌ పడి ఉంది. కింద అన్నీ నీళ్లు.. కరెంట్‌ తీగ వేలాడ్డానికి సిద్ధంగా ఉంది. పొరపాటున ఆ నీళ్లల్లో పడితే.. షాక్‌ తగిలి.. ఆ ఆర్టిస్ట్‌ చనిపోవడం ఖాయం. అది జరగబోతుండగా.. ఇన్‌స్పెక్టర్‌ వచ్చి.. కరెంట్‌ తీగను నీళ్లలో వేయబోతున్న వ్యక్తిని పట్టుకుంటాడు. తర్వాత ఇంటరాగేషన్‌లో అతనిని గుండె దగ్గర కాలుస్తాడు. కరెంట్‌ షాక్‌తో ఆ లేడీ ఆర్టిస్ట్‌ను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? డానీ. ఫుట్‌బాల్‌ కోచ్‌. ఒక్క మహిళా ఆర్టిస్ట్‌నే కాదు.. పైన చెప్పిన అన్ని చావులతోనూ డానీకి సంబంధం ఉంటుంది. ఇన్‌ఫాక్ట్‌ వాటికి స్కెచ్‌ గీసింది అతడే. అవి హత్యలు.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో రికార్డ్‌ చేసిన అమ్మాయి డెత్‌తో సహా! డానీ.. ది మర్డరర్‌.

ఓహ్‌ గాడ్‌.. ఎందుకు? అతనేమన్నా సైకోనా?
కాదు. మంచి తండ్రి. డానీకొక కొడుకు ఉంటాడు. జాషువా. ఆరేళ్లు. అందరూ జాష్‌ అని పిలుస్తుంటారు. సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌తో బాధపడుతుంటాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగితే కాని బతకడు. పైగా ఆ అబ్బాయిది రేర్‌ బ్లడ్‌గ్రూప్‌. ఏబీ నెగటివ్‌. ఆ గ్రహీతల జాబితాలో జాషువా అయిదో నంబర్‌లో ఉంటాడు. వాడు తల్లిలేని పిల్లాడు. నానమ్మ మార్గరేట్, తండ్రి డానీయే జాషువాను కళ్లల్లో పెట్టి చూసుకుంటుంటారు. అరుణ అనే డాక్టర్‌.. పిల్లాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. డానీ పట్ల ఇష్టాన్నీ పెంచుకుంటుంది. వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే జాషువా బతకడని చెప్తుంది అరుణ. వాడి లైఫ్‌ లైన్‌ అయిదు నెలల వరకే సాగొచ్చు అనే భయాన్నీ వ్యక్తం చేస్తుంది. పరిస్థితి చూస్తుంటే అయిదునెలలోపు ఆపరేషన్‌ జరిగేలా కనిపించదు. ఫ్రస్ట్రేట్‌ అవుతాడు. ఏదైనా చేసి కొడుకును బతికించుకోవాలి. ఆఖరకు మనుషులను చంపైనా సరే అన్నంత కసిగా మార్తాడు. 

అప్పుడు చేస్తాడు..!
.. ఈ హత్యలను. డానీ చేతిలో శ్వాస వదిలిన వాళ్లంతా ఏబీ నెగటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌తో ఉన్న ఆర్గాన్‌ డోనర్సే. వాళ్ల జాబితా దొరికించుకొని అందులోంచి  పైన మనుషులను ఎంచుకొని.. వాళ్ల జీవన శైలిని గమనించి మరీ మర్డర్‌కి ప్లాన్‌ చేస్తాడు డానీ. చేతికి రక్తం అంటకుండానే నాలుగు హత్యలూ కానిచ్చేస్తాడు. వీటి మీద ఇన్‌స్పెక్టర్‌ కబీర్‌ సావంత్‌కి అనుమానం వస్తుంది.. అవి సహజ మరణాలు కావని. మోడస్‌ ఆపరాండీని పరిశీలిస్తే తెలుస్తుంది.. ప్రాణం పోయినవాళ్లంతా ఆర్గాన్‌ డోనర్స్‌ అని.   ఎంక్వయిరీలో భాగంగా అవయవ గ్రహీతల జాబితా మొదటి వరుసలో ఉన్నవాళ్లందరినీ ప్రశ్నిస్తాడు కబీర్‌. ఆ క్రమంలో డానీనీ విచారిస్తాడు. అనుమానం వస్తుంది. అతని కదలికల మీద నిఘా పెడ్తాడు ఇన్‌స్పెక్టర్‌. తర్వాత  లిస్ట్‌లో ఎవరుండబోతున్నారో తెలుసుకొని హతాశుడవుతాడు. అతని భార్యే ఉంటుంది. ఆమే ఆర్టిస్ట్‌!

పోలీస్‌ హంట్‌
తన కదలికల మీద పోలీస్‌ కన్నుపడిందని డానీకి అర్థమవుతుంది. వాళ్లను తప్పుదోవ పట్టించడానికి అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న ఇంకో వ్యక్తి మీదకు డౌట్‌ను మళ్లిస్తాడు. ఆ వ్యక్తి భార్యకు ఆర్గాన్స్‌ కావాలి. ఆమె మంచంలో అచేతనంగా పడి ఉంటుంది. సేవ చేయలేక విసిగిపోయి ఉంటాడు అతను. పోలీసులకూ అతనే చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ వ్యక్తి వాలకం, తీరు చూస్తే. కాని విచారణలో కాదని తేలుతుంది. ఆ విషయాన్ని అలాగే గోప్యంగా ఉంచి డానీ మీద స్పయింగ్‌ని మరింత కట్టుదిట్టం చేస్తాడు ఇన్‌స్పెక్టర్‌ కబీర్‌. అలా పోలీసులవలలో ఇరుక్కుని దోషిగా తేలుతాడు డానీ. 
క్లైమాక్స్‌లో కబీర్‌ తూటాతో తలవాల్చేసిన డానీ ఊపిరితిత్తులనే జాషువాకు అమరుస్తారు. ఇంకో కీలక అంశం.. తన కొడుకును బతికించుకోవడం కోసం డానీ సీరియల్‌ కిల్లర్‌గా మారాడని డాక్టర్‌ అరుణ గ్రహిస్తుంది. హార్ట్‌ ఎటాక్‌ నాటకంతో డానీ ఆసుపత్రిలో చేరి.. కోమాలోకి వెళ్లిన ఆస్తమా పేషంట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆక్సిజన్‌ పైప్‌ను లాగేసి అతనిని చంపిన తీరుతో. ఆ విషయంలో డానీని నిలదీస్తుంది. అరుణకు నిజం తెలిసిపోయిందని.. ఆమెను  వేగంగా వస్తున్న కారు కిందకు తోసి చంపేస్తాడు. 
   
ఇది ‘బ్రిత్‌’ అనే వెబ్‌ సీరీస్‌ కథ. అమెజాన్‌ సెకండ్‌ ప్రొడక్షన్‌. ఫస్ట్‌ సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్స్‌తో సాగుతుంది. కొడుకు ఊపిరి నిలపడం కోసం ఇంకొకరి ఉసురు తీసేంత కఠినంగా మారిన తండ్రి కథ. నిజానికి  ఇది ఒక్క తండ్రి కథే కాదు. ప్యారలల్‌గా ఇంకో తండ్రి వ్యథా కనిపిస్తుంటుంది ఇందులో. ఆ వ్యథాభరితుడే ఇన్‌స్పెక్టర్‌ కబీర్‌ సావంత్‌. కబీర్‌కు ఒక కూతురు. ఆరేడేళ్లుంటాయేమో. అతని నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి కబీర్‌ రివాల్వర్‌తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పేలి చనిపోతుంది. ఆ అపరాధభావంతో తాగుడికి బానిసవుతాడు కబీర్‌. భార్యా విడాకులిస్తుంది. చేతులారా బిడ్డను పోగొట్టుకున్నాననే బాధతో ఉద్యోగం పట్లా నిర్లక్ష్యంగానే ఉంటాడు. డానీ కేస్‌తోనే ఆ మత్తు వదిలి మామూలు మనిషై ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తాడు. డానీగా మాధవన్‌.. కబీర్‌గా అమిత్‌ సా«ద్‌ నటించారు. శ్వాస బిగపట్టి చూసేంత ఉత్కంఠతేమీ ఉండదు. అన్‌ఫార్చునేట్లీ క్లైమాక్స్‌ కూడా ఊహకందేస్తుంది. అయినా ఆసక్తి చావదు. అదే ‘బ్రిత్‌’ను నిలిపింది. వ్యూస్‌ను పెంచింది. 

ఒక్కడున్నాడు
‘బాంబే బ్లడ్‌ గ్రూప్‌’.. ఎక్కడా వినలేదు కదూ. గోపీచంద్‌ యాక్ట్‌ చేసిన ‘ఒక్కడున్నాడు’ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో విలన్‌ మహేశ్‌ మంజ్రేకర్‌కు గుండెకి సంబంధించిన ఓ సమస్య ఉంటుంది. గుండె మార్పిడి చేయాలంటే అతని బ్లడ్‌ గ్రూప్‌ (బాంబే బ్లడ్‌) కలిగిన మనిషి గుండె కావాలి. ఒకే ఒక్కడికి ఆ బ్లడ్‌ గ్రూప్‌ ఉంటుంది. అతనే హీరో గోపీచంద్‌. ఇంకేముంది? తనకు హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉందని చెప్పి, బ్లడ్‌ డొనేట్‌ చేయమని కోరతాడు. ఆ వంకతో గోపీచంద్‌కి మత్తు ఇచ్చి, ఎంచక్కా గుండె మార్పిడి చేసేయొచ్చన్నది విలన్‌ ప్లాన్‌. బ్లడ్‌ ఇవ్వడానికి వచ్చిన గోపీచంద్‌కి మత్తులోకి జారే ముందు అసలు విషయం తెలిసిపోతుంది. ఈలోపు విలన్‌కి బీపీ పెరగడంతో ఆపరేషన్‌ వాయిదా పడుతుంది. మత్తులోంచి బయటకు వచ్చిన గోపీచంద్‌ విలన్‌ గ్యాంగ్‌ని రఫ్ఫాడించి, బయటపడతాడు. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా నటించిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఇంచు మించు ‘బ్రీత్‌’లాంటి కథే ఇది. 2002లో వచ్చి బాలీవుడ్‌ మూవీ ‘జాన్‌ క్యూ’తో ‘బ్రీత్‌’కి, ‘ఒక్కడున్నాడు’కి పోలికలున్నాయి.   
– సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement