ఇస్లాం వెలుగు
తమ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింప జేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడూ, అన్నీ తెలిసినవాడూను. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కాని ఉండవు. మనసును గాయపరిచే దానం కంటే మృదుభాషణం. క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికి అతీతుడు, అత్యంత సహనశీలుడూను.
విశ్వసించిన ఓ ప్రజలారా! కేవలం పరుల మెప్పును పొందడానికే తమ ధనం ఖర్చు చేసే వాని మాదిరిగా..... మీరు దెప్పి పొడిచి గ్రహీత మనస్సును గాయ పరిచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధనవ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు: ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకు΄ోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండ రాయి మాత్రమే. ఇలాంటివారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. (నిస్సహాయతలోనూ.. దేవుని వైపే)
(దివ్య ఖుర్‌ఆన్: 2:261–264)
వివరణ: మనం ఎవరికైనా దానం ఇచ్చి దెప్పి పొడవడం సరైన పద్ధతి కాదు. కుడి చేతితో దానం చేసిన విషయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. కాబట్టి మనం చాటుమాటుగా దానం చేయాలి. అది దేవుని ప్రీతి కోసం మాత్రమే చేయాలి. ప్రదర్శన బుద్ధి కోసమో పేరు ప్రఖ్యాతల కోసమో చేయకూడదు. మీరు చేసిన దానం దేవుడికి తెలుసు తీసుకున్న వాడికి తెలుసు అంతే కానీ మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడమే దైవ భక్తికి నిదర్శనం.
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment