ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం(పెను) కొనసాగుతున్న దరిమిలా.. ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాఖ్ దార్ చేసిన వ్యాఖ్యలు జనాలకు మంట పుట్టించాయి. పాక్‌ను అల్లానే సృష్టించాడని, కాబట్టి దేశాన్ని బాగు చేయడం కూడా ఆయనే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. దీనిపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలో ఉండి కూడా చేతకాని దద్దమ్మలా మాట్లాడొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం పాక్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత కొనసాగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా.. పరిస్థితి దిగజారుతోందే తప్ప కొలిక్కి రావడం లేదు. ఈ తరుణంలో ఓ రైల్వే లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన దార్ మాట్లాడుతూ.. ఇస్లాం పేరిట ఈ గడ్డను(పాక్) అల్లానే సృష్టించాడు. కాబట్టి, దేశాన్ని సుభిక్షంగా మార్చే బాధ్యత కూడా ఆయనదే. అందుకే దేశం మళ్లీ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందనే నమ్మకం ఉంది అని వ్యాఖ్యానించారు.
ఒకవేళ అల్లానే గనుక పాకిస్థాన్‌ను సృష్టించి ఉంటే.. ఆయనే రక్షిస్తారు. ఆయనే అభివృద్ధి చేశారు. బాగోగులు కూడా ఆయనే చూసుకుంటారు అని దార్ వ్యాఖ్యానించారు. ప్రధాని షెహ్‌బాజ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం పరిస్థితిని బాగు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తోందని పేర్కొన్నారాయన. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత ప్రభుత్వమే కారణమని, ప్రభుత్వం రాత్రింబవలు కృషి చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నా కొన్ని ప్రతిబంధకాలు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు.
అయితే దార్ కామెంట్లపై ప్రతిపక్షాలు, మేధావులు సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఉండికూడా.. పరిస్థితిని చక్కదిద్దకుండా చేతకానీ దద్దమ్మలా మాట్లాడారంటూ అని మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగి.. నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, పైగా తీవ్ర సంక్షోభం దిశగా పాక్ అడుగులు వేసిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో పాక్ ప్రజలు గట్టి బుద్ధి చెప్తారంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment