ఆర్మీపై ధిక్కారం ప్రకటించిన ప్రధాని
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో శక్తిమంతమైన ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్, ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆర్మీపై బహిరంగ ధిక్కారం ప్రకటిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం టీవీ చానెళ్లలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరగుతున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ ప్రసంగంలో నవాజ్ మాట్లాడుతూ తాను అల్లాకు, ప్రజలకు మాత్రమే జవాబుదారీ అని, మరెవరికీ కాదని స్పష్టం చేశారు. పనామా పత్రాల్లో తనకు, తన కుటుంబానికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తుకు సైతం తాను సిద్ధమని స్పష్టం చేశారు.
పనామా పత్రాల్లో ప్రధాని షరీఫ్ పేరు వెలువడిన నాటినుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆర్మీ చీఫ్ రహీల్ తాజాగా శుక్రవారం అవినీతికి పాల్పడిన ఆరుగురు టాప్ ఆర్మీ అధికారులపై వేటు వేశారు. అతినీతిని మూలాల నుంచి నిర్మూలిస్తే తప్ప ఉగ్రవాదంపై పోరులో దేశం విజయం సాధించబోదని ఆయన పేర్కొన్నారు. షరీఫ్‌ను ఇరకాటంలో నెట్టేందుకే ఆయన ఈ చర్యలు తీసుకున్నట్టు, వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని షరీఫ్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. గతంలో షరీఫ్ ప్రభుత్వాన్ని అప్పటి సైనిక నియంత పర్వేజ్ ముషార్రఫ్ పడగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే దిశగా అడుగులు పడుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఈసారి తాను అంత సులువుగా ప్రధాని పదవిని వదులుకోబోనని తన ప్రసంగంలో షరీఫ్ స్పష్టం చేశారు. పనామా పత్రాల నేపథ్యంలో తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలపైనా ఆయన మండిపడ్డారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేస్తే వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని షరీఫ్ సవాల్ విసిరారు.