చినుకు పడినా చింతే | Chinuku landed worries | Sakshi
Sakshi News home page

చినుకు పడినా చింతే

Published Mon, Aug 29 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

కామేపల్లి : కొత్తలింగాలలో సోమవారం కురుస్తున్న వర్షం

కామేపల్లి : కొత్తలింగాలలో సోమవారం కురుస్తున్న వర్షం

  • పంటలను ఆదుకునే పరిస్థితి లేదు..
  • జల్లులతో పెరగని భూగర్భ జలాలు
  • ఈ నెలలో బాగా తగ్గిన వర్షపాతం
  • ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో కురుస్తున్న వర్షాలు పంటలను ఆదుకునేలా లేవు. భూగర్భ జలాల పెంపునకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయి. జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉండగా.. ఆ తరువాత నెలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి కొంత మేరకు ముందుగానే చేరి.. జూన్‌లో ఆశించిన మేరకు వర్షాలు కురిశాయి. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 127 మి.మీలు కాగా.. 337.1 మి.మీ వర్షపాతం నమోదైంది అంటే 164.4 మి.మీ వర్షపాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 309.0 మి.మీలు కాగా.. 185.8 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –39.8 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల కూడా అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 276 మి.మీలు కాగా.. 29వ తేదీ నాటికి 117.4 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే –54 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ పంటల సాగుకు జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలు, వర్షపాతమే కీలకం. ఈ రెండు నెలల్లో అనుకూలంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి నీరు చేరి.. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కానీ.. ఈ ఏడాది దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరి సాగు ఈ రెండు నెలల్లో మాత్రమే బాగా ఉంటుంది. ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు లేకపోవటంతో వరి పంట బాగా వెనుకబడింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,25990 హెక్టార్లు కాగా.. ఆగస్టు చివరి నాటికి కేవలం 49,902 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కొంత మేరకు ప్రాజెక్టుల్లోకి, పెద్ద చెరువుల్లోకి నీరు చేరటంతో వరి సాగు చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోకి నీరు చేరకపోవటంతో జిల్లాలో దాదాపు 1.05లక్షల హెక్టార్లలో వరి పంట దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆగస్టు ఆరంభంలో 4వ తేదీ వరకు వర్షాలు అనుకూలంగా కురిశాయి. అప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 35.6 మి.మీలు కాగా.. అంతకుమించి 53.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే అప్పటికి సాధారణాన్ని మించి 51.2 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది. ఇక అప్పటి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. వరుసగా 20 రోజులపాటు అంటే 24వ తేదీ వరకు వర్షాలు కురవలేదు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా 24వ తేదీ నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేరకు మాత్రం వర్షపాతం నమోదు కావటం లేదు. 29వ తేదీ నాటికి 258.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 117.4 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు ఆరంభంలో మొదటి 4 రోజులు కురిసిన వర్షపాతం 50 మి.మీలకు పైగా ఉండగా.. ఇదే నెల చివరి వారంలో కేవలం మరో 50 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 25 రోజుల కాలంలో 260 మి.మీల మేరకు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 67 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు 29న 6.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. తిరుమలాయపాలెం మండలంలో అధికంగా 6.68 సెం.మీ వర్షపాతం నమోదుకాగా.. 3–6 సెం.మీ మధ్య ముదిగొండ, ఖమ్మం అర్బన్, బయ్యారం మండలాల్లో వర్షం కురిసింది. మరో 3 మండలాల్లో 1–3 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో 1 సెం.మీ లోపు వర్షపాతం నమోదైంది. 
    పైర్లకు అంతంత మాత్రమే..
    ఆగస్టులో వరుసగా వర్షాలు లేకపోవటంతో పెసర, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెసర 2వేల హెక్టార్లకు పైగా ఎండిపోయింది. మొక్కజొన్న కూడా దాదాపు 4వేల హెక్టార్లలో ఎండిపోయింది. ఇక పత్తి ఎదుగుదల లోపించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వడబడ్డ పత్తి కొంత మేరకు ప్రాణం పోసుకున్నా ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేదు. పూత, కాత కూడా కుచించుకుపోయింది. నల్లరేగడి నేలల్లో పత్తి ఆశాజనకంగా ఉన్నా.. ఎర్ర, దుబ్బ నేలల్లో మాత్రం బాగా దెబ్బతిన్నది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పైరు ఎదుగుదలకు, పూత, కాత వచ్చేందుకు ఎరువులు వేస్తున్నారు. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడటం లేదని, పాటు చేసే వర్షాలు కూడా పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెసర కొంత మేరకు చేతికి అందగా, ఆలస్యంగా వేసిన పెసర మాత్రం ఎండిపోయిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా పెసరకు ఉపయోగం లేదని అంటున్నారు. మొక్కజొన్న వర్షాధారంగా ప్రధానంగా వేసిన బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల వంటి ప్రాంతాల్లో అనుకూలమైన సమయాల్లో వర్షలు పడకపోవటంతో కంకి పాలుపోసుకునే దశలో ఎండిపోయిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఈ పైరుకు ఎంత మాత్రం ఉపయోగపడవని రైతులు వాపోతున్నారు. వరి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల వరి ఆశించిన మేరకు ఎదుగుదల లేదని రైతులు చెబుతున్నారు. ఇక రైతులు మిర్చిపై మాత్రం ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో 16వేల హెక్టార్లలో మిర్చి పంటను రైతులు వేశారు. మరో 10వేల హెక్టార్లలో పంట సాగు చేసే అవకాశం ఉంది. అయితే రైతులు ఈ పంటకు కూడా వర్షాలు కురుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement