ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ... | Please worry..be happy.. | Sakshi
Sakshi News home page

ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...

Published Sun, Aug 16 2015 1:27 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...

ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...

కలత.. దిగులు.. వ్యాకులత.. చింత.. సాదాసీదా పామర భాషలో చెప్పాలంటే వర్రీ... ఎవరికి లేవండీ వర్రీస్..? పెతోడికీ సవాలచ్చ వర్రీస్ ఉంటాయి... వర్రీలు మనుషులకు కాకుండా, మానూ మాకులకు ఉంటాయా..? అని ప్రశ్నిస్తారా..? అయితే, ఓకే! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా కాస్త స్థాయీ భేదాలతో మనుషులందరికీ చింతలు ఉంటాయి. పాలుతాగే పసితనంలో పెద్దగా తెలియదు గానీ, బడికి వెళ్లడం ప్రారంభించిన చిన్నారులు మొదలుకొని, కాటికి కాళ్లు చాపుకున్న పండు ముసలివాళ్లకు సైతం ఏదో ఒక చింత ఉండనే ఉంటుంది. చితి.. చచ్చాకనే మనిషిని దహిస్తుంది.

చింత బతికుండగానే మనిషిని కాల్చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. నిరంతర చింతాక్రాంతులకు షడ్రసోపేత భోజనమైననూ రుచించదు. హంసతూలికా తల్పమునైననూ నిద్రపట్టదు. ఏ పనియందూ మనసు లగ్నము కాదు. వేళ మీరిన తర్వాత ఎప్పటికో కలత నిద్ర పట్టినా, పీడకలలు పీడిస్తాయి. జీవితంలో ఇలాంటి స్థితి ఎక్కువకాలం కొనసాగడం ఆరోగ్యానికే కాదు, దీర్ఘకాలికంగా చూసుకుంటే ఆయుర్దాయానికీ మంచిది కాదు. అలాగని, ఏదీ పట్టించుకోకుండా, చీకూ చింతాలేని ధిలాసా కులాసా జీవితం గడిపితే, అది అస్సలు మంచిది కాదు. అందువల్ల మరీ వర్రీ కాకుండా, వర్రీస్ గురించి కొంచెం తెలుసుకోండి...
 
చింతా పురాణం..
‘బతుకంతా చింతే జీవికి..’ అనే కీర్తనలో పురందరదాసు లోకంలోని చింతలన్నింటినీ ఏకరువు పెట్టాడు. ‘మదిలో చింతలు మైలలు మణుగులు..’ అంటూ చింతా భారాన్ని తూకం వేశాడు అన్నమయ్య. పురాణాల్లో చింతాక్రాంతులు చాలామందే ఉన్నారు. వారిలో మచ్చుకు కొందరి గురించి చెప్పుకుందాం.. కురుక్షేత్రంలో కౌరవ, పాండవ సైన్యాలు రెండు వైపులా మోహరించి ఉన్న తరుణాన సోదరులను, బంధువులను చంపడానికా ఈ యుద్ధం చేయడం అంటూ అర్జునుడు చింతాక్రాంతుడవుతాడు.

తన రథానికి సారథ్యం వహిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధోన్ముఖుడవుతాడు. యుద్ధం మొదలవక ముందు అర్జునుడు చింతాక్రాంతుడైతే, యుద్ధం మొదలయ్యాక ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడవుతాడు. సంజయుడి ద్వారా ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలను తెలుసుకుంటూ, యుద్ధభూమిలో ఒక్కొక్కరుగా మరణిస్తున్న తన కొడుకుల దుస్థితిని తలచుకుంటూ వగచి వగచి విలపిస్తాడు. యుద్ధానికి ముందే చింతించిన అర్జునుడు విజేతగా నిలిస్తే, యుద్ధం మొదలయ్యాక చింతించిన ధృతరాష్ట్రుడు వంశనాశనాన్ని చవిచూశాడు.
 
వర్రీస్ ఆర్ వెరీ కామన్..
రాజకీయాల్లో తిరుగుతున్న పెతోడూ దేస్సేవ చేసేయాలని తెగ వర్రీ అయిపోతుంటాడు. దేశాన్ని యమ బీభత్సంగా ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రభుత్వాలు, వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని ఎలా అధికారంలోకి రావాలా అని ప్రతిపక్షాలు వర్రీ అయిపోతుంటాయి.

రిలీజు కాబోయే సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు, బయ్యర్లు వర్రీ అయిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టవుతాయా, ఫట్టవుతాయా అనే ఆలోచనతో వీరాభిమానులు వర్రీ అయిపోతుంటారు. రాబోయే పరీక్షలను తలచుకుని విద్యార్థులు, చదువుసంధ్యలు పూర్తయ్యాక వాళ్ల భవిష్యత్తు ఎలా తగలడుతుందా అని తల్లిదండ్రులు ఓ.. తెగ వర్రీ అయిపోతుంటారు. తమ వంక కనీసం కన్నెత్తి చూడనైనా చూడని అమ్మాయిల గురించి అబ్బాయిలు, అదే పనిగా తమను ఓరచూపులు చూసే అబ్బాయిల గురించి అమ్మాయిలు మరీ మరీ వర్రీ అవుతుంటారు.

ధరల దూకుడు గురించి, పెరగని జీతభత్యాల గురించి ఉద్యోగులు వర్రీ అవుతుంటారు. ఆఫీసులో అడుగుపెట్టాక బాసు మూడ్ ఎప్పుడెలా ఉంటుందోననే వర్రీ కూడా సగటు ఉద్యోగులను పీడిస్తుంటుంది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక ఇంటావిడ సాధింపుల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందిరా భగవంతుడా అని కుటుంబరావులు వర్రీ అవుతుంటారు. ఇంటాయన బుద్ధిగా ఇంటికొచ్చి షాపింగుకు తీసుకెళతాడా, లేకపోతే ఆఫీసు నుంచి ఏకంగా మందు పార్టీకి చెక్కేస్తాడా అని గృహిణీమణులు వర్రీ అవుతుంటారు.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం తినాలా అనే దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయాక బెడ్‌పైకి వెళ్లేలోగా ఏమేం చేయాలా అనే విషయాల గురించి చాలామందికి చాలా రకాల వర్రీస్ ఉంటాయి. నిగనిగలాడే కేశసంపదతో అలరారే మాడు పలచబడటం గురించి, సింహేంద్రమధ్యమంలాంటి నాజూకైన నడుము నానాటికీ పూర్ణకుంభాకారం దాల్చుతుండటం గురించి, శరీరంలో పేరుకుపోతున్న చక్కెర గురించి, నిత్యావసరాల ధరలకు మించిన వేగంతో ఎగసిపడుతున్న రక్తపోటు గురించి, సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ కడుపులో గడబిడ చేస్తుండటం గురించి మాజీ యువకులు చాలా తెగ వర్రీ అవుతుంటారు. ఇలాంటి వర్రీస్ గురించి ఎన్నయినా చెప్పవచ్చు.

ఎవరైనా వీటి జాబితాను తయారు చేస్తే, అది కచ్చితంగా కొండవీటి చాంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ఒకసారి ఒకే వర్రీ బాధిస్తుందనుకోవద్దు. కాలం ఖర్మం కలసిరాకపోతే ఒకేసారి నానా వర్రీస్ చుట్టాల్లా చుట్టుముట్టొచ్చు. ఇలాంటి వర్రీస్‌లో ఒకటో, రెండో.. ముప్పయిరెండో వర్రీస్ మీకూ ఉండే ఉంటాయి. ఇలాంటి వర్రీస్ ఉన్నందుకు బాధపడటం మాని, కొంచెం ఆనందించండి. అలాగని, ధిలాసాగా ఉండకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలపై కొంచెం కొంచెం వర్రీ అవుతూ ఉండండి. ఎందుకంటారా..? అయితే, చిత్తగించండి..
 
చిగురంత చింత మంచిదే..
చింత.. అనగా, తింత్రిణీఫలము అలియాస్ చింతపండు కాదిక్కడ. అయినా, ప్రస్తావన వచ్చింది గనుక కొంచెం చెప్పుకుందాం. మోతాదుగా చింతపండు వాడితే వంటకాలకు రుచి అబ్బుతుంది. వంటకాలకు రుచినిచ్చే చింతపండు సంగతి సరే, మరి నిద్రపట్టకుండా చేసే చింత.. అదే, వర్రీ సంగతేమిటంటారా..? కర్రీకి చింతపండులాగానే, మనిషనే వాడికి జీవితంలో వర్రీస్ కూడా మంచివేనని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఆషామాషీగా వాళ్లు ఈ మాట చెప్పడం లేదు.

పాపం, వర్రీ గురించి తెగ వర్రీ అవుతూ బోలెడన్ని పరిశోధనలు కూడా చేశారు. ఇంట్లో బిందెలు అడుగంటిన వేళ కొళాయిలో నీళ్లు రానందుకు, టీవీలో అభిమాన సీరియల్ చూస్తున్నప్పుడు చెప్పాపెట్టకుండా కరెంటు సరఫరా నిలిచిపోయినందుకు, పిల్లాడు చెప్పిన మాట వినకుండా హఠం చేసినందుకు, రెయిన్‌కోటు లేకుండా బయలుదేరిన వేళ ట్రాఫిక్ నడిమధ్యలో ఉన్నప్పుడు భోరున వర్షం కురిసినందుకు.. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు సైతం మీరు వర్రీ అవుతుంటారా..? మరేం ఫర్వాలేదు. కచ్చితంగా మీరు చాలా తెలివైన వాళ్లు! మీ ఐక్యూ ఐన్‌స్టీన్‌కు కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. చిన్నా చితకా విషయాలకు కూడా తెగ వర్రీ అయ్యే అలవాటున్న వాళ్లకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని న్యూయార్క్‌లోని సనీ డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్‌కు చెందిన మానసిక వైద్య నిపుణుడు ప్రొఫెసర్ జెరెమీ కోప్లాన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక తాజా పరిశోధనలో నిగ్గు తేల్చింది.

వర్రీ అయ్యే లక్షణం వల్లనే ప్రమాదాలను నివారించుకోగల తెలివితేటలు మనుషుల్లో అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తల ఉవాచ. వర్రీ అయ్యే లక్షణం ఉన్నవాళ్లు ప్రమాదాలకు, ఉపద్రవాలకు ఎలాంటి అవకాశం లేకుండా, ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని వారు చెబుతున్నారు. వర్రీ అయ్యే లక్షణానికి, తెలివితేటలకు అవినాభావ అనులోమానుపాత సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అందువల్ల మీ మీ భూత భవిష్యత్ వర్తమాన సమస్యలన్నింటిపైనా బేఫికర్‌గా వర్రీ అవ్వండి.. ఈ పాడు జీవితం కాస్తంతైనా సార్థకం కావాలంటే, చిగురంత చింత ఉండాల్సిందే!
- సాక్షి ఫ్యామిలీ
 
వర్రీస్.. ఫ్లాష్‌బ్యాక్..
నిరంతరం వర్రీ కావడాన్ని ఇదివరకు ఒక రుగ్మతగానే పరిగణించేవారు. వయసు మళ్లడం వల్ల తలెత్తే నానా లక్షణాల్లో వర్రీకావడం కూడా ఒకటి అని శతాబ్దం కిందట వైద్యనిపుణులు సైతం చెప్పేవాళ్లు. ‘వర్రీ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్’ అని హేడన్ బ్రౌన్ అనే వైద్య నిపుణుడు 1900 సంవత్సరంలో ఓ పుస్తకాన్ని రాస్తే,  అమెరికన్ మానసిక వైద్య నిపుణుడు విలియమ్ ఎస్ సాడ్లర్ 1914లో ‘వర్రీ అండ్ నెర్వస్‌నెస్’ అనే పుస్తకం రాశాడు. అంటే, వర్రీస్‌ని కాకపోయినా, వర్రీ అయ్యే లక్షణాన్ని సమూలంగా నిర్మూలించడాన్నే అప్పటి వైద్య నిపుణులు తమ తక్షణ కర్తవ్యంగా తలచారు. ఆ దిశగానే వారు కృషి చేశారు. మనుషుల్లో వర్రీ అయ్యే లక్షణాన్ని ఎలా రూపుమాపాలా అంటూ వారంతా తెగ వర్రీ అయ్యేవారు. పాపం.. అమాయకులు. వర్రీస్ వల్ల కలిగే మేలును అప్పట్లో గుర్తించలేకపోయారు వాళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement