Older people
-
అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక
రిటైర్మెంట్ గడువు దగ్గర పడుతున్న వారిలో, పదవి విరమణ పొందిన వారిలో ఇంకా పని చేయాలనే తపన చూస్తూంటాం. అందుకు వారు ఎంతో ప్రయత్నించాలి. వయసు భారం అనుకోకుండా సరైన నైపుణ్యాలు ఉంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంకా పనిచేయాలనుకునే వృద్ధులతో పోలిస్తే భారతీయ వృద్ధులకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు మెకిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ రిపోర్ట్ పేర్కొంది. అందుకుగల కొన్ని కారణాలను విశ్లేషించింది. మెకిన్సే 21 దేశాల్లోని 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న దాదాపు 21,000 మందిపై సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది. అందులో 1,000 మంది భారతీయులున్నారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించాలంటే వృద్ధులుసైతం పనిచేయాలని గతంలో కొందరు అభిప్రాయపడ్డారు. కొంతమంది భారతీయ వృద్ధులకు ఇప్పటికీ కుటుంబ సంరక్షణే భారంగా మారుతోంది. మరికొందరు సంపన్నులను అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా ఉన్నవారు సాంకేతికతపై, స్మార్ట్ఫోన్ల వాడకంపై ఆసక్తి చూపినప్పటికీ దాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: పాతపద్ధతే మేలు.. ‘ఎక్స్’ ప్రకటన నాలెడ్జ్ గ్యాప్, వారు అధికంగా పనిచేయకపోవడం వంటి అడ్డంకులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి వారికి సరైన శిక్షణ ఇవ్వడంతోపాటు అవగాహన పెంపొందించడం ఎంతో అవసరం. 55-64 ఏళ్ల వయసు ఉన్న వారిలో కంటే 80 ఏళ్లు దాటిన వారిలో 20-25 శాతం అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలపై అవగాహన, ఆర్థిక ప్రణాళిక, నైపుణ్య శిక్షణతో దిగువ మధ్యతరగతి వృద్ధుల కుటుంబాల్లో ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. -
60 ఏళ్ల వయసు దాటిందా..జాగ్రత్త!
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 60 ఏళ్ల వయసు దాటిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రసామాజిక, న్యాయసేవా మంత్రిత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఎవరూ బయటకు రాకూడదని, అదే విధంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు ఇంట్లో తమ గదిని వదిలి బయటకు అసలు రావద్దని చెప్పారు. ఈ మేరకు సామాజిక, న్యాయసేవ మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. ► 60 ఏళ్ల వయసు దాటి, శ్వాసకోశ, కిడ్నీ, గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ రిస్కు ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి ► వీళ్లందరూ ఇంటికి వచ్చే అతిథులను కలవకూడదు ► భౌతిక దూరం పాటిస్తూ..యోగా లాంటి వ్యాయామాలు చేయాలి ► వ్యక్తిగత శుభ్రత బాగా పాటించాలి ► వేడి ఆహారం తీసుకోవడంతో పాటు అందులో పోషకాలు ఉండేలా చూసుకోవాలి ► దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులకు ఫోన్ చేయాలి ► నీళ్లు ఎక్కువగా తాగాలి మానసిక రుగ్మతలు ఉంటే 08046110007 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చెయ్యాలి వీళ్లు ఏమి చేయకూడదంటే.. ► కరోనా వైరస్ లక్షణాలున్న వారిని కలవకూడదు ► ఎవరితోనూ కరచాలనం చేయకుండా ఉండాలి ► జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు ► హారర్ సినిమాలు, బ్రేకింగ్ న్యూస్‌లు చూడకూడదు ► పొగాకు, మద్యం సేవించే అలవాటు ఉంటే తక్షణమే మానేయాలి. -
87 ఏళ్ల వయస్సులోనూ ఆమె ఇలా..
వృద్ధాప్యం అనేది వయస్సుకు గానీ మనస్సుకు కాదని చెప్పడం గురించి మనకు తెలుసు. అలా చెప్పడమే కాదు, అందుకు రుజువు తమ జీవన విధానమేనని నిరూపిస్తున్న వాళ్లు ఇప్పుడు ఎందరో ఉన్నారు. 82వ ఏట ప్రేమించి పెళ్లి చేసుకోవడం, 85వ ఏటా ప్రతి రోజు మధ్యతరహా సముద్రంలో కొన్ని కిలోమీటర్లు ఈతకొట్టడం, 87వ ఏటా రోజు రెండు, గంటల పాటు టెన్నిస్ ఆడుతున్న వద్ధుల గురించి తెలిస్తే ఆశ్చర్యమే కాదు, ఈర్ష్య కూడా కలుగుతుంది. తాము గతంలో కన్నా ఈ వయస్సులోనే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నామని చెబుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. కెనడాలోని అంటారియోకు చెందిన 87 ఏళ్ల మఫ్వీ గ్రీవ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రతి రోజు టెన్నీస్ ఆడుతారు. ఆమె గత 70 ఏళ్లుగా టెన్సీస్ ఆడుతూనే ఉన్నారు. ‘‘కెరీర్లో అన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకున్నామన్నది ముఖ్యం కాదు. మానవ జీవితం అన్నాక ఒడిదుడుకులు, సమస్యలు తప్పవు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే ముఖ్యం. అందుకు జీవితం పట్ల సానుకూల దక్పథం అవసరం. ఈ విషయంలో ప్రముఖ రచయిత, తత్వవేత్త బెర్టాండ్ రస్సెల్ నాకు ఆదర్శం. సమస్యలు వస్తే కుంగిపోవద్దని, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలని, పరిష్కారం లభించదనుకుంటే ఆ సమస్యలను పక్కన పడేసి ముందుకు పోవాలని ఆయన చెప్పారు. నేను నా జీవితంలో అలాగే చేశాను. నా వయస్సు గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు 30 ఏళ్లా, 60 ఏళ్లా అని ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు 62 ఏళ్ల వయస్సులో మెదడులో ట్యూమర్ వచ్చింది. కంగిపోలేదు. పోరాడాను. ఓసారి బిజినెస్ ట్రిప్పులో బయటకు వెళ్లినప్పుడు కారు దిగి నడవలేక పోయాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. మనోధైర్యంతో కోలుకున్నాను. టెన్నీస్, గోల్ఫ్ ఆడడం వల్లనే నేను ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్నాను. ఆ ఆటలు ఇప్పటికీ ఆడడమేకాదు, ఎక్కడికైనా నడిచే వెళతాను. అదే నా ఆరోగ్య రహస్యం’’ అని ఆమె వివరించారు. ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ (87), అలీసియా మూర్హెడ్ (72) వద్ధ దంపతులు ఇప్పటికీ దృడంగా ఉంటారు. స్కై డైవింగ్‌లో వారికి వారే సాటే. పాట్ ఇప్పటికీ పదివేల స్కై డైవింగ్‌లు చేశారు. 80వ ఏటా ఒక్క రోజులో ఆరు గంటల వ్యవధిలో 80 స్కై డైవింగ్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించానని పాట్ తెలిపారు. వయస్సు మీరాక ఎవరైనా స్కై డైవింగ్లకు స్వస్తి చెబుతారని, అయితే అలా తాను చేయదల్చుకోలేదని అన్నారు. తాను లిఫ్టులేని ఇంటి మేడపైకి మెట్లెక్కే పోతానని, ఆ ఆలోచన వల్లనే ఇంటికి లిఫ్టు కూడా పెట్టించలేదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నప్పుతే తాను జిమ్నాస్టని, ఆ తర్వాత 30వ ఏటా స్కై డైవింగ్ నేర్చుకున్నానని పాట్ భార్య అలీసియా తెలిపారు. అందుకనే స్కై డైవింగ్ పట్ల ఆసక్తి కలిగిన పాట్ చేసుకొని ఇప్పటికీ డైవింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాలి నడకతోనే ఎక్కువ సంచరిస్తా ఛానల్ ఐలాండ్స్‌లోని ఆల్డెర్నీకి చెందిన రీటా గిల్మోర్కు 87 ఏళ్లు. ఆమె భర్త మోరిస్ 74వ ఏట మరణించారు. అప్పటి వరకు ఆయన చూసుకున్న అతిపెద్ద రెస్టారెంట్‌ను ఇప్పుడు ఆమె చూసుకుంటున్నారు. తాగుడు, స్మోకింగ్ అలవాటు లేని తాను, కార్లలో కంటే కాలి నడకనే ఎక్కువ సంచరిస్తానని, అదే తన ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఇలాంటి వాళ్లందరి గురించి ‘లైఫ్ లెస్సన్స్ ఫర్ పీపుల్ ఓల్డర్ అండ్ వైజర్ ద్యాన్ యూ’ పేరిట హార్డీగ్రాంట్ ప్రచురించిన పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు -
వ్యాయామంతో జ్ఞాపకశక్తి మెరుగు
లండన్ : వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరగడం సహజం. అయితే వ్యాయామంతో మెరుగైన జ్ఞాపకశక్తిని సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిట్నెస్ కొరవడటమే మతిమరుపుకు కారణమని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్యకరంగా ధృడంగా ఉన్న వృద్ధుల్లో మతిమరుపు ఛాయలే కనిపించలేదని పరిశోధకులు తేల్చారు. దశాబ్ధాల కిందటి విషయాలను సైతం వారు అలవోకగా చెప్పారని అథ్యయనంలో గుర్తించామని తెలిపారు. శారీరక ఫిట్నెస్ మెరుగైతే మానసిక ఆరోగ్యం కూడా చక్కడా ఉంటుందని అథ్యయనంలో గుర్తించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన శారీరక ఆరోగ్యానికి ఫిట్నెస్ ప్రాధాన్యత, ఏరోబిక్ ఫిట్‌నెస్‌కు గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. వృద్ధుల శారీరక పటుత్వం ఎంత అధికంగా ఉంటే వారిలో జ్ఞాపకశక్తి అంత మోతాదులో ఉన్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీకి చెందిన రచయిత డాక్టర్ కట్రిన సెగార్ట్ చెప్పారు. -
వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ప్రారంభించిన టీటీడీ జేఈవో సాక్షి, తిరుమల: తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు మరింత సౌకర్యంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ప్రారంభ మయ్యాయి. టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాస రాజు బుధవారం ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్ల మంజూరును ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో 1,500 మంది వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నా మన్నారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్తగా టోకెన్ కౌంటర్లు ప్రారంభించామన్నారు. మధ్యా హ్నం స్లాట్‌కు కూడా ఉదయమే టోకెన్లు మంజూరు చేస్తామని, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేద న్నారు. దక్షిణ మాడ వీధిలో వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే హాలులో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు సీట్ల సామర్థ్యాన్ని పెంచామని జేఈవో తెలిపారు. రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో తిరుమలలో జూన్ 2వ తేదీ శుక్రవారం డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులు 0877–2263261 నంబరుకు ఫోన్‌చేసి తమ సందేహలు, సూచనలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు తెలియజేయవచ్చు. -
ఎండ ప్రచండం!
► జిల్లాలో అనూహ్యంగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ► రెంటచింతల, పిడుగురాళ్ల, వినుకొండ ప్రాంతాల్లో మరింత దారుణం ► గత ఏడాదితో పోల్చితే 9 డిగ్రీల అధికంగా నమోదు ► బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్న జనం ► అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు, చిరువ్యాపారులు రెంటచింతల 45.8 పిడుగురాళ్ల 45.7 గుంటూరు 43.5 గుంటూరు రూరల్ : ఎండ ప్రచండం కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. భగభగ మండుతున్న ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే చాలు..బయటకు రావాలంటేనే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ దెబ్బకు ప్రయాణాలనూ వాయిదా వేసుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటిందాకా ఇళ్ల నుంచి రావడం లేదు. రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితీ కడుదయనీయంగా మారింది. ఒక పక్క ఎండ..మరో పక్క వడగాడ్పులకు రోడ్లపై ఉండలేక విలవిల్లాడిపోతున్నారు. వ్యాపారాలు పూర్తిగా మందగించాయని అంటున్నారు. కొందరు వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ వారం రోజుల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ నెల మూడో వారంతో ఈ ఏడాది పోల్చితే ఉష్ణోగ్రతలో విపరీత మార్పులు కన్పిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు... రాత్రి ఉష్ణోగ్రతలు సైతం రెండు మూడు డిగ్రీలు పెరగడంతో వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు వేడిమి తట్టుకోక ఉపశమనాలను వెతుక్కుంటున్నారు. రెండు రోజుల్లో గమనిస్తే ఉదయం సాయంత్రం రెండు డిగ్రీల చొప్పున రోజుకు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అత్యధికంగా వేడిమి పెరిగిపోయింది. ఇక జిల్లాలోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే రెంటచింతల, వినుకొండ, పిడుగు రాళ్ళ తదితర ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. వారం రోజుల్లో రోజూ 42 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది... ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలు... గత ఏడాది ఏప్రిల్ మూడో వారంలో కేవలం గుంటూరులో వరుసగా ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 17న 36.8, 18న 35.3, 19న 35.2, 20న 35.4, 21న 35.6, 22న 36 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదయింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు చూస్తే సుమారు 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు ఉన్నాయి. ఇక ఈ ఏడాది గడచిన వారంలో చూస్తే ఆదివారం 39.5, సోమవారం 39.5, మంగళవారం 39.5, బుధవారం 39.8, గురువారం 41.5 శుక్రవారం ఏకంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదయ్యాయి. -
చెన్నైలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం
చెన్నై: తమిళనాడు రాజధానిలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం జయలలిత గురువారం ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. నెలలో పదిసార్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. -
ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్..!
న్యూయార్క్: ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్ అని అంటుంటాం. కానీ వృద్ధులు, వయసు పైబడిన వారంటే సాధారణంగా అందరికీ చిన్నచూపు. ఓ ముద్ద తిని మూల పడుండక ఇంకా ఎందుకో ఆరాటం అని అన్ని ఇళ్లల్లో వారిపై కేకలు పెడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఓ రకంగా వారు ఇక ఏ విధంగాను ఉపయోగపడరు అని భావించేవారు లేకపోలేరు. అయితే, ఇదే అంశాన్ని సీరియస్‌గా తీసుకుని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యయనకారులు వయసులో పైబడిన వారి శక్తిసామర్థ్యాలను శోధించారు. ఈ శోధనలో పెద్దవారైపోయాక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపరని ఇన్నాళ్లు వారిపై ఉన్న అపవాదు పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమైంది. సాధారణంగా నేటి యువతరం కన్నా ఎక్కువగా పెద్దవారే కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని, దీంతోపాటు తాము చేసిన పొరపాట్లను వెంటనే గుర్తించి తమను తాము సంస్కరించుకోవడంలో కూడా నేటి యువతరం కన్నా ముందుంటారని కొలంబియా వర్సిటీ అధ్యయనకారులు తేల్చారు. ఇన్నాళ్లు సరైన వాస్తవాలు తెలియకుండానే వయసు మళ్లినవారిపై పూర్తి వ్యతిరేక ప్రచారం జరిగిందని వర్సిటీ సైకలాజికల్ సైంటిస్ట్ జానెట్ మెట్ కాఫ్ తెలిపారు. ఈ అధ్యయనం కోసం 24 ఏళ్ల లోపున్న 44మంది యువకులను తీసుకోగా 74 ఏళ్ల వయసుగలవారిని 45మందిని తీసుకున్నారు. ఇందులో పలు కొత్త అంశాలను తయారు చేసి వారికి సమాన స్థాయిలో అందించి ప్రశ్నించగా యువకుల కంటే మెరుగైన ఫలితాలను ఆ వృద్ధులు కనబరచడమే కాకుండా తాము చేసిన పొరపాట్లను కూడా అప్పటికప్పుడే గుర్తించి అధ్యయనకారులను ఆశ్చర్యపరిచారు. 'సత్యం కోసం పెద్దవారు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి తప్పు చేయాలని అస్సలు అనిపించదు. సరైన దానిని ఎంచుకునేందుకు వారు ఎంతో శ్రద్ధ కనబరుస్తారు' అని మెట్ కాఫ్ వివరించారు. -
ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...
కలత.. దిగులు.. వ్యాకులత.. చింత.. సాదాసీదా పామర భాషలో చెప్పాలంటే వర్రీ... ఎవరికి లేవండీ వర్రీస్..? పెతోడికీ సవాలచ్చ వర్రీస్ ఉంటాయి... వర్రీలు మనుషులకు కాకుండా, మానూ మాకులకు ఉంటాయా..? అని ప్రశ్నిస్తారా..? అయితే, ఓకే! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా కాస్త స్థాయీ భేదాలతో మనుషులందరికీ చింతలు ఉంటాయి. పాలుతాగే పసితనంలో పెద్దగా తెలియదు గానీ, బడికి వెళ్లడం ప్రారంభించిన చిన్నారులు మొదలుకొని, కాటికి కాళ్లు చాపుకున్న పండు ముసలివాళ్లకు సైతం ఏదో ఒక చింత ఉండనే ఉంటుంది. చితి.. చచ్చాకనే మనిషిని దహిస్తుంది. చింత బతికుండగానే మనిషిని కాల్చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. నిరంతర చింతాక్రాంతులకు షడ్రసోపేత భోజనమైననూ రుచించదు. హంసతూలికా తల్పమునైననూ నిద్రపట్టదు. ఏ పనియందూ మనసు లగ్నము కాదు. వేళ మీరిన తర్వాత ఎప్పటికో కలత నిద్ర పట్టినా, పీడకలలు పీడిస్తాయి. జీవితంలో ఇలాంటి స్థితి ఎక్కువకాలం కొనసాగడం ఆరోగ్యానికే కాదు, దీర్ఘకాలికంగా చూసుకుంటే ఆయుర్దాయానికీ మంచిది కాదు. అలాగని, ఏదీ పట్టించుకోకుండా, చీకూ చింతాలేని ధిలాసా కులాసా జీవితం గడిపితే, అది అస్సలు మంచిది కాదు. అందువల్ల మరీ వర్రీ కాకుండా, వర్రీస్ గురించి కొంచెం తెలుసుకోండి... చింతా పురాణం.. ‘బతుకంతా చింతే జీవికి..’ అనే కీర్తనలో పురందరదాసు లోకంలోని చింతలన్నింటినీ ఏకరువు పెట్టాడు. ‘మదిలో చింతలు మైలలు మణుగులు..’ అంటూ చింతా భారాన్ని తూకం వేశాడు అన్నమయ్య. పురాణాల్లో చింతాక్రాంతులు చాలామందే ఉన్నారు. వారిలో మచ్చుకు కొందరి గురించి చెప్పుకుందాం.. కురుక్షేత్రంలో కౌరవ, పాండవ సైన్యాలు రెండు వైపులా మోహరించి ఉన్న తరుణాన సోదరులను, బంధువులను చంపడానికా ఈ యుద్ధం చేయడం అంటూ అర్జునుడు చింతాక్రాంతుడవుతాడు. తన రథానికి సారథ్యం వహిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధోన్ముఖుడవుతాడు. యుద్ధం మొదలవక ముందు అర్జునుడు చింతాక్రాంతుడైతే, యుద్ధం మొదలయ్యాక ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడవుతాడు. సంజయుడి ద్వారా ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలను తెలుసుకుంటూ, యుద్ధభూమిలో ఒక్కొక్కరుగా మరణిస్తున్న తన కొడుకుల దుస్థితిని తలచుకుంటూ వగచి వగచి విలపిస్తాడు. యుద్ధానికి ముందే చింతించిన అర్జునుడు విజేతగా నిలిస్తే, యుద్ధం మొదలయ్యాక చింతించిన ధృతరాష్ట్రుడు వంశనాశనాన్ని చవిచూశాడు. వర్రీస్ ఆర్ వెరీ కామన్.. రాజకీయాల్లో తిరుగుతున్న పెతోడూ దేస్సేవ చేసేయాలని తెగ వర్రీ అయిపోతుంటాడు. దేశాన్ని యమ బీభత్సంగా ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రభుత్వాలు, వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని ఎలా అధికారంలోకి రావాలా అని ప్రతిపక్షాలు వర్రీ అయిపోతుంటాయి. రిలీజు కాబోయే సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు, బయ్యర్లు వర్రీ అయిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టవుతాయా, ఫట్టవుతాయా అనే ఆలోచనతో వీరాభిమానులు వర్రీ అయిపోతుంటారు. రాబోయే పరీక్షలను తలచుకుని విద్యార్థులు, చదువుసంధ్యలు పూర్తయ్యాక వాళ్ల భవిష్యత్తు ఎలా తగలడుతుందా అని తల్లిదండ్రులు ఓ.. తెగ వర్రీ అయిపోతుంటారు. తమ వంక కనీసం కన్నెత్తి చూడనైనా చూడని అమ్మాయిల గురించి అబ్బాయిలు, అదే పనిగా తమను ఓరచూపులు చూసే అబ్బాయిల గురించి అమ్మాయిలు మరీ మరీ వర్రీ అవుతుంటారు. ధరల దూకుడు గురించి, పెరగని జీతభత్యాల గురించి ఉద్యోగులు వర్రీ అవుతుంటారు. ఆఫీసులో అడుగుపెట్టాక బాసు మూడ్ ఎప్పుడెలా ఉంటుందోననే వర్రీ కూడా సగటు ఉద్యోగులను పీడిస్తుంటుంది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక ఇంటావిడ సాధింపుల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందిరా భగవంతుడా అని కుటుంబరావులు వర్రీ అవుతుంటారు. ఇంటాయన బుద్ధిగా ఇంటికొచ్చి షాపింగుకు తీసుకెళతాడా, లేకపోతే ఆఫీసు నుంచి ఏకంగా మందు పార్టీకి చెక్కేస్తాడా అని గృహిణీమణులు వర్రీ అవుతుంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం తినాలా అనే దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయాక బెడ్‌పైకి వెళ్లేలోగా ఏమేం చేయాలా అనే విషయాల గురించి చాలామందికి చాలా రకాల వర్రీస్ ఉంటాయి. నిగనిగలాడే కేశసంపదతో అలరారే మాడు పలచబడటం గురించి, సింహేంద్రమధ్యమంలాంటి నాజూకైన నడుము నానాటికీ పూర్ణకుంభాకారం దాల్చుతుండటం గురించి, శరీరంలో పేరుకుపోతున్న చక్కెర గురించి, నిత్యావసరాల ధరలకు మించిన వేగంతో ఎగసిపడుతున్న రక్తపోటు గురించి, సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ కడుపులో గడబిడ చేస్తుండటం గురించి మాజీ యువకులు చాలా తెగ వర్రీ అవుతుంటారు. ఇలాంటి వర్రీస్ గురించి ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరైనా వీటి జాబితాను తయారు చేస్తే, అది కచ్చితంగా కొండవీటి చాంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ఒకసారి ఒకే వర్రీ బాధిస్తుందనుకోవద్దు. కాలం ఖర్మం కలసిరాకపోతే ఒకేసారి నానా వర్రీస్ చుట్టాల్లా చుట్టుముట్టొచ్చు. ఇలాంటి వర్రీస్‌లో ఒకటో, రెండో.. ముప్పయిరెండో వర్రీస్ మీకూ ఉండే ఉంటాయి. ఇలాంటి వర్రీస్ ఉన్నందుకు బాధపడటం మాని, కొంచెం ఆనందించండి. అలాగని, ధిలాసాగా ఉండకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలపై కొంచెం కొంచెం వర్రీ అవుతూ ఉండండి. ఎందుకంటారా..? అయితే, చిత్తగించండి.. చిగురంత చింత మంచిదే.. చింత.. అనగా, తింత్రిణీఫలము అలియాస్ చింతపండు కాదిక్కడ. అయినా, ప్రస్తావన వచ్చింది గనుక కొంచెం చెప్పుకుందాం. మోతాదుగా చింతపండు వాడితే వంటకాలకు రుచి అబ్బుతుంది. వంటకాలకు రుచినిచ్చే చింతపండు సంగతి సరే, మరి నిద్రపట్టకుండా చేసే చింత.. అదే, వర్రీ సంగతేమిటంటారా..? కర్రీకి చింతపండులాగానే, మనిషనే వాడికి జీవితంలో వర్రీస్ కూడా మంచివేనని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఆషామాషీగా వాళ్లు ఈ మాట చెప్పడం లేదు. పాపం, వర్రీ గురించి తెగ వర్రీ అవుతూ బోలెడన్ని పరిశోధనలు కూడా చేశారు. ఇంట్లో బిందెలు అడుగంటిన వేళ కొళాయిలో నీళ్లు రానందుకు, టీవీలో అభిమాన సీరియల్ చూస్తున్నప్పుడు చెప్పాపెట్టకుండా కరెంటు సరఫరా నిలిచిపోయినందుకు, పిల్లాడు చెప్పిన మాట వినకుండా హఠం చేసినందుకు, రెయిన్‌కోటు లేకుండా బయలుదేరిన వేళ ట్రాఫిక్ నడిమధ్యలో ఉన్నప్పుడు భోరున వర్షం కురిసినందుకు.. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు సైతం మీరు వర్రీ అవుతుంటారా..? మరేం ఫర్వాలేదు. కచ్చితంగా మీరు చాలా తెలివైన వాళ్లు! మీ ఐక్యూ ఐన్‌స్టీన్‌కు కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. చిన్నా చితకా విషయాలకు కూడా తెగ వర్రీ అయ్యే అలవాటున్న వాళ్లకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని న్యూయార్క్‌లోని సనీ డౌన్‌స్టేట్ మెడికల్ సెంటర్‌కు చెందిన మానసిక వైద్య నిపుణుడు ప్రొఫెసర్ జెరెమీ కోప్లాన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక తాజా పరిశోధనలో నిగ్గు తేల్చింది. వర్రీ అయ్యే లక్షణం వల్లనే ప్రమాదాలను నివారించుకోగల తెలివితేటలు మనుషుల్లో అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తల ఉవాచ. వర్రీ అయ్యే లక్షణం ఉన్నవాళ్లు ప్రమాదాలకు, ఉపద్రవాలకు ఎలాంటి అవకాశం లేకుండా, ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని వారు చెబుతున్నారు. వర్రీ అయ్యే లక్షణానికి, తెలివితేటలకు అవినాభావ అనులోమానుపాత సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అందువల్ల మీ మీ భూత భవిష్యత్ వర్తమాన సమస్యలన్నింటిపైనా బేఫికర్‌గా వర్రీ అవ్వండి.. ఈ పాడు జీవితం కాస్తంతైనా సార్థకం కావాలంటే, చిగురంత చింత ఉండాల్సిందే! - సాక్షి ఫ్యామిలీ వర్రీస్.. ఫ్లాష్‌బ్యాక్.. నిరంతరం వర్రీ కావడాన్ని ఇదివరకు ఒక రుగ్మతగానే పరిగణించేవారు. వయసు మళ్లడం వల్ల తలెత్తే నానా లక్షణాల్లో వర్రీకావడం కూడా ఒకటి అని శతాబ్దం కిందట వైద్యనిపుణులు సైతం చెప్పేవాళ్లు. ‘వర్రీ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్’ అని హేడన్ బ్రౌన్ అనే వైద్య నిపుణుడు 1900 సంవత్సరంలో ఓ పుస్తకాన్ని రాస్తే, అమెరికన్ మానసిక వైద్య నిపుణుడు విలియమ్ ఎస్ సాడ్లర్ 1914లో ‘వర్రీ అండ్ నెర్వస్నెస్’ అనే పుస్తకం రాశాడు. అంటే, వర్రీస్ని కాకపోయినా, వర్రీ అయ్యే లక్షణాన్ని సమూలంగా నిర్మూలించడాన్నే అప్పటి వైద్య నిపుణులు తమ తక్షణ కర్తవ్యంగా తలచారు. ఆ దిశగానే వారు కృషి చేశారు. మనుషుల్లో వర్రీ అయ్యే లక్షణాన్ని ఎలా రూపుమాపాలా అంటూ వారంతా తెగ వర్రీ అయ్యేవారు. పాపం.. అమాయకులు. వర్రీస్ వల్ల కలిగే మేలును అప్పట్లో గుర్తించలేకపోయారు వాళ్లు. -
పెద్ద తరానికి కాస్త ఊరటనివ్వండి
మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే... పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని ‘హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి’ అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు! ఈ పరిస్థితుల్లో పెద్దతరానికి ఊరటనిచ్చేలా యువతరాన్ని మలిచేవారెవరు? కాల యవనిక మరోసారి జారింది. మరుక్షణం లేవడానికే కదా! కాలంతో పాటు పరుగెట్టలేని ఎందరెందరో మధ్యలోనే రాలిపోతుంటారు. జీవితం ఎంతో విసుగ్గా తాపీగా సాగుతుందన్నప్పుడూ, కష్టాలు మనిషిని కుంగ తీస్తున్నప్పుడు- ‘అయ్యో ఈ రోజులు త్వరగా ఎందుకు కదలవు’ అనుకున్నప్పుడు ఇనుపగుళ్లు కాళ్లకి కట్టుకున్నట్టు అడుగేయదు కాలం. అదే హాయిగా ఉన్నప్పుడెందుకలా పరుగులు తీస్తుందో నాకర్థం కాదు. పద్నాల్గు వస్తోందనుకునేలోగా ఆశ్చర్యంగా అయిపోయింది! హైద్రాబాదే ఇంతగా మారితే దేశం సంగతి ప్రపంచం సంగతి గురించి ఏం చెప్పాలి? నాకు ప్రపంచం అంతా ముసలివాళ్లతో నిండిపోయినట్టు అనిపిస్తోంది! ముసలితనంలోని ఒంటరితనం, అక్కరలేని తనం తల్చుకుంటూనే చాలామంది కృంగిపోతూ కనిపిస్తున్నారు! నిజమే వృద్ధాశ్రమాలు చాలా సౌకర్యాలతో వస్తున్నాయి. కాని ఒంటరితనం ఎందుకు బాధించాలి పెద్దవాళ్లని. ఆశలూ, ఆశయాలూ కొడుకుల్లోనే చూసుకుని సర్వం త్యాగం చేస్తారు తల్లిదండ్రులు. అది వారి అత్యాశకాదు... అభిమానం. ఎదురుచూపు కాదు... ఒంటరిగా ఉండం అన్న ఆశ. పిచ్చా! కాలం మారిపోయింది. పైసాలో ప్రపంచం అని ఇది వరకు అంటే నవ్వేరోజులు పోయాయి. డబ్బు, సౌకర్యాలు సుఖ జీవితాన్నిస్తాయని, పిల్లలు వాటిని గుమ్మరిస్తున్నారు. పాపం వాళ్లు మటుకు ఏం చేస్తారు? ఉద్యోగాలు, పెళ్లాల కండిషన్లు, తమ పిల్లల భవిష్యత్తు వారికీ ముఖ్యం కదా! నేను హైదరాబాదు శాశ్వతంగా వచ్చేశాక ఎందుకో ఒంటరితనం పీడించలేదు! చాలా సాహితీ సంస్థలు, సమాజాలు, సమావేశాలు చాలా బాగుండేవి... కాని...? చూస్తుండగానే సీను పూర్తిగా మారిపోయింది. కారణం- సాహిత్యం చచ్చిపోలేదు. సంస్కారమూ చచ్చిపోలేదు. పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. నాకు ఈ మార్పు చాలా వింతగా అనిపిస్తుంది. నేను కాళోజీ అభిమానిని. దాశరథి నన్ను ఒదినగారు అని పిలిచేవారు. సినారే నాకు అభిమాన కవి. నా కెరీర్ ప్రారంభం నుంచీ తెలిసిన వాళ్లు వేరెలా అవుతారు. అభిమానించకుండా ఉండడం ఎలా? పి.టి.రెడ్డి వంటి చిత్రకారులతో గంటలు గడిపిన సరదాను ఎలా మరిచిపోగలను? కాలం ఇంత దారుణంగా ఎందుకు మారిపోయింది! మనుషులు కాదు పట్నం కూడా పూర్తిగా మారిపోయింది. టాంక్బండ్ విగ్రహాల గట్టున కూర్చుని వేరుసెనగలు, మొక్కజొన్న పొత్తులూ హాయిగా తినగల్గేవాళ్లం. పక్కన గట్టు మీద కూర్చుని వేడివేడిగా వాడివాడిగా సాహిత్య చర్చలు, కొత్త కవితలు గానాలూ....ఆహా! తిరిగిరాని రోజులు! హైద్రాబాదు ఇప్పుడు ఒంటరి ద్వీపం. ఇక్కడి మేధావులు కూడా ఒంటిస్థంభాల వాసులు! ఎవరి గోల వారిదే! ఏ ఎండకాగొడుగే - ‘అదొక్కటే కొనసాగడానికి దారి’ అన్నాడో మిత్రుడు. నిజమే కాలంతో పాటు ఊళ్లు కూడా పాతబడిపోతాయి. కాని అందాన్ని చెడగొట్టి లాభం ఏమిటి? అన్ని రకాలుగానూ హైదరాబాద్ అందం భయంకరంగా తయారైందని ఒక్కసారి తిరిగి చూస్తే అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా ఉట్టినే చూడడానికి ప్రయాణం చేయండి. సీటు బెల్టే కాదు- వీపుకి సపోర్టు, మెడకి కాలరు- అబ్బో అదిరేలాగా రోబోలాగా తయారవ్వాలి. ఏ రోడ్డులోనూ మీరు హాయిగా ప్రయాణం సాగించలేరు! ‘సిటీ బాగా పెరిగిపోయింది. ఇదిప్పుడు అందరూ తిరగ్గలిగినదీ బ్రతక్కలిగినదీ కాదమ్మా. బండి ఉన్నవాళ్లు, డబ్బున్నవాళ్లు- తప్పించి. వాళ్లకే రక్షణలేదు’’. ఎందుకంటే ఏమో! ఎక్కడ ఆపుతారో- ఎందుకు ఆపుతారో కూడా తెలియదు. ఇక ఆకాశమార్గాలు వస్తే- జనం సుఖంగా-! ఆగండి ఆగండి. తప్పదు అవి వచ్చేదాకా సామాన్యుడి జీవితం- అంపశయ్య! ‘‘ఇప్పుడు మనం మాట్లాడ కల్గిందేం లేదు. మౌనం- గొప్ప భూషణం. అర్థం చేసుకుని బ్రతకండి’’ అని పెద్దలు హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు- తమని తామే హెచ్చరించుకుంటున్నారు. జీవితంలోని కలలు, ఆశలు, ఆదర్శాలు అన్నీ గుప్పిట పట్టుకుని వచ్చిన ఎంతోమంది ఎందుకో సామూహికంగా నిట్టూరుస్తున్నారు. మార్పు సహజం. కాలంతోపాటు మనుషులు ఎదిగినట్టే- పట్నాలూ ఎదుగుతాయి. తప్పదు. కాని హృదయాలూ విస్తరిస్తాయి, ఆహ్వానం పలుకుతాయి అని నమ్మేవాళ్లు తగ్గిపోతున్నారు. పరిస్థితులు మౌనంగా ఉండమంటున్నాయి. బ్రతికి బట్టకట్టడానికి మౌనం నేడు గొప్ప భూషణం. నా కళ్లముందు ఎన్నో దేశాల్లో ముసలితనాన్ని చూశాను. చాలా చోట్ల కాస్తో కూస్తో అసంతృప్తి ఉన్నా తృప్తిగానే బ్రతుకుతున్నారేమో అనిపించింది. మనని చూసి ‘మీరు చాలా అదృష్టవంతులు. అక్కడ పెద్దలకి గౌరవం ఉంది’ అంటే... నేను ఔనౌను అని తలూపాను గాని ఏదీ ఆ గౌరవం? ఏదీ ఆ ఆప్యాయత? కనిపించడం లేదేం? జనం, ఊళ్లు, వాతావరణం పూర్తిగా మారిపోయాయి ఎందుచేత? నాకు ఆలోచనలు సాగడం లేదు. ఇప్పుడు ఆడామగా తేడా లేదు అంటారు. కాని ఆడవాళ్లంతా శరీరాల్లాగా కనిపిస్తున్నారెందుకు? మగవాళ్లంతా వేటగాళ్లలూ కనిపిస్తున్నారెందుకు? సంస్కారం అన్నదేమయిపోయింది. పిల్లల్ని చూసి కన్నవారు భయపడడం ఏమిటి? పెద్దల్ని ఈడ్చి పారేసే ఈ తరానికి జన్మనెవరిచ్చారు. అమ్మకాదే? పుట్టుక కాదే? ఎక్కడిది? సమాజం సగం చచ్చిలేదు. పూర్తిగా చచ్చి దుర్గంధం వెదజిమ్ముతోంది. సెంటు కొట్టి లాభం లేదు. దహన సంస్కారమే కొత్త నాంది అవుతుందా? ఏమో ఎలా ఈ యువతరానికి మంచి దారి చూపెట్టడం? -
పింఛను కోసం పండుటాకుల పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): పెరిగిన పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదురెట్లు పింఛన్ పెరిగినా కష్టాలు పదిరెట్లు పెరిగాయని లబ్ధిదారులు వాపోతున్నారు. నిబంధనలు పేరుతో చాలామందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించారు. పింఛన్ మంజూరైన వారు పోస్టాఫీసు వద్దకు వెళ్లే సరికి డబ్బులు రాలేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. వేలిముద్రలు సరిగ్గా పడడం లేదని, ఆధార్ నెంబర్ తప్పుగా పడిందని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదని, వీఆర్వో నంబర్ పడలేదని చెబుతూ లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. గందరగోళంగా మారిన హెల్ప్‌డెస్క్ పింఛన్ రాని, వచ్చినా పలు రకాల కారణాల చేత నగదు అందని వారి కోసం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో వారం రోజులుగా హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి పలు పోస్టాఫీసుల్లో పింఛన్ అందని వారు మున్సిపల్ కార్యాలయం వస్తున్నారు. వీరిలో రెండు, మూడు, నాలుగు, 8 నెలలుగా పింఛన్ అందని వారు అనేక మంది ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ముగ్గురు మున్సిపల్ సిబ్బంది ఉండి లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. మొదట్లో 20 నుంచి 30 మంది వరకు హెల్ప్‌డెస్క్‌కు వచ్చేవారు. క్రమేణా వీరి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఒక్కసారిగా వందల కొద్దీ పింఛన్‌దారులు కార్యాలయూనికి చేరుకుని పింఛన్‌పై సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమాధానం చెప్పేవారే కరువు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. లబ్ధిదారులు తెచ్చిన పత్రాలపై ఇంగ్లీషులో అక్కడి సిబ్బంది రాసిస్తున్నారు. తెలుగేరాని లబ్ధిదారులకు ఇంగ్లీషులో ఏమిరాశారో తెలియక లబ్ధిదారులు బిక్కమొహం వేస్తున్నారు. -
ఎప్పుడు..? ఎంత..??
ఖమ్మం హవేలి : దసరా పండుగ తరువాత నుంచి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు అందజేస్తాం. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. పింఛన్ల కోసం అర్హులందరూ ఈ నెల 20వ తేదీలోగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.. నవంబర్ 1లోగా అర్హుల ఎంపిక ఉంటుంది. ఇది ఈ నెలలో ప్రభుత్వం చేసిన ప్రకటన. మొన్నటికి మొన్న సీఎం మరో ప్రకటన చేశారు. పింఛన్లు ఇచ్చే తేదీని మరోసారి పొడిగించారు. నవంబర్ 8వ తేదీ తర్వాత ఇస్తామని ప్రకటించారు. ఇలా పలుమార్లు పలు రకాలుగా ప్రకటనలు చేస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. అసలు పింఛన్ ఇస్తారా? లేదా?, ఇస్తే ఎంత ఇస్తారు? ఎప్పుడిస్తారు? ఎంతమందికి ఇస్తారు? అర్హుల్లో తాము ఉంటామా? లేదా? ఇలాంటి సందేహాలెన్నో దరఖాస్తుదారులను వెంటాడుతున్నాయి. ఇదిలావుండగానే ఈనెల 17వ తేదీన రాష్ట్ర గ్రామీణభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ మరో ప్రకటన చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్ల కోసం రూ.99.18 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు.ఇలా పొంతనలేని ప్రకటనలు, ఇదిగో వస్తున్నాయి.. అదిగో వస్తున్నాయి... అంటూ ప్రభుత్వం దోబూచులాట ఆడుతుండటంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. దసరా పండుగ తరువాత నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. దసరా పండుగ తరువాత ఈ పథకం కింద ఉన్న అన్ని కార్డులనూ రద్దు చేయనున్నట్లు, వీటి స్థానంలో ఇచ్చే నూతన కార్డుల కోసం అర్హులైన వారందరూ అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. తర్వాత దాన్ని 20 తేదీకి పొడగించారు. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఒక మన జిల్లాలోనే ఇప్పటివరకు వివిధ రకాల సామాజిక భద్రత పింఛన్లు 2,44,730 మందికి వస్తుండగా గడువు తేదీ ముగిసే నాటికి పింఛన్ల కోసం 2.85 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. భారీగా వచ్చిన ఈ దరఖాస్తులపై ఈనెల 30వ తేదీలోగా విచారణ నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే తేదీ గురించి ముందే తెలియడంతో ఆ రోజు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వస్థలాలకు చేరుకుని వివరాలు తెలిపారు. కాగా ప్రస్తుతం పెట్టుకున్న దరఖాస్తుల విచారణ ఎప్పుడు నిర్వహిస్తారో? ఎన్ని రోజులు పడుతుందోనని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. పాత పద్ధతిలోనే పింఛన్ విడుదల! అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి గతంలో ఇచ్చిన విధంగానే (వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500) నిధులు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. వృద్ధులు, వింతంతువులకు రూ.75.75 కోట్లు, వికలాంగులకు రూ.38 కోట్లు, గీత కార్మికులకు రూ.1.97 కోట్లు, ఎయిడ్స్ బాధితులకు రూ.17.66 కోట్లు విడుదల చేసినట్లు ఈ నెల 17వ తేదీన వెల్లడించారు. ఇప్పటికే పింఛన్ లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అధికారులు ఎప్పుడు విచారణకు వస్తారో అర్థంకాక వారికోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేశామనడం మరో గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే పింఛన్లు వస్తున్నవారు అవి ఉంటాయో, రద్దవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తాము లబ్ధిదారుల జాబితాలో ఉంటామో? లేదోనని సతమతం అవుతున్నారు. మరోవైపు గత సంవత్సరం నిర్వహించిన సదరం శిబిరాలకు సంబంధించి 13వేల మంది వికలాంగులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు సగం మందికి కూడా ధ్రువీకరణపత్రాలు అందలేదు. ఇప్పుడు వారంతా వికలాంగ సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
పింఛన్‌దారుల అవస్థలు
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :జిల్లాలోని మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఐదో తేదీ వరకు పంపిణీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు 55 శాతం మాత్రమే పంపిణీ చేశారు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద పింఛన్‌దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కరు ఐదారు రోజులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పండుగ పూట తొందరగా డబ్బులు వస్తే ఆసరా ఉంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. అధికారుల నిర్లక్ష్యంతో దసరా పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పింఛన్‌దారులు పేర్కొంటున్నారు. కాగా, మున్సిపాలిటీ సిబ్బంది పింఛన్ డబ్బులను వార్డుల్లో పంపిణీ చేసేవారు. ప్రతినెలా ఐదో తారీఖు వరకు ఒక్కో వార్డులో ఒక్కో సిబ్బంది వెళ్లి పంపిణీ సజావుగా చేసేవారు. సిబ్బందికి భారం పడుతుందని, బోగస్ పింఛన్‌దారులను ఏరివేయాలని ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు మేలో అప్పగించింది. ఈ సంస్థ నిర్వాహకులు స్మార్ట కార్డు అందజేసి, వేలి ముద్రలు తీసుకుని వాటి ఆధారంగానే పింఛన్ పంపిణీ మొదలెట్టారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యలతో పింఛన్ అందడం లేదు. పంపిణీ 55 శాతమే.. మంచిర్యాల పురపాలక సంఘంలో 5వేల పైచిలుకు పింఛన్‌దారులు ఉండగా రూ. 17 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రూ. 9 లక్షలు మాత్రమే పంపిణీ చేశా రు. కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో 4 వేల పైచిలుకు లబ్ధిదారులు ఉండగా రూ. 12.50 లక్షలు పంపిణీ చేయాల్సి ఉండగా రూ.6లక్షలు పంచారు. బెల్లంపల్లిలో 4 వేల మంది లబ్ధిదారులకు రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ.7 లక్షలు, మందమర్రిలో 3,800 మందికి రూ.11.50 లక్షలు పంచాల్సి ఉండగా రూ. 6.50 లక్షలు పంపిణీ చేశారు. అలాగే ఆదిలాబాద్ పురపాలక సంఘంలో సుమారు 6 వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.17 లక్షలలో రూ.10.50 లక్షలు, నిర్మల్‌లో 7వేల మంది పింఛన్‌దారులు ఉండగా రూ.20 లక్షలకు రూ.12 లక్షలు పంపిణీ చేశారు. భైంసాలో 4 వేల మంది పింఛన్‌దారులకు రూ.8లక్షలు పంచాల్సి ఉండగా రూ.5లక్షలు పంపి ణీ చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా గణాంకాలు పరిశీలిస్తే 55 శాతం మందికి మాత్రమే పింఛన్ అందినట్లు స్పష్టమవుతోంది. కాగా, కాంట్రాక్ట సంస్థ మేనేజర్ అమ్జద్‌ఖాన్‌ను అడుగగా 18వ తేదీలో పింఛన్లు మొత్తం పంపిణీ చేస్తామని తెలిపారు. పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతి కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్ రైల్వేస్టే„షన్లో పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలు మృతిచెందిన సంఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. జీఆర్పీ ఇన్చార్జి రశీ ద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ ప ట్టణానికి చెందిన కోట గాలమ్మ కుటుంబం ప్ర స్తుతం దండేపల్లి మండలం తాళ్లపేటలో ఉం టోంది. గాలమ్మ ప్రతినెలా కాగజ్‌నగర్‌కు వ చ్చి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. ఈనెల పింఛన్ తీసుకోవడానికి గురువా రం కాగజ్‌నగర్‌కు వచ్చింది. పింఛన్ తీసుకున్న అనంతరం బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం భాగ్యనగర్ ఎక్సప్రెస్లో వెళ్లేందుకు సిద్ధమైంది. రైలు వెళ్లిపోవడంతో రాత్రి కాగజ్‌నగర్ రైల్వేస్టే„షన్లో నిద్రించింది. శుక్రవారం వేకువజామున రైల్వే సిబ్బంది లేపగా మృతిచెంది ఉంది. స్టేషన్‌మాస్టర్ మల్లయ్య ఫిర్యా దు మేరకు జీఆర్పీ బెల్లంపల్లి ఔట్‌పోస్టు ఇన్చార్జి నందగోపాల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటుందని సిబ్బంది తెలిపారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా.. నా పేరు రాజుబాయి. మాది నిర్మల్ మండలం పింజారిగుట్ట. ప్రభుత్వం ఇచ్చే రూ.200 పింఛన్ డబ్బుల కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా. రోజూ ఆటోలో వస్తున్నా. రావడానికి పోవడానికే ఇప్పటివరకు రూ.50 ఖర్చయ్యాయి. తిండి తిప్పలు ఉండటం లేదు. ఇక్కడ వసతులు లేక అవస్థలు పడుతున్నాము. ఇప్పటివరకు పింఛన్ తీసుకోలేదు. అరిగోస పెడుతున్నారు.. పింఛన్ల కోసం అరిగోస పెడుతున్నారు. ప్రతినెలా పింఛన్ కోసం తండ్లాడుతున్నాను. ఎప్పుడిస్తారనేది దేవునికే తెలియాలి. మేము మాత్రం నడవరాకున్నా అష్ట కష్టాలు పడి పింఛన్లు ఇచ్చే చోటుకు వెళ్తాము. గంటల తరబడి నిరీక్షించిన తర్వాత రేపు రండి అంటూ ఇంటికి పంపిస్తారు. కనీసం పండుగ పూట అయినా ముందుగా ఇస్తే సంతోషించే వాళ్లం. - సత్యనారాయణ, పింఛన్‌దారుడు, హమాలీవాడ, మంచిర్యాల