కర్నూలు(జిల్లా పరిషత్): పెరిగిన పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదురెట్లు పింఛన్ పెరిగినా కష్టాలు పదిరెట్లు పెరిగాయని లబ్ధిదారులు వాపోతున్నారు. నిబంధనలు పేరుతో చాలామందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించారు. పింఛన్ మంజూరైన వారు పోస్టాఫీసు వద్దకు వెళ్లే సరికి డబ్బులు రాలేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. వేలిముద్రలు సరిగ్గా పడడం లేదని, ఆధార్ నెంబర్ తప్పుగా పడిందని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదని, వీఆర్‌వో నంబర్ పడలేదని చెబుతూ లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.
గందరగోళంగా మారిన హెల్ప్‌డెస్క్
పింఛన్ రాని, వచ్చినా పలు రకాల కారణాల చేత నగదు అందని వారి కోసం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో వారం రోజులుగా హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి పలు పోస్టాఫీసుల్లో పింఛన్ అందని వారు మున్సిపల్ కార్యాలయం వస్తున్నారు. వీరిలో రెండు, మూడు, నాలుగు, 8 నెలలుగా పింఛన్ అందని వారు అనేక మంది ఉన్నారు.
కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ముగ్గురు మున్సిపల్ సిబ్బంది ఉండి లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. మొదట్లో 20 నుంచి 30 మంది వరకు హెల్ప్‌డెస్క్‌కు వచ్చేవారు. క్రమేణా వీరి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఒక్కసారిగా వందల కొద్దీ పింఛన్‌దారులు కార్యాలయూనికి చేరుకుని పింఛన్‌పై సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సరైన సమాధానం చెప్పేవారే కరువు
మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. లబ్ధిదారులు తెచ్చిన పత్రాలపై ఇంగ్లీషులో అక్కడి సిబ్బంది రాసిస్తున్నారు. తెలుగేరాని లబ్ధిదారులకు ఇంగ్లీషులో ఏమిరాశారో తెలియక లబ్ధిదారులు బిక్కమొహం వేస్తున్నారు.
పింఛను కోసం పండుటాకుల పాట్లు
Published Tue, Dec 30 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement