ఎప్పుడు..? ఎంత..??
ఖమ్మం హవేలి : దసరా పండుగ తరువాత నుంచి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు అందజేస్తాం. గత నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. పింఛన్ల కోసం అర్హులందరూ ఈ నెల 20వ తేదీలోగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.. నవంబర్ 1లోగా అర్హుల ఎంపిక ఉంటుంది. ఇది ఈ నెలలో ప్రభుత్వం చేసిన ప్రకటన. మొన్నటికి మొన్న సీఎం మరో ప్రకటన చేశారు.
పింఛన్‌లు ఇచ్చే తేదీని మరోసారి పొడిగించారు. నవంబర్ 8వ తేదీ తర్వాత ఇస్తామని ప్రకటించారు. ఇలా పలుమార్లు పలు రకాలుగా ప్రకటనలు చేస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. అసలు పింఛన్ ఇస్తారా? లేదా?, ఇస్తే ఎంత ఇస్తారు? ఎప్పుడిస్తారు? ఎంతమందికి ఇస్తారు? అర్హుల్లో తాము ఉంటామా? లేదా? ఇలాంటి సందేహాలెన్నో దరఖాస్తుదారులను వెంటాడుతున్నాయి.
ఇదిలావుండగానే ఈనెల 17వ తేదీన రాష్ట్ర గ్రామీణభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ మరో ప్రకటన చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్ల కోసం రూ.99.18 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు.ఇలా పొంతనలేని ప్రకటనలు, ఇదిగో వస్తున్నాయి.. అదిగో వస్తున్నాయి... అంటూ ప్రభుత్వం దోబూచులాట ఆడుతుండటంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. దసరా పండుగ తరువాత నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. దసరా పండుగ తరువాత ఈ పథకం కింద ఉన్న అన్ని కార్డులనూ రద్దు చేయనున్నట్లు, వీటి స్థానంలో ఇచ్చే నూతన కార్డుల కోసం అర్హులైన వారందరూ అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. తర్వాత దాన్ని 20 తేదీకి పొడగించారు. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి.
ఒక మన జిల్లాలోనే ఇప్పటివరకు వివిధ రకాల సామాజిక భద్రత పింఛన్లు 2,44,730 మందికి వస్తుండగా గడువు తేదీ ముగిసే నాటికి పింఛన్ల కోసం 2.85 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. భారీగా వచ్చిన ఈ దరఖాస్తులపై ఈనెల 30వ తేదీలోగా విచారణ నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు, ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే తేదీ గురించి ముందే తెలియడంతో ఆ రోజు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వస్థలాలకు చేరుకుని వివరాలు తెలిపారు. కాగా ప్రస్తుతం పెట్టుకున్న దరఖాస్తుల విచారణ ఎప్పుడు నిర్వహిస్తారో? ఎన్ని రోజులు పడుతుందోనని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
పాత పద్ధతిలోనే పింఛన్ విడుదల!
అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి గతంలో ఇచ్చిన విధంగానే (వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులకు రూ.500) నిధులు విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. వృద్ధులు, వింతంతువులకు రూ.75.75 కోట్లు, వికలాంగులకు రూ.38 కోట్లు, గీత కార్మికులకు రూ.1.97 కోట్లు, ఎయిడ్స్ బాధితులకు రూ.17.66 కోట్లు విడుదల చేసినట్లు ఈ నెల 17వ తేదీన వెల్లడించారు.
ఇప్పటికే పింఛన్ లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అధికారులు ఎప్పుడు విచారణకు వస్తారో అర్థంకాక వారికోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేశామనడం మరో గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే పింఛన్లు వస్తున్నవారు అవి ఉంటాయో, రద్దవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తాము లబ్ధిదారుల జాబితాలో ఉంటామో? లేదోనని సతమతం అవుతున్నారు. మరోవైపు గత సంవత్సరం నిర్వహించిన సదరం శిబిరాలకు సంబంధించి 13వేల మంది వికలాంగులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు సగం మందికి కూడా ధ్రువీకరణపత్రాలు అందలేదు. ఇప్పుడు వారంతా వికలాంగ సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.