సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటికే గీత కార్మికులు, చేనేత, బీడి కార్మికులకు అందిస్తున్న విధంగా నెలకు రూ.వెయ్యి పెన్షన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమాశాల్లోనే దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. లబ్ధిదారులు ఎంత మంది ఉంటారనే కోణంలో ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది..
అన్ని రకాల చేతి వృత్తిదారులకు ఆసరా పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అందులో భాగంగానే డప్పు కొట్టే చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ సౌకర్యం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది ఈ వృత్తిలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. నలభై ఏళ్లకు పైబడిన తమ వృత్తి వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కొంతకాలంగా డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వృత్తిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నెలా 4.07 లక్షల మంది వృత్తిదారులకు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. అదనంగా డప్పు కొట్టే, చెప్పులు కుట్టే వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వటం ద్వారా ప్రతి ఏడాది రూ.48 కోట్లు అదనపు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment