
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి 20 రోజులు గడిచిపోయాయి. పార్టీల అనుభూతులిప్పటికే కరిగిపోయి ఉంటాయి. అంతా బాగుండాలని.. మనవాళ్లందరికీ మేలే జరగాలని ఎన్నో అనుకుంటాం. కానీ, అనుకున్నామని అన్నీ జరిగిపోతాయా? అన్న ఓ శంక కూడా ఎక్కడో ఓ మూల మనల్ని పట్టిపీడిస్తూనే ఉంటుంది. కాదంటారా? అక్షరాలా నిజమే అంటారు శాస్త్రవేత్తలు. మన మెదళ్లు ఎప్పుడూ భవిష్యత్తులో మన అవసరాలేమిటి? వాటిని సాధించుకునే మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉంటాయి? అన్న అంశాలపై నిత్యం ఆలోచిస్తూనే ఉంటాయట. ఇంకోలా చెప్పాలంటే.. చింత అనేది మనకు పుట్టుకతో వచ్చే సహజ లక్షణమన్నది శాస్త్రవేత్తల అంచనా. జేమ్స్ కార్మోడీ అనే శాస్త్రవేత్త ఏం చెబుతారంటే.. నిత్యం మనల్ని వెంటాడే చింతలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదూ అని!. వైద్యశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా తాను అటు వైద్యులకు, ఇటు రోగులకూ ఈ టెక్నిక్కులు నేర్పించానని ఆయన అంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ టెక్నిక్కులు కొందరికి ఒక్కసారికే వంటబడితే.. మిగిలిన వాళ్లకు ఎంతకీ అర్థం కావు.
చింతను మరిపించే పని..
చింత తాలూకు ప్రభావాలూ అన్నీఇన్నీ కావు. టెన్షన్.. నిద్రలేమి, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం మచ్చుకు కొన్నే. కాకపోతే వీటన్నింటి నుంచి మన బుర్రలను ప్రశాంతంగా ఉంచుకునేందుకూ మార్గాలున్నాయి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైన సందర్భాలను గమనించండి.. ఆ క్షణాల్లో మీరు కచ్చితంగా ఆనందంగానే ఉండి ఉంటారు. ఇలా ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన చింతలకు కొంత దూరం అయ్యేందుకు అవకాశముందన్నమాట. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. చేసే పనిపై శ్రద్ధ పెడితే సంతోషం వస్తుందని తెలిసినా.. మనలో చాలామంది ఎందుకు ఆ పని చేయలేకపోతుంటారు? మన మెదడు పనితీరు దీనికి కారణమని అంటారు జేమ్స్. మనకు తక్కువగా ఉండే వనరుల, ఎదురుకాగల ముప్పుల గురించి ఆలోచిస్తుండటం మెదడు స్వతఃసిద్ధంగా చేసే పనని ఆయన వివరిస్తారు. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండటం ద్వారా టెన్షన్లను మరికొంత తగ్గించుకోవచ్చునని జేమ్స్ చెబుతారు. ఈ అంశంపై కేవలం రెండు మూడు వారాల శిక్షణ పొందితే చాలు..
ఏ అంశంపైనైనా దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరగడంతోపాటు, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని, చంచలమైన ఆలోచనలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చునని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయని జేమ్స్ వివరించారు. మరెందుకు ఆలస్యం.. ఈ కొత్త ఏడాది ఎంచక్కా మైండ్‌ఫుల్‌నెస్‌తో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి!.
Comments
Please login to add a commentAdd a comment