బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది.
....
మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి...
‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’
– ... దీనికి ఏమైందిరా?
‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’
– ...అవును, కానీ మంచి ఫోనురా...
‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’
– .. సరే, చూద్దాం...
ఆ తర్వాత రోజు..
‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’
– సరే ఫస్ట్‌కు చూద్దాం...
ఓ నెల తర్వాత..
‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’
– ..ఏదీ చూద్దాం..
‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా.
– ..అలాగే చూద్దాం..
మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట!
కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని.
విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే..
ఈసారైనా బడ్టెట్‌లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా..
కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది..
నెక్స్‌ట్ బడ్జెట్‌లో చూద్దాం.. అని.
అందుకే ప్రతి బడ్జెట్‌లో శాలరీ శ్లాబ్‌లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం..
నెక్స్‌ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస
సరే చూద్దాం.. ఈ బడ్జెట్‌లో ఎలా ఉంటదో.
వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ–
..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్‌వైపు ఆశగా చూస్తోంది.
‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్.
కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి..
‘‘సమాజాన్ని స్టేబుల్‌గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్‌కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్‌క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్‌లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’
దీనికి సపోర్ట్‌గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ..
‘‘సాధారణంగా పాలిటిక్స్‌కు, ఓటింగ్‌కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా
మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్‌ను విస్మరించడం మోదీ గవర్నమెంట్‌కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’
విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు..
‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు.
ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి..
కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది.
ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి.
కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం.
మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి.
కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి..
ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది.
నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్‌గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్‌లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి..
వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’
ఇదీ ఉద్యోగుల పరిస్థితి
బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు
సరే చూద్దాం..
ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా..
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
Published Sat, Jan 28 2023 10:26 AM | Last Updated on Sat, Jan 28 2023 1:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment