బడ్జెట్‌లో సంక్షేమ మార్గం పడతారా? భారత్‌కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది? | C Ramachanraiah Write on Union Budget 2023 | Sakshi
Sakshi News home page

Union Budget 2023: బడ్జెట్‌లో సంక్షేమ మార్గం పడతారా? భారత్‌కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది?

Published Mon, Jan 30 2023 1:07 PM | Last Updated on Mon, Jan 30 2023 7:28 PM

C Ramachanraiah Write on Union Budget 2023 - Sakshi

కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల ప్రజలలో బడ్జెట్‌ ముందు సహజంగానే కొంత ఉత్కంఠ నెలకొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్‌’ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత 8 ఏళ్లుగా వల్లె వేస్తున్నారు.

అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం తమ లక్ష్యం అని చెప్పుకొంటూ వస్తున్నారు. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, నగదు బదిలీ పథకాలు, రైతాంగానికి పెట్టుబడి సాయం (పీఎం కిసాన్‌), వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్‌ భారత్, పేదలకు ఉచిత రేషన్‌ తదితర పథకాలన్నీ తమ సంక్షేమ విధానానికి చిహ్నంగా బీజేపీ అభివర్ణించుకొంటున్నది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అంది స్తున్నప్పుడు ‘సబ్‌ కా వికాస్‌’ ఆచరణలోకి రావాలి కదా! 

దేశ జనాభాలో 1 శాతం మంది ధనికుల చేతుల్లో 40 శాతం దేశ సంపద చిక్కుకుని ఉందనీ; 50 శాతం జనాభా అంటే... 65 నుంచి 70 కోట్ల మంది ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నదనీ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క ఈ 8 ఏళ్లల్లో బ్యాంకుల 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేశారు.

అయినప్పటికీ ఇంకా బ్యాంకుల నిరర్థక ఆస్తుల గ్రాస్‌ రేటు 6.5 శాతంగా ఉంది. పెట్రో ధరల పెరుగుదల చరిత్రలో లేనంతగా ఈ 8 ఏళ్లల్లో పెరిగింది. డీజిల్‌పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం, గ్యాస్‌ సిలిండర్లపై 185 శాతం భారం మోపారు. అన్ని వస్తువులపై గరిష్ఠంగా వేస్తున్న జీఎస్టీ, గృహనిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల... తదితర భారాలతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఎందుకూ కొరగాకుండా ఉంది.

ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియ జేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తు న్నాయి. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలకు రైలు రవాణా విస్తరించాల్సి ఉండగా, దేశంలోని ఎగువ మధ్యతరగతి వారి కోసం ‘వందే భారత్‌’ రైళ్లను ప్రవేశపెట్టారు.

రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో పటిష్ఠపర్చకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్‌ రైళ్లను ఒక్కొక్కటి రూ. 120 కోట్ల వ్యయంతో దశల వారీగా మొత్తం 475 ప్రారంభించాలని సంకల్పించడం ఆశ్చర్యం కలిగించకమానదు.

2014లో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఈ 8 ఏళ్లలో సంక్షేమబాట నుంచి క్రమంగా వైదొలుగుతూ వస్తోంది. 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొన్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని అతలా కుతలం చేశాయి. మొదటిది పెద్లనోట్ల రద్దు; రెండోది జీఎస్టీ అమలు. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి వేస్తామని చెప్పి కార్యాచరణ చేపట్టకపోవడంతో రైతులు రెట్టింపు నష్టాల్లో కూరుకుపోయారు.

ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నారు. దానివల్ల ఆహార ధాన్యాల నిల్వలు పడిపోతు న్నాయి. గోదాముల్లో ఇప్పుడు కేవలం 4.92 కోట్ల మెట్రిక్‌ టన్నుల గోధుమలు, బియ్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు భారత ఆహార సంస్థ తెలియజేసింది. 

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యరంగంపై కొంతమేర అనివార్యంగా వ్యయాన్ని పెంచింది. టీకాల కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా పెంపుదల వంటి మౌలిక సదుపాయాలపై గణనీయంగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ మొత్తం.. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి మించలేదు. 

ఇక, విద్యారంగాన్ని పరిశీలిస్తే, 2012–13లో యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 3.36 శాతం నిధుల్ని కేటాయించగా, ఎన్డీఏ వచ్చిన ఈ 8 ఏళ్లల్లో విద్యారంగంపై చేస్తున్న వ్యయంలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. నూతన విద్యా విధానాన్ని ఘనంగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు.

మధ్యాహ్న భోజన పథకానికి (ప్రధాన మంత్రి పోషణ్‌) వెచ్చిస్తున్న నిధుల్లో గత 7 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదలా లేదు. కీలకమైన విద్యారంగంలో కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలరు? ఎంతో కీలకమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌ డీ) రంగంలో ఇతర దేశాలు 3 శాతం మేర కేటాయింపులు చేస్తుంటే భారత్‌ కేటాయింపులు గత దశాబ్ద కాలంగా 1 శాతం మించడం లేదు. 

2008, 2009 సంవత్సరాలలో భారత్‌ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్‌ ఫార్మేషన్‌లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో... కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. ఈ 8 ఏళ్లల్లో కేంద్రం కొత్తగా చేసిన అప్పులు రూ. 91 లక్షల కోట్లు దాటాయి.  

అయితే, బ్రిటన్‌ను పక్కకు తోసి భారత్‌ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవను సమీక్షించినట్లయితే, గత 20 సంవత్సరాలలో, ఇతర దేశాలకంటే భారత్‌ ఐటీ రంగంలో వడివడిగా ముందుకుసాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్‌ అగ్రగామిగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం చేసింది నామ మాత్రమే. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌ అగ్రస్థానంలో ఉంది.
(క్లిక్ చేయండి: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి)

క్లుప్తంగా చెప్పాలంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఐటీ, సేవల రంగాలు మాత్రమే గణనీయంగా దోహదం చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ఇంతకు ముందు మాదిరిగానే చిన్నచూపు చూస్తున్నారు.

‘మేకిన్‌ ఇండియా’ ఎందుకు చతికిల పడిందో ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ ఎంఇ) ఊతం కల్పించాలి. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం ఇంకా పెరగాలి. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించి దేశీయ రైతాంగాన్ని మరింత ప్రోత్సహించాలి. నూతన వార్షిక బడ్జెట్‌లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా?


- సి. రామచంద్రయ్య
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement