...అంతా కిల్‌‘బిల్‌’పాండేలే! | Chalapathi Sarikonda Write Article On Women Bill | Sakshi
Sakshi News home page

...అంతా కిల్‌‘బిల్‌’పాండేలే!

Published Wed, Mar 15 2023 11:16 AM | Last Updated on Wed, Mar 15 2023 11:16 AM

Chalapathi Sarikonda Write Article On Women Bill - Sakshi

కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్న సామెత ఉంది. మనం చెప్పిన దానికి కాసింత కాళిదాసు లాంటి పెద్దవాళ్ల పేరు  జోడించి వారి అకౌంట్‌లో వేయడం జరుగుతుంటుంది. తద్వారా చెప్పిన దానికి మరింత ప్రాచుర్యం  వస్తుందని.. అలాంటిదే ఒకటి చూద్దాం..

అనగనగా  ఆ కాలంలో ఓ ఆకతాయి యువకుడు ఉండేవాడు. ఆ ఆకతాయి వీధిలో వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి రావే.. రావే అని కామెంట్‌ చేశాడు.. ఆ అమ్మాయికి ఒళ్లుమండి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది.  ఇప్పటిలా  ఎంపీ లకైనా సమన్లు జారీ చేసి ‘ముద్దు ముచ్చట్ల’కు జవాబు చెప్పండి అని ఆదేశించే  మహిళా కమిషన్లు అప్పట్లో లేవు. ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ప్రెస్‌ మీట్లు పెట్టి చెప్పడానికి మీడియా కూడా లేదు. పైగా ధైర్యం ఉన్న ఇప్పటి ‘నవ్య’ తరం కూడా కాదు. ఆడియో, వీడియోలు షేర్‌ చెయ్యడానికి సోషల్‌ మీడియా కూడా లేదు. అప్పట్లో న్యాయాధికారి,  ఆపై మహారాజు గారే యాక్షన్‌ తీసుకోవాలి. న్యాయాధికారి  విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని విచారణకు రమ్మని ఆకతాయిని ఆదేశించాడు.

ఇది తెలిసిన ఆకతాయి తండ్రి కంగారు పడిపోయాడు. ఇంట్లోనే ఆకతాయికి దేహశుద్ధి చేశాడు. కానీ, రాజదండన నుంచి ఎలా తప్పించడమో పాలు పోలేదు.  ఆయనకు తెలిసిన కవి ఒకరు రాజు గారి ఆస్థానంలో ఉన్నారు.  కవి గారి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. కవి  సాంతం విని,   కొడుకును దార్లో పెట్టుకుంటానని తండ్రి వద్ద గట్టిగా మాట తీసుకుని ఓ ఐడియా చెప్పాడు. ‘‘నేను ఓ శ్లోకం చెబుతా, న్యాయవిచారణ సమయంలో మీ కొడుకును చెప్పమను..’’ అంటూ, దానితో పాటు ముందుగా బాధితురాలైన అమ్మాయి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆయన చెప్పినట్టుగా చేసి ఆకతాయితో శ్లోకం బట్టీ పట్టించాడు. న్యాయవిచారణ జరుగుతున్నపుడు.. ‘నేను రావే రావే అని ఊరికే అనలేదు,  నేను అప్పుడు చదివిన శ్లోకంలో భాగమే అది..’ అని కవి చెప్పిన శ్లోకం చదివాడు.

గేహే గేహే జంగమా హేమవల్లీ
వల్లా్యం వల్లా్యం పారణశ్చంద్రబింబః
బింబే బింబే కోకిలా మంజురావః
రావే రావే జాయతే పంచబాణః
(ప్రతి ఇంట్లోనూ  ఒక కదిలే బంగారు తీగ ఉంది. ప్రతి తీగలోనూ ఒక పూర్ణ చంద్రబింబం ఉంది. ప్రతీ చంద్ర 
బింబంలోనూ ఒక కోకిల స్వరం ఉంది. ఆ  ప్రతీ ధ్వనిలోనూ మన్మథుడు  ఉన్నాడు.)

ఈ శ్లోకం చదువుతుండగా ఆమెకు రావే రావే అని మాత్రమే వినిపించిందని వివరణ ఇచ్చాడు. అంతకు ముందే ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన కారణంగా  ఆ అమ్మాయి కూడా మరింత రెట్టించ లేదు.

ఇప్పటి ‘నవ్య ’తరంలాగా.. ‘‘మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా, కిరోసిన్‌ పోసి నిప్పంటిస్తా...’’  అని ఘాటు­గా  హె చ్చరించలేదు గానీ బుద్ధిగా ఉండమని సూచించింది.
కథ కంచికి వెళ్లింది. అందరూ ఇంటికి వెళ్లారు.
ఈ శ్లోకం రాసిచ్చిన కవి ‘కాళిదాసే’ అని ప్రచారం.

ఇది కాళిదాసు కవిత్వమా,  ఎవరిదైనా పైత్యమా  అన్న విషయం వదిలేస్తే.. ఆ కాలం నుంచీ అమ్మాయిలంటే  చులకనగా చూసే ఆకతాయిలున్నారు, విచారణలున్నాయి, క్షమాపణలున్నాయి. ఇప్పటికీ పరిస్థితేం పెద్దగా మారలేదు. మెడికోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. ఎవరయినా అంతే. 

పైన చెప్పుకున్న దానికి.. కింద మనం మాట్లాడుకోబోయే విషయానికి క్లోజ్‌ రిలేషన్‌ ఉందా.. బాదరాయణ సంబంధమేనా..? మీరే తేల్చుకోండి.
ఈ నెలలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మళ్లీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రస్తావనా వచ్చింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఢిల్లీలో దీక్ష...దీని వెనుక వేరే కారణాలున్నాయని విమర్శలున్నాయనుకోండి. కాసింత చర్చయితే అయ్యింది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆశలు సాకారమైతే, వారి సాధికారతవైపు సమాజం అడుగులు వేస్తే... మహిళలపై వివక్ష తగ్గితే.. గౌరవం పెరిగితే పైన చెప్పుకున్న సంఘటన­లు లాంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న ఆశలు కనిపించాయి. కానీ, ప్రతి మహిళా దినోత్సవం రోజు  అన్ని పార్టీలు, సంఘాలు, ప్రముఖులు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్ర­స్తావించడం.  కుదిరితే కాసిన్ని దీక్షలు.. ఆ తర్వాత మరిచి పోవడం.. అంతే,  ఒకటి కాదు రెండు కాదు 26 ఏళ్లుగా ఇదే తంతు.

..ఎందుకంటే పైన మనం చెప్పుకున్న కామెంట్లూ, కథలూ కంచికిపోలే.. మన మధ్యే ఉన్నాయి. ఇవి ఆకతాయిల మాటలు  కాదు.. మీరే చూడండి.
– ఓ  రోజు మహిళా బిల్లుపై  సీరియస్‌ చర్చ జరుగుతోంది. సమర్థించే వారు గొంతు చించుకుంటున్నారు.

ఇంతలో పార్లమెంట్‌  బయట తిరుగుతున్న ఎంపీని ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి..’ అని మీడియా అడిగితే ఆయన సమాధానం... ‘మా ఆవిడ చేస్తున్న షాపింగ్‌ బిల్లు మీద తప్ప నాకే బిల్లుపై ఆసక్తి, ధ్యాసా లేవు..’ అని ఆ తర్వాత ఓ రోజు..‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌కు ఏం తెస్తుంది..? బ్యూటీపార్లర్‌లకు వెళ్లే బాబ్డ్‌ హెయిర్‌ మహిళలనా...’ మహిళా బిల్లుపై లాలూప్రసాద్‌ రియాక్షన్‌. 

చట్టసభల్లో  కూర్చుని మన రాత రాసే నేతల ధోరణి ఇలా ఉంటే.. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ టీవీ చానల్‌ కామన్‌ పీపుల్‌తో పిచ్చాపాటిగా మాట్లాడింది.. వినండి. 
– పార్లమెంట్‌లో అంత చర్చ జరుగుతోందిగా, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే.. వారిలో కొందరి సమాధానాలు  ఇవీ.
–  ‘అవునవును నేను కూడా విన్నాను. మా ఆవిడ కూడా అడిగింది. మరీ రచ్చ బాగా చేస్తున్నారు..  బిల్లు ఎక్కువ  అయ్యిందా అని..’ (జోక్‌ ?)
–  ‘నాకు బిల్‌ క్లింటన్‌ మాత్రమే తెలుసు  ఈ బిల్‌ గురించి ఐడియా లేదు..’ (లైట్‌?)
– ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ ఎప్పుడొస్తుంది..?
‘వారికి అధికారం వచ్చేసిందిగా.. క్రెడిట్‌ కార్డ్‌ల రాకతో’ (వెటకారం?)
– ఉమెన్‌ రిజర్వేషన్‌ వస్తుందా..?
‘లాలూ రైల్వే కోచ్‌లలో మహిళలకు కొన్ని కేటాయించా డుగా..’(సరదా?)
– చట్టసభల్లో మహిళల కోటా గురించి చెప్పండి. 
‘ఇప్పుడు  ఇంట్లో అంతా వారి పెత్తనం.. ఇక 
రెండు సభల్లో వారిదే పెత్తనం అవుతుంది. దేశాన్ని వారే  నడుపుతారు..’ (తేలిక భావం?)
బిల్లు తేవాల్సిన  చట్టసభల్లో నాయకులకూ, బయట సాధారణ ప్రజలకూ ఒకే రకమైన భావజాలం ఉన్నాక, 26 ఏళ్లే కాదు ఎన్నేళ్లయినా అలాగే ఉంటుంది. మహిళా దినోత్సవం రోజో, ఎన్నికల మేనిఫెస్టోల్లోనో, ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకోవడానికో  ఓ సబ్జెక్ట్‌ అవుతుంది.

‘రాజ్యసభ నుంచి లోక్‌ సభకు నడిచి వెళ్లడానికి ఐదు నిమిషాలు పడుతుంది. కానీ, రిజర్వేషన్‌ బిల్లుకు మాత్రం ఇన్నేళ్లయినా (రాజ్యసభ ఆమోదించిన 2010 నుంచి) లోక్‌
సభకు చేరనే లేదు..’
– ఇది బృందా కారత్‌ ఆవేదన. 
పైన చెప్పుకున్నట్టుగా మన పరిస్థితి ఇలాగే ఉంటే, ఎన్నాళ్లయినా బిల్లు లోక్‌సభ వైపు నడుస్తూనే ఉంటుంది.

మనమే  కాదు.. అంతటా అంతే  ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజా నివేదిక చూడండి

ప్రపంచవ్యాప్తంగా మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు 22.8 శాతమే. కేవలం 13 దేశాల్లోని కేబినెట్లలో మాత్రమే 50%, ఆపైన మహిళా మంత్రులు ఉన్నారు.

మహిళలు మంత్రులుగా ఉన్నా వారికి కేటాయిస్తున్న శాఖల ప్రాధాన్యత తక్కువే. 

ప్రజలు నేరుగా ఎన్నుకునే దిగువ సభల్లో (లోక్‌సభ తరహాలో) మహిళా పార్లమెంటేరియన్లు 26.5 శాతమే. అయితే ఇది 1995లో 11%గానే ఉండగా ప్రస్తుతం కొంత మెరుగుపడింది.

దిగువ సభలో 50%, అంతకన్నా ఎక్కువ మంది ఎంపీలున్న దేశాలు ఆరు మాత్రమే. రువాండాలో 61%, క్యూబాలో 53%, నికరాగ్వాలో 52%, మెక్సికో, న్యూజిలాండ్, యూఏఈలలో 50% మహిళా ఎంపీలున్నారు. ఈ ఆరింటితోపాటు మరో 17 దేశాల్లో 40% పైన మహిళా ఎంపీలు ఉన్నారు. 22 దేశాల్లో మహిళా ఎంపీలు 10% కన్నా తక్కువే
-సరికొండ చలపతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement