మంత్రి మల్లారెడ్డి
నెట్‌లో ట్రెండ్ అవుతున్న తండ్రీ కూతుళ్ల సంభాషణ..
పనిచేసుకుంటున్న తండ్రిని ఏడేళ్ల పాప... ‘ఏం చేస్తున్నావ్ నాన్నా...’ అని అడుగుతుంది. ‘ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నానమ్మా..’ అని సమాధానం చెప్పగా,
‘ఇన్‌కమ్ ట్యాక్స్ అంటే...’ ఆ పాప ప్రశ్న.
కొద్దిగా ఆలోచించి, కాస్త నిట్టూర్చి. ఇలా అంటాడు.
‘... నిన్నూ, అన్నను పోషిస్తున్నట్టే రాజకీయనాయకులను, అధికారులను పోషించాల్సిన బాధ్యత నా మీద ఉందమ్మా.. వాటికి డబ్బులు తీసిపెట్టడమే ఇన్‌కమ్ ట్యాక్స్..’
– ఈ జవాబులో నిజం కాస్తే ఉన్నా, కడుపు మంట ఎక్కువగా కనిపిస్తుంది. సగటు మనిషి, ఉద్యోగిపై ప్రతినెలా, ప్రతి ఏడాదీ ‘ఐటీ దాడులు’ జరుగుతూనే ఉంటాయిగా... అందుకే.
► చరిత్ర చూస్తే సగటుమనిషి కడుపు మంట నుంచి విప్లవాలు, లేదా విప్లవాత్మక ఆలోచనలు పుట్టుకురావడం కనిపిస్తుంది.
కానీ, సాక్షాత్తూ ఓ మంత్రి కడుపుమంట నుంచి కూడా విప్లవాత్మక ఆలోచనలు రావడం ముదావహం, ఆహ్వానించదగ్గ విషయం.
మంత్రి మల్లారెడ్డి పన్నులు లేని, ఐటీ దాడుల్లేని భారతావనిని స్వప్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీతో అది సాధ్యమని మనలో ఆశలు కల్పిస్తున్నారు.
ఆయన మాటలు చూడండి.
‘‘కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి 2024లో అధికారంలోకి వస్తది. ఎవరిపైనా ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు ఉండవు. మా పాలనలో ఎవరైనా, ఎట్లయినా సంపాదించుకోవచ్చు. ఎవరికి వారే స్వచ్ఛందంగా, తమకు ఇష్టమైతేనే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే విధంగా కొత్త రూల్స్ తీసుకొస్తాం..’
– వందల కొద్దీ ఐటీ అధికారులు రెండు మూడు రోజులపాటు దాడి చేసి, నానా ప్రశ్నలు వేసి, రక రకాల డాక్యుమెంట్లు అడిగి, కాస్తో కూస్తో దొరి కిన కరెన్సీని ఎక్కడిదని ప్రశ్నించిన ఫ్రస్టేషన్‌లో పుట్టిందే .. ‘బీఆర్‌ఎస్ నాయత్వంలో పన్నులు లేని భారతదేశం’ ఐడియా అని అందరూ అపోహ పడుతున్నా, వినడానికి ఎంత బావుందో... అని అందరూ ఆనందపడ్డారు.
చాయ్ వాలా... మిల్క్‌వాలా
‘చాయ్‌వాలా’ మోదీ మన గొంతులో బలవంతంగా పోస్తున్న జీఎస్‘టీ’ కన్నా ‘మిల్క్‌వాలా’ మల్లారెడ్డి మాటలే మనకు ‘బూస్ట్’నిస్తాయి. ఇలా జనాన్ని ఆనంద పెట్టడంలో, ముఖ్యంగా కుర్రకారును ఉత్సాహపరచడంలో, మోటివేట్ చెయ్యడంలో మల్లారెడ్డికి పెట్టిందిపేరు. విజయానికి తానే మోడల్ నంటూ కుండ బద్దలు కొట్టేసి, 23 మూడేళ్ల వయస్సులో సైకిల్‌పై పాలమ్మిన తాను దేశంలోని టాప్ టెన్ ‘ఎడ్యుకేషనిస్టు’గా, మంత్రిగా ఎదగడంలో తన అవిర ళ కృషిని తరచూ యువతకు గుర్తుచేస్తుంటారు. బాగా ఎదగాలని మోటివేట్ చేస్తుంటారు. షార్ట్‌కట్స్ కూడా చెబుతుంటారు.
పాతికేళ్ల వయస్సులో, అదికూడా ఎవరితో పడితే వాళ్లతో ప్రేమలో పడకూడదని ముఫ్పై ఏళ్లు దాటాకా ఆ పని చేయాలని సూచిస్తుంటారు. ప్రేమ, పెళ్లి అంటే ‘ఐశ్యర్యారాయ్ అమితాబ్ కొడుకును పట్టినట్టుగా, జాక్‌పాట్ కొట్టినట్టుగా...’ ఉండాలని అమ్మాయిలకు మార్గనిర్దేశనం చేస్తారీ ఎడ్యుకేషనిస్టు. అలాగే అబ్బాయిలు ఎలా పెళ్లి చేసుకోవాలో, ఎలా ఆర్థికంగా స్థిరపడాలో హీరో రామ్‌చరణ్‌ను చూసి నేర్చుకోవాలని సరదాగా చెబుతుంటారు.
అలా రిచ్‌గా ఎలా రూపొందాలో తరచూ చెప్పే మంత్రిగారు, ఇప్పడు ఆ రిచ్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలో యోచించి.. అలా కష్టపడి సంపాదించిన దానికి ట్యాక్స్ కట్టకపోవడమే మార్గంగా ఊహించి బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ‘ట్యాక్స్‌లెస్ కంట్రీ’గా ఇండియాను రూపొందించే పనిలో పడ్డారు.
ఇక్కడ పన్ను బాధలేదు..
నిజానికి పన్ను బాధలేని దేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల కాస్తో కూస్తో కడితే చాలు. మంత్రి గారి మాటలు నిజమైతే మనమూ ఇలా హ్యాపీగా ఉండొచ్చు.. మచ్చుకు కొన్ని..
► యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను మాటే లేదు. జనం ఎంత సంపాదించుకున్నా ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా విదేశాల వారూ ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అందుకే చాలామంది యూఏఈలో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు.
► దక్షిణ అమెరికా ఖండంలో అందమైన బీచ్‌లు, కేసినోలతో అలరారే పనామా దేశం పన్ను రహిత స్వర్గంగా పేరుపొందింది. ఇక్కడి జనం ఆదాయ పన్ను కట్టే పనిలేదు. విదేశాల్లో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుకూ పన్ను కట్టనక్కర లేదు. దేశంలో చేసే వ్యాపారంపై మాత్రం, అదీ స్వల్పస్థాయిలో పన్నులు కడితే చాలు.
► బహమాస్‌లోనూ వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేస్తే శాశ్వత నివాస అవకాశమూ ఉంటుంది.
► గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్ కూడా ప్రజల నుంచి ఎలాంటి ఆదాయ పన్ను వసూలు చేయవు. వాణిజ్య కార్యకలాపాలపై మాత్రం ఖతార్‌లో పదిశాతం, కువైట్‌లో 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
► మరో గల్ఫ్ దేశం ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రమే కాదు.. ఆస్తి పన్ను, స్థిరాస్తులపై పన్ను వంటివీ లేవు.
► ఆధునిక సదుపాయాలకు నిలయమైన బెర్ముడాలోనూ పౌరులకు ఆదాయ పన్ను లేదు.
► మొనాకో, సైమన్ ఐలాండ్స్, వనౌటు వంటి దేశాల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. వనౌటు దేశం అయితే డ్యూయల్ సిటిజన్ షిప్‌ను అధికారికంగానే అంగీకరిస్తుంది.
► యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్‌ల మధ్య స్వతంత్ర పాలిత ప్రాంతమైన ఆండోరాలో వ్యక్తిగత ఆదాయ పన్ను కేవలం పది శాతం, అదీ గరిష్ఠంగా 40 వేల యూరోలకే పరిమితం. వారసత్వ ఆస్తులు, బహుమతులపై ఎలాంటి ట్యాక్సులూ ఉండవు.
...
మొన్నటికి మొన్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే, ఆ జెండా నుంచి గులాబీ రేకుల్లాగే... సగటు, వేతన జీవుల కళ్లల్లో, ఇంకా చెప్పాలంటే ధనిక, పేద తేడా లేకుండా అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలిపడ్డాయి. కళ్ల ముందు పైన చెప్పిన పన్నులేని దేశాలు యూఏఈ, ఖతార్, కువైట్ ఇత్యాదులు అక్కడి ప్రజల ఆనందం కళ్లముందు కదలాడాయి. మల్లారెడ్డి హామీ ఇచ్చిన ‘ఐటీ దాడుల్లేని స్వప్నలోకం’ ఆవిష్కృతమైంది.
ఇక ప్రతి బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబులు మారతాయా అని కామన్ మ్యాన్ ఆశగా చూడక్కర్లేదు.
డోర్ బెల్ మోగితే ఐటీ పటాలమేమోనని రిచ్‌మ్యాన్ గాబరా పడక్కర్లేదు. మన డబ్బంతా మనకే..
... ఇప్పుడందరి చూపూ 2024 వైపే, అందరి ఆశా ఒక్కటే..
బీఆర్‌ఎస్ ఎర్రకోట ఎక్కాలి.. మల్లారెడ్డి ఆర్థిక మంత్రి కావాలి.. అంతే. (క్లిక్ చేయండి: పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...)
Comments
Please login to add a commentAdd a comment