‘ఓల్డ్‌’ నాట్‌ గోల్డ్‌.. నడిసంద్రంలో ‘నౌక’రీ..! | Sakshi
Sakshi News home page

‘ఓల్డ్‌’ నాట్‌ గోల్డ్‌.. నడిసంద్రంలో ‘నౌక’రీ..!

Published Mon, Aug 14 2023 8:26 AM

Chalapathi Sarikonda Guest Coloumn On Middle Age Blues - Sakshi

ఫ్లయింగ్‌ కిస్‌ ఇది మనం మాట్లాడుకునే అంశానికి సంబంధించింది కాదు... అయినా ఓసారి! మన సమాజంలో యాభై దాటితే వృద్ధులు, అరవైదాటాక  రిటైర్‌ కావల్సిన వారు అని అంటారు కానీ రాజకీయాలకు మాత్రం ఇదే అనువైన వయస్సు. యాభైకి దగ్గరవుతున్న యువనేతలు  ఫ్లయింగ్‌ కిస్‌లు కూడా విసరొచ్చు. దానికి తగ్గ హుషారు వయస్సే అది.

వైన్‌ గ్లాస్‌...  మిడిల్‌ ఏజ్‌ బ్లూస్‌!
ఇది కూడా మన టాపిక్‌కు కాసింత దూరమే అయినా మిడిల్‌ ఏజ్‌ కదా సరదాగా!
ఓ 80 ఏళ్ల వృద్ధుడు జనరల్‌ చెకప్‌ కోసం డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. అతని  ఆరోగ్యమూ, సరదా  చూసి డాక్టర్‌ ఆశ్చర్యపోయాడు 
ఆ డాక్టర్‌ నడివయస్సులో ఉన్నాడు.  కావల్సినంత బీఎమ్‌ఐ, ఉన్నంతలో మాంచి బీపీతో అప్పడప్పుడే  ఆరోగ్యం అలారం మోగిస్తోంది. ‘మీ ఆరోగ్య రహస్యం ఏమిటి....?’ – వృద్ధుడిని ఆసక్తిగా డాక్టర్‌  అడిగాడు.
‘నేను సూర్యుడు ఉదయించక ముందే లేచి సైకిల్‌ తొక్కడానికి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి రెండు గ్లాసుల వైన్‌ తాగుతాను!
బహుశా ఇదే నా ‘ఆరోగ్య రహస్యం.’ 
‘సరే, అయితే మీ నాన్నగారు చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎంత?’
‘నాన్న చనిపోయారని మీకు ఎవరు చెప్పారు?’
‘మీకే 80 ఏళ్లు, మీ నాన్న ఇంకా బతికే ఉన్నారా ..ఇంతకీ అతని వయసు ఇప్పుడు ఎంత....?
– ఆశ్చర్యంగా, ఆసక్తిగా డాక్టర్‌.
‘అతనికి 102 సంవత్సరాలు, ఈ ఉదయం నాతో సైకిల్‌ తొక్కాడు, ఆపై రెండు గ్లాసుల వైన్‌ తీసుకున్నాడు.’
‘దీర్ఘాయువు మీ కుటుంబ జన్యువులలో
ఉందని దీని అర్థం. ఇంతకీ మీ తాత చనిపోయినప్పుడు ఆయన వయస్సు ఎంత...?‘
‘అరే ఇప్పుడు తాతయ్యను ఎందుకు  చంపు తున్నారు...?’
‘మీకు 80 ఏళ్లు, మీ తాత ఇంకా బతికే ఉన్నారా! అతని వయసు ఎంత...?’... డాక్టర్‌ అయోమయం. ‘అతని వయస్సు 123 సంవత్సరాలు.’
‘అతను కూడా ఈ ఉదయం మీతో సైకిల్‌ తొక్కేసి వైన్‌ కూడా తీసుకుని ఉంటాడని అనుకుంటున్నా.....?’ డాక్టర్‌ అన్నాడు.
లేదు, ‘తాత ఈ ఉదయం వెళ్లలేకపోయాడు! ఎందుకంటే అతను ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాడు... రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.  ఆమె గర్భవతి కూడా!’ 
అప్పటి నుంచి డాక్టర్‌ రోజూ సైకిల్‌ తొక్కుతూ వైన్‌ తాగుతున్నాడు.
నడివయస్సును జయించే తాపత్రయం.



నడి ‘సంద్రం’
ఇది మాత్రం అచ్చంగా మన టాపిక్కే!
ఈఎమ్‌ఐలు, బీఎమ్‌ఐలు పీక్స్‌ కొచ్చే ఏజ్‌ ... అదే మిడిల్‌ ఏజ్‌. మిడిల్‌ క్లాస్‌ వాళ్లకు ఓ  పరీక్షా సమయం.  చచ్చీ చెడీ ఏ ముప్పై ఏళ్ల బార్డర్‌లోనో  పెళ్లైతే.. నలభై, యాభై ఏళ్ల మధ్య వయస్సులో పిల్లల చదువులు ఖర్చు భారీగా ఉంటుంది. ఇంటి ఈఎమ్‌ఐల నుంచి ఇంకా విముక్తి లభించదు. కారుంటే... దానిæలోన్‌ తీరదు. ఓ పక్క పెరిగిన బీఎమ్‌ఐతో ఆరోగ్యం అలారం మోగిస్తుంటుంది. ఇంకా చదువు పూర్తవ్వని కొడుకు, పెళ్లికి ఎదిగిన కూతురు... కొలువు మెడపై వేలాడుతున్న కత్తి... పింక్‌ స్లిప్‌. వెరసి నడి వయస్సు... నడిసంద్రం. 

దీనికి తోడు కొలువుల పరిస్థితి మారుతోంది చూడండి...సీనియారిటీ సీన్‌ మిస్‌..అప్పుడే కాలేజీ పూర్తి చేసి వస్తే.. ఫ్రెషర్స్‌ ఉద్యోగాలు దొరకడం కష్టం. కాస్త అనుభవముంటే ఫుల్లు డిమాండ్‌. కొంచెం ప్రాధాన్యత..

అదే ఇంకొంత కాలం గడిచి మధ్య వయసుకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడుతోంది. మెల్లగా ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇంకొన్నేళ్లు గడిస్తే ఉద్యోగంలో ఉంచడమా, ఏదో కారణంతో పంపించేయడమా అన్నట్టుగా మారిపోతోంది. ఉద్యోగుల వయసుపై వివక్ష కనిపిస్తోంది.

...కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ట్రెండ్‌ ఇది. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతికతలను, సరికొత్త పనితీరును పాత ఉద్యోగులు సరిగా అందిపుచ్చుకోలేరనే భావనే దీనికి కారణం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. 

కంపెనీలకు రెవె‘న్యూ’
పేస్కేల్‌ సంస్థ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారిలో మిలీనియల్స్‌ (1980–96 మధ్య పుట్టినవారు) 68% నుంచి 70% వరకు ఉంటే.. జనరేషన్‌  జెడ్‌ (1996–2010 మధ్య పుట్టినవారు) 18% నుంచి 20% వరకు ఉన్నారు.

అగ్రశ్రేణి కంపెనీలైన ఫేస్‌బుక్, లింక్‌డ్‌ ఇన్‌ , స్పేస్‌ఎక్స్‌ సంస్థల్లో ఉద్యోగుల సగటు వయసు కేవలం 29 ఏళ్లే. ఐబీఎం, ఒరాకిల్, హెచ్‌పీ వంటి సంస్థల్లోనూ ఇది 33 ఏళ్లే. అంటే కొత్త జనరేషన్‌ కు కంపెనీలు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది.

ఓల్డ్‌... నాట్‌ గోల్డ్‌!
ఉద్యోగులపై ‘వయసు వివక్ష’ మన దేశంలోనూ పెరుగుతోంది. ఏఐఎం సంస్థ అధ్యయనం ప్రకారం.. మన దేశంలోని చాలావరకు ఐటీ కంపెనీల్లో 50 ఏళ్లు పైబడిన ఉద్యోగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది.

–ఇన్ఫోసిస్, టీసీఎస్‌ కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగులు 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయసువారే. మరో 40 శాతం మంది 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవారు. 50 ఏళ్లు దాటినవారిసంఖ్య 10 శాతమే.

– ఐబీఎంలో మాత్రం 20–35 ఏళ్ల మధ్యవారు 45 శాతం, 35–50 ఏళ్ల మధ్యవారు 30 శాతం ఉంటే... 50 ఏళ్లు దాటినవారు 25 శాతం ఉన్నారు.

–ఇక ముందూ ఈ కంపెనీల్లో ‘యంగ్‌’ జనరేషన్‌ను పెంచే పని జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1.57 లక్షల మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్‌ చేసుకునేందుకు కంపెనీలు ఏర్పాట్లు చేసుకున్నాయి.

33 శాతం మందికి వివక్ష
జాబ్‌బజ్‌ సంస్థ చేసిన సర్వే ప్రకారం...
ఇండియాలో 33 శాతం మంది ఉద్యోగులు వయసుకు సంబంధించిన వివక్షను ఎదుర్కొంటున్నారు. మధ్యవయసు దాటినవారిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడం, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం, కొన్నిసార్లు రాజీనామా చేసేలా ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ‘‘కొన్ని దేశాల్లో ఇలాంటి వయసు వివక్షకు వ్యతిరేకంగా కఠినచట్టాలు ఉన్నాయి. మన దేశంలోనూ అలాంటివి రావాల్సి ఉంది..’’  ఓ విశ్లేషకుడి మాట.
ఇటీవల ఓ  కంపెనీ అమెరికాలో పనిచేస్తున్న 80 మంది ఉద్యోగులను ‘వయసు, సీనియర్లు’ కారణంతో భారత్‌లోని కార్యాలయాలకు బదిలీ చేయడం ‘వయసు వివక్ష’ అంశంపై చర్చను రేపింది. 2018 లోనూ ఇదే కంపెనీ 40 ఏళ్లు దాటిన 20 వేల మంది ఉద్యోగులను తొలగించడం వివాదాస్పదమైంది కూడా!

ప్రతిష్ఠాత్మక గూగుల్‌ సంస్థ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడటంతో 227 మంది కోర్టులో కేసులు వేశారు. 2019లో వారికి సుమారు రూ. 90 కోట్లు పరిహారంగా ఇచ్చి కేసుల నుంచి బయటపడింది.

కంపెనీలు ఖర్చు తగ్గించుకునే క్రమంలో ప్రధానంగా సీనియర్లపైనే వేటు వేస్తున్నాయి.తక్కువ వయసున్న వారు చురుగ్గా, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేస్తారన్న భావనే దీనికి కారణం. దీనితోపాటు సీనియర్లకు ఎక్కువ జీతాలు, అలవెన్సులు ఉండటం, పరిస్థితులకు అనుగుణంగా మారలేరనే ఆలోచన కూడా కారణం. 

‘ఓల్డ్‌’ స్టాక్‌!
ఇది కూడా మన  స్టోరీకీ సంబంధించింది కాదు.. అయినా చదవొచ్చు.పూర్వకాలంలో సౌత్‌సీ దీవుల్లో వయస్సు మళ్లిన వారిని చెట్టు పైకి  ఎక్కించేవారట. వారు ఎక్కిన తర్వాత బలమైన యువకులు ఆ చెట్టును ఊపేవారట. ఆ ఊపునకు కింద పడిపోకుండా నిలబడగలిగితే విడిచిపెట్టేవారట. నిలబడక పోయిన వారిని చంపివేసే వారట... అంతే! 
-సరికొండ చలపతి

Advertisement
Advertisement