బాబోయ్‌! హ్యాండిల్‌ విత్‌ కేర్‌... | Sarikonda Chalapathi Satirical Article On Chandrababu | Sakshi
Sakshi News home page

కరెక్ట్‌గానే రాశానుగా.. కవితక్క మొన్న ఇదే చెప్పింది.. అంకుల్‌

Published Thu, Dec 29 2022 10:02 AM | Last Updated on Thu, Dec 29 2022 10:12 AM

Sarikonda Chalapathi Satirical Article On Chandrababu - Sakshi

‘లయర్‌ అనే పక్షి బాగా మిమిక్రీ చేస్తుందట. దానికి వినబడే అన్ని రకాల ధ్వనులను అనుకరించేస్తుందట. ఇతర పక్షుల శబ్దాలు, కుక్కల అరుపులు, కెమెరా షటర్‌ శబ్దం, రంపం కోస్తున్న చప్పుడు, తుపాకీ పేలిన చప్పుడు, కారు ఇంజన్‌  ఇప్పుడు, కొన్ని కొన్ని మనుషుల మాటలు కూడా అనుకరించగలదట... ఎప్పటికప్పడు దాని అవసరాన్ని బట్టి అరుపులు ఉంటాయి కనుక ‘లయర్‌’ అంటారట అంకుల్‌. ’
– నైన్త్‌ క్లాస్‌ చదివే పక్కింటి కుర్రాడు రవి. 

...అప్పడే టీవీలో పొలిటికల్‌ లీడర్ల ముచ్చట్లపై చర్చ నడుస్తోంది. నేను సీరియస్‌గా వింటున్నా. ఎవరు ఎప్పుడు ఎలా  మాట మార్చారు, గతంలో ఏం చెప్పారు, ఇప్పడేం చెబుతున్నారు,  ఆ పార్టీలో ఉన్నప్పడు ఏం మాట్లాడారు.  ఈ పార్టీలో ఏం మాట్లాడుతున్నారు... మాటెలా మారింది... గట్రాలు. 
......

రవి  చదువుకోవడానికి మా ఆవిడ దగ్గరికి వస్తుంటాడు. నేనూ ఖాళీగా ఉన్నప్పడు వారి మధ్య ఇన్వాల్వ్‌ అవుతుంటాను. ఎప్పుడూ ఆ పిల్లాడి చేతిలో ఐఫోన్‌ ఉంటుంది. సోషల్‌ మీడియా బాగా ఫాలో అవుతుంటాడనుకుంటా... రకరకాల విషయాలు చెబుతుంటాడు. సినిమాలు, నేచర్, టెక్నాలజీ... ఇలా.
......

‘ఎందుకోయ్‌ ఆ సోషల్‌ మీడియా ముచ్చట్లు... హాయిగా పేపర్‌ చదువుకోరాదూ. జనరల్‌ నాలెడ్జ్‌ వస్తుంది’ అని వాడికి చెబుతూ, ‘న్యూస్‌ వినడానికి,  పేపర్‌ చదవడానికి ఎంకరేజ్‌ చెయ్యి , పిల్లాడు షార్ప్‌ గా ఉన్నాడు’... అని మా ఆవిడకూ ఓ సలహా పడేశా. మా ఆవిడ నన్ను అదోలా చూసింది.  నేను ఇచ్చిన సలహాలు తరచుగా వికటిస్తాయని ఆమె ప్రగాఢ నమ్మకం. ఇందులో వికటించడానికి ఏముంది? న్యూస్‌ చూడమన్నా. మంచి సలహానే కదా... అన్న ధీమాతో అక్కడి నుంచి లేచిపోయా. ఇది కొద్దిరోజుల క్రితం జరిగిన విషయం. 
......

ఓ ఫైన్‌  ఈవెనింగ్‌ మా ఆవిడ పక్కింటి కుర్రాడి హోం వర్క్‌ బుక్‌ నాముందు పడేసింది, చూడండి మీ నిర్వాకం అన్న అర్థం స్ఫురించేలా చూస్తూ. ఏదో తేడా జరిగిందని అర్థం అయ్యింది. ఏమైందా అని చదివా. సామెతలకు అర్థం రాయమని స్కూలు టీచర్‌ ఇచ్చిన అసైన్‌మెంట్‌..
– ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది... ఈ సామెతను వివరింపుము – టీచర్‌ ప్రశ్న
– తెలంగాణలో బాగా పాలన చేయని కేసీఆర్‌... బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ పార్టీ పెట్టడం. – మన వాడి సమాధానం
– గూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడట... అర్థం ఏమిటి? – మరో ప్రశ్న
– ఆంధ్రప్రదేశ్‌లో సరిగా పరిపాలన చేయలేని చంద్రబాబు మళ్లీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాననడం. – ఇదీ జవాబు
...ఈ సమాధానాలు చదివి అవాక్కయ్యా. అప్పటికే మా ఆవిడ నావైపు సీరియస్‌గా చూస్తోంది. పిల్లాడిని చెడగొట్టావుగా అన్నట్టు. 

సీరియస్‌గా టీవీల్లో వార్తలు చూస్తున్న రవిని చూసి ఠక్కున టీవీ కట్టేసి పిలిచి పక్కన కూర్చోబెట్టి సామెతలు చూపించి అడిగా...  ఇలా ఎవరు చెప్పారని.
‘మీరు వార్తలు ఫాలో అవమని చెప్పారుగా అంకుల్‌... అప్పటినుంచి పేపర్‌ చదువుతున్నా, టీవీ న్యూస్‌ కూడా చూస్తున్నా. చాలా విషయాలు తెలుస్తున్నాయ్‌. మొన్న నడ్డా తెలంగాణ వచ్చాడుగా... మొదటి సామెత ఆయన చెప్పిందే. ఆయన స్పీచ్‌ మొత్తం విన్నా. అందుకే సామెత అర్థం ఈజీగా రాసేశా. ఆ తర్వాత సామెత  చంద్రబాబు మీద  నిన్న హరీశ్‌రావు చెప్పింది... అంతకు ముందు చంద్రబాబు స్పీచ్‌ కూడా విన్నా.

 ‘కరెక్ట్‌గానే రాశానుగా  అంకుల్‌... టీచర్‌ బాగా సీరియస్‌ అయ్యింది. ఎవరు చెడగొడుతున్నార్రా నిన్ను.. అంటూ తలంటు పోసిందనుకోండి...’ 
‘...అయినా అంకుల్‌... అశోకుడిలా చెట్లు నాటించాం.. కాకతీయుల్లా చెరువులు తవ్వించాం.  ఇళ్లకూ, పొలాలకూ నీళ్లిచ్చాం.  రైతులకు సాయం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం... అని కేసీఆర్‌ చెబుతున్నారుగా. మరి నడ్డా ఎందుకలా అంటున్నాడు అంకుల్‌? ఇంకా మరి చంద్రబాబేమో...’ ఇలా వాడు గడగడా మాట్లాడుతున్నాడు. 

నేను షాక్‌ లోంచి తేరుకోకముందే వాడి నోరు మూసి మా ఆవిడ తీసుకెళ్లి పోయింది. పిల్లాడి జోలికి రావద్దన్నట్టుగా... కళ్లలో కాసిని నిప్పులు.
‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి వచ్చేవి  నిప్పులేగా.. కవితక్క మొన్న ఇదే చెప్పింది.. అంకుల్‌’... అని రవి అంటున్నట్టుగా అనిపించింది.
వార్నీ!  వీడి జనరల్‌ నాలెడ్జ్‌ తగలెయ్యా. నేను అనుకున్నదానికన్నా షార్ప్‌గా ఉన్నాడే అనుకున్నా.

ఎప్పటిలాగే... మరో సలహా వికటించిందన్నమాట! ఈ సామెతలకే ఇలా నేర్చేసుకుంటే... మరి తిట్ల సంగతేమిటి? వీడు క్లాసులో, వాళ్లింట్లో మాట్లాడుతున్న భాష పరిస్థితేమిటి? కొద్ది రోజుల్లో పక్కింటి వాళ్లు నాపై దండయాత్రకు రావడం ఖాయం. కొంచెం గతుక్కుమన్న మాట వాస్తవం. అప్పటినుంచి వాళ్ల చదువు  జోలికి పోకుండా నా మానాన నేను ఉంటున్నా...
......
 ఆ తర్వాత రవి ఓసారి బుక్‌ పట్టుకొచ్చి ఓ పద్యం చూపించాడు ‘అన్న మిచ్చిన వాని  ఆలి నిచ్చిన వాని  అపహసించుట హాని  ఓ కూనలమ్మ’
– దీని అర్థం ఏమిటి అంకుల్‌ అంటూ. 
...అప్పుడే నా ఎదురుగా టీవీలో చంద్రబాబు  ఏకధాటిగా ప్రసంగిస్తున్నాడు. నా కెందుకో  వాడికి అర్థం తెలిసీ నన్ను అడుగుతున్నాడేమో అనిపించింది. వాడి రాజకీయ పరిజ్ఞానాన్ని రుచి చూపించి మా ఆవిడతో చీవాట్లు పెట్టించాడుగా.
‘మామా అల్లుళ్ల గురించేగా?... అల్లుడికి చెబుతున్న నీతే కదా అంకుల్‌?’  రెట్టిస్తున్నాడు, ఓ పక్క టీవీలో చంద్రబాబు ప్రసంగం వింటూనే.
దగ్గర్లోనే మా ఆవిడ వుంది. 
వాడికి అర్థం చెప్పే ధైర్యం చెయ్యలేక పోయా.
‘నాకు తెలుగు పెద్దగా తెలియదు, ఆంటీని అడుగు...’
అని తప్పించుకుంటుండగా.. వాడు టీవీ నుంచి దృష్టి మరల్చకుండా బాబు ప్రసంగం వింటూనే,  ‘అవునకుంల్‌... కరోనా వైరస్‌  మళ్లీ కొత్త వేషం మార్చుకుని వస్తోందటగా. వాటినే  కొత్త వేరియంట్లంటారట... మళ్లీ మన తెలంగాణకూ వచ్చేస్తదా.. వీటి వల్ల మళ్లీ ప్రమాదం ముంచుకు వస్తదా.’
– చంద్రబాబు ప్రసంగం వింటున్న వీడి బుర్రలో కరోనా వైరస్‌ ప్రశ్నలేమిటా అని ఆశ్చర్యపోతూ వినీవిననట్టుగా అక్కడి నుంచి జారుకున్నా. 
ఏమైనా, ఈ కాలం  పిల్లలను హ్యాండిల్‌ చెయ్యలేం!

సారాంశం
-సరికొండ చలపతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement