satirestory
-
బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...
‘లయర్ అనే పక్షి బాగా మిమిక్రీ చేస్తుందట. దానికి వినబడే అన్ని రకాల ధ్వనులను అనుకరించేస్తుందట. ఇతర పక్షుల శబ్దాలు, కుక్కల అరుపులు, కెమెరా షటర్ శబ్దం, రంపం కోస్తున్న చప్పుడు, తుపాకీ పేలిన చప్పుడు, కారు ఇంజన్ ఇప్పుడు, కొన్ని కొన్ని మనుషుల మాటలు కూడా అనుకరించగలదట... ఎప్పటికప్పడు దాని అవసరాన్ని బట్టి అరుపులు ఉంటాయి కనుక ‘లయర్’ అంటారట అంకుల్. ’ – నైన్త్ క్లాస్ చదివే పక్కింటి కుర్రాడు రవి. ...అప్పడే టీవీలో పొలిటికల్ లీడర్ల ముచ్చట్లపై చర్చ నడుస్తోంది. నేను సీరియస్‌గా వింటున్నా. ఎవరు ఎప్పుడు ఎలా మాట మార్చారు, గతంలో ఏం చెప్పారు, ఇప్పడేం చెబుతున్నారు, ఆ పార్టీలో ఉన్నప్పడు ఏం మాట్లాడారు. ఈ పార్టీలో ఏం మాట్లాడుతున్నారు... మాటెలా మారింది... గట్రాలు. ...... రవి చదువుకోవడానికి మా ఆవిడ దగ్గరికి వస్తుంటాడు. నేనూ ఖాళీగా ఉన్నప్పడు వారి మధ్య ఇన్వాల్వ్ అవుతుంటాను. ఎప్పుడూ ఆ పిల్లాడి చేతిలో ఐఫోన్ ఉంటుంది. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటాడనుకుంటా... రకరకాల విషయాలు చెబుతుంటాడు. సినిమాలు, నేచర్, టెక్నాలజీ... ఇలా. ...... ‘ఎందుకోయ్ ఆ సోషల్ మీడియా ముచ్చట్లు... హాయిగా పేపర్ చదువుకోరాదూ. జనరల్ నాలెడ్జ్ వస్తుంది’ అని వాడికి చెబుతూ, ‘న్యూస్ వినడానికి, పేపర్ చదవడానికి ఎంకరేజ్ చెయ్యి , పిల్లాడు షార్ప్ గా ఉన్నాడు’... అని మా ఆవిడకూ ఓ సలహా పడేశా. మా ఆవిడ నన్ను అదోలా చూసింది. నేను ఇచ్చిన సలహాలు తరచుగా వికటిస్తాయని ఆమె ప్రగాఢ నమ్మకం. ఇందులో వికటించడానికి ఏముంది? న్యూస్ చూడమన్నా. మంచి సలహానే కదా... అన్న ధీమాతో అక్కడి నుంచి లేచిపోయా. ఇది కొద్దిరోజుల క్రితం జరిగిన విషయం. ...... ఓ ఫైన్ ఈవెనింగ్ మా ఆవిడ పక్కింటి కుర్రాడి హోం వర్క్ బుక్ నాముందు పడేసింది, చూడండి మీ నిర్వాకం అన్న అర్థం స్ఫురించేలా చూస్తూ. ఏదో తేడా జరిగిందని అర్థం అయ్యింది. ఏమైందా అని చదివా. సామెతలకు అర్థం రాయమని స్కూలు టీచర్ ఇచ్చిన అసైన్మెంట్.. – ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది... ఈ సామెతను వివరింపుము – టీచర్ ప్రశ్న – తెలంగాణలో బాగా పాలన చేయని కేసీఆర్... బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టడం. – మన వాడి సమాధానం – గూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తాడట... అర్థం ఏమిటి? – మరో ప్రశ్న – ఆంధ్రప్రదేశ్‌లో సరిగా పరిపాలన చేయలేని చంద్రబాబు మళ్లీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాననడం. – ఇదీ జవాబు ...ఈ సమాధానాలు చదివి అవాక్కయ్యా. అప్పటికే మా ఆవిడ నావైపు సీరియస్‌గా చూస్తోంది. పిల్లాడిని చెడగొట్టావుగా అన్నట్టు. సీరియస్‌గా టీవీల్లో వార్తలు చూస్తున్న రవిని చూసి ఠక్కున టీవీ కట్టేసి పిలిచి పక్కన కూర్చోబెట్టి సామెతలు చూపించి అడిగా... ఇలా ఎవరు చెప్పారని. ‘మీరు వార్తలు ఫాలో అవమని చెప్పారుగా అంకుల్... అప్పటినుంచి పేపర్ చదువుతున్నా, టీవీ న్యూస్ కూడా చూస్తున్నా. చాలా విషయాలు తెలుస్తున్నాయ్. మొన్న నడ్డా తెలంగాణ వచ్చాడుగా... మొదటి సామెత ఆయన చెప్పిందే. ఆయన స్పీచ్ మొత్తం విన్నా. అందుకే సామెత అర్థం ఈజీగా రాసేశా. ఆ తర్వాత సామెత చంద్రబాబు మీద నిన్న హరీశ్‌రావు చెప్పింది... అంతకు ముందు చంద్రబాబు స్పీచ్ కూడా విన్నా. ‘కరెక్ట్‌గానే రాశానుగా అంకుల్... టీచర్ బాగా సీరియస్ అయ్యింది. ఎవరు చెడగొడుతున్నార్రా నిన్ను.. అంటూ తలంటు పోసిందనుకోండి...’ ‘...అయినా అంకుల్... అశోకుడిలా చెట్లు నాటించాం.. కాకతీయుల్లా చెరువులు తవ్వించాం. ఇళ్లకూ, పొలాలకూ నీళ్లిచ్చాం. రైతులకు సాయం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం... అని కేసీఆర్ చెబుతున్నారుగా. మరి నడ్డా ఎందుకలా అంటున్నాడు అంకుల్? ఇంకా మరి చంద్రబాబేమో...’ ఇలా వాడు గడగడా మాట్లాడుతున్నాడు. నేను షాక్ లోంచి తేరుకోకముందే వాడి నోరు మూసి మా ఆవిడ తీసుకెళ్లి పోయింది. పిల్లాడి జోలికి రావద్దన్నట్టుగా... కళ్లలో కాసిని నిప్పులు. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి వచ్చేవి నిప్పులేగా.. కవితక్క మొన్న ఇదే చెప్పింది.. అంకుల్’... అని రవి అంటున్నట్టుగా అనిపించింది. వార్నీ! వీడి జనరల్ నాలెడ్జ్ తగలెయ్యా. నేను అనుకున్నదానికన్నా షార్ప్‌గా ఉన్నాడే అనుకున్నా. ఎప్పటిలాగే... మరో సలహా వికటించిందన్నమాట! ఈ సామెతలకే ఇలా నేర్చేసుకుంటే... మరి తిట్ల సంగతేమిటి? వీడు క్లాసులో, వాళ్లింట్లో మాట్లాడుతున్న భాష పరిస్థితేమిటి? కొద్ది రోజుల్లో పక్కింటి వాళ్లు నాపై దండయాత్రకు రావడం ఖాయం. కొంచెం గతుక్కుమన్న మాట వాస్తవం. అప్పటినుంచి వాళ్ల చదువు జోలికి పోకుండా నా మానాన నేను ఉంటున్నా... ...... ఆ తర్వాత రవి ఓసారి బుక్ పట్టుకొచ్చి ఓ పద్యం చూపించాడు ‘అన్న మిచ్చిన వాని ఆలి నిచ్చిన వాని అపహసించుట హాని ఓ కూనలమ్మ’ – దీని అర్థం ఏమిటి అంకుల్ అంటూ. ...అప్పుడే నా ఎదురుగా టీవీలో చంద్రబాబు ఏకధాటిగా ప్రసంగిస్తున్నాడు. నా కెందుకో వాడికి అర్థం తెలిసీ నన్ను అడుగుతున్నాడేమో అనిపించింది. వాడి రాజకీయ పరిజ్ఞానాన్ని రుచి చూపించి మా ఆవిడతో చీవాట్లు పెట్టించాడుగా. ‘మామా అల్లుళ్ల గురించేగా?... అల్లుడికి చెబుతున్న నీతే కదా అంకుల్?’ రెట్టిస్తున్నాడు, ఓ పక్క టీవీలో చంద్రబాబు ప్రసంగం వింటూనే. దగ్గర్లోనే మా ఆవిడ వుంది. వాడికి అర్థం చెప్పే ధైర్యం చెయ్యలేక పోయా. ‘నాకు తెలుగు పెద్దగా తెలియదు, ఆంటీని అడుగు...’ అని తప్పించుకుంటుండగా.. వాడు టీవీ నుంచి దృష్టి మరల్చకుండా బాబు ప్రసంగం వింటూనే, ‘అవునకుంల్... కరోనా వైరస్ మళ్లీ కొత్త వేషం మార్చుకుని వస్తోందటగా. వాటినే కొత్త వేరియంట్లంటారట... మళ్లీ మన తెలంగాణకూ వచ్చేస్తదా.. వీటి వల్ల మళ్లీ ప్రమాదం ముంచుకు వస్తదా.’ – చంద్రబాబు ప్రసంగం వింటున్న వీడి బుర్రలో కరోనా వైరస్ ప్రశ్నలేమిటా అని ఆశ్చర్యపోతూ వినీవిననట్టుగా అక్కడి నుంచి జారుకున్నా. ఏమైనా, ఈ కాలం పిల్లలను హ్యాండిల్ చెయ్యలేం! సారాంశం -సరికొండ చలపతి -
వెతుక్కుంటూ వెళ్లి మరీ ఓనర్‌ను కరిచిన కుక్క?!
విశ్వాసంలో కుక్కను మించిన ప్రాణి మరొకటి లేదంటారు. అలాంటిది ఫిన్లాండ్కు చెందిన ఓ కుక్క పాపం వందల కిలోమీటర్లు ప్రయాణించింది. తీరా ఓనర్ కనిపించిన ఆనందంలో కసి తీరా కరిచేసింది!. ఇంటర్నెట్లో ఈ మధ్య బాగా వైరల్ అయిన పోస్ట్ ఇది. దీంతో రకరకాల రియాక్షన్లు వ్యక్తం అయ్యాయి. కానీ.. జులై 18న ఫేస్బుక్లో బాగా వైరల్ అయిన వార్త ఇది. తనను అనాథగా వదిలేసిన ఓనర్‌పై పగబట్టి కుక్క అలా చేసిందనేది ఆ వార్త సారాంశం. నిజానికి ఇదేం కొత్త కాదు.. మూడేళ్ల క్రితం జపాన్‌లో, రెండేళ్ల క్రితం మెక్సికోలో, పోయినేడాది ఉగాండాలో.. ఇలా ఏడాదికో ఊరి చొప్పున అదే టైటిల్‌తో వార్త వైరల్ అవుతూనే వస్తోంది. పైగా ఈ వార్తకు అఫీషియల్ సోర్స్ కూడా ఏం లేదు. సో.. ఇదొక అనామకమైన కథనం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కుక్క కథ ఎలా పుట్టిందంటే.. 1924లో ఓరేగావ్ సిల్వర్టన్కు చెందిన ఫ్రాంక్-ఎలిజబెత్ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి.. ఇండియానా వోల్కట్ట్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఓరోజు రెండేళ్ల వయసున్న వాళ్ల పెంపుడు కుక్క బాబీ.. వీధి కుక్కలు తరమడంతో పారిపోయింది. దాని కోసం వెతికి వెతికి విసిగిపోయి.. చివరికి ఇంటికి వచ్చేశారు. ఆరు నెలల తర్వాత ఓరోజు మట్టికొట్టుకుపోయి.. ఒంటి నిండా గాయాలతో సిల్వర్టన్లోకి యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది బాబీ. మొత్తం 2,551 మైళ్లు(4,105 కిలోమీటర్లు) ప్రయాణించింది అది. అన్ని రోజులు అది ప్రయాణించిన తీరును.. ఓ పెద్దావిడ కొన్నాళ్లపాటు దానికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని పరిశోధించి అప్పటి ప్రముఖ పత్రికలు సైతం కథనాలు వచ్చాయి. దీంతో ‘బాబీ ది వండర్ డాగ్’ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. పెంచిన ప్రేమ కోసం తన ప్రాణాలకు తెగించి ఆ మూగ జీవి చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోయింది కూడా. ఇక బాబీ స్టోరీకి సెటైర్‌గా 2018లో దేర్ ఈజ్ న్యూస్ అనే వెబ్ సైట్ సెటైరిక్ స్టోరీ రాసింది. అందులో కుక్క తనను వదిలేసి వెళ్లిన ఓనర్‌ను వెతుక్కుంటూ వంద కిలోమీటర్లు ప్రయాణించిందని, కనబడగానే కరిచేసిందని రాసి ఉంది. అలా ఆ సెటైర్ ఆర్టికల్ ఇన్నేళ్లుగా వైరల్ అవుతూ.. ఏదో కొత్త విషయంలా చక్కర్లు కొడుతూ వస్తోందన్నమాట. సో.. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే.. ఓనర్ మీద ప్రేమతో ప్రయాణించిన కుక్క ఉంది కానీ, పగ పెంచుకుని వెళ్లి మరీ కరిచిన కుక్క మాత్రం ఇప్పటివరకైతే వార్తల్లోకి ఎక్కలేదు. -
సినిమాశుల్కం
స్థలము : అమరావతిలోని ఇంకో ‘బొంకుల’ దిబ్బ (బాబు ప్రవేశించును) చంద్రబాబు: సాయం కాలమైంది. కాసేపట్లో ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు ఉంది. మహా నాయకుడు సినిమా గురించి వాళ్ళేం మాట్లాడతారోనని బెంగగా ఉంది. వాళ్లు నోళ్లు విప్పకముందే నాలుగు ఝాడిస్తే సరి. ఎవరా వస్తున్నది.. నా ప్రియ బామ్మర్ది బాలయ్య బాబులా ఉన్నాడు. ఇవాళ ఎన్టీఆర్ బయోపిక్కు రెండో పార్టు రిలీజై ఉంటుంది. ఈపాటికి కలెక్షన్ల రిపోర్టు బయటికి వచ్చే ఉంటుంది. ఇతగాడి వైఖరి చూస్తే ఈ బొమ్మ కూడా చీదేసినట్టే కనబడుతుంది. ఇతణ్ణి కొంచెం ఓదార్చక తప్పదు. ఆలి వంక చుట్టము ఆప్త బంధువు అన్నారు. ఆపై వియ్యంకుడు కూడానాయే. (బాలయ్య బాబు ప్రవేశించును ) ఏమివాయ్ మై డియర్ బాలయ్య బాబూ, ముఖం వేల వేసినావ్? బాల: ఇక మీర్నాతో మాట్లాడకండి. మీరు చెప్పినట్టు తియ్యడం వల్లే మన సినిమా అంత ఘోరంగా చంకనాకిపోయిందంటున్నారు మీడియా వాళ్లు. చంద్ర: నాన్సెన్స్ .. మొదట్నించీ నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఈ మీడియా వాళ్లకి, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్లకి నన్ను చూస్తే గిట్టదు. అందుచేత బొమ్మ పోయిందంటున్నారు. లేకపోతే నువ్వేమిటి, సినిమా ఫెయిల్ కావడమేమిటి? వాళ్లని అసలు లెక్క చెయ్యకు. బాల: మీ వల్ల నాకు వచ్చిందల్లా మీడియా వాళ్లని లెక్క చెయ్యకపోవడం ఒక్కటే. అసలు ఫస్టు పార్టు దొబ్బేసినప్పుడే మీ దగ్గర మొత్తుకున్నాను. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ ఆదుకుంటానని ఒక్క సారయినా ఒక్క ముక్క చెప్పిన పాపాన పోయినారూ? చంద్ర: డామిట్.. ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వొస్తుంది. మొన్నటికి మొన్న నీ శాతకర్ణి సినిమాకి నూటికి నూరు శాతం వినోదప్పన్ను మినహాయింపు ఇవ్వలేదూ? ఎన్టీఆర్ బయోపిక్కు ఫస్టు పార్టు కథానాయకుడుకి తెలంగాణలో ఇవ్వకపోయినా ఆంధ్రాలో స్పెషల్ షోలకి పెర్మిషన్ ఇవ్వలేదూ? వారం రోజులపాటు రోజుకి ఆరు షోలు చొప్పున వేసుకుని దున్నుకొమ్మని చెప్పలేదూ? ఇంతా చేస్తే ఆదుకోలేదని తప్పుపడుతు న్నావ్? దిసీజ్ బేస్ ఇన్గ్రాటిడ్యూడ్ బావా! బాల: ఎన్ని చేస్తే ఏం లాభం .. ఫస్టు పార్టుకి పెద్ద బొక్కే పడిందిగా బావగారూ! చంద్ర: ముందు బూతులు ఆపవయ్యా మగడా! బాల: (కళ్ళు తుడుచుకొనును) మీకేం తెలుసు బావగారూ నా ఆవేదన? ఫస్టు పార్టుకి మనం ఇచ్చిన హైప్ వల్ల ఫ్యాన్సీ రేట్లకి కొనుక్కున్న వాళ్ళంతా కోట్లు కోట్లు నష్టపోయి నెత్తిన చెంగేసుకున్నారు. మా నష్టాన్ని భర్తీ చేస్తావా, ఛస్తావా అని నా పీకల మీద కూర్చున్నారు. ఒక దశలో చెప్పిన రోజుకి రెండో పార్టు రిలీజు చెయ్యగలుగుతానా లేదా అని డౌటు కూడా వచ్చేసింది. మొత్తానికి కిందా మీదా పడి రెండో పార్టు రిలీజు చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు చూడండి, కథానాయకుడు కథని అడ్డం తిప్పితే మహా నాయకుడు మహా దెబ్బ కొట్టింది. మళ్లీ మీరే చక్రం వేసి ఒడ్డున పడెయ్యాలి బావగారూ! చంద్ర: ఏం చెయ్యమంటావ్ బాలయ్య బావా.. పోనీ, మన పార్టీ సభ్యులంతా సకుటుంబ సపరివార సమేతంగా విధిగా టిక్కెట్లు కొనుక్కుని రెండో పార్టు చూడా లని హుకుం జారీ చెయ్యమంటావా ? బాల: సముద్రంలో కాకి రెట్టంత ఆ కలెక్షన్ ఏం సరిపోతుంది బావగారూ! (అని నాలి క్కరుచుకొనును) చంద్ర: సరేగానీ ఈ గండం గడిచే ఉపాయం చెబుతాను. వింటావా? బాల: మీ శలవు ఎప్పుడు తప్పాను? డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు , థియేటర్ ఓనర్లు, ఆఖరికి కేంటీన్, కార్లూ, స్కూటర్ల కాంట్రాక్టర్లు కూడా నన్ను పీక్కు తినేస్తున్నారు. వీళ్ల బారినుంచి మీరే నన్ను కాపాడాలి. చంద్ర: అయితే నేనో ఉపాయం చెబుతాను. నేను కూడా హైదరాబాద్ వస్తాను. వీళ్ళందరితో ఓ మీటింగ్ పెట్టు. బాల: మీరు వస్తే బతికాను. వాళ్లకి వచ్చిన నష్టంలో సగం మీరు భర్తీ చేస్తారని చెప్పేద్దామా? చంద్ర: ఓరి నా పిచ్చి బామ్మర్దీ.. అన్ని కోట్లు నేనెక్కడ్నించి తెచ్చి పోస్తాను? ఎలాగూ ఎలెక్షన్లు వస్తున్నాయి కదా.. వాళ్లెవర్నీ పార్టీ ఫండ్ అడగబోమనీ, అసలు వాళ్ల జోలికే రాబోమనీ హామీ ఇచ్చేద్దాం. దెబ్బకి శాంతిస్తారు. బాల: ఆహా.. మీ బుర్రే బుర్ర బావగారూ! (గురజాడ అప్పారావు గారికి క్షమాపణలతో..) వ్యాసకర్త: మంగు రాజగోపాల్, సీనియర్ పాత్రికేయుడు -
రియోను మించేలా సంబరాలు
డీజైవైసీ ప్రకటన (సిటీ డెస్క్) ‘ఈ ఏడాది దినోత్సవ సంబరాలు రియోను మించి చేయాలని నిర్ణయించాం..ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 120 ఏళ్ల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా విశాఖలోని పూర్ణామార్కెట్‌ను ఎంచుకున్నాం. గంటకొక ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించాలని తీర్మానించాం’ అని విశాఖ డీజేవైసీ (దోమల జాయింట్ యాక్షన్ కమిటీ) ప్రకటించింది. సరిగ్గా 1897 ఆగస్టు 20న మా సోదరి ఎనాఫిలిస్ దోమ వలన మానవులకు మలేరియా వ్యాపిస్తుందని విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నాం. నిజంగా ఆయనే కానీ ఈ విషయాన్ని బయటపెట్టకపోయి ఉంటే మా జాతి అంత గౌరవం లభించేది కాదు. మేము లేని ప్రాంతం లేదు. మేము గీ పెట్టకుండా ఉంటే ఎందరో గాఢనిద్రలోకి జారుకుని ఊబకాయులుగా మారిపోతారు. అంతేకాదు మా మీద కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో మా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గాల్లో ఎగిరే ర్యాలీ చేయాలని నిర్ణయించాం. ఈ సమావేశం నొవెటల్ నిర్వహించాలని మొదట అనుకున్నాం. అయితే ప్రభుత్వం రహదారి భద్రతపై రెండు రోజుల పాటు జాతీయ వర్క్‌షాప్ ఏర్పాటు చేసి మా ఉనికిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. అందుకే పూర్ణామార్కెట్‌లో మాకిష్టమైన చెత్తాచెదారం మధ్య ఈ 120 ఏళ్ల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు డీజేవైసీ ప్రకటించింది. సమావేశానికి ఎనాఫిలస్, క్యూలెక్స్, ఈడిస్, జపనిస్ ఎన్సెఫలైటిస్ దోమలు ముఖ్య అతిథులుగా హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఎనాఫిలస్ మాట్లాడుతూ...కలలో కూడా ఊహించలేదు. మేం ఇంత గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటామని, అదంతా అధికారులు, ప్రజాప్రతినిధులు దయే. వారికి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడే ఎందుకంటే...! ఎన్నో ప్రాంతాలు ఉండగా ఇక్కడే ఉత్సవాలను జరుపుకోవడానికి కారణం.. గత గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరం రోజులు పారిశుధ్య కార్మికులు ఆందోళన చేసి తమ జాతి వద్ధికి ఎంతో సహకరించారు. మేం దినోత్సవం జరుపుకునే నాటికి కష్ణాపుష్కరాలు జరుగుతుండటంతో యాదచ్ఛికమే అయినా...మాకూ... పుష్కరాలకు..మాకూ.. జీవీఎంసీ పారిశుధ్య విభాగానికి తరతరాల అనుబంధం ఏదో ఉంది. కార్మికులంతా పుష్కర సేవలకు వెళ్లడంతో నగరంలో చెత్తాచెదారం పెరిగిపోతోంది. అది మాకు కలిసొచ్చే అంశం. మరిన్ని ఎక్కువ దోమలు వద్ధి చెందడానికి మాకు ఇంతకంటే మంచి అవకాశం లేదు. ఈ విధంగా ముందుకు పోతున్న చంద్రబాబు సర్కార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనే సీఎంగా లేకుంటే మాకు ఇంత పేరుప్రఖ్యాతలు వచ్చి ఉండేవి కావు. అందుకని ఆయన ఎక్కడుంటే అక్కడ మా దోమల దండు అండగా ఉంటుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని అధికారులకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. వారికి ‘దోమస్కార్’ అవార్డులు ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. అవార్డు కింద టార్టోయస్, మస్కిటో క్వాయిల్స్, దోమ తెరలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్కారు, అధికారుల జోలికిపోకూడదని... సర్కారు, అధికారుల జోలికి మేం పోకూడదని ‘చిటుకుచిటుకు’ మంటూ నిర్ణయం తీసుకున్నాం. వాళ్లు గానీ స్వయంగా బాధ అనుభవిస్తే మాపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక పోతే...మాకు నవ్వు తెప్పించేలా అప్పుడప్పుడూ మున్సిపల్ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. చెత్త తొలగిస్తాం...ఫాగింగ్చేస్తాం...బ్లీచింగ్ జల్లుతామని... ఎన్నాళ్లునుంచే ఈ ప్రకటనలు వినీవినీ బోరు కొడుతోంది. ఫాగింగ్ మాకు స్ప్రేతో సమానం... బ్లీచింగ్ మాకు ఫేసుకు రాసుకునే పౌడర్... లేకపోతే ఇప్పటికే మా జాతి అంతరించేది. మనుషులు టెక్నాలజీతో పోటీపడుతుంటే మేము మాత్రం వెనుకబడే ఉన్నామనుకుంటే ఎలా? మరీ విడ్డూరం కాకపోతే...పసుపునకు..కీటకాలను నాశనం చేసే గుణం ఉంటుంది. అదే పసుపు ఎక్కువై గత గోదావరిలో పుష్కరాల్లో ఈకోలీ బ్యాక్టీరియా పుట్టుకువచ్చింది. దీంతో పసుపు కూడా మమ్మల్ని ఏమీ చేయలేక చేతులెత్తేసినందుకు గర్వంగా ఉంది. ఈ నేపథ్యంలో మా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈకోలీ బ్యాక్టీరియాను ఆహ్వానిస్తున్నాం. విశాఖజిల్లాలో ఎడిస్,సూరోఫోరా, హిరోనోటేలియా, ఎల్లోఫీవర్ దోమలు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షంచనున్నాయి. దోమయోగా..! క్యూలెక్స్, ఈడిస్ దోమలు మాట్లాడుతూ...నగరంలో కొత్తగా వచ్చిన కమిషనర్ అక్కడక్కడా చెత్త తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా సభ్యులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. వీరి ఆందోళన జయించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 2700 రకాల దోమలను విశాఖ రప్పిస్తున్నాం. వాళ్ల చేత ‘దోమయోగా’ కార్యక్రమం నిర్వహించనున్నాం. బ్లీచింగ్, ఫాగింగ్చేసేటప్పుడు యోగాసనాలద్వారా వాటì నుంచి తప్పించుకునేలా శిక్షణ ఇస్తాం. ఈ కార్యక్రమానికి మాకు స్ఫూర్తి కమలనాథులే. వారికి కూడా ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలుపుతున్నాం. 120 ఏళ్ల పండుగకు భారీ ఏర్పాట్లు ఇక 120 ఏళ్ల పండగకు కోట్లాది దోమలు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ప్రధాన మురికికాలువలు, టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త కుప్పలను సిద్ధం చేశాం. చరిత్రలో నిలిచిపోయేలా నేషనల్ జియోగ్రఫీ ఛానల్, స్టార్ గ్రూప్ ఛానల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఈవెంట్‌కు దర్శకత్వ బాధ్యతలను ‘దోమపాటి’కి అవకాశం కల్పించాం. వీలైనన్ని చెత్త కుప్పలను సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన వివరాలకు డీజేవైఏ అని స్పేస్ ఇచ్చి 5757కు ఎస్ఎంఎస్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తామని దోమల సంఘం ప్రకటించింది. సమావేశం అనంతరం అన్ని కలిసి సెల్ఫీలతో సందడి చేశాయి.