విశ్వాసంలో కుక్కను మించిన ప్రాణి మరొకటి లేదంటారు. అలాంటిది ఫిన్‌లాండ్‌కు చెందిన ఓ కుక్క పాపం వందల కిలోమీటర్లు ప్రయాణించింది. తీరా ఓనర్ కనిపించిన ఆనందంలో కసి తీరా కరిచేసింది!. ఇంటర్నెట్‌లో ఈ మధ్య బాగా వైరల్ అయిన పోస్ట్ ఇది. దీంతో రకరకాల రియాక్షన్లు వ్యక్తం అయ్యాయి. కానీ..
జులై 18న ఫేస్‌బుక్‌లో బాగా వైరల్ అయిన వార్త ఇది. తనను అనాథగా వదిలేసిన ఓనర్‌పై పగబట్టి కుక్క అలా చేసిందనేది ఆ వార్త సారాంశం. నిజానికి ఇదేం కొత్త కాదు.. మూడేళ్ల క్రితం జపాన్‌లో, రెండేళ్ల క్రితం మెక్సికోలో, పోయినేడాది ఉగాండాలో.. ఇలా ఏడాదికో ఊరి చొప్పున అదే టైటిల్‌తో వార్త వైరల్ అవుతూనే వస్తోంది. పైగా ఈ వార్తకు అఫీషియల్ సోర్స్ కూడా ఏం లేదు. సో.. ఇదొక అనామకమైన కథనం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కుక్క కథ ఎలా పుట్టిందంటే..
1924లో ఓరేగావ్ సిల్వర్‌టన్‌కు చెందిన ఫ్రాంక్-ఎలిజబెత్ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి.. ఇండియానా వోల్‌కట్ట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఓరోజు రెండేళ్ల వయసున్న వాళ్ల పెంపుడు కుక్క బాబీ.. వీధి కుక్కలు తరమడంతో పారిపోయింది. దాని కోసం వెతికి వెతికి విసిగిపోయి.. చివరికి ఇంటికి వచ్చేశారు. ఆరు నెలల తర్వాత ఓరోజు మట్టికొట్టుకుపోయి.. ఒంటి నిండా గాయాలతో సిల్వర్‌టన్‌లోకి యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది బాబీ. మొత్తం 2,551 మైళ్లు(4,105 కిలోమీటర్లు) ప్రయాణించింది అది. అన్ని రోజులు అది ప్రయాణించిన తీరును.. ఓ పెద్దావిడ కొన్నాళ్లపాటు దానికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని పరిశోధించి అప్పటి ప్రముఖ పత్రికలు సైతం కథనాలు వచ్చాయి. దీంతో ‘బాబీ ది వండర్ డాగ్’ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. పెంచిన ప్రేమ కోసం తన ప్రాణాలకు తెగించి ఆ మూగ జీవి చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోయింది కూడా.
ఇక బాబీ స్టోరీకి సెటైర్‌గా 2018లో దేర్ ఈజ్ న్యూస్ అనే వెబ్ సైట్ సెటైరిక్ స్టోరీ రాసింది. అందులో కుక్క తనను వదిలేసి వెళ్లిన ఓనర్‌ను వెతుక్కుంటూ వంద కిలోమీటర్లు ప్రయాణించిందని, కనబడగానే కరిచేసిందని రాసి ఉంది. అలా ఆ సెటైర్ ఆర్టికల్ ఇన్నేళ్లుగా వైరల్ అవుతూ.. ఏదో కొత్త విషయంలా చక్కర్లు కొడుతూ వస్తోందన్నమాట. సో.. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే.. ఓనర్ మీద ప్రేమతో ప్రయాణించిన కుక్క ఉంది కానీ, పగ పెంచుకుని వెళ్లి మరీ కరిచిన కుక్క మాత్రం ఇప్పటివరకైతే వార్తల్లోకి ఎక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment