(ఇది కల్పితమే, కానీ అందరినీ ఉద్దేశించిందే..
– ముందస్తు డిస్‌క్లెయిమర్)
నల్లధనంలా నిగనిగలాడుతున్న అమావాస్య చీకటి..అంత చీకట్లోనూ మోదీ కొత్త రెండువేల రూపాయి నోటులా తళతళలాడుతున్న ఓ ఇల్లు.. ఆ ఇంటిలోకి దూరాడో దొంగ..
ఎదురుగా నిలువెత్తు సాయిబాబా ఫొటో..దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ‘పరాయి సొమ్ము ఆశించడం పాపం..’ అని రాసి ఉంది. అది చదివి లెంప లేసుకుని, సాయిబాబాకు దండం పెట్టుకుని వెనక్కు తిరిగాడు. మన దొంగ సాయిబాబా భక్తుడు.. అంతటివాడి మాటను కాదంటాడా!
వెనక్కు తిరిగి వెళ్లిపోదామనుకున్న దొంగకు గుమ్మంపైన ఆ ఇంటి ఓనరు ఫొటో కనపడింది.. కాస్త అదో రకం నవ్వుతో.
వెంటనే దొంగ ఇలా అనుకున్నాడు... ‘ఇదంతా పరాయి సొమ్ము ఎలా అవుతుంది. మనసొమ్మేగా తప్పేంలేదు’ అనుకుని చేతికందింది పట్టుకు పోయాడు..
ఆ ఇంటి ఓనరెవరో మీకు తెలిసే ఉంటుంది.
...లేకుంటే చివరిలో చూద్దాం...
............
ఇక అసలు విషయానికొద్దాం..
ఈ మధ్య అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై, జనాభివృద్ధిపై, పేదరికంపై జరుగుతున్న పరిశీలనలు, చూపిస్తున్న సూచికలు విపక్షాల విమర్శల్లాగే తప్ప..సరిగ్గా లేనట్లుంది... మొన్నటికి మొన్న ఆకలి సూచిలో 107 స్థానానికి మనను నెట్టాయి.
మునుగోడుకు ఆ బృందాలను పంపి పరిశీలించ మనండి. వాళ్ల అంచనాలన్నీ తలకిందులైపోవూ!
ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు... పొద్దున లేవగానే మంచి చెడుల పరామర్శలు, పనుల్లో పాలు పంచుకుంటూ వందలాది నాయకులు. (వెయ్యి ఓట్లున్న గ్రామంలో అన్ని పార్టీలు కలిపి.. 150 వాహనాలు.. నాలుగైదు వందల కార్యకర్తలు ఎప్పుడూ కనపడుతున్నారట)
–ఇంతకు మించి పాలన ఏమి ఉంటుంది?
తలలు తెగిపడుతున్న నాటుకోళ్లు, యాటలు... బిర్యానీ పొట్లాల పెళపెళలు... ఐదు రూపాయలకే భోజనం అని ఆహ్వానిస్తున్న హోటళ్లు
– ఆకలిసూచిక పొలమారుతోంది...
బస్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యం చేయించడం, బంకుల్లో రెండు లీటర్ల ఫ్రీ పెట్రోల్, జనం చేసిన అప్పులు తీర్చ డానికి ఆర్థిక సాయం, 20 వేలనుంచి 30 వేల దాకా నడుస్తున్న ఓటు వేలం పాట..
– మానవాభివృద్ధి సూచిక పరిగెత్తించడానికే కదా!
యాదాద్రి లాంటి గుళ్లలో ఫ్రీ దర్శనాలు (ప్రమాణానికే అనుకోండి), కాసిన్ని విందులతో ఆనంద విహారాలు, మంచింగ్‌లు, మందు బాటిళ్ల చప్పుళ్లు.
– హ్యాపీ ఇండెక్స్ చిద్విలాసమే కదా!
ఎలాగైనా జనం జేబుల్లో డబ్బు చేర్చాలని తహతహలాడే పార్టీలు‘హవాలా’ రిస్కుకూ వెనుకాడడం లేదు... నిఘా కన్ను కప్పి చెక్‌పోస్టులు దాటి... బైకుల ద్వారా... డొంకల్లోంచి... కోట్లు తీసుకువచ్చే ప్రయత్నాలు..
– ఇంతకు మించి ప్రజాసేవ ఏముంటుంది?
ఆరేళ్ల కిందట నల్లధనం బయటికి తెస్తానన్న మోదీ మాట విని నవ్వుకున్న వారు ఇప్పుడు. ‘...అరే వచ్చేసిందే’ అని తెల్లబోతున్న సందర్భం.
మాది ‘బంగారు తెలంగాణ’ అన్న కేసీఆర్ మాట విని వెక్కిరించిన వారి ముఖంలో ఇప్పుడు ‘నిజమే...’నన్న ఆశ్చర్యం.
సంపద పంపిణీ జరగాలని అరిచి అరిచీ అలసిపోయిన వామపక్షవాదుల కళ్లలో... ఆనంద భాష్పాలు.
పక్క నియోజకవర్గాలు కూడా తమ ఆనందా నికి, అభివృద్ధి కోసమై రాజీనామా చేసే ఎమ్మేల్యేల కోసం... ఉప ఎన్నికల కోసం... ఎదురు చూస్తున్న తరుణం.
– ఇది కదా ప్రజాస్వామ్య ఔన్నత్యం..!
ఇక్కడ కదా ఆనందాభివృద్ధి తూనికలు, కొల మానాలు, సూచికలు లెక్కగట్టాల్సింది..
ఓ ఓటరు మాట..
ప్రస్తుతం జాతర నడుస్తోంది.
ఇప్పటి దాకా చేసిందేమీ లేదు, ఇక ఎవరూ గెలిచి చేసేదేమీ లేదు... వారికి ఓట్లు గావాలే మాకు డబ్బులు కావాలే... మా అవకాశం మాది... వారి అవకాశం వారిది.
ఇక్కడ మాకు నచ్చింది ఒకటే... ‘...మాకు పైసలి స్తున్నరు... అంతే.’
ఇప్పడు 100 కోట్లు పెడితే తర్వాత రెండొందల కోట్లు సంపాయిస్తడు. వాళ్లకు పోయేదేముంది..
అభివృద్ది లేదు పాడూ లేదు... ఇన్నేళ్లూ లేంది ఇప్పుడయితదా! ఎవడు డబ్బులిస్తే వాడికి ఓట్లె య్యడం మంచిది... గొడవలేకుండా.
– ఆహా... ఇది కదా ప్రజాస్వామ్య స్థితప్రజ్ఞత!
(మన మంత్రి నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలువ తగ్గట్లే... నాయకుల ‘వ్యాల్యూ’ పెరుగుతోంది అంతే... దానివల్లే ఇన్ని వెసులుబాట్లు)
‘టీ’ వాలా ఎంట్రీ..
ముళ్లపూడి వెంకటరమణ గారి కథోటి ఉంది. ఓ ఊరిలో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువు లుండేవారు. ఓట్లకు నోట్లు జల్లేస్తూ... వచ్చేది పది రూపాయల లాభమైనా నూర్రూపాయలు తగలే సేంత ప్రచారం చేస్తూ పోటీ పడేవారు. వీరికి పోటీగా ‘టీ’వాలా గోదాలోకి దిగడంతో∙సీన్ ఎలా మారిపోయిందో చెప్పే సరదా ఎన్నికల కథ. ఎన్నికలయి పోయాక... నెగ్గినవాడు బాగుపడ్డాడా అని ప్రశ్నిస్తే... నెగ్గినోడు వేరు, బాగుపడ్డవాడు వేరూనూ అని సమాధానం వస్తుంది. కాసిన్ని రోజులు ఆగితే ఇక్కడా మనకు తెలుస్తుంది. బేటీవాలా, రోటీవాలా, ‘టీ’ వాలాల్లో... ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు బాగుపడ్డారూ.. అని.
నేతల ఊకదంపుళ్లు, మైకుల సౌండ్లు, వాహనాల హారన్లు, హామీ చప్పుళ్లు, కరెన్సీ పెళపెళలు, మందు బాటిళ్ల సౌండ్ల మధ్య... ఇంకా ప్రజాస్వామ్యంపై, ప్రజా శ్రేయస్సుపై ఆశ చావని మేధావులు బలహీన స్వరంతోనైనా ఓటర్లు అలియాస్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు.. ‘...ఓట్లు అమ్ముకోవడం తప్పు కదా..? అని.
దానికి సమాధానం మాత్రం గట్టిగానే వస్తోంది.
‘...పంచుతున్న డబ్బులన్నీ వాళ్లు కూలీనాలీ చేసి చెమటోడ్చి సంపాదించినవా? అంతా మా డబ్బే కదా ఇవ్వనివ్వండి...’ అని.
– ఇది కదా ప్రజాస్వామ్యం పరిపక్వత!
............
ఇక, పైన మనం చెప్పుకున్న దొంగ ఎవరింటికి దొంగతనానికి వెళ్లాడో, ఎవరి ఫొటో చూశాడో.. ఎందుకు అది పరాయి సొమ్ము కాదను కున్నాడో.. చెప్పనక్కరలేదనుకుంటా!
Comments
Please login to add a commentAdd a comment