hunger index
-
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
.... ఉప ఎన్నికలూ జిందాబాద్!
(ఇది కల్పితమే, కానీ అందరినీ ఉద్దేశించిందే.. – ముందస్తు డిస్‌క్లెయిమర్) నల్లధనంలా నిగనిగలాడుతున్న అమావాస్య చీకటి..అంత చీకట్లోనూ మోదీ కొత్త రెండువేల రూపాయి నోటులా తళతళలాడుతున్న ఓ ఇల్లు.. ఆ ఇంటిలోకి దూరాడో దొంగ.. ఎదురుగా నిలువెత్తు సాయిబాబా ఫొటో..దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ‘పరాయి సొమ్ము ఆశించడం పాపం..’ అని రాసి ఉంది. అది చదివి లెంప లేసుకుని, సాయిబాబాకు దండం పెట్టుకుని వెనక్కు తిరిగాడు. మన దొంగ సాయిబాబా భక్తుడు.. అంతటివాడి మాటను కాదంటాడా! వెనక్కు తిరిగి వెళ్లిపోదామనుకున్న దొంగకు గుమ్మంపైన ఆ ఇంటి ఓనరు ఫొటో కనపడింది.. కాస్త అదో రకం నవ్వుతో. వెంటనే దొంగ ఇలా అనుకున్నాడు... ‘ఇదంతా పరాయి సొమ్ము ఎలా అవుతుంది. మనసొమ్మేగా తప్పేంలేదు’ అనుకుని చేతికందింది పట్టుకు పోయాడు.. ఆ ఇంటి ఓనరెవరో మీకు తెలిసే ఉంటుంది. ...లేకుంటే చివరిలో చూద్దాం... ............ ఇక అసలు విషయానికొద్దాం.. ఈ మధ్య అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై, జనాభివృద్ధిపై, పేదరికంపై జరుగుతున్న పరిశీలనలు, చూపిస్తున్న సూచికలు విపక్షాల విమర్శల్లాగే తప్ప..సరిగ్గా లేనట్లుంది... మొన్నటికి మొన్న ఆకలి సూచిలో 107 స్థానానికి మనను నెట్టాయి. మునుగోడుకు ఆ బృందాలను పంపి పరిశీలించ మనండి. వాళ్ల అంచనాలన్నీ తలకిందులైపోవూ! ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు... పొద్దున లేవగానే మంచి చెడుల పరామర్శలు, పనుల్లో పాలు పంచుకుంటూ వందలాది నాయకులు. (వెయ్యి ఓట్లున్న గ్రామంలో అన్ని పార్టీలు కలిపి.. 150 వాహనాలు.. నాలుగైదు వందల కార్యకర్తలు ఎప్పుడూ కనపడుతున్నారట) –ఇంతకు మించి పాలన ఏమి ఉంటుంది? తలలు తెగిపడుతున్న నాటుకోళ్లు, యాటలు... బిర్యానీ పొట్లాల పెళపెళలు... ఐదు రూపాయలకే భోజనం అని ఆహ్వానిస్తున్న హోటళ్లు – ఆకలిసూచిక పొలమారుతోంది... బస్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యం చేయించడం, బంకుల్లో రెండు లీటర్ల ఫ్రీ పెట్రోల్, జనం చేసిన అప్పులు తీర్చ డానికి ఆర్థిక సాయం, 20 వేలనుంచి 30 వేల దాకా నడుస్తున్న ఓటు వేలం పాట.. – మానవాభివృద్ధి సూచిక పరిగెత్తించడానికే కదా! యాదాద్రి లాంటి గుళ్లలో ఫ్రీ దర్శనాలు (ప్రమాణానికే అనుకోండి), కాసిన్ని విందులతో ఆనంద విహారాలు, మంచింగ్లు, మందు బాటిళ్ల చప్పుళ్లు. – హ్యాపీ ఇండెక్స్ చిద్విలాసమే కదా! ఎలాగైనా జనం జేబుల్లో డబ్బు చేర్చాలని తహతహలాడే పార్టీలు‘హవాలా’ రిస్కుకూ వెనుకాడడం లేదు... నిఘా కన్ను కప్పి చెక్‌పోస్టులు దాటి... బైకుల ద్వారా... డొంకల్లోంచి... కోట్లు తీసుకువచ్చే ప్రయత్నాలు.. – ఇంతకు మించి ప్రజాసేవ ఏముంటుంది? ఆరేళ్ల కిందట నల్లధనం బయటికి తెస్తానన్న మోదీ మాట విని నవ్వుకున్న వారు ఇప్పుడు. ‘...అరే వచ్చేసిందే’ అని తెల్లబోతున్న సందర్భం. మాది ‘బంగారు తెలంగాణ’ అన్న కేసీఆర్ మాట విని వెక్కిరించిన వారి ముఖంలో ఇప్పుడు ‘నిజమే...’నన్న ఆశ్చర్యం. సంపద పంపిణీ జరగాలని అరిచి అరిచీ అలసిపోయిన వామపక్షవాదుల కళ్లలో... ఆనంద భాష్పాలు. పక్క నియోజకవర్గాలు కూడా తమ ఆనందా నికి, అభివృద్ధి కోసమై రాజీనామా చేసే ఎమ్మేల్యేల కోసం... ఉప ఎన్నికల కోసం... ఎదురు చూస్తున్న తరుణం. – ఇది కదా ప్రజాస్వామ్య ఔన్నత్యం..! ఇక్కడ కదా ఆనందాభివృద్ధి తూనికలు, కొల మానాలు, సూచికలు లెక్కగట్టాల్సింది.. ఓ ఓటరు మాట.. ప్రస్తుతం జాతర నడుస్తోంది. ఇప్పటి దాకా చేసిందేమీ లేదు, ఇక ఎవరూ గెలిచి చేసేదేమీ లేదు... వారికి ఓట్లు గావాలే మాకు డబ్బులు కావాలే... మా అవకాశం మాది... వారి అవకాశం వారిది. ఇక్కడ మాకు నచ్చింది ఒకటే... ‘...మాకు పైసలి స్తున్నరు... అంతే.’ ఇప్పడు 100 కోట్లు పెడితే తర్వాత రెండొందల కోట్లు సంపాయిస్తడు. వాళ్లకు పోయేదేముంది.. అభివృద్ది లేదు పాడూ లేదు... ఇన్నేళ్లూ లేంది ఇప్పుడయితదా! ఎవడు డబ్బులిస్తే వాడికి ఓట్లె య్యడం మంచిది... గొడవలేకుండా. – ఆహా... ఇది కదా ప్రజాస్వామ్య స్థితప్రజ్ఞత! (మన మంత్రి నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలువ తగ్గట్లే... నాయకుల ‘వ్యాల్యూ’ పెరుగుతోంది అంతే... దానివల్లే ఇన్ని వెసులుబాట్లు) ‘టీ’ వాలా ఎంట్రీ.. ముళ్లపూడి వెంకటరమణ గారి కథోటి ఉంది. ఓ ఊరిలో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువు లుండేవారు. ఓట్లకు నోట్లు జల్లేస్తూ... వచ్చేది పది రూపాయల లాభమైనా నూర్రూపాయలు తగలే సేంత ప్రచారం చేస్తూ పోటీ పడేవారు. వీరికి పోటీగా ‘టీ’వాలా గోదాలోకి దిగడంతో∙సీన్ ఎలా మారిపోయిందో చెప్పే సరదా ఎన్నికల కథ. ఎన్నికలయి పోయాక... నెగ్గినవాడు బాగుపడ్డాడా అని ప్రశ్నిస్తే... నెగ్గినోడు వేరు, బాగుపడ్డవాడు వేరూనూ అని సమాధానం వస్తుంది. కాసిన్ని రోజులు ఆగితే ఇక్కడా మనకు తెలుస్తుంది. బేటీవాలా, రోటీవాలా, ‘టీ’ వాలాల్లో... ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు బాగుపడ్డారూ.. అని. నేతల ఊకదంపుళ్లు, మైకుల సౌండ్లు, వాహనాల హారన్లు, హామీ చప్పుళ్లు, కరెన్సీ పెళపెళలు, మందు బాటిళ్ల సౌండ్ల మధ్య... ఇంకా ప్రజాస్వామ్యంపై, ప్రజా శ్రేయస్సుపై ఆశ చావని మేధావులు బలహీన స్వరంతోనైనా ఓటర్లు అలియాస్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు.. ‘...ఓట్లు అమ్ముకోవడం తప్పు కదా..? అని. దానికి సమాధానం మాత్రం గట్టిగానే వస్తోంది. ‘...పంచుతున్న డబ్బులన్నీ వాళ్లు కూలీనాలీ చేసి చెమటోడ్చి సంపాదించినవా? అంతా మా డబ్బే కదా ఇవ్వనివ్వండి...’ అని. – ఇది కదా ప్రజాస్వామ్యం పరిపక్వత! ............ ఇక, పైన మనం చెప్పుకున్న దొంగ ఎవరింటికి దొంగతనానికి వెళ్లాడో, ఎవరి ఫొటో చూశాడో.. ఎందుకు అది పరాయి సొమ్ము కాదను కున్నాడో.. చెప్పనక్కరలేదనుకుంటా! -
Global Hunger Report 2022: ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి. నివేదిక ఏం చెప్పిందంటే... ► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది. ► జీహెచ్ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది. ► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి. ► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి ► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది. ► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. ► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి. ► భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. విరుచుకుపడిన విపక్షాలు దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు. -
ఆకలి సూచీలో అట్టడుగు.. బీజేపీ ఘనతే
సాక్షి, హైదరాబాద్: ఆకలి సూచీ (హంగర్ ఇండెక్స్)లో భారత్ స్థానం దిగజారడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107 స్థానానికి పడిపోయింది. ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన మ రో అద్భుతమైన విజ యం ఇది. ఆకలి సూ చీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరింది. ఈ వైఫల్యాన్ని కూడా బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని అనుకుంటున్నా’అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అచ్చేదిన్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఆంగ్ల పత్రికలోని వార్తను ట్వీట్‌కు జత చేశారు. -
ఆకలి సూచీలో మరీ అధ్వాన్నంగా భారత్
న్యూఢిల్లీ: ఆకలి సూచీలో మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం.. 2022 ఏడాదికిగానూ భారత్ 107వ స్థానంలో నిలిచింది. మొత్తం 121 దేశాల జాబితాలో భారత్‌కు ఈ స్థానం దక్కింది. మన పొరుగు దేశాలు శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మన దేశం కన్నా ముందు ఉండడం గమనార్హం. చైనా, టర్కీ, కువైట్.. జీహెచ్ఐ ఇండెక్స్‌లో అత్యంత మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. ఇక దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న ఆకలి కేకల ఘంటికలను ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ నివేదిక ప్రకటించింది. మన దేశంలో.. చైల్డ్ వేస్టింగ్ రేటు 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ► గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. ► ఐరిష్‌కు చెందిన ఎయిడ్ ఏజెన్సీ ‘కన్సర్న్ వరల్డ్ వైడ్’, జర్మనీకి చెందిన సంస్థ ‘వెల్ట్ హంగర్ లైఫ్’లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ► పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్ వేస్టింగ్, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జీహెచ్ఐలో స్కోరు ఇస్తారు. ► ఈ స్కోర్లు ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. ► భారత్‌కు 29.1 శాతం స్కోరుతో తీవ్రమైన ప్రభావిత దేశాల జాబితాలో నిలిచింది. ► భారత్‌లో చైల్డ్ వేస్టింగ్ రేట్ (వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం) 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ఉంది. ► 2021లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థౠనంలో నిలిచింది. ఇప్పుడు 121 దేశాల జాబితాలో 107వ ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ► ఇక భారత్ GHI స్కోర్ కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2000 సంవత్సరంలో 38.8 నుంచి 2014-2022 మధ్య 28.2 - 29.1 పరిధికి పడిపోయింది స్కోర్. -
ర్యాంకులు పోనాయండీ!
ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళనకర అంశం, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన విషయం. ఐరాస లెక్క ప్రకారం వరుసగా రెండో ఏడాదీ పలు దేశాల ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) స్కోరు కిందకు పడింది. మన దేశపు ర్యాంకు మునుపటితో పోలిస్తే రెండు స్థానాలు కిందకు పడింది. ఐరాస అభివృద్ధి సంస్థ (యూఎన్డీపీ) 2021–22 మానవాభివృద్ధి నివేదిక (హెచ్డీఆర్) ‘అనిశ్చిత పరిస్థితులు, అస్థిర జీవితాలు – మారుతున్న ప్రపంచంలో భవిష్యత్ రూప కల్పన’ ఈ చేదునిజాన్ని బయటపెట్టింది. తొంభై శాతానికి పైగా దేశాలు 2020లో కానీ, 2021లో కానీ హెచ్‌డీఐ స్కోరులో వెనకబడ్డాయి. నలభై శాతానికి పైగా దేశాలైతే ఆ రెండేళ్ళూ ర్యాంకుల్లో కిందికి వచ్చేశాయి. గత వారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం మానవాభివృద్ధిలో మొత్తం 191 దేశాల్లో మన దేశం రెండు స్థానాలు కిందకొచ్చి, 132వ ర్యాంకుకు చేరింది. గడచిన 32 ఏళ్ళలో ఇలా వరుసగా రెండేళ్ళు సూచికలో దిగజారడం ఇదే తొలిసారి. మానవాభివృద్ధి పరామితుల ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకల కన్నా మనం వెనకబడే ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తిలో బ్రిటన్ను దాటేశాం లాంటి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న వారికి ఇది కనువిప్పు. హెచ్డీఐలో వివిధ దేశాల ర్యాంకులు పడిపోవడానికి కనివిని ఎరుగని సంక్షోభాలు కారణం. గత పదేళ్ళలో ఆర్థికపతనాలు, వాతావరణ సంక్షోభాలు, కరోనా, యుద్ధం లాంటి గడ్డు సమస్యల్ని ప్రపంచం ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం ప్రపంచాభివృద్ధిపై ప్రభావం చూపింది. అయితే, అందులో కరోనాది అతి పెద్ద పాత్ర అని ఐరాస నివేదిక సారాంశం. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారితో మానవ పురోగతి కనీసం అయిదేళ్ళు వెనక్కి వెళ్ళింది. అంతటా అనిశ్చితి ప్రబలింది. హెచ్‌డీఐకి లెక్కలోకి తీసుకుంటున్న అంశాల్లో లోపాలున్నాయని కొన్ని విమర్శలు లేకపోలేదు. అయితే, మరే సూచికా లేని వేళ ప్రతి దేశపు సగటు విజయాన్నీ లెక్కించడానికి ఉన్నంతలో ఇదే మెరుగైనదని ఒప్పుకోక తప్పదు. ఆర్థిక అసమానత్వం, లైంగిక అసమానత్వం, బహుముఖ దారిద్య్రం లాంటి ఆరు వేర్వేరు మానవాభివృద్ధి సూచీల ద్వారా ఈ ర్యాంకులు లెక్కకట్టారు. స్విట్జర్లాండ్ 0.962 స్కోరుతో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. భారత్ కేవలం 0.633 స్కోరుతో అగ్రశ్రేణికి సుదూరంగా నిలిచిపోయింది. విషాదమేమిటంటే, మానవాభివృద్ధిలో మన స్కోరు ప్రపంచ సగటు 0.732 కన్నా తక్కువ. పొరుగున ఉన్న చైనా హెచ్‌డీఐ స్కోర్ 1990 నుంచి ఏటా పెరుగుతుంటే, మన పరిస్థితి తద్భిన్నంగా ఉంది. మన దేశంలో ఆర్థిక అసమానతలూ ఎక్కువే. జనాభాలో అతి సంపన్నులైన 1 శాతం మంది ఆదాయ వాటా, నిరుపేదలైన 40 శాతం మంది వాటా కన్నా ఎక్కువని తాజా లెక్క. ఇంతటి అసమానత చైనా, స్విట్జర్లాండ్లలో లేదు. లింగపరంగా చూస్తే, మన దేశ తలసరి ఆదాయంలో పురుషుల కన్నా స్త్రీలు చాలా వెనుకబడి ఉన్నారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికన లెక్కకట్టే బహుముఖ దారిద్య్రం లోనూ భారత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. 2019 నాటి యూఎన్డీపీ అంచనాల ప్రకారం... ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనాలో 5.4 కోట్ల మంది బహుముఖ దారిద్య్రంలో ఉంటే, రెండో అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆ సంఖ్య 38.1 కోట్ల పైచిలుకే. అయితే, 2019 – 2020 మధ్య మన దేశంలో లింగ అసమానత దారుణంగా పెరగగా, తాజా నివేదికలో ఆ కోణంలో కొద్దిగా మెరుగుదల సాధించడం ఉపశమనం. మొత్తానికి, అన్నీ కలిపి చూస్తే మానవాభివృద్ధిలో మన స్కోరునూ, దరిమిలా ఇతర దేశాల మధ్య మన ర్యాంకునూ కిందకు గుంజాయి. అయితే, సంతోషించదగ్గ అంశం ఏమంటే – కరోనాలో ఏడాది లోపలే భారత్ టీకాను అభివృద్ధి చేయడం, ధనిక దేశాలకు సైతం కరోనా నిరోధానికి సహకరించడం! ఇది మన మానవ సామర్థ్యమే! అదే సమయంలో కనీస ఆదాయ హామీకై దేశంలో జరుగుతున్న ప్రయత్నాలూ యూఎన్డీపీ ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కరోనా అనంతరం ఆర్థికంగా మన దేశపు పనితీరు పొరుగు దేశాల కన్నా మెరుగ్గా ఉండడం ఆశాకిరణం. అభివృద్ధి అజెండా అమలుకు నిధులు వెచ్చించే వీలుంటుంది. అయినా, ఇప్పటికీ అనేక అంశాల్లో ఇతర దేశాలు మెరుగ్గా ఉన్నాయనేది నిష్ఠురసత్యం. పౌష్టికలోప జనాభా, బాలల మరణాల రేటు తదితర అంశాలతో లెక్కించే ‘ప్రపంచ ఆకలి సూచి’ (2020) ప్రకారం కూడా 107 దేశాల్లో మనది 94వ స్థానం. వీటికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధం, ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపోని కరోనా, భూతాపోన్నతి ముప్పేటదాడి చేస్తున్నాయి. అన్నీ కలసి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చని ఐరాస హెచ్చరిస్తోంది. నిలకడైన అభివృద్ధి, సామాజిక భద్రత, సత్వర సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి పెడితేనే అనిశ్చితి నుంచి బయటపడగలమంటోంది. ఐరాస మాట చద్దిమూట. పాలకులు దీన్ని పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. పర్యావరణ సంక్షోభ నివారణ లక్ష్యాలను చేరుకొనేందుకూ కృషి చేయాలి. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతూ, ఉపాధి హామీ తగ్గుతున్న సమయంలో ఎన్నికల వ్యూహాలు కాస్త ఆపి, నిలకడగా చేతల్లోకి దిగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాలు తగ్గించుకొని, సమన్వయంతో సాగాలి. కానీ, పైచేయి కోసం ప్రయత్నాలతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా సహకార స్ఫూర్తి కొరవడుతున్న వేళ ప్రగతి బాటలో కలసి సాగడానికి మన పాలకులు సిద్ధమేనా? -
ఆహార సంక్షోభం ముంగిట్లో...
ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్ కౌంట్స్’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది... భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్ దివంగత ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. మాంసాహారంతో నష్టమేమిటి? శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే. ధరలు ఆకాశానికి... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక! క్రమక్షయంతో పెనుముప్పు పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్ వాడి ఫండ్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్ కౌంట్స్’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్ వేస్టేజ్ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్ హార్వెస్టింగ్ లాస్) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా. (కంచర్ల యాదగిరిరెడ్డి) -
ఆకలి భారతం
న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి తీవ్రత పెరిగింది. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం అట్టడుగు స్థానానికి చేరువలో ఉన్న ట్టు అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. 2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 117 ప్రపంచ దేశాల్లో మన దేశం 102వ స్థానానికి దిగజారిందని వెల్లడించింది. మనకన్నా పేదరికంలో ఉన్న, అత్యంత వెనుకబడి ఉన్న దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకన్నా మనదేశం వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా తయారుచేసిన ఈ నివేదిక భారత్‌లో ఆకలి తీవ్రమైందని హెచ్చరించింది. దేశంలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరని, ఇతర దేశాలకంటే అతి తక్కువ బరువుతో ఉన్నారంది. 2008–12 మధ్య బరువు తక్కువ ఉన్న పిల్లల శాతం దేశంలో 16.5 శాతం ఉండగా, 2014–18కి మధ్య 20.8 శాతానికి దిగజారింది. 2030 కల్లా ఆకలిని జయించేవైపు దేశం కృషి చేస్తోందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలో మొత్తం 113 దేశాల్లో భారత్ 83 స్థానంలో ఉండగా, 2018లో మొత్తం 119 దేశాల జాబితాలో 103 స్థానంలో ఉంది. నాలుగు అంశాల ఆధారంగా రేటింగ్... గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కేటగిరీలో మన దేశం 30.3 స్కోరుతో ఉంది. ఈ స్కోరుని నాలుగు సూచీలపై ఆధారపడి నిర్ణయిస్తారు. పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉండడం, వయసుకి తగ్గ ఎత్తు ఎదగకపోవడం, శిశు మరణాలు. నివేదిక ముఖ్యాంశాలు ► దేశంలో కేవలం 6 నుంచి 23 నెలల మధ్య వయసున్న వారిలో 9.6 శాతం మందికి మాత్రమే ‘కనీస ఆహార అవసరాలు’తీరుతున్నాయి. ► భారత్‌లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన జరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందనీ, దానివల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయంది. ► బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ సహా మొత్తం 17 దేశాలు ఈ సూచీలో 5 కన్నా తక్కువ ర్యాంకుతో ఉన్నత స్థానంలో ఉన్నాయి. ► నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే, తీవ్రమైన వాతావరణ మార్పులతో సతమతమౌతోన్న యెమన్, జిబౌటి దేశాలు సైతం భారత్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. ► పొరుగు దేశాలైన నేపాల్(73), శ్రీలంక(66), బంగ్లాదేశ్(88), మయన్మార్(69), పాకిస్తాన్ (94) స్థానంలో ఉండి ఆకలి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. ► చివరకు చైనా (25) సైతం భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉంది. -
ఆకలిరాజ్యం!
ఇరవై రోజుల్లో దేశమంతా 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోబోతుండగా, ఎక్కడో మారుమూల కాదు... దేశ రాజధాని నగరంలో ముగ్గురు చిన్నారులు పట్టెడన్నం దొరక్క ఆకలికి మాడి మృత్యువాత పడ్డారు. ఈ దుర్వార్త చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇంతగా అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా ఇలాంటి చావులా అని దిగ్భ్రాంతికలగొచ్చు. కానీ న్యూఢి ల్లీలో జరగటం వల్లా... ఒకే కుటుంబంలో ముగ్గురు పసివాళ్లు ప్రాణాలు కోల్పోవటంవల్లా ఈ ఉదంతానికి ప్రాధాన్యత వచ్చిందిగానీ దేశంలో ఈ తరహా మరణాలు సంభవించని రోజంటూ లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్న మాట. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితా ఉంటే అందులో మన స్థానం 100. మనకన్నా పొరుగునున్న బంగ్లా దేశ్(88), శ్రీలంక(84), మయన్మార్(77), నేపాల్(72) ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్క పాకిస్తాన్ మాత్రం మనకంటే కాస్త వెనకబడి ఉంది. ఎక్కడైనా ఆకలిచావులు సంభవించాయని వార్తలొస్తే మన ప్రభుత్వాలు చాలా నొచ్చుకుంటాయి. ఆకలితో కాదు... అనారోగ్యంతో మరణించారని తేల్చ డానికి ప్రయాసపడతాయి. నిరుడు జార్ఖండ్‌లో పదకొండేళ్ల బాలిక సంతోషి చనిపోయినప్పుడు, ఆ రాష్ట్రంలోనే అంతక్రితం 58 ఏళ్ల సావిత్రిదేవి మరణించినప్పుడు అక్కడి ప్రభుత్వం అవి ఆకలి చావులు కాదు... అనారోగ్యం చావులని వాదించింది. అందుకు పోస్టుమార్టం నివేదికలను సాక్ష్యా లుగా చూపింది. ఒక్క జార్ఖండే కాదు... ఏ రాష్ట్రమైనా ఆ పనే చేస్తోంది. కానీ నిండా పదేళ్లు కూడా లేని ముగ్గురు పిల్లలూ న్యూఢిల్లీలో ప్రభుత్వాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. రెండోసారి పోస్టుమార్టం చేయించినా వారి కడుపులు, పేగులూ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని తేలింది. తన నలభైయ్యేళ్ల సర్వీసులో ఈ మాదిరి కేసుల్ని ఎప్పుడూ చూడలేదని పోస్టుమార్టం చేసిన వైద్యుడు అన్నాడంటే ఆ పిల్లలు మృత్యువాత పడేముందు అనుభవించిన వేదన ఎటువంటిదో ఊహించుకోవచ్చు. కనీసం ఎనిమిది రోజులనుంచి వారికి తిండి నీళ్లూ లభించలేదని చెబుతున్నారు. తాను అద్దెకు తెచ్చుకున్న రిక్షాను ఎవరో దొంగిలించుకపోవడంతో వారి తండ్రి దిక్కుతోచక, పూట గడవటానికి పని వెతు క్కుంటూ ఎటో వెళ్లాడని స్థానికులు అంటున్నారు. ఆ పిల్లల్ని సాకి కాపాడాల్సిన అమ్మ మతి స్థిమితం తప్పి తన లోకంలో ఉండిపోయింది. పిల్లల మృతదేహాలను తరలిస్తూ ఆసుపత్రి సిబ్బంది తల్లిని కూడా వెంటబెట్టుకు వెళ్తుంటే ‘ఇంత అన్నముంటే పెట్టండ’ంటూ ఆ పిచ్చితల్లి ప్రాథేయ పడింది. పెద్ద పాప వయసు ఎనిమిదేళ్లు దాటలేదు. రెండో పాపకు నాలుగేళ్ల వయసుంటే ఆఖరి చిన్నారికి రెండేళ్లు. మనం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నామని భరోసా ఇవ్వడానికి ప్రభుత్వాలు తరచుగా వృద్ధి రేటును ఉదహరిస్తాయి. ఇంతమందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి బయటపడేశామని ఏటా లెక్కలు ఏకరువు పెడతాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే తామెంత సాధించామో ఘనమైన వాణిజ్య ప్రకటనలతో సమ్మోహనపరిచే ప్రయత్నం చేస్తాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక లెక్క ప్రకారం మన దేశ జనాభాకంతటికీ ఏడాది పొడవునా కడుపు నిండాలంటే దాదాపు 23 కోట్ల టన్నుల ఆహారం అవసరం. కానీ నిరుడు మన ఆహార దిగుబడి దాదాపు 27.5 కోట్ల టన్నులు. అంటే నాలుగున్నర కోట్ల టన్నుల మిగులు సాధిస్తున్నాం. అయినా ఈ దేశంలో ఆకలిచావులు నిత్యకృత్యమవుతు న్నాయి. రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న ఆకలిచావుల్లో చాలా భాగం లెక్కకు రావు. మీడియా దృష్టి పడి హడావుడి జరిగినప్పుడు వ్యాధుల కారణంగా మరణించారని చెప్ప డానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. సాధారణంగా ఆకలికి తాళలేనప్పుడు ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు విజృంభించే వ్యాధులు ప్రభుత్వాలకు అక్కరకొస్తాయి. మన దేశంలో అంతా బాగానే ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి. బడికొచ్చే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఆరేళ్లలోపు పిల్లలకు, గర్భిణులకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీలున్నాయి. ఇవిగాక బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు వగైరాలు చవగ్గా అందించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ఉంది. వీటిన్నిటికీ మించి అయిదేళ్ల క్రితం మన దేశం ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన ఆహార భద్రతా చట్టం ఉంది. ఇన్ని ఉండగా తలాబ్ చౌక్ ప్రాంతానికి వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు పోలేదు? ఆ పిల్లల కుటుంబానికి మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ఉండే చాలా కుటుంబాలకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. కార్డు కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏదైనా బిల్లు తీసుకురమ్మంటున్నారని అక్కడివారు ఫిర్యాదు చేస్తున్నారంటే మన ప్రభుత్వాలు ఏరకంగా పనిచేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సమస్త అవసరాలకూ పనికొస్తుందని నమ్మించి ఆధార్‌ను తీసుకొచ్చినా అది ఉంటే చాలదు... బిల్లులు కావాలని ప్రభుత్వ కార్యా లయాలన్నిటా అడుగుతారు. ఎక్కడో బెంగాల్నుంచో, బిహార్నుంచో పొట్టపోసుకోవడానికొచ్చిన కుటుంబాలకు ఇవన్నీ అసాధ్యం గనుక ఏ పథకంలోనూ వారు చేరే అవకాశం ఉండదు. ఏతావాతా సంక్షేమ పథకాలన్నీ కాగితాల్లో నిక్షిప్తమై ఉంటే... సాధారణ పౌరులు ఆకలితో నకనకలాడతారు. ప్రపంచంలో ఇంత అసంబద్ధంగా, ఇంత అన్యాయంగా నడిచే వ్యవస్థలు మరెక్కడా ఉండవు. అయిదేళ్లలోపు పిల్లల్లో సంభవించే సగం మరణాలకు ప్రధాన కారణం పౌష్టికాహారలోపమేనని ఈమధ్యే యునిసెఫ్ నివేదిక తెలిపింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల మరణానికి కారణం మీరంటే మీరని ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వాదించుకుంటున్నాయి. కానీ నిరుపేద కుటుంబాలకు తగిన గుర్తింపు కార్డులిచ్చి వారికి మెరుగైన ఆహారం, వసతి, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటం ఎలా అన్న అంశంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నిరర్ధకమైన వాగ్యుద్ధాలకు స్వస్తి చెప్పి సామాజిక సంక్షేమ పథకాలు లక్షిత వర్గాలకు చేరేందుకు అవసరమైన కార్యాచరణ రూపొం దించటం తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. -
భారత్‌లో ఆకలి కేకలు
న్యూఢిల్లీ: భారతదేశం తీవ్రమైన ఆకలి సమస్యతో బాధపడుతోంది. తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితాలో భారత్ 100వ స్థానంలో ఉంది. ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఇరాక్ కన్నా వెనుక స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కన్నా కొంచెం మెరుగైన ర్యాంకు సాధించింది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) తన నివేదికలో పేర్కొంది. గతేడాది భారత్ 97వ స్థానంలో ఉంది. తన పొరుగు దేశాల కన్నా భారత్ తక్కువ స్థానంలో ఉందని ఐఎఫ్పీఆర్ఐ వ్యాఖ్యానించింది. చైనా (29), నేపాల్ (72), మయన్మార్ (77), శ్రీలంక (84), బంగ్లాదేశ్ (88)తో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. పాక్(106), అఫ్గానిస్తాన్ 107వ ర్యాంకులతో భారత్ కన్నా వెనుక ఉన్నాయి. ఉత్తర కొరియా 93, ఇరాక్ 78వ స్థానంలో ఉన్నాయి. -
ఆకలి భారతం పట్టదా మోదీ?
ప్రపంచంలో 2020 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందని మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కలగన్నారు. సూపర్ పవర్ మాట ఏమోగానీ, 2020 నాటికి ఆకలితో అలమటిస్తున్న బాలభారతం అసువులు బాయకపోతే అదే పదివేలని ప్రార్థించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఆకలిని అధిగమించడంలో భారత్ బాగా వెనకబడి పోయిందని, ఆకలిపై పోరాడుతున్న దేశాల్లో భారత్ 97 స్థానంలో నిలిచిందని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' తాజా నివేదికలో వెల్లడించింది. ఆకలి పోరాటంలో కెన్యా, మలావి లాంటి వెనకబడిన దేశాలకన్నా, యుద్ధాలతో రగిలిపోతున్న ఇరాక్ కన్నా భారత్ వెనకబడిపోవడం అవమానకర విషయం. నేపాల్, బంగ్లా, చైనా, శ్రీలంక, మయన్మార్ లాంటి పొరుగుదేశాలకన్నా వెనకబడిపోయామంటే మింగుడుపడని అంశమే. ఈ విషయంలో మనం శ్రీలంక కన్నా ఒక్క శాతమైనా ముందుకు వెళ్లాలంటే 2016లో పుట్టిన 9 లక్షల మంది పిల్లల్లో ఒక్కరు కూడా చనిపోకుండా వారిని 2021 నాటి వరకు కాపాడుకోవాలి. భారత్‌లో ప్రస్తుతం 35 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో 15 శాతం మంది పిల్లలు కనీస ఆహారం అందక ఆకలితో అల్లాడిపోతున్నారు. వారిలో ప్రతి 20 మందిలో ఒకరు ఐదేళ్లలోపు మరణించే ప్రమాదం ఉంది. రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మురిసిపోయే నాయకులు ఆహారం, ఆకలి, పౌష్టికాహార లోపం అంశాల గురించి ఎన్నడూ మాట్లాడరు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, దేశ భద్రత, కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి, ఉద్యోగాలు, మార్పు అన్న అంశాలను ప్రస్తావించారు తప్ప ఆకలి, ఆహారం గురించి మాట వరుసకు కూడా మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రపంచ దేశాలు పర్యటిస్తున్నారు తప్ప బాలభారతం ఎదుర్కొంటున్న ఆకలి సమస్య గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. మధ్యతరగతి, అగ్రవర్ణాల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ నాయకులకు ఆకలి సమస్య ఎందుకు పట్టడం లేదు? ఆకలి, పౌష్టికాహార లోపం వల్ల మరణిస్తున్న పిల్లలు ఎక్కువ మంది దళితులు, ఆదిమవాసులే కావడమే అందుకు కారణమేమో! 2011 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు లేదా ప్రశ్నలు కేవలం 3 శాతం మాత్రమే పిల్లలకు సంబంధించినవంటే వారికిస్తున్న ప్రాధాన్యమెంతో అర్థం చేసుకోవచ్చు. పౌష్టికాహార లోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్య అగ్రవర్ణాల కన్నా దళితుల్లో 53 శాతం ఎక్కువగా ఉండగా, ఆదివాసీల్లో 35 శాతం ఎక్కువగా ఉంది. పేద, దళితవర్గాల సమస్యను రాజకీయ పెద్దలతోపాటు మీడియా కూడా పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. 300 మీడియా సంస్థల నిర్ణేతల్లో ఒక్క శాతానికి మంచి దళితులు గానీ ఆదివాసీలుగా నీ లేకపోవడమే అందుకు కారణమా? ఏదేమైనా మరో ఐదేళ్ల వరకు, అంటే 2021 సంవత్సరం వరకు ఆకలిపై పోరాటంలో భారత్ అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా కనిపించడం లేదని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' అభిప్రాయపడింది.