ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్ కౌంట్స్’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది...
భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్ దివంగత ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు.
మాంసాహారంతో నష్టమేమిటి?
శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే.
ధరలు ఆకాశానికి...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక!
క్రమక్షయంతో పెనుముప్పు
పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్ వాడి ఫండ్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి.
ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు!
ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్ కౌంట్స్’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంది.
దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్ వేస్టేజ్ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్ హార్వెస్టింగ్ లాస్) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా.
(కంచర్ల యాదగిరిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment