యుద్ధకాలంలో ఆహారమే ముఖ్యం | Abhijeet Bhattacharya Analysis On Food Crisis And Misery During Wars | Sakshi
Sakshi News home page

యుద్ధకాలంలో ఆహారమే ముఖ్యం

Published Tue, Sep 20 2022 1:07 AM | Last Updated on Tue, Sep 20 2022 1:18 AM

Abhijeet Bhattacharya Analysis On Food Crisis And Misery During Wars - Sakshi

యుద్ధాలు ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తాయని చరిత్ర పదే పదే రుజువు చేస్తోంది. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ సైనిక ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనేవి అందరినీ కలవరపరుస్తున్నాయి. మందుగుండు సామర్థ్యం, బాంబులు, క్షిపణులు ఇవేవీ ప్రపంచానికి ఇప్పుడు ముఖ్యం కాదు. మెరిసే మెట్రో భవంతులు, స్టాక్‌ మార్కెట్‌ బూమ్, పెరుగుతున్న మల్టీ బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ దేశాలకు రక్షక పాత్ర పోషించలేవు. ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అన్నది ఇప్పుడు అత్యవసర సూత్రం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద వరి, గోధుమ ఉత్పత్తి దేశాలు కూడా మరింత ఉత్పత్తి కోసం పాట్లు పడుతున్నాయి.

‘‘తిండి లేకుండా ఇది రెండో రోజు. మేమంతా శరీరంలో నీటి చుక్క అనేది లేకుండా అల్లాడిపోయాం. ఇప్పటికే 60 గంటలపాటు మాకు తిండి లేదు. మా సైనికులూ, నేనూ ఎంతకాలం పోషణ లేకుండా ఉంటామో తెలీదు. నా వాచ్‌ కేసి చూశాను. సరిగ్గా ఉదయం 9.22 నిమిషాలు. 1962 అక్టోబర్‌ 22 సోమవారం. నేను చైనా ప్రజా విముక్తి సైన్యం ఖైదీగా ఉన్నాను. ఆ సమయానికి 66 గంటలుగా నేను తిండి లేకుండా ఉన్నాను. అలిసిపోయాను. ఆకలితో అలమటించిపోతున్నాను. గడ్డం గీసుకోలేదు. నిరుత్సాహం ఆవరించింది.’’ (హిమాలయన్‌ బ్లండర్‌; పేజీ: 390; బ్రిగేడియర్‌ జాన్‌ పి. దల్వీ)

సార్వభౌమాధికార దేశ యోధులకు తిండి లేకపోతే జరిగేది అదే. సురక్షితమైన స్థావరం నుంచి మండుతున్న హిమాలయ సరిహద్దుకు ఆహార పదార్థాలు సరఫరా చేయడంలో రాజ్య యంత్రాంగం ప్రదర్శిం చిన నేరపూరితమైన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇది. యుద్ధరంగంలోని ముందు వరుస యోధుల ఆహార సంక్షోభాన్ని ఎత్తిచూపేలా, సుమారు నెలరోజులపాటు సైనికంగా చైనా అవమానకరమైన దెబ్బ కొట్టింది. ఆకలితో అలమటించిన యోధులు తప్పనిసరై లొంగిపోయి శత్రువు కారాగార అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. స్పష్టంగా యుద్ధాలు సరిహద్దుల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ కూడా ఆహార సంక్షేభాన్ని పుట్టిస్తాయి.

అదృష్టవశాత్తూ, ప్రపంచ యుద్ధాలు మనకు దూరంగానే ఉంటూ వచ్చాయి. కానీ 1962 నాటి యుద్ధం భారత్‌ భూభాగంలోనే జరి గింది. కాకపోతే, రెండో ప్రపంచ యుద్ధం తూర్పు భారతదేశంలో విధ్వంసకరమైన దుర్భిక్షాన్ని కొనితెచ్చింది. 1962 చైనా ముట్టడి సమ యంలో భారతీయ సైనికులు ఆకలితో అలమటించడానికి ముందు 150 సంవత్సరాల క్రితం 1812లో నెపోలియన్‌ రెజిమెంట్‌కు చెందిన సైన్యాలు భయంకరమైన ఆహార సరఫరా వైఫల్యం కారణంగా ఆకలి దప్పులతో అలమటించి రష్యా చేతిలో ఊచకోతకు గురయ్యాయి. దాంతో శక్తిమంతమైన ఫ్రాన్స్‌ సైన్యాలు తక్కువ అంచనా ఉన్న జార్‌ రోమనోవ్‌ సైన్యం చేతిలో ఘోర పరాజయం పొందాయి. జార్‌ గుర్రాలు ఆహార సరఫరాలను సజీవంగా ఉంచడమే రష్యా సైనికుల విజయానికి కారణం.

నేటి రష్యా–ఉక్రెయిన్‌ సైనిక ఘర్షణ కూడా ఆహార ఉత్పత్తి, వినియోగం, పంపిణీకి సంబంధించి కనీవినీ ఎరుగని అంతర్జాతీయ భయాందోళనలను సృష్టించింది. టోక్యో నుంచి చికాగో వరకు, ఢిల్లీ నుంచి ఢాకా వరకు, కెనడా నుంచి అర్జెంటీనా వరకు ఆహార ధాన్యా లను అధికంగా ఉత్పత్తి చేసే ప్రతి దేశం కూడా యుద్ధ ప్రాంతానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ ఆందోళన చెందుతున్నాయి.

రష్యా– ఉక్రెయిన్‌ సైనిక ఘర్షణ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుందనీ, దాని భారం ప్రపంచంపై ఈ స్థాయిలో పడుతుందనీ ఎవరూ ఊహించ లేదు. అయితే, పోరాడుతున్న ప్రపంచం కంటే ఆహారం పండిస్తున్న ప్రపంచమే అగ్రగామి అనే ఎరుక ఇప్పుడు అందరి అనుభవంలోకీ వస్తోంది. కాబట్టే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ (ఏటా 3.60 కోట్ల టన్నులు) తన నిల్వలను పెంచుకోవడానికి భారత్, వియత్నాంలతో 3 లక్షల 30 వేల టన్నుల వరిధాన్యం దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. యుద్ధ దుష్ఫలితాలతో పెరుగుతున్న దేశీయ ఆహార ధరల వేడిని చల్లార్చుకోవడమే బంగ్లాదేశ్‌ లక్ష్యం.

భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా (ఏటా 12 కోట్ల టన్నులు), మూడో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (ఏటా 10.04 కోట్ల టన్నులు) ఉండి, ఎగుమతులు చేస్తోంది. కానీ జాతీయ ఉత్పత్తిలో పావుశాతం వాటా ఉన్న బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ లలో బలహీనమైన రుతుపవనాల కారణంగా ప్రస్తుత సీజన్‌లో వరి ఉత్పత్తి ప్రమాదంలో పడింది. దీంతో భారత్‌ కూడా దేశీయ ధరల పెరుగుదలకూ, లాభాలు తెచ్చిపెట్టే ఎగుమతులకూ, బిగుసుకు పోయిన సరఫరా మార్గాలకూ మధ్య సమతుల్యతను తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో వరి నాటు 8 శాతం తగ్గింది.

అమెరికా ప్రభుత్వం కూడా, ఒక పంటకు బదులుగా రెండు పంటలు వేయాలని రైతుల మీద ఒత్తిడి తెస్తోంది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (5.5 కోట్ల టన్నులు), ఎగుమతిదారుగా ఉన్న అమెరికాను సైతం యూరప్‌ యుద్ధం భయ పెడుతోంది. ఎందుకంటే స్తంభించిపోయిన ఓడరేవుల్లో గోధుమ పంట ఇరుక్కుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పంపిణీకి, వినియోగ దారుకూ మధ్య ఉన్న గొలుసు తెగిపోయింది. అయితే, ఉత్పత్తి పెంచడం వల్ల  ఆసియా, యూరప్‌ వినియోగదారులను చేజిక్కించు కునే మార్గం కూడా అమెరికాకు సుగమం కానుంది. కాబట్టి, ఉక్రెయిన్‌ యుద్ధం అదనంగా గోధుమ పండించే ఉత్పత్తిదారులకు లాభాలను పండించే మార్గాలను తెరిచింది. ఉక్రెయిన్‌ పతనం అమెరికాకు లాభంగా మారుతోందన్నమాట.

జపాన్‌ విషయానికి వస్తే, ఆ ద్వీప భౌగోళిక పరిమితుల కారణంగా ఆహారం నిత్య సమస్యగానే ఉంటోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టే ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉంటున్నప్పటికీ (77 లక్షల టన్నులు) జపాన్‌ ఆహార ధాన్యాల దిగుమతిదారుగానే  ఉంటోంది. అటు చైనా తైవాన్‌ ఘర్షణల ప్రమాదం, ఇటు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఆహార స్వావలంబన ప్రాముఖ్యతను జపాన్‌ గుర్తిస్తోంది.

స్వదేశంలో పంటల ఉత్పత్తి, ఎరువులు, గింజల విష యంలో వీలైనంత అధికోత్పత్తిని దేశం సాధించాల్సి ఉంటుందని విధాన నిర్ణేతలు గుర్తిస్తున్నారు. పైగా ఆసియాలో తిరుగులేని నావికా శక్తిగా జపానీయులు గుర్తింపు పొందిన రోజులకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఈరోజు ప్రత్యక్ష యుద్ధంలో జపాన్‌ పాల్గొనాల్సి వస్తే దాని ఆహార పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్క జపాన్‌ మాత్రమే కాదు, ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించని చాలా దేశాలకూ ఇదే వర్తిస్తుంది.

రష్యా–ఉక్రెయిన్‌ ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనే అంశాలు సామూహికంగా అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటున్నాయి. మందుగుండు పేలుళ్ల సామర్థ్యం, బాంబులు, క్షిపణులు, తుపాకులు ఇవేవీ ఇప్పుడు ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక పతనం ఎంతగా ఆందోళన కలిగిస్తున్నదంటే, ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారైన కెనడా మరింతగా గోధుమ ఉత్పత్తి చేయడానికి పూనుకుంటోంది. ఆహార సరఫరా, పంపిణీ వ్యవస్థ దీర్ఘకాలం సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తున్న తరుణంలో... ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అనేదే ఇప్పుడు అన్ని దేశాలకూ తారక మంత్రం అయిపోయింది.

ఇక భారత్‌లో పాలకుల విధానాల కారణంగా రైతులకు రుణ భారం గుదిబండగా మారుతున్నప్పటికీ, ఆహార స్వావలంబన విష యంలో దేశం అద్భుతమైన విజయాలు సాధించిందనడంలో సందేహం లేదు. 1960 నుంచి ఆయా ప్రభుత్వాలు రైతులకు కల్పిం చిన ప్రోత్సాహకాలే ఈ విజయానికి కారణం. వ్యవసాయేతర ఆర్థిక సామర్థ్యం కోసం వ్యవసాయాన్నీ, ఆహారోత్పత్తినీ తమ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంపై ఇప్పుడు జపానీయులు ఆగ్రహిస్తున్నారు. భారత్‌ సైతం 130 కోట్లకు పైగా జనాభాకు తిండి పెట్టడం తన అత్యంత ముఖ్యమైన బాధ్యత అని గుర్తించి తీరాలి.

సుదూర ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ఆహారోత్పత్తి, వ్యవసాయం దుఃస్థితికి గురై దుర్భిక్షం కారణంగా సామూహిక ఆకలి పెరిగిన పక్షంలో... మెరిసే మెట్రో భవంతులు, పెరుగుతున్న స్టాక్‌ మార్కెట్‌ బూమ్, పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ రక్షక పాత్ర పోషించలేవు. ఖాళీ కడుపుతో ఉన్న మనిషికి ఆహారమే దేవుడు అని గాంధీజీ సరిగ్గానే చెప్పారు. కాబట్టి సంక్షుభిత సమయాల్లో జాగరూకతతో, చురుగ్గా ఉండటం చాలా అవసరం.


అభిజిత్‌ భట్టాచార్య 
వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement