misery
-
యుద్ధకాలంలో ఆహారమే ముఖ్యం
యుద్ధాలు ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తాయని చరిత్ర పదే పదే రుజువు చేస్తోంది. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనేవి అందరినీ కలవరపరుస్తున్నాయి. మందుగుండు సామర్థ్యం, బాంబులు, క్షిపణులు ఇవేవీ ప్రపంచానికి ఇప్పుడు ముఖ్యం కాదు. మెరిసే మెట్రో భవంతులు, స్టాక్ మార్కెట్ బూమ్, పెరుగుతున్న మల్టీ బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ దేశాలకు రక్షక పాత్ర పోషించలేవు. ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అన్నది ఇప్పుడు అత్యవసర సూత్రం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద వరి, గోధుమ ఉత్పత్తి దేశాలు కూడా మరింత ఉత్పత్తి కోసం పాట్లు పడుతున్నాయి. ‘‘తిండి లేకుండా ఇది రెండో రోజు. మేమంతా శరీరంలో నీటి చుక్క అనేది లేకుండా అల్లాడిపోయాం. ఇప్పటికే 60 గంటలపాటు మాకు తిండి లేదు. మా సైనికులూ, నేనూ ఎంతకాలం పోషణ లేకుండా ఉంటామో తెలీదు. నా వాచ్ కేసి చూశాను. సరిగ్గా ఉదయం 9.22 నిమిషాలు. 1962 అక్టోబర్ 22 సోమవారం. నేను చైనా ప్రజా విముక్తి సైన్యం ఖైదీగా ఉన్నాను. ఆ సమయానికి 66 గంటలుగా నేను తిండి లేకుండా ఉన్నాను. అలిసిపోయాను. ఆకలితో అలమటించిపోతున్నాను. గడ్డం గీసుకోలేదు. నిరుత్సాహం ఆవరించింది.’’ (హిమాలయన్ బ్లండర్; పేజీ: 390; బ్రిగేడియర్ జాన్ పి. దల్వీ) సార్వభౌమాధికార దేశ యోధులకు తిండి లేకపోతే జరిగేది అదే. సురక్షితమైన స్థావరం నుంచి మండుతున్న హిమాలయ సరిహద్దుకు ఆహార పదార్థాలు సరఫరా చేయడంలో రాజ్య యంత్రాంగం ప్రదర్శిం చిన నేరపూరితమైన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇది. యుద్ధరంగంలోని ముందు వరుస యోధుల ఆహార సంక్షోభాన్ని ఎత్తిచూపేలా, సుమారు నెలరోజులపాటు సైనికంగా చైనా అవమానకరమైన దెబ్బ కొట్టింది. ఆకలితో అలమటించిన యోధులు తప్పనిసరై లొంగిపోయి శత్రువు కారాగార అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. స్పష్టంగా యుద్ధాలు సరిహద్దుల్లోనూ, వ్యవసాయ క్షేత్రాల్లోనూ కూడా ఆహార సంక్షేభాన్ని పుట్టిస్తాయి. అదృష్టవశాత్తూ, ప్రపంచ యుద్ధాలు మనకు దూరంగానే ఉంటూ వచ్చాయి. కానీ 1962 నాటి యుద్ధం భారత్ భూభాగంలోనే జరి గింది. కాకపోతే, రెండో ప్రపంచ యుద్ధం తూర్పు భారతదేశంలో విధ్వంసకరమైన దుర్భిక్షాన్ని కొనితెచ్చింది. 1962 చైనా ముట్టడి సమ యంలో భారతీయ సైనికులు ఆకలితో అలమటించడానికి ముందు 150 సంవత్సరాల క్రితం 1812లో నెపోలియన్ రెజిమెంట్‌కు చెందిన సైన్యాలు భయంకరమైన ఆహార సరఫరా వైఫల్యం కారణంగా ఆకలి దప్పులతో అలమటించి రష్యా చేతిలో ఊచకోతకు గురయ్యాయి. దాంతో శక్తిమంతమైన ఫ్రాన్స్ సైన్యాలు తక్కువ అంచనా ఉన్న జార్ రోమనోవ్ సైన్యం చేతిలో ఘోర పరాజయం పొందాయి. జార్ గుర్రాలు ఆహార సరఫరాలను సజీవంగా ఉంచడమే రష్యా సైనికుల విజయానికి కారణం. నేటి రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణ కూడా ఆహార ఉత్పత్తి, వినియోగం, పంపిణీకి సంబంధించి కనీవినీ ఎరుగని అంతర్జాతీయ భయాందోళనలను సృష్టించింది. టోక్యో నుంచి చికాగో వరకు, ఢిల్లీ నుంచి ఢాకా వరకు, కెనడా నుంచి అర్జెంటీనా వరకు ఆహార ధాన్యా లను అధికంగా ఉత్పత్తి చేసే ప్రతి దేశం కూడా యుద్ధ ప్రాంతానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ ఆందోళన చెందుతున్నాయి. రష్యా– ఉక్రెయిన్ సైనిక ఘర్షణ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుందనీ, దాని భారం ప్రపంచంపై ఈ స్థాయిలో పడుతుందనీ ఎవరూ ఊహించ లేదు. అయితే, పోరాడుతున్న ప్రపంచం కంటే ఆహారం పండిస్తున్న ప్రపంచమే అగ్రగామి అనే ఎరుక ఇప్పుడు అందరి అనుభవంలోకీ వస్తోంది. కాబట్టే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ (ఏటా 3.60 కోట్ల టన్నులు) తన నిల్వలను పెంచుకోవడానికి భారత్, వియత్నాంలతో 3 లక్షల 30 వేల టన్నుల వరిధాన్యం దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకుంది. యుద్ధ దుష్ఫలితాలతో పెరుగుతున్న దేశీయ ఆహార ధరల వేడిని చల్లార్చుకోవడమే బంగ్లాదేశ్ లక్ష్యం. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా (ఏటా 12 కోట్ల టన్నులు), మూడో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (ఏటా 10.04 కోట్ల టన్నులు) ఉండి, ఎగుమతులు చేస్తోంది. కానీ జాతీయ ఉత్పత్తిలో పావుశాతం వాటా ఉన్న బెంగాల్, ఉత్తరప్రదేశ్ లలో బలహీనమైన రుతుపవనాల కారణంగా ప్రస్తుత సీజన్లో వరి ఉత్పత్తి ప్రమాదంలో పడింది. దీంతో భారత్ కూడా దేశీయ ధరల పెరుగుదలకూ, లాభాలు తెచ్చిపెట్టే ఎగుమతులకూ, బిగుసుకు పోయిన సరఫరా మార్గాలకూ మధ్య సమతుల్యతను తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో వరి నాటు 8 శాతం తగ్గింది. అమెరికా ప్రభుత్వం కూడా, ఒక పంటకు బదులుగా రెండు పంటలు వేయాలని రైతుల మీద ఒత్తిడి తెస్తోంది. ప్రపంచంలో అయిదో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా (5.5 కోట్ల టన్నులు), ఎగుమతిదారుగా ఉన్న అమెరికాను సైతం యూరప్ యుద్ధం భయ పెడుతోంది. ఎందుకంటే స్తంభించిపోయిన ఓడరేవుల్లో గోధుమ పంట ఇరుక్కుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పంపిణీకి, వినియోగ దారుకూ మధ్య ఉన్న గొలుసు తెగిపోయింది. అయితే, ఉత్పత్తి పెంచడం వల్ల ఆసియా, యూరప్ వినియోగదారులను చేజిక్కించు కునే మార్గం కూడా అమెరికాకు సుగమం కానుంది. కాబట్టి, ఉక్రెయిన్ యుద్ధం అదనంగా గోధుమ పండించే ఉత్పత్తిదారులకు లాభాలను పండించే మార్గాలను తెరిచింది. ఉక్రెయిన్ పతనం అమెరికాకు లాభంగా మారుతోందన్నమాట. జపాన్ విషయానికి వస్తే, ఆ ద్వీప భౌగోళిక పరిమితుల కారణంగా ఆహారం నిత్య సమస్యగానే ఉంటోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టే ప్రపంచంలోనే తొమ్మిదో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉంటున్నప్పటికీ (77 లక్షల టన్నులు) జపాన్ ఆహార ధాన్యాల దిగుమతిదారుగానే ఉంటోంది. అటు చైనా తైవాన్ ఘర్షణల ప్రమాదం, ఇటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆహార స్వావలంబన ప్రాముఖ్యతను జపాన్ గుర్తిస్తోంది. స్వదేశంలో పంటల ఉత్పత్తి, ఎరువులు, గింజల విష యంలో వీలైనంత అధికోత్పత్తిని దేశం సాధించాల్సి ఉంటుందని విధాన నిర్ణేతలు గుర్తిస్తున్నారు. పైగా ఆసియాలో తిరుగులేని నావికా శక్తిగా జపానీయులు గుర్తింపు పొందిన రోజులకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఈరోజు ప్రత్యక్ష యుద్ధంలో జపాన్ పాల్గొనాల్సి వస్తే దాని ఆహార పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్క జపాన్ మాత్రమే కాదు, ఆహారోత్పత్తిలో స్వావలంబన సాధించని చాలా దేశాలకూ ఇదే వర్తిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ కంటే మిన్నగా రైతు, ఎరువు, ఆహారం, దుర్భిక్షం అనే అంశాలు సామూహికంగా అందరి దృష్టినీ తమ వైపు తిప్పుకొంటున్నాయి. మందుగుండు పేలుళ్ల సామర్థ్యం, బాంబులు, క్షిపణులు, తుపాకులు ఇవేవీ ఇప్పుడు ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక పతనం ఎంతగా ఆందోళన కలిగిస్తున్నదంటే, ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారైన కెనడా మరింతగా గోధుమ ఉత్పత్తి చేయడానికి పూనుకుంటోంది. ఆహార సరఫరా, పంపిణీ వ్యవస్థ దీర్ఘకాలం సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తున్న తరుణంలో... ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఆహార ధాన్యాల నిల్వ పెంచుకోండి అనేదే ఇప్పుడు అన్ని దేశాలకూ తారక మంత్రం అయిపోయింది. ఇక భారత్‌లో పాలకుల విధానాల కారణంగా రైతులకు రుణ భారం గుదిబండగా మారుతున్నప్పటికీ, ఆహార స్వావలంబన విష యంలో దేశం అద్భుతమైన విజయాలు సాధించిందనడంలో సందేహం లేదు. 1960 నుంచి ఆయా ప్రభుత్వాలు రైతులకు కల్పిం చిన ప్రోత్సాహకాలే ఈ విజయానికి కారణం. వ్యవసాయేతర ఆర్థిక సామర్థ్యం కోసం వ్యవసాయాన్నీ, ఆహారోత్పత్తినీ తమ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ రావడంపై ఇప్పుడు జపానీయులు ఆగ్రహిస్తున్నారు. భారత్ సైతం 130 కోట్లకు పైగా జనాభాకు తిండి పెట్టడం తన అత్యంత ముఖ్యమైన బాధ్యత అని గుర్తించి తీరాలి. సుదూర ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ఆహారోత్పత్తి, వ్యవసాయం దుఃస్థితికి గురై దుర్భిక్షం కారణంగా సామూహిక ఆకలి పెరిగిన పక్షంలో... మెరిసే మెట్రో భవంతులు, పెరుగుతున్న స్టాక్ మార్కెట్ బూమ్, పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య ఏ విధంగానూ రక్షక పాత్ర పోషించలేవు. ఖాళీ కడుపుతో ఉన్న మనిషికి ఆహారమే దేవుడు అని గాంధీజీ సరిగ్గానే చెప్పారు. కాబట్టి సంక్షుభిత సమయాల్లో జాగరూకతతో, చురుగ్గా ఉండటం చాలా అవసరం. అభిజిత్ భట్టాచార్య వ్యాసకర్త రచయిత, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చోద్యం కాకపోతే.. భర్తకు తిండి పెట్టడానికి కూడా డబ్బు తీసుకుంటుందట
‘పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన’ అనేది ఓ సామెత. గీసిగీసి బేరమాడే వాళ్లని, పావలాకు పదిరూపాయలు లాభం కోరుకునేవాళ్లని.. పీనాసి సంఘంలో చేర్చి మరీ ఎండగట్టినా మారరు. పైపెచ్చు అదేదో ఘనకార్యమన్నట్లుగా పొంగిపోతుంటారు ‘అహా నా పెళ్లంట’ సినిమాలోని కోట శ్రీనివాసరావు మాదిరి. ఆ కోవలోకి చెందిందే అమెరికా వాసి.. నలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది. వాటర్ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్.. భర్త జాయ్‌కు తిండి పెట్టడానికి కూడా డబ్బు తీసుకుంటుందట. ‘తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. నా భర్త నేను తినే ఆహారం కంటే ఎక్కువ తింటే.. అందుకుగాను అతడు నాకు డబ్బు చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని ఇంటి అవసరాల కోసం దాచిపెడతాను. నేను ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చవకదైనా అయ్యుండాలి లేదా ఉచితంగానైనా రావాలి. మొదట్లో ఇంత పొదుపుగా ఉండేదాన్ని కాదు. మా పెద్దబ్బాయి పుట్టాక ఏడాదికి 30 వేల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు స్వీకరించాను. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అందుకే అవసరాలన్నింటినీ తగ్గించడం మొదలుపెట్టాను. చివరికి ఇంటి మరమ్మత్తులు కూడా నేనే చేసుకుంటాను’ అని చెప్పుకొస్తుంది గుయిలీస్. అయితే ఈ కథ విన్నవారంతా పొదుపు మంచిదే కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్ మీద సానుభూతి చూపిస్తున్నారు. -
బీడీలు చుడుతూ.. కష్టాలు చెబుతూ..
సిరిసిల్ల: ‘పదహారేళ్లకే నాకు పెళ్లయింది. నా భర్త తాగుబోతు. మాకు ఇల్లులేదు. బీడీలు చేస్తేనే బతుకు. పాప గుండెజబ్బుతో బాధపడింది. నెలకు మూడువేల మందులు ఇప్పించినం. ఆరోగ్యశ్రీ వర్తించదన్నరు. ఎన్నో దవాఖాన్లు తిరిగినం. సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నం. ఏ సాయమూ రాలేదు. పాప చచ్చిపోయింది. రెండులక్షలు అప్పులైనయి. మహిళా సంఘంల యాభైవేల లోను ఇమ్మంటే నువ్వెట్ల కడుతవని ముప్పైవేలే ఇచ్చిండ్రు. ఆరేళ్ల బాబు ఉన్నడు. బీడీలు చేస్తే నెలకు ఐదువందలు వస్తున్నయి. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అప్పులు తీరే దారిలేదు’ అంటూ సిరిసిల్లకు చెందిన విజయ కన్నీళ్లు పెట్టింది. బీడీ కార్మికుల సంక్షేమ కమిటీ బృందం కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంగళవారం సిరిసిల్లకు రాగా, స్థానిక అంబాభవాని ఆలయం లో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా విజయ కన్నీటిగాథ అందర్నీ కదిలిం చింది. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లలేదా అని పూనం మాల కొండయ్య ప్రశ్నించగా.. ‘సర్కారు దవాఖానకు పోతే ఎవరు పట్టించుకుంటరు? గంటల తరబడి ఫోన్లో మాట్లాడ్తరు తప్ప పేషెంట్లను పట్టించుకోరు. ప్రాణం పోతే తిరిగి వస్తుందా?’ అంటూ విజయ ఆవేదనగా ప్రశ్నించింది. ‘డ్యూటీ అయిపోయినంక ఫోన్లో మాట్లాడుకోవచ్చుకదా. ఉండేదే రెండు గంటలు. ఆ రెండు గంటలు ఫోన్లోనే మాట్లాడ్తరు’ అంటూ డాక్టర్ల నిర్లక్ష్యాన్ని వివరించింది. బీడీ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం రాగా, కార్మికులు ఆకు, తంబాకు, చాటలతో సమావేశానికి వచ్చారు. బీడీలు చేస్తూనే అధికారులకు బాధలు చెప్పుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో వేదన ‘నా కొడుకు చనిపోయిండు. ఒక బిడ్డకు పెళ్లి చేసిన. ఇంకో బిడ్డ పెళ్లికుంది. నేను బీడీలు చేసి ఎట్ల పెండ్లి చేయాలే. ఎంత చేసినా బట్టకు, పొట్టకు సాలుత లేదు. మా ఆయన సాంచాల పని చేస్తడు. ఇల్లు లేదు. జాగ లేదు. మేమెట్ల బతుకాలే..’ అని అడిశెర్ల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. సిరిసిల్లకు వచ్చిన అధ్యయన బృందం ముందు బీడీ కార్మికులు తమ ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కన్నీళ్లు పెట్టారు. ప్రభుత్వం పింఛన్ మంజూరీ చేసి ఆదుకోవాలని, 35 కిలోల బియ్యం కార్డులను రద్దు చేయకుండా కొనసాగించాలని కార్మికులు పదేపదే వేడుకున్నారు. బియ్యం బందయితే బతుకే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆడోళ్లకు కూడా చెప్పరాని బాధలున్నయి. పిల్లల ముఖాలు చేసి బతుకుతున్నం’ అంటూ రోదిస్తూ వివరించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీడీకార్మిక పిల్లలకు వర్తింపజేసి ఆడపిల్లల పెళ్లి భారం కాకుండా చూడాలని కోరారు. బీడీల పనితో పాటు ఇతర పనిలోనూ శిక్షణ ఇప్పిస్తే పని చేసుకుంటామని, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ రావడం లేదు.. సిరిసిల్లలో మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ రావడం లేదు. ఒక్కో సంఘానికి రూ.ఐదు లక్షల లోను ఇచ్చారు. నెలనెల కట్టడానికి ఇబ్బందవుతుంది. మేం బీడీలు చేసే అప్పు తీర్చాలి. మొగోళ్లు పని చేస్తే తాగుడుకే సరిపోతుంది. కల్లు బంద్ చేయాలంటూ పలువురు మహిళలు తెలిపారు. బ్యాంకువాళ్లు బలవంతంగా వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. పదినెల్లుగా వడ్డీ రావడం లేదని మహిళలు చెప్పగా, కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ స్పందించి డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్‌తో మాట్లాడారు. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీలు వస్తుందని, నేరుగా వారి ఖాతాల్లోనే జమవుతుందని స్పష్టం చేశారు. బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పలువురు కార్మికులు వివరించారు. ప్రభుత్వానికి నివేదిస్తాం బీడీ కార్మికుల సమస్యలను కళ్లారా చూశామని, సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిస్తామని బీడీ కార్మికుల సంక్షేమ కమిటీ సభ్యురాలు పూనం మాలకొండయ్య అన్నారు. కార్మికులకు మేలు జరిగేవిధంగా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారుల బృందంలో కమిటీ సభ్యులు సునీల్‌శర్మ, స్వాతిలక్రా, సౌమ్యమిశ్రా, కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్, కలెక్టర్ నీతుకుమారిప్రసాద్, ఐసీడీఎస్ అధికారిణి శ్యామ్‌సుందరి, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, హౌసింగ్ పీడీ నర్సింగరావు, డెప్యూటీ లేబర్ కమిషనర్ గాంధీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కోటేశ్వర్రావు, ఆర్డీవో బానోతు భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, తహశీల్దార్ మన్నె ప్రభాకర్, కమిషనర్ సుమన్‌రావు, సెస్ ఎండీ రామకృష్ణ, ఆర్అండ్బీ ఎస్ఈ చందులాల్, సీఐ విజయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, కార్మిక నాయకులు పంతం రవి, వెంగల శ్రీనివాస్, గొట్టె రుక్మిణి, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు..! ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!!
సినీ రంగంలో బ్రేక్ వచ్చేంత వరకు పడిన కష్టాల గురించి ఒకసారి ఎమ్మెస్ ‘సాక్షి’తో పంచుకుంటూ, ‘‘...ఆ పన్నెండేళ్ళు నేను పడిన కష్టాలు భయంకరం! ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్ళిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టికెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చొని ఆలోచనలో పడ్డా. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి, చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోల్లా మనం కష్టపడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే! ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకు అంటించా. టికెట్ చించేశా’’ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గరకు రచయితగా వెళ్ళడం, నటుడిగా తెర మీదకు రావడం చరిత్ర. ప్రయత్నిస్తూ కెరీర్లో గెలుపు సాధించిన ఎమ్మెస్ అనారోగ్యంపై పోరులో అర్ధంతరంగా ప్రయత్నం విరమించి కన్నుమూయడం తీరని విషాదం. -
భార్యకు క్షమాపణ చెప్పండి!
సుద్దాల అశోక్‌తేజ - అంతర్వీక్షణం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది! మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం? నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం? వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని. ఎలాంటి వారిని ఇష్టపడతారు? మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను. డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం? సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది. మీకు నచ్చిన పుస్తకాలు..! అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది. ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు? ... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను. మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ. మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు! మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి. తొలి పాట రాసినప్పటి అనుభూతి ... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం. తొలి సంపాదన! ... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన. అలాంటి మనసు నిండిన మరో సంఘటన? నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్లర్గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి? ...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే. అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం? ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు. ఎవరికైనా క్షమాపణ చెప్పారా? మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను. మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో? ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’. భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా? సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం. పాటల్లో ఉపయోగించే భావం... కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు? నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని. - వి.ఎం.ఆర్ -
కవి స్వేచ్ఛాజీవి
- సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆ కలానికి జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఆ సాహిత్యం.. ప్రజా సమస్యల ప్రతిబింబం. పదంపదంలో ఉద్యమపథం.. మాటమాటలో పోరాట కెరటం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తెలుగు పద ప్రయోగంలో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీకవి, సాహితీమూర్తి సుద్దాల అశోక్ తేజ. ఆయన రాసిన పాటల పూదోటలో ఎన్నో కుసుమాలు.. మరెన్నో కాంతి శిఖరాలు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న అశోక్ తేజ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. - విజయవాడ కల్చరల్ సాక్షి : కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం అందుకున్నందుకు అభినందనలు.. అశోక్ తేజ : థ్యాంక్స్.. సాక్షి : మీది సుదీర్ఘ సినీ ప్రస్థానం కదా.. ఇందులో మీరు నేర్చుకున్నదేమిటీ? అశోక్ తేజ : లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సాక్షి : ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. అవన్నీ స్వేచ్ఛగా రాసినవేనా.. అశోక్ తేజ : కవి ఎప్పుడూ స్వేఛ్చాజీవే. అతడిని శాసించేవారు ఏకాలంలోనూ ఉండరు. సాక్షి : ప్రజాకవిగా జనంకోసం బతికిన సుద్దాల హనుమంతు కుమారుడు మీరు. మీపై మీ తండ్రి ప్రభావం ఏమైనా ఉందా.. అశోక్ తేజ : నా మాట.. పాట.. అంతా మా నాయనగారే. నేను ఈస్థానంలో ఉండటానికి ఆయనే కారణం. అందుకే ఆయన పేరుతో ప్రారంభించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా కవులను సత్కరిస్తున్నా. సాక్షి : మీరు రాసిన ఏ పాటకైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశపడ్డారా.. అశోక్ తేజ : నాకు బాగా ఇష్టమైన పాటల్లో ‘ఒకటే మరణం ఒకటే జననం..’ అనే పాటకు వస్తుందని ఆశపడ్డా.. సాక్షి : సినీ రంగంలో ప్రతిభకు స్థానం ఉందా.. అశోక్ తేజ : తప్పకుండా ఉంటుంది. సినీ రంగంలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అరుునా నేను 20ఏళ్లు ఈ రంగంలోనే నిలబడ్డా. కాసింత అదృష్టం కూడా ఉండాలి. సాక్షి : మీ పాటల వెనుక ప్రోత్సాహం ఎవరు? అశోక్ తేజ : జనం ఉన్నారు. జనం కోసం బతికిన కవులున్నారు. నా పాట వెనున ఆవేదన ఉంది. అన్నింటికంటే నా తండ్రి ఉన్నారు. సాక్షి : సినీకవికి కావాల్సిన అర్హతలేమిటీ? అశోక్ తేజ : సాహిత్యం తెలిసి ఉండాలి. కాస్త సంగీత పరిజ్ఞానం కూడా అవసరం. సాక్షి : తెలుగు సినిమా పాటల్లోని ఆంగ్ల పదాల వల్ల భాష చనిపోతోందని భాషావేత్తల ఆవేదన. దీనికి మీ సమాధానమేంటి? అశోక్ తేజ : ఆంగ్ల పదాలు 20 శాతం ఉంటే ఫర్వాలేదు. అంతకుమించి ఉంటే ప్రమాదమే.. సాక్షి : ఒక పాట రాసిన తరువాత.. ఇది ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించిన సంఘటనలేమైనా ఉన్నాయూ.. అశోక్ తేజ : దాదాపు లేవు. ఒక పాట రాసిన తరువాత దాని గురించి నేను ఆలోచించను. సాక్షి : తెలంగాణ రాష్ర్ట సాధనకు కవులంతా ఏకమయ్యూరు. సీమాంధ్రలో ఆ స్ఫూర్తి లేకపోవ డానికి కారణం. అశోక్ తేజ : అది వారివారి ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు. అశోక్ తేజ : 800 సినిమాల్లో 2వేలకు పైగా పాటలు రాశాను. సాక్షి : జానపద కళలను కాపాడుకోవటమెలా.. అశోక్ తేజ : కేవలం వ్యక్తుల వల్లో.. కళాసంస్థల వల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వం కళా పీఠాలు స్థాపించాలి. వాటికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. దేశం మెత్తంమీద ఉన్న జానపద సంపదల వివరాలు తెలుసుకోవాలి. వాటిని ప్రదర్శించే వారికి ఉపాధి సౌకర్యాలు కలిపించాలి. సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగును ఎలా కాపాడుకోవాలి? అశోక్ తేజ : భాషను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భాషను కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజలకు రావాలి.