ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు..! ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!!
సినీ రంగంలో బ్రేక్ వచ్చేంత వరకు పడిన కష్టాల గురించి ఒకసారి ఎమ్మెస్ ‘సాక్షి’తో పంచుకుంటూ, ‘‘...ఆ పన్నెండేళ్ళు నేను పడిన కష్టాలు భయంకరం! ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్ళిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టికెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చొని ఆలోచనలో పడ్డా. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి, చివరికి అనుకున్నది సాధిస్తాడు.
‘మనం రాసిన కథల్లో హీరోల్లా మనం కష్టపడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే! ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకు అంటించా. టికెట్ చించేశా’’ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గరకు రచయితగా వెళ్ళడం, నటుడిగా తెర మీదకు రావడం చరిత్ర. ప్రయత్నిస్తూ కెరీర్‌లో గెలుపు సాధించిన ఎమ్మెస్ అనారోగ్యంపై పోరులో అర్ధంతరంగా ప్రయత్నం విరమించి కన్నుమూయడం తీరని విషాదం.