బీడీలు చుడుతూ.. కష్టాలు చెబుతూ.. | Rounding out the difficulties of bidis skirt .. | Sakshi
Sakshi News home page

బీడీలు చుడుతూ.. కష్టాలు చెబుతూ..

Published Wed, Jan 28 2015 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

బీడీలు చుడుతూ.. కష్టాలు చెబుతూ..

బీడీలు చుడుతూ.. కష్టాలు చెబుతూ..

సిరిసిల్ల: ‘పదహారేళ్లకే నాకు పెళ్లయింది. నా భర్త తాగుబోతు. మాకు ఇల్లులేదు. బీడీలు చేస్తేనే బతుకు. పాప గుండెజబ్బుతో బాధపడింది. నెలకు మూడువేల మందులు ఇప్పించినం. ఆరోగ్యశ్రీ వర్తించదన్నరు. ఎన్నో దవాఖాన్లు తిరిగినం. సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నం. ఏ సాయమూ రాలేదు. పాప చచ్చిపోయింది. రెండులక్షలు అప్పులైనయి. మహిళా సంఘంల యాభైవేల లోను ఇమ్మంటే నువ్వెట్ల కడుతవని ముప్పైవేలే ఇచ్చిండ్రు. ఆరేళ్ల బాబు ఉన్నడు. బీడీలు చేస్తే నెలకు ఐదువందలు వస్తున్నయి. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అప్పులు తీరే దారిలేదు’ అంటూ సిరిసిల్లకు చెందిన విజయ కన్నీళ్లు పెట్టింది.
 
బీడీ కార్మికుల సంక్షేమ కమిటీ బృందం కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంగళవారం సిరిసిల్లకు రాగా, స్థానిక అంబాభవాని ఆలయం లో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా విజయ కన్నీటిగాథ అందర్నీ కదిలిం చింది. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లలేదా అని పూనం మాల కొండయ్య ప్రశ్నించగా.. ‘సర్కారు దవాఖానకు  పోతే ఎవరు పట్టించుకుంటరు? గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడ్తరు తప్ప పేషెంట్లను పట్టించుకోరు.

ప్రాణం పోతే తిరిగి వస్తుందా?’ అంటూ విజయ ఆవేదనగా ప్రశ్నించింది. ‘డ్యూటీ అయిపోయినంక ఫోన్లో మాట్లాడుకోవచ్చుకదా. ఉండేదే రెండు గంటలు. ఆ రెండు గంటలు ఫోన్‌లోనే మాట్లాడ్తరు’ అంటూ డాక్టర్ల నిర్లక్ష్యాన్ని వివరించింది. బీడీ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం రాగా, కార్మికులు ఆకు, తంబాకు, చాటలతో సమావేశానికి వచ్చారు. బీడీలు చేస్తూనే అధికారులకు బాధలు చెప్పుకున్నారు.
 
ఒక్కొక్కరిది ఒక్కో వేదన
‘నా కొడుకు చనిపోయిండు. ఒక బిడ్డకు పెళ్లి చేసిన. ఇంకో బిడ్డ పెళ్లికుంది. నేను బీడీలు చేసి ఎట్ల పెండ్లి చేయాలే. ఎంత చేసినా బట్టకు, పొట్టకు సాలుత లేదు. మా ఆయన సాంచాల పని చేస్తడు. ఇల్లు లేదు. జాగ లేదు. మేమెట్ల బతుకాలే..’ అని అడిశెర్ల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. సిరిసిల్లకు వచ్చిన అధ్యయన బృందం ముందు బీడీ కార్మికులు తమ ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కన్నీళ్లు పెట్టారు.

ప్రభుత్వం పింఛన్ మంజూరీ చేసి ఆదుకోవాలని, 35 కిలోల బియ్యం కార్డులను రద్దు చేయకుండా కొనసాగించాలని కార్మికులు పదేపదే వేడుకున్నారు. బియ్యం బందయితే బతుకే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆడోళ్లకు కూడా చెప్పరాని బాధలున్నయి. పిల్లల ముఖాలు చేసి బతుకుతున్నం’ అంటూ రోదిస్తూ వివరించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బీడీకార్మిక పిల్లలకు వర్తింపజేసి ఆడపిల్లల పెళ్లి భారం కాకుండా చూడాలని కోరారు. బీడీల పనితో పాటు ఇతర పనిలోనూ శిక్షణ ఇప్పిస్తే పని చేసుకుంటామని, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులు తెలిపారు.
 
మహిళా సంఘాలకు వడ్డీ రావడం లేదు..
సిరిసిల్లలో మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ రావడం లేదు. ఒక్కో సంఘానికి రూ.ఐదు లక్షల లోను ఇచ్చారు. నెలనెల కట్టడానికి ఇబ్బందవుతుంది. మేం బీడీలు చేసే అప్పు తీర్చాలి. మొగోళ్లు పని చేస్తే తాగుడుకే సరిపోతుంది. కల్లు బంద్ చేయాలంటూ పలువురు మహిళలు తెలిపారు. బ్యాంకువాళ్లు బలవంతంగా వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు.

పదినెల్లుగా వడ్డీ రావడం లేదని మహిళలు చెప్పగా, కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ స్పందించి డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్‌తో మాట్లాడారు. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీలు వస్తుందని, నేరుగా వారి ఖాతాల్లోనే జమవుతుందని స్పష్టం చేశారు. బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పలువురు కార్మికులు వివరించారు.
 
ప్రభుత్వానికి నివేదిస్తాం
బీడీ కార్మికుల సమస్యలను కళ్లారా చూశామని, సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిస్తామని బీడీ కార్మికుల సంక్షేమ కమిటీ సభ్యురాలు పూనం మాలకొండయ్య అన్నారు. కార్మికులకు మేలు జరిగేవిధంగా చూస్తామని ఆమె స్పష్టం చేశారు. ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
అధికారుల బృందంలో కమిటీ సభ్యులు సునీల్‌శర్మ, స్వాతిలక్రా, సౌమ్యమిశ్రా, కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్, కలెక్టర్ నీతుకుమారిప్రసాద్, ఐసీడీఎస్ అధికారిణి శ్యామ్‌సుందరి, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, హౌసింగ్ పీడీ నర్సింగరావు, డెప్యూటీ లేబర్ కమిషనర్ గాంధీ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కోటేశ్వర్‌రావు, ఆర్డీవో బానోతు భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, తహశీల్దార్ మన్నె ప్రభాకర్, కమిషనర్ సుమన్‌రావు, సెస్ ఎండీ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చందులాల్, సీఐ విజయ్‌కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, కార్మిక నాయకులు పంతం రవి, వెంగల శ్రీనివాస్, గొట్టె రుక్మిణి, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement