Sociology
-
Sociology: సామాజిక శాస్త్రాన్ని అభ్యసించాలి
ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గల కారణం మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపద రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం (సోషియాలజీ). సమాజ పరిణామ దశలనూ, సమాజంలోని మానవ సంబంధాలనూ, సమాజ మనుగడనూ; ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలనూ ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజం లోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీ కరణ, సామాజికీకరణ, స్తరీకరణ ఏవిధంగా ఉండాలో తెలుపుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగే పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి మార్పులకు గురవుతున్నాయి. అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరవవుతోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సామాజిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా దాదాపు కనుమరుగై పోయింది. కేవలం కొన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుగానే ఇది అందుబాటులో ఉంది. (క్లిక్: 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?) గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరిరక్షించడానికీ తోడ్పడుతుంది. అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేక పోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశ పెట్టి, సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. (క్లిక్: ఒక కొత్త వ్యవస్థ అవసరం) – డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్ తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా -
ఆహార సంక్షోభం ముంగిట్లో...
ప్రపంచ జనాభా ఏటేటా పెరుగుతోంది... 2050 కల్లా వెయ్యికోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నది శాస్త్రవేత్తల అంచనా. మరి అప్పటికి అందరికీ చాలినంత ఆహారం దొరకడం సాధ్యమా? అదంత తేలిక కాదంటోంది కోపెన్‌హేగన్ కేంద్రంగా పని చేస్తున్న ‘ద వరల్డ్ కౌంట్స్’. మనిషి ప్రకృతి వనరులను వాడుకుంటున్న తీరును, ఆహార పద్ధతులను తక్షణం మార్చుకోవాలని సూచిస్తోంది. లేదంటే మరో పాతికేళ్లలో మనుషులంతా అన్నమో రామచంద్రా అని అంగలార్చాల్సిన గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తోంది... భూమ్మీద అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి అయితే మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ పంటనైనా వేసుకోగల భూమి లభ్యత కాస్త అటూ ఇటుగా 140 కోట్ల హెక్టార్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 1,000 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది రెండు పూటలా కడుపు నిండా తినాలంటే 2017తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యమన్నది హార్వర్డ్ యూనివర్సిటీ సోషియో బయాలజిస్ట్ దివంగత ఎడ్వర్డ్ విల్సన్ అభిప్రాయం. మనుషులంతా శాకాహారులుగా మారినా, పాడి పశువుల పెంపకానికి వనరులు పెద్దగా వాడకపోయినా 2050 నాటికి 1,000 కోట్ల మందికి చాలినంత ఆహారం అందించడం కష్టమని తేల్చారాయన. పంటలు పండించేందుకు భూ జీవావరణానికున్న పరిమితులే ఇందుకు కారణమని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. మాంసాహారంతో నష్టమేమిటి? శాకాహారంతో పోలిస్తే మాంసాహార ఉత్పత్తికి ఖర్చయ్యే వనరులు చాలా ఎక్కువ. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం కనీసం ఐదు కిలోల దాణా వాడితే గానీ కిలో మాంసం తయారు కాదు. అమెరికాను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ దేశవ్యాప్తంగా మొక్కజొన్న పండించేందుకు వెచ్చించే వనరుల కంటే ఏకంగా 75 రెట్లు ఎక్కువ శక్తిని మాంసం ఉత్పత్తికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కేలరీల లెక్కలు చూసినా మాంసం ఉత్పత్తి ఖరీదైన వ్యవహారమే. రెండు, మూడు కేలరీల ఇంధనం ఖర్చు చేస్తే సోయాబీన్, గోధుమ వంటి వాటినుంచి ఒక కేలరీ ప్రొటీన్ సంపాదించుకోవచ్చు. అదే మాంసం విషయంలో ఏకంగా 54 కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా మాంసాహారాన్ని మానేందుకు చాలామంది అంగీకరించే పరిస్థితులు లేవు. ఇది ఆహార సమస్య మరింత జటిలం చేసేదే. ధరలు ఆకాశానికి... రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలల్లో ఏకంగా 55 దేశాలు ఆహార పదార్థాల ఎగుమతులపై నియంత్రణలు విధించాయి. 2030 నాటికల్లా మొక్కజొన్న ధర 80 శాతం, బియ్యం ధర 30 శాతం పెరుగుతాయన్నది అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఎరువులు, కీటకనాశినులకూ డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మనం ఏటా దాదాపు 9,000 కోట్ల టన్నుల ప్రకృతి వనరులను వినియోగిస్తున్నాం. 2050 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనా. యుద్ధాలు, ప్రకృతి ప్రకోపాలు, ఘర్షణలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆహారం కోసం కటకటలాడే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నది నిపుణుల హెచ్చరిక! క్రమక్షయంతో పెనుముప్పు పంటకు బలమిచ్చే నేల పై పొరలోని మట్టి పలు కారణాల వల్ల కోతకు (క్రమక్షయానికి) గురవుతుందన్నది తెలిసిందే. ఉపరితలం నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవావరణం అత్యధికంగా ఉంటాయి. గత 40 ఏళ్లలో ప్రపంచం మొత్తమ్మీద నేల పై పొరలో 40 శాతం కోతకు గురైందని అంచనా. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందివ్వాలంటే గత 8,000 ఏళ్లలో పండించినంత ఆహారాన్ని వచ్చే 40 ఏళ్లలో పండించాల్సి ఉంటుంది!’ అన్న ‘వరల్డ్ వాడి ఫండ్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ క్లే వ్యాఖ్యలు పొంచి ఉన్న ముప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఏటా మన వృథా రూ. 92 వేల కోట్లు! ప్రపంచవ్యాప్తంగా భారీ పరిమాణంలో ఆహారం వృథా అవుతుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుడిని చేరకుండానే పంటలో మూడో వంతు, చేరాక దాదాపు మరో సగం వృథా అవుతోందన్నది ఐరాస వంటి సంస్థల అంచనా. ‘ద వరల్డ్ కౌంట్స్’’ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తమ్మీద వృథా అయిన ఆహారం ఏకంగా 40.7 కోట్ల టన్నులు! పాశ్చాత్య దేశాల ఆహారపుటలవాట్ల వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రమవుతోందని నిపుణులంటున్నారు. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించే భారత్‌లోనూ ఆహార వృథా తక్కువేమీ కాదు. ఇది ఇళ్లలో కంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా దాదాపు 92 వేల కోట్ల రూపాయల విలువైన ఆహార పదార్థాలు చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. గతేడాది ఫుడ్ వేస్టేజ్ సూచీ లెక్కల ప్రకారం భారతీయులు ఒక్కొక్కరూ రోజుకు 137 గ్రాముల చొప్పున ఏటా దాదాపు 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టగలిగితే ఎందరో అన్నార్తుల కడుపులు నింపొచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆకాంక్ష నెరవేరకపోవడానికి కోతల తరువాత పంటలకు జరుగుతున్న నష్టాలు (పోస్ట్ హార్వెస్టింగ్ లాస్) కూడా ఒక కారణమేనని నీతి ఆయోగ్ సభ్యుడొకరు అన్నారు. నిల్వ, రవాణా సదుపాయాల లేమి వల్ల పాలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి త్వరగా పాడైపోయే ఆహారంలో 20 శాతం దాకా వృథా అవుతోందని, ఆహార శుద్ధి పరిశ్రమలో ఈ నష్టం 32 శాతం దాకా ఉందని అంచనా. (కంచర్ల యాదగిరిరెడ్డి) -
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
వివాదాస్పదం: కట్నం వల్ల ఏడు లాభాలు
సాక్షి, బెంగళూర్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశంతో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. బెంగళూర్‌లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ పాఠ్యాంశమంటూ ఓ వ్యాసం ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఉంది ఏంటంటే.. వరకట్నం తీసుకోవటం వల్ల లాభాలు. బెంగళూరులోని ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందిన సెయింట్ జోసెఫ్ కాలేజీ పేరిట ఈ వ్యాసం విడుదల అయ్యింది. వరకట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలను అక్కడ పాఠ్యాంశంగా వల్లె వేస్తున్నారంట. సోషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా ఈ అంశాలను బోధిస్తున్నారని చెబుతున్నారు. వరకట్నం తీసుకోవడం వల్ల ఉండే 7 ఉపయోగాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. - ఎక్కువ కట్నం ఇవ్వడం వల్ల అందవిహీనంగా ఉన్న అమ్మాయిల పెళ్లి చేయవచ్చు - అందమైన అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశజూపి పెళ్లికి ఒప్పించవచ్చు - కట్నం వల్ల కొత్తగా పెళ్లైన వాళ్లు కలిసి జీవించడానికి కొంత ఆర్థిక సాయంగా ఉంటుంది - మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది - ఎక్కువ కట్నం తెచ్చిన అమ్మాయిని అత్తారింట్లో ఎక్కువ ప్రేమగా చూస్తారు - ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వారి స్థాయిని సమాజం గుర్తిస్తుంది - అమ్మాయికి తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వడం కంటే.. కట్నం ఇచ్చి పంపించేస్తేనే ఉపయోగం ఉంది ఇలా ఆయా అంశాల గురించి అందులో కూలంకశంగా పేర్కొన్నారు. అయితే ఈ పాఠ్యాంశం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న యూనివర్సిటీ అధికారులు.. ఉతన్నస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. తమ కళాశాల ఇలాంటి వాటిని ప్రోత్సహించదని సెయింట్ జోసెఫ్ కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ కిరణ్ జీవన్ చెప్పగా, సోషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ బెరిన్ కూడా ఆ ఆరోపణలను ఖండించారు. 1961 నుంచి భారత దేశంలో వరకట్న నిషేధం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఇంకా అది ఓ దురాచారంగానే కొనసాగుతుండగా.. ప్రభుత్వాలు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఏయూ నియామకాలు సరికాదు
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కొద్దిరోజుల క్రితం జరిగిన మూడు నియామకాలు సరికాదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశా రు. బుధవారం సర్య్కూట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నకుమంత్రి సమాధానమిచ్చారు. ప్రాధమిక విచారణలో ఇది అక్రమమని తేలిందన్నారు. కొద్ది వారాల క్రితం వర్సిటీలో వివిధ పథకాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు అబ్జార్బ్ పేరుతో వర్సిటీలోని సోషల్ వర్క్, సోషియాలజీ, అకడమిక్ స్టాఫ్ కళాశాలలో నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో కమిటీ నియమించి విచారణ జరిపించాలని ఆదేశించారు. కమిటి ప్రాధమిక విచారణలో నియామకాలు తప్పుపట్టిం దన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్.ఏ.డి పాల్‌ను అకడమిక్ స్టాఫ్ కళాశాలలో, డాక్ట ర్ హరనాథ్‌ను సోషల్ వర్క్ విభాగంలో, సార్క్ అధ్యయన కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ శ్రీమన్నారాయణను సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించేశారు. వీటి ని అబ్జార్బ్ చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిపే ఉద్యోగాల భర్తీలో వీటిని ఖాళీలుగా చూ పే అవకాశం ఉండదంటూ వర్సిటీలో దుమా రం రేగింది. ఎటువంటి నోటిఫికేషన్, ఇంట ర్వ్యూలు లేకుండా నియామకాలు జరపడంపై నిరుద్యోగులు సైతం తీవ్ర ఆవేదన చెందారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. ప్రాధమిక విచారణతో తప్పు తేలడంతో వర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే విషయం త్వరలో తేలే అవకాశం ఉంది. విద్యార్థులతో ఆటలొద్దు: గంటా సాక్షి, విశాఖపట్నం : స్థానికత అంశంలో విద్యార్థుల భవిష్యత్తుతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన ప్రభుత్వ అతిథి గృహంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్‌కు ఇది సరికాదని మంత్రి హితవుపలికారు. సినీ పరిశ్రమ విశాఖ వచ్చేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ ఒకరిద్దరి అభిప్రాయమో కాకుండా సినీ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధుల సలహా, సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు తెలపారు. బీఈడీ, డీఎడ్ చదువుతోన్న తాజా అభ్యర్థులకు అవకాశం కల్పించడంపై న్యాయపరమైన అంశాల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రంగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని, విద్యాశాఖలోనే 62 శాతం సిబ్బంది లోటున్నట్టు లెక్కలు చెప్తున్నాయన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసమే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని, వారికి నష్టం కలగని రీతిలోనే తవ్వకాలు చేపడతారన్నారు. గిరిజనులు వ్యతిరేకిస్తే బాక్సైట్ తవ్వకాల్ని నిలిపేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. -
సోషియాలజీ కోర్సుతో అవకాశాలు...
ఆస్ట్రో ఫిజిక్స్ కోర్సులు చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -విజయ్, ఆదిలాబాద్. ఆస్ట్రోఫిజిక్స్.. ఖగోళ శాస్త్రంలోని ఒక భాగం. నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కులు, గెలాక్సీలు వంటి ఖగోళ పదార్థాల భౌతిక లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రోఫిజిక్స్. ఇందులో ఖగోళ పరంగా సేకరించిన డేటాను ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించి విశ్లేషిస్తారు. ఈ కోర్సును ఎంపిక చేసుకున్న వారికి పరిశోధన -బోధన ప్రధానంగా అవకాశాలు ఉంటాయి. ఏరోస్పేస్ కంపెనీలు, శాటిలైట్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు, వివిధ పరిశోధన సంస్థలు, సైన్స్ సెంటర్లు, టెలిస్కోప్ తయారీ సంస్థలు, ప్లానెటోరియంలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఇస్రో, డీఆర్డీవో వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఆస్ట్రోఫిజిక్స్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. స్పేస్ లేబొరేటరీస్/స్పేస్ మిషన్లలో డేటా విశ్లేషణ సంబంధిత విధుల్లో అసిస్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు. ఉన్నత విద్యా విషయానికొస్తే దేశ, విదేశాల్లో పలు ఇన్స్టిట్యూట్లు పోస్ట్‌డాక్టోరల్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఎన్నో రకాల నూతన సబ్జెక్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -ప్రవీణ్, కరీంనగర్. బయోటెక్నాలజీ అనువర్తనాలను వివిధ రంగాల్లో వినియోగిస్తారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, యానిమల్ సెన్సైస్, హార్టికల్చర్, హెల్త్‌కేర్ వంటి వాటిల్లో కొన్ని. బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: - ఐఐటీ -ఖరగ్‌పూర్; వెబ్సైట్: www.iit-kgp.ac.in - జేఎన్టీయూ-హైదరాబాద్ వెబ్సైట్: http://jntuh.ac.in - ఐఐఐటీ-హైదరాబాద్ వెబ్సైట్: http://biotech.iith.ac.in - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in - వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)-వెల్లూరు వెబ్సైట్: www.vit.ac.in ఫార్మసీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులేవి? -బాలరాజ్, మహబూబ్‌నగర్. ఔషధాల తయారీ సంబంధిత అంశాలను బోధించే శాస్త్రం ఫార్మసీ. ఫార్మసీకి సంబంధించి ప్రధానంగా మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ), బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ (బీఫార్మసీ), ఫార్మ్-డి. ఈ మూడు కోర్సుల్లో చేరాలంటే కావల్సిన అర్హత-ఇంటర్మీడియెట్ (బైపీసీ, ఎంపీసీ). వీటిల్లో డీఫార్మసీ కోర్సులో ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో మాత్రం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు. డీఫార్మసీ విద్యార్థులు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాయడం ద్వారా బీఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఇటువంటి విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ స్కీమ్ విధానంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ తర్వాత ఆసక్తి ఉంటే ఎంఫార్మసీ చేయవచ్చు. జాతీయ స్థాయి కళాశాల్లో ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందాలంటే జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)కు హాజరు కావాలి. రాష్ట్ర స్థాయిలోనైతే పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాయాలి. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన తర్వాత అర్హతలు, అనుభవం ఆధారంగా సూపర్వైజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ తదితర హోదాల్లో స్థిరపడొచ్చు. డ్రగ్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, బయోటెక్నాలజీ, కెమికల్ పరిశ్రలు, హాస్పిటల్స్ వీరికి ఉపాధి వేదికలుగా ఉంటాయి. సోషియాలజీ కోర్సును చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -మణి, జడ్చర్ల. ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ. మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ట్రైబల్ డెవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను దక్కించుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకోవడానికి.. ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. -
సమాజానికే కాదు.. కెరీర్‌కూ కొండంత అండగా...!
జాతి ఏదైనా.. సంస్కృతి మరేదైనా.. ప్రజల్ని పట్టిపీడించే సమస్యలు చాలానే! ఆ సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కడమెలాగో తెలియని వారు కోకొల్లలు.. ఇలాంటి నేపథ్యం ఉన్నవారు జన భారతంలో మరింత ఎక్కువ. ఇలాంటి వారికి ఆపన్నహస్తం అందించేందుకు అవకాశం కల్పించే కోర్సు.. సోషియాలజీ. సంప్రదాయ కోర్సుల్లో క్రేజీ కోర్సుగా నిలుస్తున్న ‘సోషియాలజీ’పై ఫోకస్.. ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ! సోషియాలజీ.. సోషల్ వర్క్‌తో సమానంగా అవకాశాలు కల్పిస్తోంది. గత అయిదారేళ్ల కాలంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో నిపుణుల అవసరం పెరగడంతో యువత సోషియాలజీ వైపు అడుగులు వేస్తోంది.. -విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు సోషియాలజీ- అకడెమిక్ కోర్సులు: మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. వివిధ విద్యా సంస్థలు సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ఉన్నత సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఉన్నత కెరీర్‌కు రాచ మార్గం: సోషియాలజీలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అవకాశాలున్నాయి. ఉమెన్ డవలప్మెంట్, రూరల్ డవలప్మెంట్, ట్రైబల్ డవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల్లోని ఎన్నో పరిశోధన సంస్థలు పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. పీహెచ్డీ పూర్తిచేసి అకడమిక్‌తో పాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. ఐఐటీల్లోనూ.. ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు.. సాధారణంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులకు కేరాఫ్‌గా నిలిచే సంస్థలు. కానీ, ఇవి ఇప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా సోషల్ సెన్సైస్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) అందిస్తున్నాయి. అవి.. ఐఐటీ-కాన్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-ఢిల్లీ; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ- ఖరగ్‌పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-గువహటి; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. ఐఐటీ-బాంబే; కోర్సులు: పీజీ, పీహెచ్డీ. జాతీయ స్థాయిలో కోర్సులను అందించే సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) యూనివర్సిటీ ఆఫ్ పుణె (ఎంఏ) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) పుదుచ్చేరి యూనివర్సిటీ (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) ఇగ్నో సహా మరెన్నో యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో సోషియాలజీలో బ్యాచిలర్ నుంచి పీహెచ్డీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి. అవకాశాలు అపారం: ఒకప్పుడు సంప్రదాయ కోర్సుగా నిలిచిన సోషియాలజీ ఇప్పుడు కార్పొరేట్ రూపును సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అవకాశాల పరంగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల భరోసా! సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన వేదికలు.. అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలు. స్వచ్ఛంద సంస్థల్లో అడుగు పెట్టడం. కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు. ప్రభుత్వ పథకాల్లో అవకాశాలు. చిన్న పరిశ్రమల్లో మానవ వనరుల విభాగాలు. వీటిలో ప్రధానమైనవి.. స్వచ్ఛంద సంస్థలు. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల్లో జండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, యూనివర్సల్ హెల్త్ వంటి అంశాలను చేర్చిన నేపథ్యంలో ఇవి సోషియాలజీ ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు. స్వయం ఉపాధికి ఊతం: సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. ఇలా గంటకు రూ. వేయి నుంచి రూ.5 వేల వరకు ఫీజు పొందుతున్న వారూ ఉన్నారు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సివిల్ సర్వీస్‌లో అనుకూల ఆప్షనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష. సివిల్స్ మెయిన్స్ కోసం సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది నిపుణుల మాట. సిలబస్ పరిధి కాసింత తక్కువగా ఉండటం, సిలబస్‌లోని అంశాలన్నీ సమాజంతో ముడిపడి ఉండటం, సులభంగా అర్థమయ్యేలా ఉండటమే దీనికి కారణమంటున్నారు. అవసరమైన నైపుణ్యాలు: విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కాగల నేర్పు. ఎదుటి వారి సమస్యలను వినే ఓర్పు. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగలగడం. నిరంతర అవగాహన అవసరం సోషియాలజీ ఉత్తీర్ణులకు ఇప్పుడు కెరీర్ అవకాశాలు అద్భుతమని చెప్పొచ్చు. ఒకసారి కెరీర్ ప్రస్థానం ప్రారంభించాక నిరంతరం సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు; విభిన్న జాతులు, సంస్కృతుల్లో మార్పులు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనే విధంగా అధ్యయనం సాగించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరిక్యులంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. సోషియాలజీ కెరీర్లో అడుగుపెట్టిన వారిలో తాము ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్న నిబద్ధత ఉంటే ఈ రంగంలో సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. -ప్రొఫెసర్ పుష్ప మేరి రాణి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సోషియాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ. సోషియాలజీ ఉపాధికి వేదిక సోషియాలజీ, సోషల్ వర్క్.. ఈ రెండూ సోషల్ సెన్సైస్ విభాగాలే. అయితే సోషియాలజీ సమాజ సంబంధిత అంశాలు, సమస్యలపై అవగాహన కల్పిస్తే.. సోషల్ వర్క్‌లో క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక విధంగా ఈ రెండు కోర్సుల ఉద్దేశం ఒకటే. కాబట్టి సోషియాలజీ అభ్యర్థులు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో సోషల్ వర్క్‌పై కూడా అవగాహన పెంచుకుంటే మరిన్ని అవకాశాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాల రీత్యా ఈ రంగాల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం వేలల్లో ఉంటుంది. కానీ, అందుకు తగిన స్థాయిలో విద్యార్థులు అందుబాటులో లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాలను కూడా చక్కటి ఉపాధి వేదికలుగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం. ఎం.వి. రామిరెడ్డి, హెడ్- ఆపరేషన్స్, రామ్కీ ఫౌండేషన్