ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గల కారణం మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, జానపద రీతులు భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండటమే. వీటి గురించి తెలిపేదే సామాజిక శాస్త్రం (సోషియాలజీ). సమాజ పరిణామ దశలనూ, సమాజంలోని మానవ సంబంధాలనూ, సమాజ మనుగడనూ; ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలనూ ఇది వివరిస్తుంది. సమాజ మనుగడ సక్రమంగా, సరైన రీతిలో కొనసాగాలంటే సమాజం లోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీ కరణ, సామాజికీకరణ, స్తరీకరణ ఏవిధంగా ఉండాలో తెలుపుతుంది.
ప్రపంచీకరణలో భాగంగా జరిగే పాశ్చాత్యీకరణ మూలంగా క్రమేణా మన దేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి మార్పులకు గురవుతున్నాయి. అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సైతం సమాజ శాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరవవుతోంది. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో సామాజిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా దాదాపు కనుమరుగై పోయింది. కేవలం కొన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుగానే ఇది అందుబాటులో ఉంది. (క్లిక్: 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?)
గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరిరక్షించడానికీ తోడ్పడుతుంది. అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేక పోలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశ పెట్టి, సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. (క్లిక్: ఒక కొత్త వ్యవస్థ అవసరం)
– డాక్టర్ పోలం సైదులు ముదిరాజ్
తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment