సోషియాలజీ కోర్సుతో అవకాశాలు... | Opportunities galore with Socialogy case | Sakshi
Sakshi News home page

సోషియాలజీ కోర్సుతో అవకాశాలు...

Published Thu, Jun 19 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

Opportunities galore with Socialogy case

ఆస్ట్రో ఫిజిక్స్ కోర్సులు చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి?    
-విజయ్, ఆదిలాబాద్.
 ఆస్ట్రోఫిజిక్స్.. ఖగోళ శాస్త్రంలోని ఒక భాగం. నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కులు, గెలాక్సీలు వంటి ఖగోళ పదార్థాల భౌతిక లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రోఫిజిక్స్. ఇందులో ఖగోళ పరంగా సేకరించిన డేటాను ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించి విశ్లేషిస్తారు. ఈ కోర్సును ఎంపిక చేసుకున్న వారికి పరిశోధన -బోధన ప్రధానంగా అవకాశాలు ఉంటాయి. ఏరోస్పేస్ కంపెనీలు, శాటిలైట్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు, వివిధ పరిశోధన సంస్థలు, సైన్స్ సెంటర్లు, టెలిస్కోప్ తయారీ సంస్థలు, ప్లానెటోరియంలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఇస్రో, డీఆర్‌డీవో వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఆస్ట్రోఫిజిక్స్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. స్పేస్ లేబొరేటరీస్/స్పేస్ మిషన్లలో డేటా విశ్లేషణ సంబంధిత విధుల్లో అసిస్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు. ఉన్నత విద్యా విషయానికొస్తే దేశ, విదేశాల్లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు పోస్ట్‌డాక్టోరల్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఎన్నో రకాల నూతన సబ్జెక్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి.
 
 బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?    -ప్రవీణ్, కరీంనగర్.
 బయోటెక్నాలజీ అనువర్తనాలను వివిధ రంగాల్లో వినియోగిస్తారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్‌మెంట్, వేస్ట్ మేనేజ్‌మెంట్, యానిమల్ సెన్సైస్, హార్టికల్చర్, హెల్త్‌కేర్ వంటి వాటిల్లో కొన్ని.
 బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 -    ఐఐటీ -ఖరగ్‌పూర్; వెబ్‌సైట్: www.iit-kgp.ac.in
 -    జేఎన్‌టీయూ-హైదరాబాద్
     వెబ్‌సైట్: http://jntuh.ac.in
 -    ఐఐఐటీ-హైదరాబాద్
     వెబ్‌సైట్: http://biotech.iith.ac.in
 -    యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
     వెబ్‌సైట్: www.uohyd.ac.in
 -    వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)-వెల్లూరు
     వెబ్‌సైట్: www.vit.ac.in
 
 ఫార్మసీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులేవి?
 -బాలరాజ్, మహబూబ్‌నగర్.
 ఔషధాల తయారీ సంబంధిత అంశాలను బోధించే శాస్త్రం ఫార్మసీ. ఫార్మసీకి సంబంధించి ప్రధానంగా మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ), బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ (బీఫార్మసీ), ఫార్మ్-డి. ఈ మూడు కోర్సుల్లో చేరాలంటే కావల్సిన అర్హత-ఇంటర్మీడియెట్ (బైపీసీ, ఎంపీసీ). వీటిల్లో డీఫార్మసీ కోర్సులో ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో మాత్రం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు. డీఫార్మసీ విద్యార్థులు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాయడం ద్వారా బీఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఇటువంటి విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ స్కీమ్ విధానంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ తర్వాత ఆసక్తి ఉంటే ఎంఫార్మసీ చేయవచ్చు. జాతీయ స్థాయి కళాశాల్లో ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందాలంటే జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)కు హాజరు కావాలి. రాష్ట్ర స్థాయిలోనైతే పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాయాలి.
 
 ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన తర్వాత అర్హతలు, అనుభవం ఆధారంగా సూపర్‌వైజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫార్మసిస్ట్ తదితర హోదాల్లో స్థిరపడొచ్చు. డ్రగ్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, బయోటెక్నాలజీ, కెమికల్ పరిశ్రలు, హాస్పిటల్స్ వీరికి ఉపాధి వేదికలుగా ఉంటాయి.
 
 సోషియాలజీ కోర్సును చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
     -మణి, జడ్చర్ల.
 ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ. మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను దక్కించుకోవచ్చు.
 
 సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకోవడానికి.. ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement