Astrophysics
-
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్‌హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్‌లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్‌లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్‌లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!
తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉగాది (ఏప్రిల్ 3) రోజున ఆకాశం నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిండి, కోటపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను తమ స్మార్ట్ఫోన్లలో బంధిస్తూ తెగ సంబరపడిపోయారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆకస్మాత్తుగా ఆకాశం నుంచి నేలరాలిన ఉల్కపాతంపై ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను తెలియజేశారు. అవి ఉల్కలు కాదు...! ఏప్రిల్ 2న ఆకాశంలో వెలుగులు విరజిమ్ముత్తూ కన్పించినవి ఉల్కలు కాదని ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు నిర్ధారించారు. సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఈ ఉల్కాపాతంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ ఆకాశం నుంచి నేల రాలిన వస్తువులు ఉల్కలు కాదని అవి గతంతో డ్రాగన్ కంట్రీ చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R — ANI (@ANI) April 2, 2022 చైనా ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన చాంగ్ జెంగ్ 3B సీరియల్ నంబర్ Y77 రాకెట్ మూడవ దశ భాగాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై నాగ్‌పూర్‌కు చెందిన స్కైవాచ్ గ్రూప్ ప్రెసిడెంట్ సురేష్ చోపడే కూడా స్పందించారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో కన్పించినా ఈ అరుదైన దృశ్యాలు ఉల్కలు కాదంటూ పేర్కొన్నారు. అవి శాటిలైట్‌కు సంబంధించిన గ్రహశకలాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో శాటిలైట్‌కు సంబంధించిన భారీ శకలాలు పడి ఉన్నట్లు గమనార్హం. I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 - it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK — Jonathan McDowell (@planet4589) April 2, 2022 చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం..! -
భళా భరద్వాజ్.. అమెరికాలో తెలుగు విద్యార్థి అద్భుత ప్రతిభ
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆణిముత్యం ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు సాధించి మాతృదేశం గర్వించేలా పేరు తెచ్చుకున్నాడు. అతనే విశాఖ జిల్లా సీలేరులోని ఏపీ జెన్కో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ కామేశ్వర శర్మ కుమారుడు భరద్వాజ్. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ యూఎంకేసీలో నిర్వహించిన అర్హత పరీక్షలో భరద్వాజ్ ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు శాస్త్ర పరిశోధనలు చేశాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరద్వాజ్ పరిశోధనలు చేశాడు. దీంతో ఖగోళ భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమ కుమారుడి పరిశోధనలకు వచ్చిన గుర్తింపుపై సోమవారం భరద్వాజ్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రంతో భరద్వాజ్ ఖగోళ భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి డాక్టరేట్ ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన వ్యక్తి భరద్వాజ్ అని వారు తెలిపారు. తమ కుమారుడి కృషివెనుక ప్రొఫెసర్ డానియేల్ మాకింటోస్, మార్క్ బ్రాడ్‌విన్ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ పరిశోధనల సమయంలో ఎనిమిది సంస్థల నుంచి ఉపకార వేతనాలు లభించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్ కొనసాగిస్తున్న మరో పరిశోధనకు అమెరికాలోని నాసా ఉపకార వేతనం కూడా అందించనుందన్నారు. భరద్వాజ్ పరిశోధనలు మెచ్చి 2018లో అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ స్వర్ణ పతకం అందజేసిందని, భారత్‌కు తిరిగొచ్చి దేశంలోని విద్యార్థులకు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా చేయడమే అతని ధ్యేయమన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోస్టు డాక్టరేట్ కూడా చేయనున్నట్లు తెలిపారు. పరిశోధనల అనంతరం స్వదేశానికి వచ్చిన భరద్వాజ్‌తో తల్లిదండ్రులు, సోదరి -
జీవం పుట్టుకకు దారేదీ?
భూమ్మీద జీవం ఎలా పుట్టింది? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. సముద్రపు అడుగున పుట్టిందని కొందరు. అగ్నిపర్వత బిలాల్లోంచి ఆవిర్భవించిందని ఇంకొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. సుమారు 370 నుంచి 450 కోట్ల ఏళ్ల కింద ఆకాశం నుంచి కొన్ని ఉల్కల ముక్కలు వెచ్చటి, చిన్నసైజు నీటి కుంటల్లోకి పడటం జీవం పుట్టుకకు కారణమైందని తాజాగా మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై సముద్రాల మధ్య ఖండాలు ఏర్పడుతున్న సమయంలోనే భూమ్మీద జీవం ఏర్పడింది. ఉల్కా శకలాలతో పాటు మౌలిక పోషకాలు చేరడంతో ముందుగా తనంతట తాను పునరుత్పత్తి చేసుకోగల ఆర్ఎన్ఏ ఏర్పడిందని.. ఇది తర్వాతి కాలంలో జీవం ఆవిర్భవానికి దారితీసిందని కె.డి.పియర్స్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రంతో పాటు భూగర్భ, రసాయ, జీవ శాస్త్రాలన్నింటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నారు. వెచ్చటి కుంటల్లోని నీరు ఆవిరి కావడం, మళ్లీ నీరు చేరడం వంటి సహజ ప్రక్రియల వల్ల ఉల్కా శకలాల ద్వారా నీటిలోకి చేరిన రసాయనాలు ఒకదానితో ఒకటి బంధం ఏర్పరచుకునేందుకు వీలేర్పడిందని తెలిపారు. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని ఆర్ఎన్ఏలు పరిస రాల్లోని పోషకాలను గ్రహించి మరిన్ని ఆర్ఎన్ఏలను ఉత్పత్తి చేయగలిగాయన్నారు. -
విశ్వ తరంగాలు.. గురుత్వ తరంగాలు..
నిశ్చలంగా ఉన్న నీటిపైకి ఓ రబ్బరు బంతి విసిరితే ఏమవుతుంది? పడిన చోట బంతి చుట్టూ అలలు ఏర్పడి కొంత దూరం విస్తరిస్తాయి! ఇది మనందరికీ అనుభవమే. ఇప్పుడు నీటి స్థానంలో విశ్వం మొత్తం వ్యాపించి ఉండే అంతరిక్ష కాలాలను (స్పేస్ టైమ్) ఊహించుకోండి. భూమి, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులు రబ్బరు బంతులు అనుకుందాం. వీటి కదలికల వల్ల కూడా స్పేస్‌టైమ్‌లో అలల్లాంటివి ఏర్పడతాయని.. వీటిని గురుత్వ తరంగాలు అంటారని ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్ల కిందటే ప్రతిపాదించారు. ఖగోళ వస్తువు బరువు ఎక్కువయ్యే కొద్దీ ఈ తరంగాల పరిమాణమూ పెరుగుతుంది. ఈ గురుత్వ తరంగాలను ప్రత్యక్షంగా గమనించేందుకు ప్రయోగాలు జరిపి విజయం సాధించినందుకు రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్ అనే ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. ఈ గురుత్వ తరంగాలు అంటే ఏంటి.. అసలు ఇవి ఎలా ఏర్పడతాయి.. వాటి పుట్టుపూర్వోత్తరాలపై ప్రత్యేక కథనం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంత ప్రాముఖ్యం ఎందుకు? గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించగలిగితే ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సుదూర నక్షత్రాలు, పాలపుంతలు, కృష్ణ బిలాల తాలూకు వివరాలను ఆయా ఖగోళ వస్తువులు సృష్టించే గురుత్వ తరంగాల సైజును బట్టి నిర్ధారించవచ్చు. లిగో ద్వారా గుర్తించిన గురుత్వ తరంగాలు విశ్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఏర్పడినవి కాబట్టి.. వీటి ఆధారంగా విశ్వం విస్తరిస్తోందా.. ఎంత వేగంతో విస్తరిస్తోంది.. వంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఎలా గుర్తించారు? 1974లో తొలిసారి ఈ గురుత్వ తరంగాలను పరోక్షంగా గుర్తించారు. ఒక న్యూట్రాన్ స్టార్ జంట ఓ భారీ ద్రవ్యరాశి చుట్టూ తిరుగుతూ.. క్రమేపీ చిన్నగా మారుతుండటం.. గురుత్వ తరంగాల ద్వారా కోల్పోయే శక్తికి తగ్గట్లు వాటి సైజు తగ్గుతుండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. గురుత్వ తరంగాల ఉనికికి ఇది పరోక్ష నిదర్శనమని తెలిపిన ఈ ప్రయోగాలకు 1993లో నోబెల్ అవార్డు దక్కింది. ఆ తర్వాత అమెరికాలో లిగో పేరుతో, ఇటలీలో విర్గో పేరుతో గురుత్వ తరంగాలను గుర్తించేందుకు రెండు ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. సుదూర ప్రయాణంలో గురుత్వ తరంగాల్లో వచ్చే సూక్ష్మమైన మార్పులను గుర్తిస్తుంది. ఒక లేజర్ కిరణాన్ని రెండుగా విడగొట్టి.. రెండు వైపులకు పంపించడం.. ఆ వైపున ఉన్న అద్దాల ద్వారా వీటిని మళ్లీ ఒక చోట(రెండుగా విడగొట్టిన చోటు)కు చేర్చడం ఈ ప్రయోగంలో జరిగే తంతు. రెండు లేజర్ కిరణాలు ఏకమయ్యే చోట ఆ కాంతి తాలూకు తరంగాలను గుర్తిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వ్యతిరేక దిశల్లో ప్రయాణించే లేజర్ కిరణాలు ఏకమై ఎలాంటి సంకేతాలను చూపవు. గురుత్వ తరంగాల సమక్షంలో మాత్రం కొంచెం తేడాలు వస్తాయి. ఈ తేడాల ఆధారంగా గురుత్వ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నిర్ధారించారు. వేటితో సంబంధం లేకుండా.. ఈ గురుత్వ తరంగాలు విశ్వంలో ఎక్కడ పుట్టినా ఏ రకమైన పదార్థంతోనూ సంబంధం లేకుండా ప్రవహిస్తుంటాయి. పైగా చాలా సూక్ష్మంగా ఉంటాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని ప్రత్యక్షంగా గుర్తించలేమని ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తే వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణబిలాల జంటను తీసుకుందాం. స్పేస్‌టైమ్‌లో ఇవి సృష్టించే గురుత్వ తరంగాలు.. భూమ్మీద 10 లక్షల కిలోమీటర్ల దూరాన్ని పరమాణు స్థాయికి తగ్గించేంత చిన్నగా ఉంటాయి. అయితే సుమారు 1,380 కోట్ల ఏళ్ల కింద రెండు భారీ కృష్ణబిలాలు ఢీ కొనడంతో అతిపెద్ద గురుత్వ తరంగాలు ఏర్పడ్డాయి. ఈ తరంగాలు విశ్వంలో అన్నివైపులా ప్రయాణిస్తుండగా 2015లో అమెరికాలో ఏర్పాటు చేసిన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గురుత్వ’ప్రయోగాలకు నోబెల్ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లను వరించిన అత్యున్నత పురస్కారం స్టాక్‌హోం: గురుత్వ తరంగాల ఉనికిని గుర్తించి నందుకుగాను అమెరికాకు చెందిన ముగ్గురు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలైన రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లను నోబెల్ అవార్డు వరిం చింది. తన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఈ గురుత్వ తరంగాల గురించి వందేళ్ల కిందటే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదిం చారు. ఇవి కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడం వంటి పరిణామాలు జరగడం వల్ల ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లోనే వీటిని తొలిసారిగా గుర్తించినప్పటికీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. వీటిని గుర్తించేందుకు యూఎస్‌లోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)ను థోర్న్, వీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడ్డ గురుత్వ తరం గాలను వీరు తొలిసారిగా ప్రత్యక్షంగా గుర్తించ గలిగారు. ‘ఈ తరంగాలు భూమికి చేరేసరికి చాలా బలహీనమైపోతాయి. అయినా వాటిని గుర్తించడం ఖగోళ భౌతిక శాస్త్రంలో ఓ సంచల నం’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెడ్ గోరాన్ హన్సన్ అన్నారు. ఈ అంతు చిక్కని తరంగాలను 2015 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గుర్తించగలిగారు. రెండు సార్లు ‘లిగో’ ను, ఇంకోసారి ఇటలీలో యురోపియన్ గ్రావి టేషనల్ అబ్జర్వేటరీ (విర్గో)ను ఉపయోగిం చారు. కృష్ణ బిలాలు ఎటువంటి కాంతినీ వెదజల్లవు. వీటిని కేవలం గురుత్వ తరంగాల ఆధారంగానే గుర్తించే వీలు కలుగుతుంది. -
ప్రఖ్యాత శాస్త్రవేత్త యశ్ పాల్ కన్నుమూత
నోయిడా: ప్రఖ్యాత శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మాజీ అధ్యక్షుడు ప్రొ. యశ్ పాల్ (90) కన్నుమూశారు. నోయిడాలోని తన నివాసంలో నిన్న (సోమవారం) ఆయన మరణించారు. కొన్నేళ్ల క్రితం యశ్పాల్ క్యాన్సర్ బారిన పడి అనంతరం చికిత్స ద్వారా కోలుకున్నారు. యశ్ పాల్ 1926లో పాకిస్తాన్‌లోని ఝాంగ్లో జన్మించారు. హర్యానాలోని పాయ్లో పెరిగిన ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే 1958 లో మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ డిగ్రీ పొందారు. పాల్ విజ్ఞాన రంగం, కాస్మిక్ కిరణాల అధ్యయనం, అధిక శక్తి భౌతిక శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం మరియు అభివృద్ధిపై గణనీయమైన కృషి చేశారు. ఆయన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 1976లో పద్మభూషణ్, 2013లో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేసింది. యశ్ పాల్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం జరగనున్నాయిన. -
సోషియాలజీ కోర్సుతో అవకాశాలు...
ఆస్ట్రో ఫిజిక్స్ కోర్సులు చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -విజయ్, ఆదిలాబాద్. ఆస్ట్రోఫిజిక్స్.. ఖగోళ శాస్త్రంలోని ఒక భాగం. నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కులు, గెలాక్సీలు వంటి ఖగోళ పదార్థాల భౌతిక లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం ఆస్ట్రోఫిజిక్స్. ఇందులో ఖగోళ పరంగా సేకరించిన డేటాను ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించి విశ్లేషిస్తారు. ఈ కోర్సును ఎంపిక చేసుకున్న వారికి పరిశోధన -బోధన ప్రధానంగా అవకాశాలు ఉంటాయి. ఏరోస్పేస్ కంపెనీలు, శాటిలైట్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు, వివిధ పరిశోధన సంస్థలు, సైన్స్ సెంటర్లు, టెలిస్కోప్ తయారీ సంస్థలు, ప్లానెటోరియంలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఇస్రో, డీఆర్డీవో వంటి ప్రభుత్వ సంస్థల్లో కూడా ఆస్ట్రోఫిజిక్స్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. స్పేస్ లేబొరేటరీస్/స్పేస్ మిషన్లలో డేటా విశ్లేషణ సంబంధిత విధుల్లో అసిస్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు. ఉన్నత విద్యా విషయానికొస్తే దేశ, విదేశాల్లో పలు ఇన్స్టిట్యూట్లు పోస్ట్‌డాక్టోరల్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఎన్నో రకాల నూతన సబ్జెక్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -ప్రవీణ్, కరీంనగర్. బయోటెక్నాలజీ అనువర్తనాలను వివిధ రంగాల్లో వినియోగిస్తారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, యానిమల్ సెన్సైస్, హార్టికల్చర్, హెల్త్‌కేర్ వంటి వాటిల్లో కొన్ని. బయోటెక్నాలజీలో పీజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: - ఐఐటీ -ఖరగ్‌పూర్; వెబ్సైట్: www.iit-kgp.ac.in - జేఎన్టీయూ-హైదరాబాద్ వెబ్సైట్: http://jntuh.ac.in - ఐఐఐటీ-హైదరాబాద్ వెబ్సైట్: http://biotech.iith.ac.in - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in - వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)-వెల్లూరు వెబ్సైట్: www.vit.ac.in ఫార్మసీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులేవి? -బాలరాజ్, మహబూబ్‌నగర్. ఔషధాల తయారీ సంబంధిత అంశాలను బోధించే శాస్త్రం ఫార్మసీ. ఫార్మసీకి సంబంధించి ప్రధానంగా మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీఫార్మసీ), బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ (బీఫార్మసీ), ఫార్మ్-డి. ఈ మూడు కోర్సుల్లో చేరాలంటే కావల్సిన అర్హత-ఇంటర్మీడియెట్ (బైపీసీ, ఎంపీసీ). వీటిల్లో డీఫార్మసీ కోర్సులో ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో మాత్రం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు 50 శాతం సీట్ల చొప్పున కేటాయిస్తారు. డీఫార్మసీ విద్యార్థులు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాయడం ద్వారా బీఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఇటువంటి విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ స్కీమ్ విధానంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. బీఫార్మసీ తర్వాత ఆసక్తి ఉంటే ఎంఫార్మసీ చేయవచ్చు. జాతీయ స్థాయి కళాశాల్లో ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందాలంటే జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)కు హాజరు కావాలి. రాష్ట్ర స్థాయిలోనైతే పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష రాయాలి. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన తర్వాత అర్హతలు, అనుభవం ఆధారంగా సూపర్వైజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ తదితర హోదాల్లో స్థిరపడొచ్చు. డ్రగ్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, బయోటెక్నాలజీ, కెమికల్ పరిశ్రలు, హాస్పిటల్స్ వీరికి ఉపాధి వేదికలుగా ఉంటాయి. సోషియాలజీ కోర్సును చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -మణి, జడ్చర్ల. ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ. మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ట్రైబల్ డెవలప్మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను దక్కించుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకోవడానికి.. ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు.