ఆకలి భారతం పట్టదా మోదీ?
Published Thu, Oct 20 2016 2:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
ప్రపంచంలో 2020 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందని మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కలగన్నారు. సూపర్ పవర్ మాట ఏమోగానీ, 2020 నాటికి ఆకలితో అలమటిస్తున్న బాలభారతం అసువులు బాయకపోతే అదే పదివేలని ప్రార్థించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఆకలిని అధిగమించడంలో భారత్ బాగా వెనకబడి పోయిందని, ఆకలిపై పోరాడుతున్న దేశాల్లో భారత్ 97 స్థానంలో నిలిచిందని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' తాజా నివేదికలో వెల్లడించింది.
ఆకలి పోరాటంలో కెన్యా, మలావి లాంటి వెనకబడిన దేశాలకన్నా, యుద్ధాలతో రగిలిపోతున్న ఇరాక్ కన్నా భారత్ వెనకబడిపోవడం అవమానకర విషయం. నేపాల్, బంగ్లా, చైనా, శ్రీలంక, మయన్మార్ లాంటి పొరుగుదేశాలకన్నా వెనకబడిపోయామంటే మింగుడుపడని అంశమే. ఈ విషయంలో మనం శ్రీలంక కన్నా ఒక్క శాతమైనా ముందుకు వెళ్లాలంటే 2016లో పుట్టిన 9 లక్షల మంది పిల్లల్లో ఒక్కరు కూడా చనిపోకుండా వారిని 2021 నాటి వరకు కాపాడుకోవాలి. భారత్‌లో ప్రస్తుతం 35 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో 15 శాతం మంది పిల్లలు కనీస ఆహారం అందక ఆకలితో అల్లాడిపోతున్నారు. వారిలో ప్రతి 20 మందిలో ఒకరు ఐదేళ్లలోపు మరణించే ప్రమాదం ఉంది.
రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మురిసిపోయే నాయకులు ఆహారం, ఆకలి, పౌష్టికాహార లోపం అంశాల గురించి ఎన్నడూ మాట్లాడరు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, దేశ భద్రత, కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి, ఉద్యోగాలు, మార్పు అన్న అంశాలను ప్రస్తావించారు తప్ప ఆకలి, ఆహారం గురించి మాట వరుసకు కూడా మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రపంచ దేశాలు పర్యటిస్తున్నారు తప్ప బాలభారతం ఎదుర్కొంటున్న ఆకలి సమస్య గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు.
మధ్యతరగతి, అగ్రవర్ణాల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ నాయకులకు ఆకలి సమస్య ఎందుకు పట్టడం లేదు? ఆకలి, పౌష్టికాహార లోపం వల్ల మరణిస్తున్న పిల్లలు ఎక్కువ మంది దళితులు, ఆదిమవాసులే కావడమే అందుకు కారణమేమో! 2011 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు లేదా ప్రశ్నలు కేవలం 3 శాతం మాత్రమే పిల్లలకు సంబంధించినవంటే వారికిస్తున్న ప్రాధాన్యమెంతో అర్థం చేసుకోవచ్చు. పౌష్టికాహార లోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్య అగ్రవర్ణాల కన్నా దళితుల్లో 53 శాతం ఎక్కువగా ఉండగా, ఆదివాసీల్లో 35 శాతం ఎక్కువగా ఉంది.
పేద, దళితవర్గాల సమస్యను రాజకీయ పెద్దలతోపాటు మీడియా కూడా పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. 300 మీడియా సంస్థల నిర్ణేతల్లో ఒక్క శాతానికి మంచి దళితులు గానీ ఆదివాసీలుగా నీ లేకపోవడమే అందుకు కారణమా? ఏదేమైనా మరో ఐదేళ్ల వరకు, అంటే 2021 సంవత్సరం వరకు ఆకలిపై పోరాటంలో భారత్ అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా కనిపించడం లేదని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' అభిప్రాయపడింది.
Advertisement
Advertisement