న్యూఢిల్లీ: భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఏకంగా ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకు గాను భారత్ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. చైల్డ్ వేస్టింగ్ రేటులో (పోషకాహార లోపంతో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించాయి.
నివేదిక ఏం చెప్పిందంటే...
► 2021లో ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలకు గాను భారత్ 101వస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 121 దేశాల్లో 107 ర్యాంకుకి చేరుకుంది. 2020లో భారత్ 94వ స్థానంలో ఉంది.
► జీహెచ్‌ఐ స్కోర్ తగ్గుతూ వస్తోంది.. 2000 సంవత్సరంలో 38.8 ఉన్న స్కోర్ 2014–2022లలో 28.2–29.1 మధ్య ఉంటూ వస్తోంది.
► ఆసియా దేశాల్లో యుద్ధంతో అతాలకుతలమవుతున్న అఫ్గానిస్తాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన కంటే వెనుకబడి ఉంది. జీహెచ్‌ఐ స్కోరు అయిదు కంటే తక్కువగా ఉన్న దాదాపుగా 17 దేశాలు తొలి పది స్థానాల్లో నిలిచాయి. చైనా, కువైట్‌లు తొలి స్థానాలను దక్కించుకున్నాయి.
► ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84), నేపాల్ (81), శ్రీలంక (64) మన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి
► చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్ (పౌష్టికహార లోపంతో అయిదేళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలు) రేటులో కూడా భారత్ బాగా వెనుకబడి ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
► భారత్, పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో చైల్డ్ స్టంటింగ్ రేటు 35 నుంచి 38శాతం మధ్య ఉంది.
► పౌష్టికాహారలోపంతో బాధపడేవారు 2018–2020లో 14.6శాతం ఉంటే 2019–2021 నాటికి 16.3శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోప బాధితుల్లో 22.4 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు.
► పౌష్టికాహార లోపంతో అయిదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలు 2014లో 4.6శాతం ఉంటే 2020 నాటికి 3.3శాతానికి తగ్గాయి.
► భారత్‌లోని ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపాల్లో తగ్గుదల కనిపిస్తోంది.
► ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల సామాజిక ఆర్థిక హోదా, తల్లి ఆరోగ్యం విద్య వంటి అంశాల్లో భారత్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా వేర్వేరు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
► కోవిడ్–19 దుష్పరిణామాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి ప్రపంచ దేశాల్లో ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి.
భారత్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం
అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టనను దిగజార్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రపంచ ఆకలి సూచిని రూపొందించారని కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తింది. ఆకలి సూచిని లెక్కించే పద్ధతిలోనే తప్పులు తడకలు ఉన్నాయని విరుచుకుపడింది. ఈ అంశాన్ని ఆహార, వ్యవసాయ సంస్థ దష్టికి తీసుకువెళుతున్నట్టుగా కేంద్ర మహిళా, శిశు అభివద్ధి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించకుండా భారత్ ప్రతిష్టను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
విరుచుకుపడిన విపక్షాలు
దేశంలో రోజు రోజుకి ఆకలి కేకలు పెరిగిపోతూ ఉండడంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఎనిమిదన్నరేళ్లలోనే మోదీ ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేసిందని ధ్వజమెత్తాయి. పెరిగిపోతున్న ధరలు, తరిగిపోతున్న ఆహార నిల్వలు గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ఇకనైనా కేంద్రం తాను చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపేయాలన్నారు.
Global Hunger Report 2022: ఆకలి కేకలు
Published Sun, Oct 16 2022 5:23 AM | Last Updated on Sun, Oct 16 2022 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment