Economy of India
-
సవాళ్లలోనూ స్థిరంగా భారత్ ఎకానమీ: సీఈఏ
కోల్‌కతా: భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, మాంద్యం ముంగిట పలు దేశాలు నిలుచున్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడుతోందని ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వెర్చువల్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్ర క్లిష్ట పరిస్థితిలో ప్రపంచం ఉందన్నారు. అయినా భారత్ 2022–23లో 6.5 శాతం 7 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకునే పరిస్థితి ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను భారత్ తట్టుకుని నిలబడుతున్నట్లు పేర్కొన్నారు. -
.... ఉప ఎన్నికలూ జిందాబాద్!
(ఇది కల్పితమే, కానీ అందరినీ ఉద్దేశించిందే.. – ముందస్తు డిస్‌క్లెయిమర్) నల్లధనంలా నిగనిగలాడుతున్న అమావాస్య చీకటి..అంత చీకట్లోనూ మోదీ కొత్త రెండువేల రూపాయి నోటులా తళతళలాడుతున్న ఓ ఇల్లు.. ఆ ఇంటిలోకి దూరాడో దొంగ.. ఎదురుగా నిలువెత్తు సాయిబాబా ఫొటో..దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ‘పరాయి సొమ్ము ఆశించడం పాపం..’ అని రాసి ఉంది. అది చదివి లెంప లేసుకుని, సాయిబాబాకు దండం పెట్టుకుని వెనక్కు తిరిగాడు. మన దొంగ సాయిబాబా భక్తుడు.. అంతటివాడి మాటను కాదంటాడా! వెనక్కు తిరిగి వెళ్లిపోదామనుకున్న దొంగకు గుమ్మంపైన ఆ ఇంటి ఓనరు ఫొటో కనపడింది.. కాస్త అదో రకం నవ్వుతో. వెంటనే దొంగ ఇలా అనుకున్నాడు... ‘ఇదంతా పరాయి సొమ్ము ఎలా అవుతుంది. మనసొమ్మేగా తప్పేంలేదు’ అనుకుని చేతికందింది పట్టుకు పోయాడు.. ఆ ఇంటి ఓనరెవరో మీకు తెలిసే ఉంటుంది. ...లేకుంటే చివరిలో చూద్దాం... ............ ఇక అసలు విషయానికొద్దాం.. ఈ మధ్య అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై, జనాభివృద్ధిపై, పేదరికంపై జరుగుతున్న పరిశీలనలు, చూపిస్తున్న సూచికలు విపక్షాల విమర్శల్లాగే తప్ప..సరిగ్గా లేనట్లుంది... మొన్నటికి మొన్న ఆకలి సూచిలో 107 స్థానానికి మనను నెట్టాయి. మునుగోడుకు ఆ బృందాలను పంపి పరిశీలించ మనండి. వాళ్ల అంచనాలన్నీ తలకిందులైపోవూ! ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు... పొద్దున లేవగానే మంచి చెడుల పరామర్శలు, పనుల్లో పాలు పంచుకుంటూ వందలాది నాయకులు. (వెయ్యి ఓట్లున్న గ్రామంలో అన్ని పార్టీలు కలిపి.. 150 వాహనాలు.. నాలుగైదు వందల కార్యకర్తలు ఎప్పుడూ కనపడుతున్నారట) –ఇంతకు మించి పాలన ఏమి ఉంటుంది? తలలు తెగిపడుతున్న నాటుకోళ్లు, యాటలు... బిర్యానీ పొట్లాల పెళపెళలు... ఐదు రూపాయలకే భోజనం అని ఆహ్వానిస్తున్న హోటళ్లు – ఆకలిసూచిక పొలమారుతోంది... బస్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యం చేయించడం, బంకుల్లో రెండు లీటర్ల ఫ్రీ పెట్రోల్, జనం చేసిన అప్పులు తీర్చ డానికి ఆర్థిక సాయం, 20 వేలనుంచి 30 వేల దాకా నడుస్తున్న ఓటు వేలం పాట.. – మానవాభివృద్ధి సూచిక పరిగెత్తించడానికే కదా! యాదాద్రి లాంటి గుళ్లలో ఫ్రీ దర్శనాలు (ప్రమాణానికే అనుకోండి), కాసిన్ని విందులతో ఆనంద విహారాలు, మంచింగ్లు, మందు బాటిళ్ల చప్పుళ్లు. – హ్యాపీ ఇండెక్స్ చిద్విలాసమే కదా! ఎలాగైనా జనం జేబుల్లో డబ్బు చేర్చాలని తహతహలాడే పార్టీలు‘హవాలా’ రిస్కుకూ వెనుకాడడం లేదు... నిఘా కన్ను కప్పి చెక్‌పోస్టులు దాటి... బైకుల ద్వారా... డొంకల్లోంచి... కోట్లు తీసుకువచ్చే ప్రయత్నాలు.. – ఇంతకు మించి ప్రజాసేవ ఏముంటుంది? ఆరేళ్ల కిందట నల్లధనం బయటికి తెస్తానన్న మోదీ మాట విని నవ్వుకున్న వారు ఇప్పుడు. ‘...అరే వచ్చేసిందే’ అని తెల్లబోతున్న సందర్భం. మాది ‘బంగారు తెలంగాణ’ అన్న కేసీఆర్ మాట విని వెక్కిరించిన వారి ముఖంలో ఇప్పుడు ‘నిజమే...’నన్న ఆశ్చర్యం. సంపద పంపిణీ జరగాలని అరిచి అరిచీ అలసిపోయిన వామపక్షవాదుల కళ్లలో... ఆనంద భాష్పాలు. పక్క నియోజకవర్గాలు కూడా తమ ఆనందా నికి, అభివృద్ధి కోసమై రాజీనామా చేసే ఎమ్మేల్యేల కోసం... ఉప ఎన్నికల కోసం... ఎదురు చూస్తున్న తరుణం. – ఇది కదా ప్రజాస్వామ్య ఔన్నత్యం..! ఇక్కడ కదా ఆనందాభివృద్ధి తూనికలు, కొల మానాలు, సూచికలు లెక్కగట్టాల్సింది.. ఓ ఓటరు మాట.. ప్రస్తుతం జాతర నడుస్తోంది. ఇప్పటి దాకా చేసిందేమీ లేదు, ఇక ఎవరూ గెలిచి చేసేదేమీ లేదు... వారికి ఓట్లు గావాలే మాకు డబ్బులు కావాలే... మా అవకాశం మాది... వారి అవకాశం వారిది. ఇక్కడ మాకు నచ్చింది ఒకటే... ‘...మాకు పైసలి స్తున్నరు... అంతే.’ ఇప్పడు 100 కోట్లు పెడితే తర్వాత రెండొందల కోట్లు సంపాయిస్తడు. వాళ్లకు పోయేదేముంది.. అభివృద్ది లేదు పాడూ లేదు... ఇన్నేళ్లూ లేంది ఇప్పుడయితదా! ఎవడు డబ్బులిస్తే వాడికి ఓట్లె య్యడం మంచిది... గొడవలేకుండా. – ఆహా... ఇది కదా ప్రజాస్వామ్య స్థితప్రజ్ఞత! (మన మంత్రి నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలువ తగ్గట్లే... నాయకుల ‘వ్యాల్యూ’ పెరుగుతోంది అంతే... దానివల్లే ఇన్ని వెసులుబాట్లు) ‘టీ’ వాలా ఎంట్రీ.. ముళ్లపూడి వెంకటరమణ గారి కథోటి ఉంది. ఓ ఊరిలో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువు లుండేవారు. ఓట్లకు నోట్లు జల్లేస్తూ... వచ్చేది పది రూపాయల లాభమైనా నూర్రూపాయలు తగలే సేంత ప్రచారం చేస్తూ పోటీ పడేవారు. వీరికి పోటీగా ‘టీ’వాలా గోదాలోకి దిగడంతో∙సీన్ ఎలా మారిపోయిందో చెప్పే సరదా ఎన్నికల కథ. ఎన్నికలయి పోయాక... నెగ్గినవాడు బాగుపడ్డాడా అని ప్రశ్నిస్తే... నెగ్గినోడు వేరు, బాగుపడ్డవాడు వేరూనూ అని సమాధానం వస్తుంది. కాసిన్ని రోజులు ఆగితే ఇక్కడా మనకు తెలుస్తుంది. బేటీవాలా, రోటీవాలా, ‘టీ’ వాలాల్లో... ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు బాగుపడ్డారూ.. అని. నేతల ఊకదంపుళ్లు, మైకుల సౌండ్లు, వాహనాల హారన్లు, హామీ చప్పుళ్లు, కరెన్సీ పెళపెళలు, మందు బాటిళ్ల సౌండ్ల మధ్య... ఇంకా ప్రజాస్వామ్యంపై, ప్రజా శ్రేయస్సుపై ఆశ చావని మేధావులు బలహీన స్వరంతోనైనా ఓటర్లు అలియాస్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు.. ‘...ఓట్లు అమ్ముకోవడం తప్పు కదా..? అని. దానికి సమాధానం మాత్రం గట్టిగానే వస్తోంది. ‘...పంచుతున్న డబ్బులన్నీ వాళ్లు కూలీనాలీ చేసి చెమటోడ్చి సంపాదించినవా? అంతా మా డబ్బే కదా ఇవ్వనివ్వండి...’ అని. – ఇది కదా ప్రజాస్వామ్యం పరిపక్వత! ............ ఇక, పైన మనం చెప్పుకున్న దొంగ ఎవరింటికి దొంగతనానికి వెళ్లాడో, ఎవరి ఫొటో చూశాడో.. ఎందుకు అది పరాయి సొమ్ము కాదను కున్నాడో.. చెప్పనక్కరలేదనుకుంటా! -
Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్‌దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. బ్రిటన్ వెనుకబాటుకూ, భారత్ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్ 814 బిలియన్ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్ డాలర్ల లెక్కన భారత్ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్ను భారత్ దాటేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. బ్రిటన్‌లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్‌వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్ను వెనక్కి నెట్టి, భారత్ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్ రివెంజ్’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్‌తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్’ (యూహెచ్‌సీ) లెక్కన చూసినా భారత్ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 2016 నాటికే బ్రిటన్ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్‌లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్‌ను మధ్య ఆదాయ దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి. -
స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్త!
ముంబై: భారత వృద్ది రేటు అంచనాలను 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు గాను 30 బేసిస్ పాయింట్ల మేర మోర్గాన్ స్టాన్లీ తగ్గించింది. స్థూల ఆర్థిక అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోవచ్చంటూ హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేయవచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 7.9 శాతంగా ఈ సంస్థ ప్రకటించింది. 2023–24లో వృద్ధి రేటు 6.7 శాతానికి క్షీణిస్తుందని తెలిసింది. గత అంచనా 7 శాతంగా ఉంది. అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అధిక కమోడిటీల ధరలు, అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో రిస్క్‌తీసుకునే ధోరణి తగ్గడం భారత్ వృద్ధి రేటు క్షీణతకు రిస్క్‌లుగా పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం (రేట్ల పెంపు) అన్నవి వ్యాపార సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి మూలధన రికవరీని ఆలస్యం చేయవచ్చు’’అని మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసి నివేదికలో పేర్కొంది. సరఫరా వైపు ప్రభుత్వం తీసుకునే చర్యల మద్దతు, వ్యాపార కార్యకాలపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం అన్నవి ఈ రిస్క్‌ల ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 2022–23కు 6.5 శాతం, కరెంటు ఖాతా లోటు పదేళ్ల గరిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకోవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. -
గతి శక్తి, పీఎల్ఐ స్కీమ్‌తో ఎకానమీకి రక్ష
న్యూఢిల్లీ: గతిశక్తి, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు భారత్ ఎకానమీని అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తాయని ఆర్థికశాఖ పేర్కొంది. దీనితోపాటు సంబంధిత పథకాలు దేశంలో పెట్టుబడులను పెంచుతాయని విశ్లేషించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పునరుద్ధరణ, అధిక వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. కాగా భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాటి ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతాయని నెలవారీ విశ్లేషణా నివేదిక పేర్కొంది. దీని పర్యవసాన ప్రభావం ప్రపంచవ్యాప్త వృద్ధి అవుట్‌లుక్‌పై పడుతుందని తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఇంధన ధరల తీవ్రత, ఆహార మార్కెట్లో సరఫరాల సమస్యలు ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతాయన్న అంశం భారత్ ఎకానమీకి కీలకం. అయితే తాత్కాలిక అవాంతరాలు దేశ వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టత దీనికి కారణం. ► భారత్ ఎకానమీకి సవాళ్లు ఎదరయినప్పటికీ, వీటి తీవ్రతను తగ్గించడానికి గతిశక్తి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు దోహదపడతాయి. పెట్టుబడులు, వేగవంతమైన రికవరీ, పటిష్ట వృద్ధికి ఈ పథకాలు సహాయపడతాయి. దీనికితోడు గత కొన్నేళ్లుగా తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సరఫరాల సవాళ్లు తగ్గుతాయని భావిస్తున్నాం. ► శ్రామిక శక్తి వినియోగం మెరుగుదల, నిరుద్యోగం రేటు తగ్గడం, ఆర్థికంగా పేదలకు నిరంతర మద్దతు అందించడానికి ప్రభుత్వ పటిష్ట చర్యలు (పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను సెప్టెంబర్ 2022 చివరి వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించడం) ఎకానమీని విస్తృత స్థాయిలో సుస్థిర వృద్ధి బాటలో ముందుకు నడుపుతాయి. ► వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు మార్చి 2022లో రూ. 1.4 లక్షల కోట్లను దాటి రికార్డు సృష్టించాయి. రికవరీ అనంతర వృద్ధి ప్రారంభాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలు క్రమంగా మహమ్మారి ప్రేరేపిత పరిమితులను సడలిస్తుండడం ఎకానమీకి లాభిస్తోంది. ముడి పదార్థాల ధరల పెరిగినా, సేవల రంగం పటిష్టంగా ఉంది. ఇన్పుట్స్ వ్యయం 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి నమోదయినప్పటికీ ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 51.8 వద్ద ఉంటే, మార్చిలో 53.6కు ఎగసింది. వ్యాక్సినేషన్ విస్తృతితో కోవిడ్–19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇవన్నీ ఎకానమీ వేగవంతమైన పురోగతిని సూచిస్తున్నాయి. ► ప్రైవేట్ వినియోగంలో వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విలువలు, పరిమాణాలు 2021– 22లో రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో యూపీఐ లావాదేవీల పరిమాణం మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్లను దాటింది. ► ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూలధన పెట్టుబడులు మహమ్మారి ప్రేరిత, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల (2019–20, 2020–21) స్థాయిలను అధిగమించాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత ఊపందుకునే వీలుంది. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ భారీగా ఆకర్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోకి స్థూల ఎఫ్‌డీఐల ప్రవాహం 2021 ఏప్రిల్– 2022 జనవరి మధ్య 69.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)ద్వారా పెట్టుబడుల్లో 2021 ఏప్రిల్– 2022 ఫిబ్రవరి మధ్య (అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి) 29.7 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనివల్ల భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 630 డాలర్లకుపైగా పెరిగాయి. ఇవి 12 నెలలకుపైగా దిగుమతులకు సరిపోతాయి. ► 2022 జనవరిలో నికర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య 15.3 లక్షలుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 37.4 శాతం అధికం. ఇది విస్తృత ఆర్థిక పునరుద్ధరణ ఉపాధి అవకాశాల వృద్ధిని కూడా పెంచిందని సూచిస్తోంది. ఆర్థికరంగం బాగుంది భారత్ ఎకానమీ పరిస్థితి ప్రస్తుతం బాగుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోగలిగిన స్థాయిలో దేశం ఆర్థిక రంగం ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి అవసరం. – బిమల్ జలాన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఏ సవాలునైనా తట్టుకోగలం
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ సవాలునైనా తట్టుకోగల స్థితిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలూ రాకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ఇతర కీలక కమోడిటీ ధరలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వ్యవస్థకు ఈ భరోసాను కల్పించడం గమనార్హం. భారత పరిశ్రమల సమాఖ్య– సీఐఐ నిర్వహించిన ఒక పారిశ్రామిక సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► మార్చి 2020లో మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినప్పటి నుండి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలోకి రూ. 17 లక్షల కోట్లను పంప్ చేసింది. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సవాళ్లు తలెత్తకుండా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. ► అవసరమైన పరిస్థితుల్లో ఆర్బీఐ లిక్విడిటీ చర్యల ఉపసంహరణ ప్రక్రియను చాలా సజావుగా నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగాల అవసరాలను తీర్చే విషయంలో తగినంత ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ► బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు గణనీయంగా మెరుగుపడింది. మూలధన నిష్పత్తి 16 శాతంగా ఉంది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) రికార్డు స్థాయిలో 6.5 శాతానికి పడిపోయాయి. ► యుద్ధంతో తీవ్ర సవాళ్లు తలెత్తినప్పటికీ అధిక ఫారెక్స్ నిల్వలు, తక్కువ కరెంట్ అకౌంట్ లోటు ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా స్థితిలో ఉంచుతోంది. ► దేశంలోకి వచ్చీ–పోయే నిధుల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే క్యాడ్ (కరెంట్ అకౌంట్ లోటు)ను నిర్వహించగలిగిన సత్తా దేశానికి ఉంది. ఇందుకు సంబంధించి ఎటుంటి సవాళ్లు ఎదురైనా భారత్ తగిన విధంగా ఎదుర్కొనగలుగుతుంది. ► భారతదేశం ఆంక్షలను ఎదుర్కొంటుందని భయపడాల్సిన పనిలేదు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు (దాదాపు 630 బిలియన్ డాలర్లపైన) తగిన విధంగా చక్కని వైవిధ్యభరిత స్థాయిలో ఉన్నాయి. ► ఆర్బీఐ విదేశీ కరెన్సీ అసెట్స్‌లో అమెరికా డాలర్లు మెజారిటీని కలిగి ఉండగా, ఆరు నెలల క్రితం ఇతర కరెన్సీలలో తన అసెట్స్‌ను విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆర్బీఐ ట్రాక్ చేసే దాదాపు 60 హై–ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. స్టాగ్ఫ్లేషన్ భయాలు అక్కర్లేదు.. సరళతర ద్రవ్య విధానానికి తిలోదకాలిచ్చే అంచనాలను ఆర్బీఐ వ్యతిరేకిస్తుంది. వృద్ధికి తోడ్పాటు కోసం తగిన అన్ని చర్యలనూ ఆర్బీఐ తీసుకుంటుంది. వరుసగా రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం నిర్ధేశిత ఆర శాతం స్థాయిని దాటినప్పటికీ ఇది తగ్గుముఖం పడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ధరల స్థిరత్వం, దానిని అదుపులో ఉంచడం సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కర్తవ్యం. దీనిని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక భారతదేశానికి స్టాగ్ఫ్లేషన్ అవకాశం లేదు. ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)కు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం) ఆరు స్థాయిలోనే కొనసాగుతుందని భావించవద్దు. ఇది దిగివస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో విశ్లేషకులు, నిపుణులు రేట్ల పెంపు, సరళతర ద్రవ్య విధానం నుంచి సెంట్రల్ బ్యాంక్ వైదొలడం వంటి అంచనాల నేపథ్యంలో దాస్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత కొనసాగితే, దేశంలో స్టాగ్ఫ్లేషన్ (ఎకానమీలో స్తబ్దతతో కూడిన పరిస్థితి. ధరల తీవ్రత వల్ల వృద్ధి మందగమనం, తీవ్ర నిరుద్యోగం వంటి సవాళ్లు తలెత్తడం) సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని బహుళజాతి బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ– మోర్టాన్ స్టాన్లీ ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని పరపతి విధాన కమిటీ మెజారిటీ అభిప్రాయపడింది. రెపో యథాతథ కొనసాగింపునకు ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. -
మహమ్మారిని ఎదుర్కొనడంపైనే బడ్జెట్ దృష్టి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు. ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కొనసాగించాలి. -
భౌతిక–డిజిటల్ విధానాల కలయిక తప్పనిసరి
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సేవలకు సంబంధించి భారత్‌లో భౌతిక (ఫిజికల్), డిజిటల్ విధానాల మేలు కలయిక తప్పనిసరని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా స్పష్టం చేశారు. విస్తృత భౌగోళిక అంశాలు దీనికి కారణంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్ ఆర్థిక వ్యవస్థ పయనం దిశలో సవాళ్లు– పరిష్కారాలు’ అన్న అంశంపై ఫిక్కీ, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్‌ఐబీఏసీ 2021 వర్చువల్ సమావేశాల్లో చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► భారతదేశంలో బ్యాంకింగ్ పలు రకాల వినియోగదారులకు సేవలను అందిస్తోంది. మేము డిజిటల్ అవగాహన ఉన్నవారికి అలాగే ఫోన్ క్లిక్‌ల ద్వారా భౌతికంగా ఏమీ పొందాలనుకోని వారికి కూడా సేవ చేస్తాము. ఆర్థిక–డిజిటల్ అక్షరాస్యత లేని వినియోగదారులు భారత్‌లో ఉన్న విషయాన్ని గమనించాలి. ► కనుక భారతదేశం వంటి దేశంలో వినియోగదారులకు భౌతిక, డిజిటల్ ఆర్థిక సేవలు రెండూ అవసరమని, ఈ విషయంలో సహజీవనం చేయక తప్పదని నేను భావిస్తున్నాను. ► భారత్‌లో కో–లెండింగ్ నమూనా ఆవిర్భావం విషయానికి వస్తే, దేశంలో మారుమూల ఉన్న వారికిసైతం ఆర్థిక సేవలు అందాలన్న ప్రధాన ధ్యేయంతో ఏర్పడిన యంత్రాంగం ఇది. ప్రస్తుతం సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బీఐకి 65% శాఖలు ఉన్నాయని, ఇలాంటప్పుడు కూడా కో–లెండింగ్ భాగస్వామి అవసరమా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు ఇంకా చొచ్చుకువెళ్లాల్సి ఉందని అనుకుంటున్నాను. రుణగ్రహీతల అవసరాల గురించిన తగిన సమాచారాన్ని çకో–లెండింగ్ భాగస్వామి వ్యవస్థ తగిన విధంగా అందించగలుగుతుందని భావిస్తున్నాను. ► ఎస్బీఐ అటువంటి రెండు భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మరికొందరితో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకోడానికి వారి వద్దనున్న సమాచారం దోహదపడుతుంది. టెక్నాలజీతో ఆర్థిక సేవల్లో పెను మార్పులు: కేవీ కామత్ కొంగొత్త టెక్నాలజీల రాకతో ఆర్థిక సేవల రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ బ్యాంకరు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. టెక్ ఆధారిత కొత్త తరం సంస్థలను కూడా నియంత్రణ నిబంధనల పరిధిలోకి తెచ్చేలా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. తద్వారా సదరు రంగంలోని సంస్థలన్నింటికీ సమాన హోదా, నిబంధనలు వర్తించేలా కృషి చేయాలని ఫిక్కీ–ఎఫ్‌ఐబీఏసీ 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కామత్ తెలిపారు. డిజిటల్‌తో తగ్గిన బ్యాంకింగ్ భారం: గోయెల్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, యుకో బ్యాంక్ సీఈఓ ఏకే గోయెల్ సమావేశంలో ప్రసంగిస్తూ, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ వల్ల బ్రాంచీలపై భారం తగ్గిందని అన్నారు. అయితే ఇప్పటికీ 30 శాతం మంది ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్న విషయం ఒక సమస్యగా ఉందని అన్నారు. సహ రుణ (కో–లెండింగ్) విధానం ద్వారా లేదా ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యంతో డిజిటల్ రుణాలను మెరుగుపరచవచ్చని, ఇది బ్యాంకు శాఖల భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువే!: ఆర్థిక శాఖ
జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్ పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్ ఆర్థిక శాఖ తాజా సమీక్ష న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 8.4 శాతం అప్ Economy Of India ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో రియల్ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది. మరింత స్పీడ్ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్ఎఫ్ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్ వేరియంట్ గ్లోబల్ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్ ఇందుకు కారణంకానుంది. కోవిడ్–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది. ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి. చదవండి: సింగపూర్ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్’ ! కేంద్రం కొత్త ఆదేశాలు -
ఆగస్టులో సేవల రంగం సూపర్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఆగస్టులో దూసుకుపోయింది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ క్షీణత నుంచి భారీ వృద్ధిలోకి జంప్ చేసింది. జూలైలో 45.4 క్షీణతలో ఉన్న రంగం, ఆగస్టులో 18 నెలల గరిష్ట స్థాయి 56.7కు ఎగసింది. సూచీ 50 లోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సమీక్షా నెల్లో బిజినెస్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సెకండ్‌వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించడం, పలు సంస్థల పునఃప్రారంభం, కొత్త ఆర్డర్లు, వినియోగం భారీగా పెరగడం వంటి పలు అంశాలు ఆగస్టు సేవల రంగంపై ప్రభావం చూపాయి. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో గడచిన నాలుగు నెలలుగా సేవల ఇండెక్స్ 50లోపు క్షీణతలోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ ఇండెక్స్ కూడా దూకుడే... సేవలు, తయారీ ఇండెక్స్ కలిసిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా 49.2 క్షీణత (జూలై) నుంచి ఆగస్టులో 55.4 వృద్ధిలోకి మారింది. మూడు నెలలుగా ఈ విభాగం క్షీణతలోనే కొనసాగింది. ఒక్క తయారీ రంగం చూస్తే, తయారీ రంగం ఆగస్టులో వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, జూలైకన్నా నెమ్మదించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 52.3 వద్ద ఉంది. జూలైలో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంకాగా, పారిశ్రామిక రంగం వాటా 15 శాతం. పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వెయిటేజ్ దాదాపు 70 శాతం. చదవండి: -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. ఇంతక్రితం 9.1% ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్బీఐ వృద్ధి అంచనా 9.5% కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9% నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే. ‘కే’ నమూనా రికవరీ..: సమాజంలో అసమానతలు పెరిగిపోవడంపై ఇండ్ రా ప్రధాన ఆర్థికవేత్త, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి లక్షలాది సంఖ్యలో ప్రజలను పేదరికంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ (ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ (జు) నమూనా రికవరీ అని సిన్హా తెలిపారు. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వేగంగా మరింత సమస్యల్లోకి జారిపోతారు. ఎకానమీలో దాదాపు 58 శాతం ఉన్న ప్రైవేటు వినియోగంలో గత స్థాయి వృద్ధి ప్రస్తుతం లేదని సిన్హా అన్నారు. -
‘స్క్రాపేజ్ పాలసీతో అదనంగా రూ.40వేల కోట్లు’
న్యూఢిల్లీ: వాహనాల తుక్కు విధానం (స్క్రాపేజీ పాలసీ) దేశ ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించడం కేంద్రం, రాష్ట్రాలకు సైతం అనుకూలిస్తుందంటూ.. జీఎస్టీ రూపంలో రూ.40వేల కోట్లను అదనంగా పొందొచ్చన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వాహన స్క్రాపేజీ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. -
2021లో భారత్ వృద్ధి 12.5 శాతం!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్ దిగ్గజం– ఐఎంఎఫ్ తాజాగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్‌లుక్ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్‌లుక్ వివరించింది. లాక్డౌన్ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది. చదవండి: (అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్) ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు అవుట్‌లుక్‌లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి. కోవిడ్–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి. సవాళ్లు పొంచి ఉన్నాయ్.. అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్‌ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. – గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ నెల లాక్‌డౌన్‌తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్ఏ భారత్ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్డౌన్ విధింపు ద్వారా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది. 2021–22లో భారత్ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్ ఎఫెక్ట్ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది. సెకండ్‌వేవ్‌తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్ కోవిడ్–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ సెకండ్‌వేవ్ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్ విశ్లేషించింది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్ రెపో రేటు 25–40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. -
రికవరీ ఉన్నా... కష్టాలు కొనసాగుతున్నాయ్!
వాషింగ్టన్: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 కఠిన లాక్డౌన్ పరిస్థితుల నుంచి భారత్ ఎకానమీ గణనీయంగా కోలుకున్నప్పటికీ, కష్టాల నుంచి బయటపడిపోలేదని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలోనే నమోదవుతుందని వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ లెండర్ అంచనావేసింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో దక్షిణాసియా ఎకానమీలపై బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2016–17లో 8.3 శాతం వృద్ధిని సాధించిన తర్వాత 2019–20లో భారత్ కేవలం 4 శాతం వృద్ధికి పరిమితమైంది. -
వేగంగా రికవరీ అవుతున్న ఎకానమీ!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ విశ్లేషించింది. కరోనా ప్రేరిత అంశాలతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోనే వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. కాగా ఆర్బీఐ అధికారులు రాసిన ఈ ఆర్టికల్‌లో వ్యక్తమైన అభిప్రాయాలను రచయితల అభిప్రాయాలుగానే పరిగణించాలితప్ప, ఆర్బీఐకి ఆపాదించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. తొలి త్రైమాసికంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 23.9 శాతంగా నమోదుకావడం... దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8% నుంచి 14% వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనాలు... అటు తర్వాత కనబడిన ఆర్థిక క్రియాశీలత... సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణరేటు 7.5 శాతానికి కట్టడి... ఈ సానుకూల వాతావరణంలో ఆర్బీఐసహా పలు సంస్థల తమ క్షీణ అంచనాలను సవరించడం (2020–21 ఆర్థిక సంవత్సరానికి) వంటి అంశాల నేపథ్యంలో వెలువడిన ఆర్టికల్‌లో ముఖ్యాంశాలు చూస్తే... ► కోవిడ్–19 కఠిన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలోనే భారత్ 0.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంకేతంగా రెండు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అందులో ఒకటి సెప్టెంబర్ మధ్యస్థం నుంచే పెట్టుబడులు, వినియోగ డిమాండ్ విషయంలో సానుకూలత కనిపించింది. ఇక రెండవ విషయానికి వస్తే, ద్రవ్యపరమైన చర్యలు వినియోగంవైపే కాకుండా, పెట్టుబడుల వైపునకూ మళ్లాయి. ► దేశంలో సెకండ్‌వేవ్ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంబంధించిన ద్రవ్యపరమైన చర్యలు మరింత ఊపందుకున్నాయి. ► ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలోనే క్షీణతకు సంబంధించి తొలి అంచనాల సవరణ జరుగుతోంది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సానుకూలత పరిస్థితుల్లో ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి), ఎస్అండ్పీ ఆ సంస్థ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి), ఇక్రా (–11 శాతం నుంచి 7.8 శాతానికి) ఎస్బీఐ రీసెర్చ్ (– 10.9 శాతం నుంచి 7.4 శాతానికి) క్షీణ అంచనాలను తగ్గించాయి. క్షీణ అంచనాలను తగ్గించిన ఇండియా రేటింగ్స్ కాగా, 2020–21 భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన తొలి క్షీణ అంచనాలను ఇండియా రేటింగ్స్ గురువారం 11.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా – 0.8 శాతం, – 0.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.6 శాతంగా విశ్లేషించింది. -
అంచనాలకు మించి రికవరీ
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ తొలి అంచనాలకన్నా పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా కేసుల పెరుగుదలే వృద్ధికి ప్రతికూలమనీ ఆయన అన్నారు. రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) గణాంకాలు . శుక్రవారం (27వ తేదీ) వెలువడుతుండడం, క్యూ2లో క్షీణ రేటు ‘సింగిల్’ డిజిట్‌లోనే (10 శాతంలోపే) ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రేరిత సమస్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 23.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. విదేశీ మారకానికి సంబంధించి భారత్ డీలర్ల సంఘం (ఎఫ్ఈడీఏఐ) వార్షిక దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► వృద్ధి రికవరీకి సంబంధించి.. పండుగ సీజన్ అనంతరం డిమాండ్ కొనసాగడం, పెరుగుతున్న కరోనా కేసులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాక్సిన్ అందుబాటు విషయంలో మార్కెట్ పునఃమదింపు ఎలా ఉంటుం దన్నదీ పరిశీలించాల్సిన ముఖ్యాంశాల్లో ఒకటి. ► తొలి త్రైమాసికంలో భారీ క్షీణత అనంతరం, క్యూ2లో ఆర్థిక క్రియాశీలత ఊహించినదానికన్నా వేగంగా ఉంది. రికవరీలో పటిష్టత నమోదైంది. ► గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం లక్ష్యాలను మించి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం) ఉంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) జాగ్రత్తగా పరిశీలించి రేటు కోతకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తాత్కాలికమైనవనీ, ధరల తీవ్రత క్రమంగా తగ్గుతుందని అక్టోబర్ పరపతి సమీక్ష అభిప్రాయపడింది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ, రేట్ల కోత అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరళతర విధానాన్నే పాటించాలనీ నిర్దేశించుకుంది. ► తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండడం భారత్‌కు ప్రస్తుతం కలిసి వస్తున్న అంశం. నవంబర్ 13 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 572.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడాది దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► 2020 తరహా సంవత్సరాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అవకాశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. యూరోప్‌లోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొం టున్నాయి. ప్రపంచ వృద్ధికి ప్రతికూలాంశమిది. ► మార్కెట్లపై మహమ్మారి పలు విధాలుగా ప్రతికూల ప్రభావాలు చూపింది. ఆర్థిక మందగమనం, ద్రవ్య లభ్యత, కమర్షియల్ పేపర్, కార్పొరేట్ బాండ్ మార్కెట్ క్షీణత, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాల్లో ప్రతికూలతలు ఏర్పాడ్డాయి. -
దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి కరోనా మహమ్మారి విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విస్తరణ కారణంగా భారత ఆర్థికవ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. షికాగో బిజినెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా ఉన్న రాజన్ దేశం స్వాతంత్ర్యం తరువాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. 'ఇటీవలి కాలంలో భారతదేశపు గొప్ప సవాలు' అనే పేరుతో తన బ్లాగులో ఈ విషయాలను పేర్కొన్నారు. ( కరోనా : రఘురామ్ రాజన్ సూచనలు) ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు తీవ్రంగా వుంది. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. మన దేశానికి సంబంధించి పలు సంస్థలు బలమైన వృద్ధిని సాధించాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆర్థిక సంక్షోభంపై పోరాడటానికి సాధ్యమైన చర్యలను కూడా ఆయన సూచించారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని రాజన్ బ్లాగులో పేర్కొన్నారు. భౌతిక దూరం లాంటి కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని సూచించారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికి, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రణాళికలను రూపొందించడం, ఆమోదించడంతో పాటు సమర్ధవంతంగా అమలయ్యేలా పరిపాలన విభాగం చూడాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, మానవత్వంతో వారిని ఆదుకోవడం సరైన పని అని రాజన్ ప్రధానంగా సూచించారు. చదవండి : కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ లాక్డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట -
ఆర్థిక వ్యవస్థకు వెలుగురేఖ కనిపించింది..!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ట స్థాయి నుంచి త్వరలోనే పుంజుకుంటుందని మైనింగ్ దిగ్గజం, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గించినందున అది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున చేసే పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలపై వ్యయాలతోపాటు, దేశంలో దాగి ఉన్న సహజ వనరులను వెలికితీసే విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక శాతం ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పరిశీలించాలని కూడా సూచించారు. ప్రభుత్వరంగ కంపెనీలు స్వతంత్రంగా పనిచేయగలిగితే ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలవన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ తిరిగి అధిక వృద్ధి బాట పడుతుంది. సొరంగం చివర్లో వెలుగును నేను చూశాను. ఇది ఎంతో దూరంలో లేదు’’ అని అనిల్ అగర్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జీఎస్టీ ప్రభావం తాత్కాలికమేనని, ఇది గాడిన పడినట్టు చెప్పారు. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వృద్ధి రేటుకు ప్రోత్సాహకంగా కేంద్రం కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం గమనార్హం. నిబంధనల అడ్డు తొలగించాలి.. ప్రపంచంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న భారత్ పెట్టుబడులకు సహజ గమ్యస్థానమని అనిల్ అగర్వాల్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యాపారాలు చేయాలనుకునే వారికి భారత్ ఉత్తమ ప్రదేశంగా ఆయన పేర్కొన్నారు. -
జీడీపీ వృద్ధి 5 శాతం లోపే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ 2020 మార్చి మధ్య) 5 శాతం దిగువనే నమోదవుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. జీడీపీ వృద్ధి 2019–20లో 5 నుంచి 4.5 శ్రేణిలోనే ఉంటుందని ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్, రేటింగ్ దిగ్గజ సంస్థలు అంచనావేశాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతం. జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది. ఎన్ఎస్ఓ తాజా విశ్లేషణ ప్రకారం, 2019–20లో తయారీ రంగం భారీగా దెబ్బతిననుంది. 2018–19లో 6.2 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధిరేటు 2019–20లో 2 శాతానికి పడిపోతుందని ఎన్ఎస్ఓ అంచనావేసింది. అలాగే వ్యవసాయం, నిర్మాణ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి రంగాలు కూడా ప్రతికూల ఫలితాలను నమోదుచేసే అవకాశం ఉందని వివరించింది. అయితే మైనింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ వంటి రంగాల్లో కొంత సానుకూలత ఉండొచ్చని ఎన్ఎస్ఓ అంచనావేసింది. ఆర్బీఐ అంచనాలకన్నా తక్కువ! ..: తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ గత నెల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గించేసింది. అక్టోబర్ నాటి సమీక్షలో వృద్ధి అంచనా 6.1 శాతం. ఇప్పుడు 5 శాతం కన్నా లోపే వృద్ధి రేటు ఉంటుందని ఎన్ఎస్ఓ అంచనావేస్తుండడం గమనార్హం. 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. చమురు ధరల మంటతో ఇబ్బందే: డీబీఎస్ ముడి చమురు ధరలు తీవ్రంగా ఉంటే, అది భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సింగపూర్ బ్యాంకింగ్ గ్రూప్– డీబీఎస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇప్పటికే రూపాయి రెండు నెలల గరిష్టం... 72 స్థాయికి పడిపోయిన విషయాన్ని గుర్తుచేసింది. తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం భారత్ నెలవారీ తలసరి ఆదాయం 2019–20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018–19లో తలసరి ఆదాయం రూ.10,534. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది. కాగా వృద్ధిరేటు 10% (2018–19) నుంచి 6.8 శాతానికి పడిపోతుండడం గమనార్హం. -
2030 నాటికి చైనా తరువాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్. సాహూ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేని కంపెనీ లను పునరుద్ధరించేందుకు పరిష్కార నిపుణు లు (ఆర్పీ) ప్రయత్నించాలని, తద్వారా ఆ కంపెనీని నమ్ముకుని ఉన్న ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేసినట్లు అవుతుందని సాహూ అన్నారు.రుణ పరిష్కార ప్రణాళికల తయారీ విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరించాలని, రుణదాతల కమిటీ ముందు కేవలం ఒక రుణ పరిష్కార ప్రణాళి కనే ఉంచకుండా, దీర్ఘ కాలంగా ప్రయోజనం చేకూర్చే రుణ ప్రణాళికలను సైతం ఆ కమిటీ ముందు ఉంచాలని కోరారు.స్వయంగా రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించే వెసులు బాటును దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్న కంపెనీకి సైతం కల్పించాలని, తద్వారా కంపెనీ పునరుద్ధరణకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఇండియా (సిపీ) ఆధ్వ ర్యంలో శనివారం నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్టసీ కోడ్ (ఐబీసీ) అమలులో ఎదురవు తున్న ఇబ్బందులపై ఈ సమావేశం చర్చిం చింది. ఇందులో సిపీ అధ్యక్షుడు సుమంత్ బత్రా, సిపీ హైదరాబాద్ కన్వీనర్ వీవీఎస్ఎన్ రాజులతో పాటు పలువురు న్యాయవాదులు, కంపెనీ సెక్రటరీలు, చార్టెర్డ్ అకౌంటెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ, 2016లో వచ్చిన ఐబీసీ వల్ల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఈ కోడ్ వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ, ఐబీసీ వల్ల 2030 నాటికి చైనా తరువాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని తెలిపారు. ఈ కోడ్ వల్ల దివాలా కంపెనీలకు, బ్యాంకు లకు మేలు జరుగుతుందని, దివాలా కంపెనీ ని ఇతరులు టేకోవర్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే బ్యాంకులకు సైతం రుణాలు వసూలు అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఐబీసీ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. దివాలాలో ఉన్న కంపెనీలను కొందరు బినామీలు చేజిక్కించుకుంటున్నా రని, దీనికి అడ్డుకట్టవేయాలని కోరారు. ఐబీసీలో పలు అంశాలపై స్పష్టత లోపించిం దని, వీటినీ అధిగమించినప్పుడే ఐబీసీ లక్ష్యం నెరవేరుతుందని వారు అభిప్రాయపడ్డారు. -
భారత్ వృద్ధి తీరు భేష్!
వాషింగ్టన్/ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఇక వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా అవతరించబోతోందని పేర్కొంది. మరోవైపు పీడబ్ల్యూసీ– ఫిక్కీ సర్వే వచ్చే 12 నెలల్లో భారత్ వృద్ధి రేటు 7%పైనే ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ చర్యలు వృద్ధికి దోహదపడతాయని భారత్ కార్పొరేట్ భావిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఆయా సంస్థల నివేదికల్లోని ముఖ్యాంశాలపై దృష్టి సారిస్తే... వినియోగం, పెట్టుబడుల దన్ను: ప్రపంచబ్యాంక్ భారత్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ‘‘2019 గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ నివేదికలో పేర్కొంది. అటు తర్వాత వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. దేశంలో పటిష్ట వినియోగం, పెట్టుబడుల ధోరణి ఈ స్థాయి వృద్ధి రేటుకు దోహదపడే అంశాలుగా వివరించింది. ఈ స్థాయి వృద్ధితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఇక చైనా వృద్ధి రేటు 2018లో 6.5% అయితే 2019, 2020ల్లో 6.2%కి పడిపోతుందని విశ్లేషించింది. 2021లో మరింతగా 6%కి పడిపోతుందని పేర్కొం ది. భారత్ వృద్ధి ధోరణి ప్రోత్సాహకరమైన రీతిలో కొనసాగుతోందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పరిస్థితి సానుకూలంగా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రాస్పెక్టŠస్ గ్రూప్ డైరెక్టర్ ఐహాన్ కోష్ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అవకాశాలను తట్టుకోవడానికి తగిన వ్యూహాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచబ్యాంక్ సూచించడం గమనార్హం. ప్రభుత్వ చర్యల సత్ఫలితాలు: సర్వే కేంద్రం తీసుకుంటున్న పలు విధానపరమైన చర్యలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని పీడబ్ల్యూసీ–ఫిక్కీ సర్వే ఒకటి పేర్కొంది. వచ్చే 12 నెలల కాలంలో దేశం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని భారత్ కార్పొరేట్ రంగం భావిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. ఎగుమతుల మార్కెట్‌పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందనీ, వృద్ధిలో ఈ విభాగం కూడా కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. 2018 జూలై–అక్టోబర్ మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఫైనాన్షియల్ అధికారులు, భారత తయారీ రంగం వ్యూహాత్మక విభాగాల చీఫ్‌లతో ఇంటర్వ్యూల ద్వారా తాజా సర్వే రూపకల్పన జరిగింది. మౌలిక రంగం అభివృద్ధితో ప్రభుత్వ రంగం పటిష్టంగా ఉందని, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయని, నియంత్రణా వ్యవస్థల పనితీరు సమర్థవంతంగా ఉందని పేర్కొన్న సర్వే, దీనితోపాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గాలను సరళీకరణ వృద్ధికి దోహదపడే అంశాలని విశ్లేషించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు మరిన్ని పెరగాలని సూచించింది. 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు వినియోగం: డబ్ల్యూఈఎఫ్ అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్ వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ విలువ 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్న అంచనాలను వెలువరించింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో ఆరవ దేశంగా కొనసాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో దేశీయ ప్రైవేట్ వినియోగం 60 శాతంగా ఉంది. నైపుణ్యం మెరుగుదల, భవిష్యత్తులో ఉపాధి కల్పన, గ్రామీణ భారతంలో సామాజిక–ఆర్థిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై భారత్ తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా డబ్ల్యూఈఎఫ్ తన తాజా నివేదికలో వివరించింది. భారత్‌లోని 30 పట్టణాలు, నగరాల్లోని 5,100 కుటుంబాల అభిప్రాయాల ఆధారంగా తాజా సర్వే రూపొందింది. అలాగే దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో దాదాపు 40 ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఆర్థిక సంవత్సరంసహా వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7% పైన ఉంటుందనేది ఫోరమ్ అంచనా. -
పటిష్ట వృద్ధి బాటనే భారత్: ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19), అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ ఆరికాభివృద్ధి రేట్లు వరుసగా 7.3 శాతం, 7.6 శాతం నమోదవుతాయని విశ్లేషిం చింది. ‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్ లుక్ (ఏడీఓ) 2018’ పేరుతో విడుదలైన ఏడీబీ వార్షిక ఆర్థిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►భారత్‌కు కొన్ని సవాళ్లూ ఉన్నాయి. రూపాయి బలహీనత, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు ఇందులో ప్రధానమైనవి. ► చమురు ధరలు ఒకపక్క పెరుగుతున్నాయి. అయితే మరోపక్క దేశీయ డిమాండ్ బాగుంది. ఎగుమతులు ప్రత్యేకించి తయారీ రంగానికి సంబంధించి బాగున్నాయి. ఆయా అంశాల వల్ల చమురు ధరల పెరుగుదల తీవ్రత భారత్ ఆర్థిక వ్యవస్థపై లేకుండా చేస్తున్నాయి. ►ఆసియా వృద్ధి రేటు 2018లో 6 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. వాణిజ్య యుద్ధ భయాలు కీలకమైనవి. ప్రపంచం కోలుకోలేదు...కానీ భారత్ భేష్: ఆంక్టాడ్ 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా ప్రపంచం కోలుకోలేదని ఆంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవడానికి సంకేతాలని పేర్కొంది. అయితే భారత్‌తో కూడిన బ్రిక్స్ దేశాలు మాత్రం మెరుగైన వృద్ధిని సాధిస్తున్నాయని కితా బిచ్చింది. దేశీయ డిమాండ్ పుంజుకోవడం దీనికి కారణమని పేర్కొంది. -
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన విధానాల్ని అవలంబిస్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన తప్పుపట్టారు. సమాజాన్ని విడగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, ఆయన వాడుతున్న భాష ప్రధాని స్థాయి వ్యక్తి వాడదగింది కాదని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం బెంగళూరుకు వచ్చిన ఆయన కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకింగ్ మోసాలు నాలుగురెట్లు ‘ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ యూపీఏ హయాంలో భారత వృద్ధి రేటు 7.8 శాతంగా కొనసాగింది. ప్రస్తుత ప్రధాని మోదీ పాలనలో దేశాభివృద్ధి 14 ఏళ్లు వెనక్కి వెళ్లింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు’ అని మన్మోహన్ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 67 శాతం తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారని, మోదీ హయాంలో ఎక్సైజ్ పన్నులను మితిమీరి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ హయాంలో బ్యాంకింగ్ మోసాలు నాలుగురెట్లు పెరిగాయని, పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త నిర్వహణ లోపం వల్ల బ్యాంకింగ్ రంగంపై ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నగదు కొరత విపరీతంగా వేధిస్తోందని, మంచివని ప్రచారం చేస్తూ మోదీ ప్రవేశపెడుతున్న విధానాలు చివరకు నష్టాల్ని మిగులుస్తున్నాయని ఎద్దేవా చేశారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పరారీపై మాట్లాడుతూ.. 2015, 2016 సంవత్సరాల్లో ఏదో తప్పు జరుగుతుందన్న సంకేతాలు వెలువడినప్పటికీ మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తీవ్ర సంక్షోభంలో రైతన్న ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది’ అని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీయే హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు శూన్యమని, వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోందని తప్పుపట్టారు. ‘వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 21 శాతం తగ్గిపోయాయి. మోదీ మాత్రం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్టుబడులు 34–35 శాతం పెరిగాయని, మోదీ హయాంలో ఆ రంగం పూర్తిగా దెబ్బతిందని మన్మోహన్ విమర్శించారు. ‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో తిరోగమనంలో పయనిస్తోంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారు. అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతింది’ అని మన్మోహన్ మండిపడ్డారు. -
చుక్కల్లో సంపన్నుడు.. పాతాళంలో పేదోడు.. ఇదే ఇండియా!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భారత్ మూడవ బలమైన ఆర్థిక శక్తిగా బలపడిందంటే కొనుగోలు శక్తిలో మాత్రమే. దీన్ని కూడా గర్వించతగ్గ పరిణామంగానే పరిణమించినా ప్రపంచంలోనే ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాల్లో రష్యా తర్వాత స్థానాన్ని భారతదేశం ఆక్రమించి ఉందన్న అపకీర్తిని ఎలా జీర్ణించుకోవాలి? క్రెడిట్ సూస్స్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ అంచనాల ప్రకారం భారత దేశంలోని 60 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. అదే రష్యాలోనైతే 74 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. ఇక 80 శాతం భారత్ ఆస్తి 10 శాతం ప్రజల వద్దనే పోగుబడిపోయింది. మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990 నుంచి ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. అంటే, 1,130 డాలర్ల నుంచి 6, 576 డాలర్లకు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి తగ్గుముఖం పట్టి ఆయు: ప్రమాణం పెరిగింది. దేశ జనాభా 130 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్, బంగ్లా, పాకిస్థాన్ లాంటి దేశాలను అధిగమించింది. అయితే ఈ అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. హిందువుల్లోని అగ్రకులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో పెరిగింది. ఈ వర్గాలకు చెందిన 28 శాతం ప్రజలు, అంటే 36 కోట్ల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారత్‌లో సగటు భారతీయులు దారిద్య్రంలోనే జీవిస్తున్నారు. భారత ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ఆర్థిక వృద్ధి రేటుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆర్థికాభివృద్ధిని ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూసినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక ఫలాలు పేదలకు కూడా చేరుతాయి. దాన్నే సామాజిక అభివృద్ధిగా నిపుణులు చెబుతారు. 2000 సంవత్సరం నుంచి 2016 వరకు భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినా.. సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందారు. 2000 సంవత్సరంలో 1 శాతం ధనికుల వద్ద 36.8 శాతం ఆస్తులుండగా, నేటికి అవి 60 శాతానికి చేరుకున్నాయి. మొత్తం దేశం ఆస్తిలో 4.1 శాతం వాటానే పేదలు అనుభవిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ సూస్స్, ఆక్స్‌ఫామ్ సంస్థల అంచనా ప్రకారం 1988 నుంచి 2011 మధ్య కాలంలో పేదవారిలో పది శాతం పేద వారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా, పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. పేదవారి ఆదాయం ఏటా ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. క్రోని క్యాపిటలిజం, కార్పొరేషన్ సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు, వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి. మధ్య తరగతి కూడా పెద్ద దెబ్బ ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్ వెనుకబడింది. -
2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5–7 ట్రిలియన్ డాలర్ల (6.5–7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ గురువారం పేర్కొన్నారు. 2035–40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన పాత్రను గణనీయంగా మెరుగుపరచుకోనుందని ఆయన ఈ సదస్సులో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, చాలా మంది ఇతరుల కోసం ఉపాధి అవకాశాలను సైతం సృష్టిస్తున్నారు.’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. దేశంలో భూ యాజమాన్యానికి సంబంధించిన వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో పది అతిపెద్ద ఎకానమీలు