సైబర్ బురిడీ | lottery Cheating | Sakshi
Sakshi News home page

సైబర్ బురిడీ

Published Sat, Feb 22 2014 6:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

lottery Cheating

  • భారత ఆర్థిక వ్యవస్థను కూల్చేందుకు ఐఎస్‌ఐ కుతంత్రం
  •   దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్
  •   ‘+92’ ఫోన్‌కాల్స్‌తో లాటరీలంటూ మోసం
  •   ముగ్గురిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
  •   దేశంలో వందకు పైగా ముఠాలు: అదనపు సీపీ
  •  సాక్షి, సిటీబ్యూరో : ఇప్పటివరకు నకిలీ నోట్లను గుప్పించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) కొత్త పంథా అనుసరిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతూ చాపకింద నీరులా హవాలా వ్యాపారం కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ నేరం జరుగుతున్న విధానాన్ని ఆధారంగా చేసుకునే ఐఎస్‌ఐ పాత్రను అనుమానిస్తున్నామని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు, సిట్) సందీప్ శాండిల్య శుక్రవారం వెల్లడించారు. సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు, అదనపు డీసీపీ ఎంవీ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ తరహా ముఠాలు దేశ వ్యాప్తంగా మరో 100 వరకు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
     
     ఒక్కోక్కరికీ ఒక్కో బాధ్యత
     పాక్ కేంద్రంగా సాగుతున్న ఈ హైటెక్ వ్యవహారంలో అక్కడి వారు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
     
     మొదటి అంచలో భారత్ నుంచి వెళ్లి లేదా భారత్‌లో బంధువులుండి దుబాయ్‌లో ఉంటున్న వారు ఉంటున్నారు.
     
     వీరి ద్వారా ఇక్కడ ఉన్న వారి బంధువుల్ని సంప్రదించి లోకల్ మాడ్యుల్ ఏర్పాటు చేస్తున్నారు.
     
     దుబాయ్‌లో ఉన్న వారు ప్రాథమికంగా భారత్‌కు చెందిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతుల వారి ఫోన్ నెంబర్లు సేకరించాల్సి ఉంటుంది.
     
     ఈ వివరాలను పాకిస్థాన్‌లో ఉన్నవారికి అందించడంతో పాటు భారత్‌లో ఉన్న మాడ్యుల్స్ ద్వారా బోగస్ వివరాలతో వీలైనన్ని బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు తీసుకునేలా చేయాలి.
     
     ఆ ఖాతాల నెంబర్లను పాకిస్థాన్‌కు పంపాలి. దుబాయ్‌లో ఉంటున్న వారి నుంచి సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పాకిస్థాన్ మాడ్యుల్ అసలు వ్యవహారం ప్రారంభిస్తుంది.
     
     అక్కడి సిమ్‌కార్డుల్ని వినియోగించి భారత్‌లో ఉన్న వారిలో రోజుకు 100 నుంచి 150 మందిని సంప్రదిస్తుంది.
     
     పాకిస్థాన్ ఇంటర్మేషనల్ కోడ్ 0092 కావడంతో ఇవన్నీ ‘+92’తో డిస్‌ప్లే అవుతాయి.
     
     వీటిని రిసీవ్ చేసుకున్న వారిలో హిందీ, ఉర్దూ మాట్లాడే ఓ వర్గం వారినే ఎంచుకుని టార్గెట్‌గా చేసుకుంటున్నారు.
     
     ఈ బాధితుల్లో పాతబస్తీతో పాటు సైబరాబాద్ శివార్లు, విశాఖపట్నానికి చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు.
     
     కేబీసీ అంటూ అందినకాడికి దండుకుని...
     అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తున్న మోసగాళ్లు మీ నెం బర్‌కు రూ.25 లక్షల లాటరీ తగిలిందంటూ ఎర వేస్తున్నారు.
     
     ఆసక్తి చూపినవారితో సంప్రదిస్తూ గుర్తింపుకార్డుల్ని స్కాన్ చేసి ఈ-మెయిల్ ద్వారా పంపమని కోరుతున్నారు.
     
     అలా అందుకున్న వాటితో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు తయారు చేయించి మెయిల్ చేస్తున్నారు.
     
     ఈ రకంగా బాధితులు పూర్తిగా నమ్మారని భావించిన తరవాత వివిధ రకాలైన పన్నులు, క్లియరెన్స్‌ల పేరుతో వీరి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.
     
     ఈ మొత్తాల్ని భారత్ మాడ్యుల్ ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల నెంబర్లు చెప్పి వాటిలో డిపాజిట్ చేయిస్తున్నారు.
     
     ఇలా పలుదఫాలుగా డబ్బులు డిపాజిట్ చేసిన తరవాత మోసపోయామని గుర్తించిన బాధితులు ‘+92’ నెంబర్లకు ఫోన్ చేస్తే అవి పని చేయట్లేదని తెలుస్తోంది.
     
     బ్యాంక్ ఖాతా వివరాలు ఆరా తీసినా అప్పటికే మొత్తం ఖాళీ అయిపోతున్నాయి.
     
     ఆరు నెలల్లో 16 ఫిర్యాదులు రావడంతో...
      ‘+92’ ఫోన్ కాల్స్ బారినపడ్డామంటూ గత ఆరు నెలల్లో  సైబర్ క్రైమ్ పోలీసులకు 16 ఫిర్యాదులు అందాయి.
     
     ఈ బాధితులు రూ.24 లక్షలు కోల్పోయారు. దీంతో డీసీపీ జి.పాలరాజు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.
     
     ఈ బృందం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన షహెన్‌షా, మహ్మద్ అఫ్తాబ్‌లతో పాటు బీహార్‌లోని పాట్నాకు చెందిన సుజీత్‌కుమార్‌లను అరెస్టు చేశారు.
     
     వీరి నుంచి రూ.15.1 లక్ష నగదు, 70 డెబిట్ కార్డులు, 40 బోగస్ ఓటర్ ఐడీలు, 38 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
     
     బ్యాంకు ఖాతాలు తెరవడంలో కీలకపాత్ర పోషిస్తూ, ఖాతాల్లో పడిన డబ్బును ఏటీఎంల ద్వారా డ్రా చేసి అలహాబాద్‌లో ఉన్న రెండు ముఠాలకు అప్పగిస్తూ వీరు కమీషన్లు తీసుకుంటున్నారని తేలింది.
     
      6 నెలలుగా ఈ త్రయం 100 బ్యాంకు ఖాతాలు తెరిచారు.
     
      ఇదే ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం గాలిస్తున్నారు.
     
     పాక్, దుబాయ్‌లకు అనుబంధంగా పని చేసే ముఠాలు మధ్యప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్‌ల్లోనూ ఉన్నట్లు గుర్తించారు.
     
      ఈ నిందితులపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఆరోపణలు నమోదు చేస్తున్నామని సందీప్ శాండిల్య వెల్లడించారు.
     
     ప్రత్యేక హవాలా మార్పిడి ద్వారా పాక్‌కు
     రెండు దే శాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా అంటారు.
     
     దుబాయ్ కేంద్రంగా జరిగే ఈ వ్యవహారంలో ఓ సంస్థకు రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు.
     
     అక్కడి నుంచి ఇక్కడకు డబ్బు పంపాలని భావించిన వారు వీరిని ఆశ్రయిస్తారు.
     
     దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌కు డబ్బును అందిస్తే... అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని అదే సంస్థకు చెందిన మరో ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీ చేస్తాడు.
     
     ఇటు నుంచి అటు నగదు వెళ్లాలన్నా ఇదే పద్ధతిలో జరుగుతుంది.
     
     అయితే ప్రత్యేక హవాలాకు పాల్పడుతున్న ఐఎస్‌ఐ కొత్త పంథా అనుసరిస్తోంది.
     
     దుబాయ్‌లో వ్యక్తుల నుంచి ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న దుబాయ్ మాడ్యుల్‌తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు.
     
     ఇక్కడ డెలివరీ చేయడానికి మాత్రం భారత్‌లోని బ్యాంకు ఖాతాల్లో పడిన ‘+92 నేరాలకు’ సంబంధించిన డబ్బును వినియోగిస్తున్నారు.
     
     ఈ తరహాలో పనిచేసే రెండు ముఠాలు అలహాబాద్‌లో ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement