the lottery
-
మందడుగు
జూన్ 27. వాతావరణం తేటగా, పొడిగా ఉంది. పదింటి ప్రాంతంలో గ్రామస్థులు పోస్టాఫీసుకూ బ్యాంకుకూ మధ్యనున్న స్థలంలో గుమిగూడసాగారు. వేరే పట్టణాల్లో అయితే ఈ లాటరీ తీయడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అందుకే వ్యవహారం జూన్ 20 కల్లా మొదలైపోతుంది. ఈ గ్రామంలో మహా అయితే ఉన్నది మూడువందల మంది. రెండు గంటల్లోపే లాటరీ తీయడం అయిపోతుంది. పదింటికి మొదలుపెట్టినా మధ్యాహ్న భోజనానికి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవచ్చు. సహజంగానే పిల్లలు ముందు పోగయ్యారు. ఈమధ్యే వారికి ఎండాకాలం సెలవులు ప్రకటించారు. ఆ స్వేచ్ఛ వారిని నిలువనీయడం లేదు. బాబీ మార్టిన్ అప్పుడే జేబుల్లో రాళ్లను నింపేసుకున్నాడు. మిగిలినవాళ్లు కూడా వాడిని అనుసరిస్తూ గుండ్రటి, నున్నటి రాళ్లను ఏరుతున్నారు. బాబీ, హారీ జోన్స్, డికీ డెలాక్రాయ్ ఒక మూలన రాళ్లు పోగేసి, వాటిని ఎవరూ ఎత్తుకుపోకుండా ఓ కన్నేసి ఉంచారు. ఆడపిల్లలు మరో పక్కన నిల్చుని మాట్లాడుతున్నారు. తర్వాత మగవాళ్లు రావడం మొదలైంది. పిల్లల్ని ఓ కంట గమనిస్తూ విత్తనాలు, వానలు, ట్రాక్టర్లు, పన్నుల గురించి సంభాషిస్తున్నారు. అనంతరం వెలిసిపోయిన బట్టల్లో గృహిణులు వచ్చారు. ఒకరినొకరు పలకరించుకుని, తమ భర్తల వెనకాల వెళ్లి నిలుచుండి, పిల్లల్ని కేకేశారు. నాలుగైదు సార్లు పిలిచాకగానీ వాళ్లు తల్లుల దగ్గరికి రాలేదు. గ్రామంలో ఆటపాటలు నిర్వహించినట్టుగానే ఈ లాటరీ బాధ్యతను కూడా మిస్టర్ సమ్మర్స్ చూసుకుంటాడు. ఆయన బ్లూ జీన్స్, తెల్ల చొక్కా వేసుకున్నాడు. బొగ్గు వ్యాపారంలో ఉన్నాడు. పిల్లలు లేరు. సమయాన్నీ శక్తినీ వెచ్చించే వెసులుబాటు ఆయనకు ఉంది. ఆయన చేతిలోని నల్లటి చెక్కపెట్టెను చూడగానే గ్రామస్తుల్లో గుసగుసలు మొదలైనాయి. సమ్మర్స్ వెనకాలే పోస్ట్‌మాస్టర్ మిస్టర్ గ్రేవ్స్ ముక్కాలి స్టూల్‌ను తెచ్చి వేయగానే దానిమీద చెక్కపెట్టెను ఉంచాడు సమ్మర్స్. ఎవరైనా సాయం చేయమని సమ్మర్స్ అనగానే మార్టిన్, ఆయన పెద్దకొడుకు బాక్స్టర్ వెళ్లి కదలకుండా స్టూలును పట్టుకున్నారు. లోపలి చీటీలను సమ్మర్స్ కలియబెట్టాడు. లాటరీకి సంబంధించిన అసలైన సరంజామా ఎప్పుడో పోయింది. ఈ నల్లపెట్టె కూడా ఊరిలోని కురువృద్ధుడు వార్నర్ పుట్టకముందునుంచీ ఉంటున్నది. ఇంకో కొత్తపెట్టె చేయించడం గురించి సమ్మర్స్ చాలాసార్లు గ్రామస్తులతో తలపోశాడు. కానీ సంప్రదాయానికి ప్రాతినిధ్యంగా ఉన్న ఈ నల్లపెట్టెని మార్చడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఊళ్లో చెప్పుకునే కథ ఏమిటంటే, ఈ పెట్టె తయారీలో దీనికి పూర్వం వాడుకలో ఉన్న పెట్టెలోని కొన్ని చెక్కలను కలిపారు; ఆ పాతపెట్టెను గ్రామంలో తొలిగా స్థిరపడిన పెద్దలు నిర్మించారు. కాలక్రమంలో ఆచారంలోని చాలాభాగం మరిచిపోవడమో వదిలివేయడమో జరిగింది. తరాలుగా వాడుకలో ఉన్న చెక్క పలకల స్థానంలో కాగితాలను ప్రవేశపెట్టడంలో మాత్రం సమ్మర్స్ విజయవంతం అయ్యాడు. జనాభా తక్కువున్నప్పుడు ఆ చెక్క పలకలను నల్లపెట్టెలో వేయడం సులభమయ్యింది. జనం పెరిగాక ఆ పెట్టెలో సులభంగా పట్టేవి కావాలని ఆయన వాదించాడు. లాటరీకి ముందురోజు రాత్రి సమ్మర్స్, గ్రేవ్స్ ఇద్దరూ ఈ చీటీలు సిద్ధం చేసి పెట్టెలో వేసి, తెల్లారి ఇక్కడికి తెచ్చేదాకా సమ్మర్స్ బొగ్గు కంపెనీలో నిలిపి తాళం వేసి ఉంచుతారు. మిగిలిన ఏడాదంతా పెట్టె ఎక్కడో దగ్గర పడివుంటుంది. ఈ లాటరీ ప్రారంభించడానికి ముందు బానే హడావుడి జరుగుతుంది. ముందు వంశ పెద్దల జాబితా సిద్ధం చేయాలి, తర్వాత కుటుంబ పెద్దల జాబితా, అటుపై కుటుంబంలోని సభ్యుల జాబితా. ఈ లాటరీ నిర్వహణ బాధ్యతను సమ్మర్స్‌కు అప్పగిస్తున్నట్టు గ్రేవ్స్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఈ సందర్భానికి తగిన పాటేదో ఉండేది.ఇంతలో హడావుడి పడుతూ శ్రీమతి హచిన్సన్ పరుగెత్తుకొచ్చింది. శ్రీమతి డెలాక్రాయ్‌తో ‘మా ఆయన కట్టెల కోసం పోయాడేమో అనుకున్నా, తీరా కిటికీలోంచి చూస్తే పిల్లలూ లేరు, అప్పుడు గుర్తొచ్చింది ఇవ్వాళ ఇరవై ఏడని, వెంటనే పరుగెత్తుకొచ్చాను’ అంది. నువ్వు సమయానికే వచ్చావని శ్రీమతి డెలాక్రాయ్ సమాధానమిచ్చింది. అందరూ ఉన్నట్టేనా? అని సమ్మర్స్ అడిగాడు. జనం ‘డన్బార్. డన్బార్’ అని అరిచారు. ‘అవునుగదా, క్లైడ్ డన్బార్ కాలు విరిగింది. ఆయన బదులుగా ఎవరు చీటీ తీస్తారు?’ నేను తీస్తానంటూ ఒక మహిళ జవాబిచ్చింది. భర్తకు బదులుగా భార్య, ఇంట్లో వయసుకొచ్చిన మగపిల్లలు లేరా జేనీ? అని సమ్మర్స్ అడిగాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసినా లాటరీ పెద్దగా ఈ ప్రశ్నలు వేయడం ఆనవాయితీ. హొరేస్ ఉన్నాడుగానీ ఇంకా పదహారేళ్లు నిండలేదని పశ్చాత్తాపంగా జవాబిచ్చింది శ్రీమతి డన్బార్. ‘వాట్సన్ బాయ్ ఈసారి కూడా తీస్తున్నాడా?’ అవును, మా అమ్మా నా తరఫున నేను తీస్తానంటూ గుంపులోంచి ఓ పొడుగాటి యువకుడు చేయెత్తాడు. అందివచ్చిన కొడుకు ఉన్నాడని గుంపులోని కొన్ని గొంతులు మాట్లాడుకున్నాయి. ‘ఇప్పుడు నేను ముందుగా వంశపెద్దల పేర్లను పిలుస్తాను, ఒక్కొక్కరూ వచ్చి పెట్టెలోని చీటీ తీసుకోండి. ప్రతి ఒక్కరూ తీసుకునేదాకా మడత విప్పకూడదు. సరేనా?’ అని ప్రశ్నించాడు సమ్మర్స్. ప్రతిసారీ జరిగే తంతే కాబట్టి, సగం సగం విన్నారు జనం. ‘ఆడమ్స్’. గుంపులోంచి ఒక మనిషి ముందుకు వెళ్లాడు. ‘హాయ్ స్టీవ్’ అని పలకరించాడు సమ్మర్స్. ‘హాయ్ జో’ అని బదులిచ్చాడు ఆడమ్స్. తర్వాత పెట్టెదగ్గరికి వెళ్లి, ఒక చీటీ తీసుకుని తన స్థానంలోకి వచ్చి నిలుచున్నాడు. ‘ఆల్లెన్’. ‘ఆండర్సన్’. ‘బెంథామ్’. మిస్టర్ గ్రేవ్స్ కూడా చీటీ తీసుకున్నాడు. సమ్మర్స్ తన పేరు తానే పిలుచుకుని తనూ ఓ చీటీ తీసుకున్నాడు. అందరూ అయ్యాక, తమ చేతిల్లో ఉన్న చీటీలను తెరిచి చూసుకున్నారు. వెంటనే జనంలో కోలాహలం మొదలైంది. ‘ఎవరు?’ ‘ఎవరికొచ్చింది?’ ‘హచిన్సన్’ ‘బిల్ హచిన్సన్కు వచ్చింది.’ తండ్రికి విషయం చెప్పిరమ్మని పెద్దకొడుకును ఇంటికి పరుగెత్తించింది శ్రీమతి డన్బార్. హచిన్సన్ ఎక్కడున్నాడని జనం వెతికారు. బిల్ హచిన్సన్ తన కాగితం చూసుకుంటూ మౌనంగా నిలుచున్నాడు. వెంటనే బిగ్గరగా టెస్సీ హచిన్సన్ అరవసాగింది. ‘సమ్మర్స్, ఆయనకు కావాల్సిన కాగితాన్ని తీసుకునే సమయం నువ్వు ఇవ్వలేదు, నేను చూశాను, ఇదేం బాగాలేదు’. ‘నోర్మూసుకో టెస్సీ’ అని బిల్ హచిన్సన్ అన్నాడు. ‘బిల్, నువ్వు హచిన్సన్ వంశానికి చీటీ తీశావు. హచిన్సన్ వంశంలో ఎన్ని కుటుంబాలున్నాయి?’ కూతుళ్లు డాన్, ఈవా పేర్లు చెబుతుంది టెస్సీ. వాళ్లను వాళ్ల భర్తల కుటుంబాలతో లెక్కిస్తారు, అది నీకూ తెలుసని జవాబిస్తాడు సమ్మర్స్. తర్వాతి చీటీ, కుటుంబ పెద్ద ఎవరో తెలియడం కోసం తీస్తారు. హచిన్సన్ ఇంట్లో పెళ్లయినవాళ్లుపోగా బిల్ జూనియర్, నాన్సీ, డేవ్ ఉన్నారు. అంటే వంశ పెద్దగానూ, కుటుంబపెద్దగానూ రెండింటికీ బిల్ హచిన్సన్ చీటీ తీసినట్టు! ఒకేసారి రెండు రౌండ్లు ముగిసినట్టు. ఇక మూడో రౌండులో బిల్, టెస్సీతో కలిపి ఈ ఐదుగురి పేర్లను రాసిన చీటీలను తీయాలి. అయితే డేవ్ పసివాడు కాబట్టి వాడి చీటి విషయంలో సాయపడవలిసిందిగా హారీని కోరాడు సమ్మర్స్. అప్పటికీ టెస్సీ ఇది అన్యాయమని అరుస్తూనేవుంది. మళ్లీ మొదలుపెడదామని డిమాండు చేస్తూనేవుంది. ఆమె మాటల్ని ఎవరూ ఖాతరు చేయలేదు. ఐదుగురూ ఒక్కొక్కరూ వచ్చి చీటీలను తీసుకున్నారు. డేవ్‌కు హారీ సాయపడ్డాడు. నాన్సీకి రాకూడదని ఆమె స్నేహితురాలు కోరుకుంది. ఐదుగురూ తీసుకున్నాక, చీటీలను తెరిచారు. ఎత్తిపట్టి జనానికి చూపించారు. ఖాళీ. బిల్ నీది? అదీ ఖాళీ. టెస్సీ నీది? టెస్సీ చూపించలేదు. బిల్ భార్యను కోప్పడి, బలవంతంగా తెరిచాడు. నల్లమచ్చ! టెస్సీ చేతికి వచ్చిన కాగితంలో నల్లమచ్చ. జనంలో కదలిక మొదలైంది. ‘జనులారా, త్వరగా ముగించేద్దాం’ అన్నాడు సమ్మర్స్. పెద్దరాయిని రెండు చేతులతో ఎత్తింది శ్రీమతి డెలాక్రాయ్. పిల్లలు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎవరో డేవ్ చేతికి కూడా కొన్ని గులకరాళ్లు ఇచ్చారు. వార్నర్ ఉత్తేజపరుస్తున్నాడు. ఆడమ్స్, గ్రేవ్స్ కూడా రెడీ. టెస్సీ హచిన్సన్ జనం మధ్యలో నిలబడి వుంది. పక్కనుంచి మొదటి రాయి వచ్చి ఆమె తలకు తగిలింది. అమెరికన్ రచయిత్రి షిర్లీ జాక్సన్ (1916–1965) కథ ‘ద లాటరీ’ కి సంక్షిప్త రూపం ఇది. 1948 లో ‘న్యూయార్కర్’ లో దీన్ని ప్రచురించినప్పుడు వేలాదిమంది పాఠకులు తిట్టిపోస్తూ ఉత్తరాలు రాశారు. ఆ పత్రిక చరిత్రలోనే ఇంత స్పందన మరే కథకూ రాలేదు. అయితే, మూక మనస్తత్వాన్నీ, హేతువిరుద్ధంగా ఆచారాలను పాటించే తీరునూ శక్తిమంతమైన సంకేతాలతో చిత్రించిన కథగా విమర్శకులు దీన్ని తర్వాత ప్రశంసించారు. దీని సంక్షిప్తం: సాక్షి సాహిత్యం డెస్క్. షిర్లీ జాక్సన్ -
సైబర్ బురిడీ
భారత ఆర్థిక వ్యవస్థను కూల్చేందుకు ఐఎస్ఐ కుతంత్రం దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్ ‘+92’ ఫోన్‌కాల్స్‌తో లాటరీలంటూ మోసం ముగ్గురిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు దేశంలో వందకు పైగా ముఠాలు: అదనపు సీపీ సాక్షి, సిటీబ్యూరో : ఇప్పటివరకు నకిలీ నోట్లను గుప్పించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కొత్త పంథా అనుసరిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతూ చాపకింద నీరులా హవాలా వ్యాపారం కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ నేరం జరుగుతున్న విధానాన్ని ఆధారంగా చేసుకునే ఐఎస్ఐ పాత్రను అనుమానిస్తున్నామని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు, సిట్) సందీప్ శాండిల్య శుక్రవారం వెల్లడించారు. సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు, అదనపు డీసీపీ ఎంవీ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ తరహా ముఠాలు దేశ వ్యాప్తంగా మరో 100 వరకు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కోక్కరికీ ఒక్కో బాధ్యత పాక్ కేంద్రంగా సాగుతున్న ఈ హైటెక్ వ్యవహారంలో అక్కడి వారు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మొదటి అంచలో భారత్ నుంచి వెళ్లి లేదా భారత్‌లో బంధువులుండి దుబాయ్‌లో ఉంటున్న వారు ఉంటున్నారు. వీరి ద్వారా ఇక్కడ ఉన్న వారి బంధువుల్ని సంప్రదించి లోకల్ మాడ్యుల్ ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్‌లో ఉన్న వారు ప్రాథమికంగా భారత్‌కు చెందిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతుల వారి ఫోన్ నెంబర్లు సేకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పాకిస్థాన్‌లో ఉన్నవారికి అందించడంతో పాటు భారత్‌లో ఉన్న మాడ్యుల్స్ ద్వారా బోగస్ వివరాలతో వీలైనన్ని బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు తీసుకునేలా చేయాలి. ఆ ఖాతాల నెంబర్లను పాకిస్థాన్‌కు పంపాలి. దుబాయ్‌లో ఉంటున్న వారి నుంచి సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పాకిస్థాన్ మాడ్యుల్ అసలు వ్యవహారం ప్రారంభిస్తుంది. అక్కడి సిమ్‌కార్డుల్ని వినియోగించి భారత్‌లో ఉన్న వారిలో రోజుకు 100 నుంచి 150 మందిని సంప్రదిస్తుంది. పాకిస్థాన్ ఇంటర్మేషనల్ కోడ్ 0092 కావడంతో ఇవన్నీ ‘+92’తో డిస్ప్లే అవుతాయి. వీటిని రిసీవ్ చేసుకున్న వారిలో హిందీ, ఉర్దూ మాట్లాడే ఓ వర్గం వారినే ఎంచుకుని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఈ బాధితుల్లో పాతబస్తీతో పాటు సైబరాబాద్ శివార్లు, విశాఖపట్నానికి చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. కేబీసీ అంటూ అందినకాడికి దండుకుని... అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తున్న మోసగాళ్లు మీ నెం బర్కు రూ.25 లక్షల లాటరీ తగిలిందంటూ ఎర వేస్తున్నారు. ఆసక్తి చూపినవారితో సంప్రదిస్తూ గుర్తింపుకార్డుల్ని స్కాన్ చేసి ఈ-మెయిల్ ద్వారా పంపమని కోరుతున్నారు. అలా అందుకున్న వాటితో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు తయారు చేయించి మెయిల్ చేస్తున్నారు. ఈ రకంగా బాధితులు పూర్తిగా నమ్మారని భావించిన తరవాత వివిధ రకాలైన పన్నులు, క్లియరెన్స్‌ల పేరుతో వీరి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఈ మొత్తాల్ని భారత్ మాడ్యుల్ ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల నెంబర్లు చెప్పి వాటిలో డిపాజిట్ చేయిస్తున్నారు. ఇలా పలుదఫాలుగా డబ్బులు డిపాజిట్ చేసిన తరవాత మోసపోయామని గుర్తించిన బాధితులు ‘+92’ నెంబర్లకు ఫోన్ చేస్తే అవి పని చేయట్లేదని తెలుస్తోంది. బ్యాంక్ ఖాతా వివరాలు ఆరా తీసినా అప్పటికే మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఆరు నెలల్లో 16 ఫిర్యాదులు రావడంతో... ‘+92’ ఫోన్ కాల్స్ బారినపడ్డామంటూ గత ఆరు నెలల్లో సైబర్ క్రైమ్ పోలీసులకు 16 ఫిర్యాదులు అందాయి. ఈ బాధితులు రూ.24 లక్షలు కోల్పోయారు. దీంతో డీసీపీ జి.పాలరాజు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ బృందం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన షహెన్షా, మహ్మద్ అఫ్తాబ్‌లతో పాటు బీహార్‌లోని పాట్నాకు చెందిన సుజీత్‌కుమార్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.15.1 లక్ష నగదు, 70 డెబిట్ కార్డులు, 40 బోగస్ ఓటర్ ఐడీలు, 38 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు తెరవడంలో కీలకపాత్ర పోషిస్తూ, ఖాతాల్లో పడిన డబ్బును ఏటీఎంల ద్వారా డ్రా చేసి అలహాబాద్‌లో ఉన్న రెండు ముఠాలకు అప్పగిస్తూ వీరు కమీషన్లు తీసుకుంటున్నారని తేలింది. 6 నెలలుగా ఈ త్రయం 100 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇదే ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం గాలిస్తున్నారు. పాక్, దుబాయ్‌లకు అనుబంధంగా పని చేసే ముఠాలు మధ్యప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్‌ల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ నిందితులపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఆరోపణలు నమోదు చేస్తున్నామని సందీప్ శాండిల్య వెల్లడించారు. ప్రత్యేక హవాలా మార్పిడి ద్వారా పాక్‌కు రెండు దే శాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా అంటారు. దుబాయ్ కేంద్రంగా జరిగే ఈ వ్యవహారంలో ఓ సంస్థకు రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడకు డబ్బు పంపాలని భావించిన వారు వీరిని ఆశ్రయిస్తారు. దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌కు డబ్బును అందిస్తే... అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని అదే సంస్థకు చెందిన మరో ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీ చేస్తాడు. ఇటు నుంచి అటు నగదు వెళ్లాలన్నా ఇదే పద్ధతిలో జరుగుతుంది. అయితే ప్రత్యేక హవాలాకు పాల్పడుతున్న ఐఎస్ఐ కొత్త పంథా అనుసరిస్తోంది. దుబాయ్‌లో వ్యక్తుల నుంచి ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న దుబాయ్ మాడ్యుల్‌తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. ఇక్కడ డెలివరీ చేయడానికి మాత్రం భారత్‌లోని బ్యాంకు ఖాతాల్లో పడిన ‘+92 నేరాలకు’ సంబంధించిన డబ్బును వినియోగిస్తున్నారు. ఈ తరహాలో పనిచేసే రెండు ముఠాలు అలహాబాద్‌లో ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. -
నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల జైలు
గాజువాక, న్యూస్‌లైన్ : లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయని యువతిని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నైజీరియా దేశస్తుడికి ఎనిమిది నెలల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 అపరాధ రుసుం విధిస్తూ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.దత్తాత్రేయులు సోమవారం తీర్పు చెప్పారు. మిలియన్ పౌండ్లు లాటరీలో వచ్చాయని 47వ వార్డు ములగాడ హౌసింగ్‌కాలనీకి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని లండా రమాదేవికి నైజీరియాకు చెందిన ఫ్రిడో అంబ్రోస్ గత ఏడాది మేలో సెల్‌ఫోన్ ద్వారా సమాచారం పంపించాడు. ఆమె వారిని ఫోన్లో సంప్రదించగా ఆ డబ్బును విడుదల చేయడం కోసం రూ.21 వేలు అవసరమని అకౌంట్ నంబర్ ద్వారా వసూలు చేశాడు. లాటరీ డబ్బు అధిక మొత్తంలో ఉందని దాన్ని ఇండియన్ కరెన్సీకి మార్చడం కోసం అదనంగా రూ.2.10 లక్షలు చెల్లించాలని మరో అకౌంట్ నంబర్ ఇచ్చాడు. ఆమె అదే రోజు రూ.50 వేలు, మరుసటిరోజు రూ.1.60 లక్షలు వేరొక అకౌంట్ నంబర్‌కు పంపింది. మళ్లీ రూ.9 లక్షలు చెల్లించాలని యువతికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. విసుగెత్తిన యువతి తనకు లాటరీ సొమ్ము వద్దని, తాను చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటే కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. తాను బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని, ఇంటికి వస్తే డబ్బు ఇస్తానని చెప్పడంతో అతడు జూన్ 12న ఇంటికి వచ్చాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న కుటుంబ సభ్యులు అతడిని బంధించి గాజువాక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. కేసును సైబర్ క్రైమ్ సీఐ వెంకటేశ్వరరావు విచారించగా, నకిలీ పాస్‌పోర్టుపై అతడు భారత్‌కు వచ్చినట్టు నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ వాదనలు అనంతరం నిందితునికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ కేసు వాదించారు.