మందడుగు | Shirley Jackson The Lottery Story | Sakshi
Sakshi News home page

మందడుగు

Published Mon, Jan 21 2019 12:15 AM | Last Updated on Mon, Jan 21 2019 12:15 AM

Shirley Jackson The Lottery Story - Sakshi

జూన్‌ 27. వాతావరణం తేటగా, పొడిగా ఉంది. పదింటి ప్రాంతంలో గ్రామస్థులు పోస్టాఫీసుకూ బ్యాంకుకూ మధ్యనున్న స్థలంలో గుమిగూడసాగారు. వేరే పట్టణాల్లో అయితే ఈ లాటరీ తీయడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అందుకే వ్యవహారం జూన్‌ 20 కల్లా మొదలైపోతుంది. ఈ గ్రామంలో మహా అయితే ఉన్నది మూడువందల మంది. రెండు గంటల్లోపే లాటరీ తీయడం అయిపోతుంది. పదింటికి మొదలుపెట్టినా మధ్యాహ్న భోజనానికి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవచ్చు. సహజంగానే పిల్లలు ముందు పోగయ్యారు. ఈమధ్యే వారికి ఎండాకాలం సెలవులు ప్రకటించారు. ఆ స్వేచ్ఛ వారిని నిలువనీయడం లేదు. బాబీ మార్టిన్‌ అప్పుడే జేబుల్లో రాళ్లను నింపేసుకున్నాడు. మిగిలినవాళ్లు కూడా వాడిని అనుసరిస్తూ గుండ్రటి, నున్నటి రాళ్లను ఏరుతున్నారు. బాబీ, హారీ జోన్స్, డికీ డెలాక్రాయ్‌ ఒక మూలన రాళ్లు పోగేసి, వాటిని ఎవరూ ఎత్తుకుపోకుండా ఓ కన్నేసి ఉంచారు. ఆడపిల్లలు మరో పక్కన నిల్చుని మాట్లాడుతున్నారు.

తర్వాత మగవాళ్లు రావడం మొదలైంది. పిల్లల్ని ఓ కంట గమనిస్తూ విత్తనాలు, వానలు, ట్రాక్టర్లు, పన్నుల గురించి సంభాషిస్తున్నారు. అనంతరం వెలిసిపోయిన బట్టల్లో గృహిణులు వచ్చారు. ఒకరినొకరు పలకరించుకుని, తమ భర్తల వెనకాల వెళ్లి నిలుచుండి, పిల్లల్ని కేకేశారు. నాలుగైదు సార్లు పిలిచాకగానీ వాళ్లు తల్లుల దగ్గరికి రాలేదు. గ్రామంలో ఆటపాటలు నిర్వహించినట్టుగానే ఈ లాటరీ బాధ్యతను కూడా మిస్టర్‌ సమ్మర్స్‌ చూసుకుంటాడు. ఆయన బ్లూ జీన్స్, తెల్ల చొక్కా వేసుకున్నాడు. బొగ్గు వ్యాపారంలో ఉన్నాడు. పిల్లలు లేరు. సమయాన్నీ శక్తినీ వెచ్చించే వెసులుబాటు ఆయనకు ఉంది. ఆయన చేతిలోని నల్లటి చెక్కపెట్టెను చూడగానే గ్రామస్తుల్లో గుసగుసలు మొదలైనాయి. సమ్మర్స్‌ వెనకాలే పోస్ట్‌మాస్టర్‌ మిస్టర్‌ గ్రేవ్స్‌ ముక్కాలి స్టూల్‌ను తెచ్చి వేయగానే దానిమీద చెక్కపెట్టెను ఉంచాడు సమ్మర్స్‌. ఎవరైనా సాయం చేయమని సమ్మర్స్‌ అనగానే మార్టిన్, ఆయన పెద్దకొడుకు బాక్స్‌టర్‌ వెళ్లి కదలకుండా స్టూలును పట్టుకున్నారు. లోపలి చీటీలను సమ్మర్స్‌ కలియబెట్టాడు.

లాటరీకి సంబంధించిన అసలైన సరంజామా ఎప్పుడో పోయింది. ఈ నల్లపెట్టె కూడా ఊరిలోని కురువృద్ధుడు వార్నర్‌ పుట్టకముందునుంచీ ఉంటున్నది. ఇంకో కొత్తపెట్టె చేయించడం గురించి సమ్మర్స్‌ చాలాసార్లు గ్రామస్తులతో తలపోశాడు. కానీ సంప్రదాయానికి ప్రాతినిధ్యంగా ఉన్న ఈ నల్లపెట్టెని మార్చడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఊళ్లో చెప్పుకునే కథ ఏమిటంటే, ఈ పెట్టె తయారీలో దీనికి పూర్వం వాడుకలో ఉన్న పెట్టెలోని కొన్ని చెక్కలను కలిపారు; ఆ పాతపెట్టెను గ్రామంలో తొలిగా స్థిరపడిన పెద్దలు నిర్మించారు. కాలక్రమంలో ఆచారంలోని చాలాభాగం మరిచిపోవడమో వదిలివేయడమో జరిగింది. తరాలుగా వాడుకలో ఉన్న చెక్క పలకల స్థానంలో కాగితాలను ప్రవేశపెట్టడంలో మాత్రం సమ్మర్స్‌ విజయవంతం అయ్యాడు. జనాభా తక్కువున్నప్పుడు ఆ చెక్క పలకలను నల్లపెట్టెలో వేయడం సులభమయ్యింది. జనం పెరిగాక ఆ పెట్టెలో సులభంగా పట్టేవి కావాలని ఆయన వాదించాడు. లాటరీకి ముందురోజు రాత్రి సమ్మర్స్, గ్రేవ్స్‌ ఇద్దరూ ఈ చీటీలు సిద్ధం చేసి పెట్టెలో వేసి, తెల్లారి ఇక్కడికి తెచ్చేదాకా సమ్మర్స్‌ బొగ్గు కంపెనీలో నిలిపి తాళం వేసి ఉంచుతారు. మిగిలిన ఏడాదంతా పెట్టె ఎక్కడో దగ్గర పడివుంటుంది.

ఈ లాటరీ ప్రారంభించడానికి ముందు బానే హడావుడి జరుగుతుంది. ముందు వంశ పెద్దల జాబితా సిద్ధం చేయాలి, తర్వాత కుటుంబ పెద్దల జాబితా, అటుపై కుటుంబంలోని సభ్యుల జాబితా.  ఈ లాటరీ నిర్వహణ బాధ్యతను సమ్మర్స్‌కు అప్పగిస్తున్నట్టు గ్రేవ్స్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఈ సందర్భానికి తగిన పాటేదో ఉండేది.ఇంతలో హడావుడి పడుతూ శ్రీమతి హచిన్‌సన్‌ పరుగెత్తుకొచ్చింది. శ్రీమతి డెలాక్రాయ్‌తో ‘మా ఆయన కట్టెల కోసం పోయాడేమో అనుకున్నా, తీరా కిటికీలోంచి చూస్తే పిల్లలూ లేరు, అప్పుడు గుర్తొచ్చింది ఇవ్వాళ ఇరవై ఏడని, వెంటనే పరుగెత్తుకొచ్చాను’ అంది. నువ్వు సమయానికే వచ్చావని శ్రీమతి డెలాక్రాయ్‌ సమాధానమిచ్చింది. అందరూ ఉన్నట్టేనా? అని సమ్మర్స్‌ అడిగాడు. జనం ‘డన్‌బార్‌. డన్‌బార్‌’ అని అరిచారు. ‘అవునుగదా, క్లైడ్‌ డన్‌బార్‌ కాలు విరిగింది. ఆయన బదులుగా ఎవరు చీటీ తీస్తారు?’
నేను తీస్తానంటూ ఒక మహిళ జవాబిచ్చింది. భర్తకు బదులుగా భార్య, ఇంట్లో వయసుకొచ్చిన మగపిల్లలు లేరా జేనీ? అని సమ్మర్స్‌ అడిగాడు. ఈ విషయం ఊరందరికీ తెలిసినా లాటరీ పెద్దగా ఈ ప్రశ్నలు వేయడం ఆనవాయితీ. హొరేస్‌ ఉన్నాడుగానీ ఇంకా పదహారేళ్లు నిండలేదని పశ్చాత్తాపంగా జవాబిచ్చింది శ్రీమతి డన్‌బార్‌.

‘వాట్సన్‌ బాయ్‌ ఈసారి కూడా తీస్తున్నాడా?’ అవును, మా అమ్మా నా తరఫున నేను తీస్తానంటూ గుంపులోంచి ఓ పొడుగాటి యువకుడు చేయెత్తాడు. అందివచ్చిన కొడుకు ఉన్నాడని గుంపులోని కొన్ని గొంతులు మాట్లాడుకున్నాయి. ‘ఇప్పుడు నేను ముందుగా వంశపెద్దల పేర్లను పిలుస్తాను, ఒక్కొక్కరూ వచ్చి పెట్టెలోని చీటీ తీసుకోండి. ప్రతి ఒక్కరూ తీసుకునేదాకా మడత విప్పకూడదు. సరేనా?’ అని ప్రశ్నించాడు సమ్మర్స్‌. ప్రతిసారీ జరిగే తంతే కాబట్టి, సగం సగం విన్నారు జనం. ‘ఆడమ్స్‌’. గుంపులోంచి ఒక మనిషి ముందుకు వెళ్లాడు. ‘హాయ్‌ స్టీవ్‌’ అని పలకరించాడు సమ్మర్స్‌. ‘హాయ్‌ జో’ అని బదులిచ్చాడు  ఆడమ్స్‌. తర్వాత పెట్టెదగ్గరికి వెళ్లి, ఒక చీటీ తీసుకుని తన స్థానంలోకి వచ్చి నిలుచున్నాడు. ‘ఆల్లెన్‌’. ‘ఆండర్‌సన్‌’. ‘బెంథామ్‌’. మిస్టర్‌ గ్రేవ్స్‌ కూడా చీటీ తీసుకున్నాడు. సమ్మర్స్‌ తన పేరు తానే పిలుచుకుని తనూ ఓ చీటీ తీసుకున్నాడు. అందరూ అయ్యాక, తమ చేతిల్లో ఉన్న చీటీలను తెరిచి చూసుకున్నారు. వెంటనే జనంలో కోలాహలం మొదలైంది. ‘ఎవరు?’ ‘ఎవరికొచ్చింది?’ ‘హచిన్‌సన్‌’ ‘బిల్‌ హచిన్‌సన్‌కు వచ్చింది.’ తండ్రికి విషయం చెప్పిరమ్మని పెద్దకొడుకును ఇంటికి పరుగెత్తించింది శ్రీమతి డన్‌బార్‌.

హచిన్‌సన్‌ ఎక్కడున్నాడని జనం వెతికారు. బిల్‌ హచిన్‌సన్‌ తన కాగితం చూసుకుంటూ మౌనంగా నిలుచున్నాడు. వెంటనే బిగ్గరగా టెస్సీ హచిన్‌సన్‌ అరవసాగింది. ‘సమ్మర్స్, ఆయనకు కావాల్సిన కాగితాన్ని తీసుకునే సమయం నువ్వు ఇవ్వలేదు, నేను చూశాను, ఇదేం బాగాలేదు’. ‘నోర్మూసుకో టెస్సీ’ అని బిల్‌ హచిన్‌సన్‌ అన్నాడు. ‘బిల్, నువ్వు హచిన్‌సన్‌ వంశానికి చీటీ తీశావు. హచిన్‌సన్‌ వంశంలో ఎన్ని కుటుంబాలున్నాయి?’ కూతుళ్లు డాన్, ఈవా పేర్లు చెబుతుంది టెస్సీ. వాళ్లను వాళ్ల భర్తల కుటుంబాలతో లెక్కిస్తారు, అది నీకూ తెలుసని జవాబిస్తాడు సమ్మర్స్‌. తర్వాతి చీటీ, కుటుంబ పెద్ద ఎవరో తెలియడం కోసం తీస్తారు. హచిన్‌సన్‌ ఇంట్లో పెళ్లయినవాళ్లుపోగా బిల్‌ జూనియర్, నాన్సీ, డేవ్‌ ఉన్నారు. అంటే వంశ పెద్దగానూ, కుటుంబపెద్దగానూ రెండింటికీ బిల్‌ హచిన్‌సన్‌ చీటీ తీసినట్టు! ఒకేసారి రెండు రౌండ్లు ముగిసినట్టు. ఇక మూడో రౌండులో బిల్, టెస్సీతో కలిపి ఈ ఐదుగురి పేర్లను రాసిన చీటీలను తీయాలి. అయితే డేవ్‌ పసివాడు కాబట్టి వాడి చీటి విషయంలో సాయపడవలిసిందిగా హారీని కోరాడు సమ్మర్స్‌. అప్పటికీ టెస్సీ ఇది అన్యాయమని అరుస్తూనేవుంది. మళ్లీ మొదలుపెడదామని డిమాండు చేస్తూనేవుంది. ఆమె మాటల్ని ఎవరూ ఖాతరు చేయలేదు.

ఐదుగురూ ఒక్కొక్కరూ వచ్చి చీటీలను తీసుకున్నారు. డేవ్‌కు హారీ సాయపడ్డాడు. నాన్సీకి రాకూడదని ఆమె స్నేహితురాలు కోరుకుంది. ఐదుగురూ తీసుకున్నాక, చీటీలను తెరిచారు. ఎత్తిపట్టి జనానికి చూపించారు. ఖాళీ. బిల్‌ నీది? అదీ ఖాళీ. టెస్సీ నీది? టెస్సీ చూపించలేదు. బిల్‌ భార్యను కోప్పడి, బలవంతంగా తెరిచాడు. నల్లమచ్చ! టెస్సీ చేతికి వచ్చిన కాగితంలో నల్లమచ్చ. జనంలో కదలిక మొదలైంది. ‘జనులారా, త్వరగా ముగించేద్దాం’ అన్నాడు సమ్మర్స్‌. పెద్దరాయిని రెండు చేతులతో ఎత్తింది శ్రీమతి డెలాక్రాయ్‌. పిల్లలు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎవరో డేవ్‌ చేతికి కూడా కొన్ని గులకరాళ్లు ఇచ్చారు. వార్నర్‌ ఉత్తేజపరుస్తున్నాడు. ఆడమ్స్, గ్రేవ్స్‌ కూడా రెడీ. టెస్సీ హచిన్‌సన్‌ జనం మధ్యలో నిలబడి వుంది. పక్కనుంచి మొదటి రాయి వచ్చి ఆమె తలకు తగిలింది.

అమెరికన్‌ రచయిత్రి షిర్లీ జాక్సన్‌ (1916–1965) కథ ‘ద లాటరీ’ కి సంక్షిప్త రూపం ఇది. 1948 లో ‘న్యూయార్కర్‌’ లో దీన్ని ప్రచురించినప్పుడు వేలాదిమంది పాఠకులు తిట్టిపోస్తూ ఉత్తరాలు రాశారు. ఆ పత్రిక చరిత్రలోనే ఇంత స్పందన మరే కథకూ రాలేదు. అయితే, మూక మనస్తత్వాన్నీ, హేతువిరుద్ధంగా ఆచారాలను పాటించే తీరునూ శక్తిమంతమైన సంకేతాలతో చిత్రించిన కథగా విమర్శకులు దీన్ని తర్వాత ప్రశంసించారు. దీని సంక్షిప్తం: సాక్షి సాహిత్యం డెస్క్‌.

షిర్లీ జాక్సన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement