ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. ఇంతక్రితం 9.1% ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్‌బీఐ వృద్ధి అంచనా 9.5% కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9% నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే.
‘కే’ నమూనా రికవరీ..: సమాజంలో అసమానతలు పెరిగిపోవడంపై ఇండ్ రా ప్రధాన ఆర్థికవేత్త, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి లక్షలాది సంఖ్యలో ప్రజలను పేదరికంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ (ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ (జు) నమూనా రికవరీ అని సిన్హా తెలిపారు. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వేగంగా మరింత సమస్యల్లోకి జారిపోతారు. ఎకానమీలో దాదాపు 58 శాతం ఉన్న ప్రైవేటు వినియోగంలో గత స్థాయి వృద్ధి ప్రస్తుతం లేదని సిన్హా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment