India Ratings and Research
-
వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 7.5 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధికి సంబంధించి ప్రస్తుత 7.1 శాతం అంచనాలను 7.5 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తాజా నివేదికలో పేర్కొంది. వినియోగ డిమాండ్ క్రిత అంచనాలకన్నా మెరుగ్గా ఉండడం తాజా నిర్ణయానికి కారణమని వివరించింది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు, కార్పొరేట్లు, బ్యాంకుల చక్కటి బ్యాలెన్స్ షీట్లు, ప్రారంభమైన ప్రైవేట్ కార్పొరేట్ మూలధన పెట్టుబడుల ప్రక్రియ, వృద్ధి ఊపందుకోవడం వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్ మరింత ఊపునిస్తున్నట్లు విశ్లేíÙంచింది. వ్యవసాయ, గ్రామీణ వ్యయాలను బడ్జెట్ పెంచుతుందని, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) రంగానికి రుణ మంజూరులను మెరుగుపరుస్తుందని ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆర్బీఐ, అర్థిక సర్వే అంచనాలకన్నా అధికం.. 2024–25 భారత్ జీడీపీ పురోగతిపై ఆర్బీఐ (7.2 శాతం), ఆర్థిక మంత్రిత్వశాఖ సర్వే (6.5 శాతం నుంచి 7 శాతం మధ్య) వృద్ధి అంచనాలకన్నా... ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా అంచనాలు అధికంగా (7.5 శాతం) ఉండడం గమనార్హం. సాధరణంకన్నా అధిక స్థాయిలో వర్షపాతం, తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఇచ్చే ఫలితాలు జీడీపీ వృద్ధిని ఊహించినదానికన్నా పెంచుతాయని ఇండ్రా అభిప్రాయపడింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రమాదంగా కొనసాగుతున్నప్పటికీ మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24 కంటే, 2024–25లో తక్కువగా ఉంటుందని సంస్థ అంచనావేసింది. ఇది వాస్తవ వేతన వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. -
డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే
ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్‌ను చేరుకునేందుకు అవి హోల్‌సేల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు... సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా, రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి మోస్తరుగా.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్ఎఫ్సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. 2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్ఎఫ్సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. అందుబాటు గృహ రుణాల జోరు హెచ్ఎఫ్సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్‌ఎఫ్‌సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్ హౌసింగ్ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. -
అఫర్డబుల్ హౌస్ లోన్స్ .. వారికి కష్ట కాలమే!
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణరంగ వ్యయాలు పెరిగి పోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అదిప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1-6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8-13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడిసరుకు ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20-25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
స్టీల్ అవుట్‌లుక్.. సూపర్
కోల్‌కతా: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో భారతీయ ఉక్కు రంగ అవుట్‌లుక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన తాజా నివేదికలో పేర్కొంది. గ్లోబల్ డిమాండ్ అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలోనూ దేశీయ పరిశ్రమ దృఢంగా ఉంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. నివేదికలోని అంశాలు, ఇందుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలిస్తే.. - 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టీల్ పరిశ్రమకు ‘‘తటస్థ అవుట్‌లుక్’’ను కొనసాగిస్తున్నాం. అధిక ద్రవ్యోల్బణం, దీనివల్ల అంతంత మాత్రంగా కొనసాగుతున్న మార్జిన్ల అంచనాలు దీనికి కారణం. - ప్రభుత్వం చేసే మౌలిక సదుపాయాల వ్యయం దేశీయంగా స్టీల్ స్థిరమైన వినియోగానికి తోడ్పడుతుంది. ప్రభుత్వం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం వచ్చే ఐదేళ్లలో వ్యయాలకు రూ. 1,11,000 కోట్లను కేటాయించింది, అయితే ప్రైవేట్ రంగ మూలధన వ్యయం, హౌసింగ్, కన్సూ్యమర్ డ్యూరబుల్స్ ఎండ్–యూజర్ సెగ్మెంట్ (వినియోగదారులు), ధరల పెరుగుదల వల్ల డిమాండ్‌లో మందగమనంలోనే ఉండడం కొంత ప్రతికూలాంశం. - ఇండ్–రా పరిశోధన ప్రకారం, స్టీల్ ఉత్పత్తిదారులకు ద్రవ్యోల్బణం సవాళ్లు పూర్తిగా అధిగమించడం కొంత సవాలు కావచ్చు. పరిశ్రమ స్థూల లాభాలు అంతంతమాత్రంగా ఉండడానికి ద్రవ్యోల్బణం సవాళ్లు దారితీయవచ్చు. అయితే స్థూల ఆదాయాలు మాత్రం కరోనా ముందస్తు సంవత్సరం 2019కంటే అధికంగానే ఉండే వీలుంది. - చైనా ఉత్పత్తి, ఎగుమతులు తక్కువగా ఉండటం యురోపియన్ మార్కెట్లకు ఎగుమతుల కోటా పరిమితి పెరుగుదల, కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా భారతీయ స్టీల్ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. ఆయా అంశాలు ఎగుమతుల విక్రయాల్లో లాభాలు అధికంగా ఉండే వీలుంది. ఇది ఈ రంగం మొత్తంగా లాభాల బాటన నిలబడ్డానికి దోహదపడుతుంది. ఆర్సెలర్ మిట్టల్ అంచనాలు నిరుత్సాహం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్ గ్లోబల్ స్టీల్ డిమాండ్‌లో క్షీణతను అంచనా వేస్తుండడం గమనార్హం. భౌగోళిక రాజకీయ అంతరాయాలు, సప్లై సవాళ్లు, ద్రవ్యోల్బణం, చైనా కోవిడ్ –19 లాక్డౌన్లు, దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలను మందగించడం వంటి అంశాల వల్ల ప్రపంచ ఉక్కు వినియోగం 2022లో ఒక శాతం క్షీణించవచ్చని ఉక్కు ఉత్పత్తి దిగ్గజంఆర్సెలార్ మిట్టల్ తన తాజా అంచనాల్లో పేర్కొంటోంది. యూరోప్‌లో ఉక్కు వినియోగం (కంపెనీ ప్రధాన యూనిట్లు ఉన్న ప్రాంతాల పరిధిలో) 2022లో 2 నుంచి 4 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తోంది. క్రితం అంచనాలు 0.2 శాతం వృద్ధి కంటే ఇది పూర్తి భిన్నమైన అంచనా కావడం గమనార్హం. టాటా స్టీల్ పరిస్థితి ఇదీ.. 2022 మార్చి త్రైమాసికంలో, యూరప్ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి టాటా స్టీల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 2.8 శాతం క్షీణించింది. కానీ ధరలు పెరగడంతో సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర ఆదాయాలు టన్నుకు 53 యూరోలు అధికంగా ఉన్నాయి. చైనా ఇకపై ఏటా తన సామర్థ్యానికి 50–60 మిలియన్ టన్నులను అదనంగా జోడించే పరిస్థితి లేనందున డిమాండ్, ధరలు పటిష్టంగా ఉంటాయని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు తగ్గకుండా చూసే క్రమంలో చైనా స్టీల్ ఎగుమతులను భారీగా చేయకపోవచ్చని కూడా టాటా స్టీల్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో తమ స్థూల ఆదాయ మార్జిన్న్లు పటిష్టంగా ఉండేలా వ్యూహాలు రూపొందించాలని టాటా స్టీల్ భావిస్తోంది. దేశంలో కోకింగ్ బొగ్గు ధర కూడా టన్నుకు 100 డాలర్లు పెరుగుతుందని, అయితే సగటు అమ్మకపు ధరలో టన్నుకు రూ. 8,000–8,500 పెంపు ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చని కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బలమైన డిమాండ్ కొనసాగుతుందన్న అంచనాలతో ఈ దేశీయ స్టీల్ దిగ్గజ సంస్థ రాబోయే కొన్ని సంవత్సరాలలో దేశంలో తన ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2030 నాటికి తర సామర్థ్యాన్ని 40 మిలియన్ టన్నులకు రెట్టింపు చేయాలని సంకల్పించింది. కాగా, ప్రస్తుత స్టీల్ ధరల వద్ద స్టీల్ డిమాండ్‌పై కొంత సందేహాలు ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంటోంది. ఈ నేపథ్యలో టాటా స్టీల్‌పై తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్లు తెలిపింది. చదవండి: సాగర్మాల.. 1,537 ప్రాజెక్టులు.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు -
ఎగుమతుల లక్ష్యం నెరవేరుతుంది
ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) ఒన నివేదికలో పేర్కొంది. భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మార్చి నెలలో 26 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదవుతాయని అంచనావేసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 2.8 శాతంగా ఉంటుందని ఇండ్–రా అంచనావేసింది. విలువలో ఇది 23.6 బిలియన్ డాలర్లు. ఈ లెక్కలే నిజమైతే, క్యాడ్ ఈ స్థాయికి చేరడం 13 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి అవుతుంది. క్రూడాయిల్ ధరల తీవ్రత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాలని పేర్కొంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దిగుమతుల బిల్లు 606 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ దిగుమతుల విలువ 550 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు దిగుమతుల భారం నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల విలువ 155.5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2022–23లో ఎకానమీ రికవరీ వేగవంతం వల్ల చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022 ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ ఐదు శాతం పెరుగుతుందన్నది అంచనా. మిగిలిన అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని భావించిన పక్షంలో ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 165 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. చమురు ధరలు పెరిగే కొలదీ భారత్ దిగుమతుల భారం మరింత తీవ్రం అవుతుంది. శాశ్వత ప్రాతిపదికన చమురు ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదలకు చమురు దిగుమతుల భారం 15 బిలియన్ డాలర్లు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 0.4 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. క్యాడ్ సమస్యకు ఈ పరిణామాలు దారితీయవచ్చు. చమురు అధిక ధరల వల్ల రూపాయి కూడా మరింత బలహీనపడే వీలుంది. చమురు దిగుమతుల ధరల తీవ్రత వాణిజ్యలోటును మరింత పెంచే అంశం. ఆయా అంశాలు విదేశీ మారకానికి సంబంధించి దేశానికి ప్రతికూలంగా మారతాయి. కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతంలోటును నమోదుచేస్తుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసినప్పటికీ, చమురు ధరల తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. -
ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..?
న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ పెరుగతున్న కేసుల వల్ల భారతదేశం ఈ ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం జీడీపీ రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పేరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి రాత్రి, వారాంతపు కర్ఫ్యూలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. క్యూ4ఎఫ్ వై22లో జీడీపీ వృద్ధి ఇప్పుడు 5.7 శాతం(యోవై)గా ఉండనున్నట్లు తెలపింది. ఇది ఈ ఏజెన్సీ మునుపటి అంచనా 6.1 శాతం కంటే 40 బేసిస్ పాయింట్లు తక్కువ. "2022 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ది రేటును తగ్గిస్తూ 9.3 శాతంగా పేర్కొంది. ఇది మా మునుపటి అంచనా 9.4 శాతం కంటే 10 బేస్ పాయింట్లు తక్కువ" అని ఏజెన్సీ తెలిపింది. ఓమిక్రాన్ కొత్త కేసులు గత కోవిడ్ వేరియెంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఎక్కువగా ప్రాణాంతకం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా, కోవిడ్ 1.0 & 2.0 కంటే ఇది తక్కువ విఘాతం కలిగిస్తుంది. కరోనా కేసుల వ్యాప్తిని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూలు, లాక్ డౌన్ విధించాలని చూస్తుండటంతో ఆ ప్రభావం దేశ జీడీపీ పడుతున్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు శుభవార్త!) -
మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!
ముంబై: రాష్ట్రాల ఆదాయాలు క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా)తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు (ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.1 శాతానికి (రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో) పరిమితి కావచ్చని అంచనా వేసింది. చదవండి: భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ ఇంతక్రితం వరకూ ఈ అంచనాను సంస్థ 4.3 శాతంగా పేర్కొంది. ఇక రాష్ట్రాల జీడీపీలో రుణ నిష్పత్తి కూడా 34 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలను వెలువరించింది. వ్యాక్సినేషన్ విస్తృత స్థాయిలో కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ కూడా ఊపందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. ఆయా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మెరుగుపడ్డానికి దోహపడతాయని పేర్కొంది. కరోనా ప్రేరిత మూడవ వేవ్ భయాలు తొలిగిపోతే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను ప్రభుత్వాలు మరింత సడలించే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనావేస్తోంది. ఆయా పరిస్థితుల్లో రెవెన్యూ లోటు క్రితం అంచనాలను కూడా 1.5 శాతం నుంచి (రాష్ట్రాల జీడీపీల్లో) 1.3 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. నివేదికకు సంబంధించి కీలక అంశాలను పరిశీలిస్తే.. ►2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14 రాష్ట్రాల నుంచి అందిన సమాచారం విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో ఆయా రాష్ట్రాల ఆదాయం 30.8 శాతం పెరిగి రూ.3.95 లక్షల కోట్లకు చేరింది. ►2020 ఇదే కాలంలో పోల్చి చూసినా సమీక్షా కాలంలో వృద్ధిరేటు 1.5 శాతంగా ఉంది. ► పన్ను, పన్నుయేతల ఆదాయాలు వరుసగా 77 శాతం, 46 శాతం చొప్పున ఎగశాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని భావించవచ్చు. ►రాష్ట్రాల స్థూల మార్కెట్ రుణాలు 2020–21లో రూ.7.88 లక్షల కోట్లు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.1.94 లక్షల కోట్లు. ► 2020 ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.2.1 లక్షల కోట్లు. ►అయితే 2020–21తో పోల్చితే స్థూల మార్కెట్ రుణాలు రూ.8.2 లక్షల కోట్లకు పెరుగే అవకాశం ఉంది. ఇది క్రితం క్రితం రూ.8.4 లక్షల కోట్ల అంచనాకన్నా తక్కువ. ఇక నికర మార్కెట్ రుణాలు 2020–21లో రూ.6.45 లక్షల కోట్లుకాగా, ఇది 2021–22 నాటికి 6.2 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. -
భారత్ వృద్ధి రేటు అప్‌గ్రేడ్
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. ఇంతక్రితం 9.1% ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్బీఐ వృద్ధి అంచనా 9.5% కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9% నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే. ‘కే’ నమూనా రికవరీ..: సమాజంలో అసమానతలు పెరిగిపోవడంపై ఇండ్ రా ప్రధాన ఆర్థికవేత్త, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి లక్షలాది సంఖ్యలో ప్రజలను పేదరికంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ (ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ (జు) నమూనా రికవరీ అని సిన్హా తెలిపారు. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వేగంగా మరింత సమస్యల్లోకి జారిపోతారు. ఎకానమీలో దాదాపు 58 శాతం ఉన్న ప్రైవేటు వినియోగంలో గత స్థాయి వృద్ధి ప్రస్తుతం లేదని సిన్హా అన్నారు. -
ఆటో డిమాండ్‌కు కరోనా షాక్
సాక్షి,ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు..ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగు పడినట్లు కనిపించడం లేదని ఇండ్-రా నివేదికలో తెలిపింది. (భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!) నివేదిక ఇతర విశేషాలు.. ► 2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. ► ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. ► 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. ► కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. ► యుటిలిలటీ వాహనాలకు డిమాండ్ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. ► గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. చదవండి : కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్ -
కరోనా గండం: ఆ పరిశ్రమ డిమాండ్ క్షీణించే అవకాశం
ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు.. ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని ఇండ్–రా నివేదికలో తెలిపింది. నివేదిక ఇతర విశేషాలు.. ►2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. ►ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. ►2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. ►కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. ►యుటిలిటీ వాహనాలకు డిమాండ్ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. ►గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. -
18 ఏళ్లు పైబడినవారి వ్యాక్సినేషన్‌కు 67,193 కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రభుత్వాలకు రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.46,323 కోట్లుగా ఉంటుందని, కేంద్రం వ్యయం రూ.20,870 కోట్లని విశ్లేషించింది. ఈ మొత్తం కలుపుకుంటే స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) వ్యాక్సినేషన్ వ్యయ భారం కేవలం 0.36 శాతంగా ఉంటుందని పేర్కొంది. 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కిందకు (మొత్తం దేశ జనాభా 133.26 కోట్ల మందిలో) 84.19 కోట్ల మంది వస్తారని తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. -
బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే
సాక్షి,ముంబై: ఆర్థికాభివృద్ధికి గాను కేంద్రం ఇకపై తన దృష్టిని సరఫరాల పరమైన సమస్యల నుంచి నుంచి డిమాండ్ వైపు ఇబ్బందులపైకి మరల్చాలని రేటింగ్స్ సూచించింది. 2021-22 బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని సూచించింది. ముఖ్యాంశాలు చూస్తే... మహమ్మారి కరోనా దేశంలో సమస్యలు సృష్టించడం ప్రారంభించినప్పటి నుంచీ కేంద్రం తన దృష్టిని దాదాపు సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికే కేటాయించింది. డిమాండ్ వైపు సవాళ్లను తొలగించడానికి అంతగా ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఈ విధానం మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికి ప్రయతి్నంచడం మంచిదే. ఇందులో తప్పేమీ లేదు. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ఆర్థిక వ్యవస్థ క్షీణిత, రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి కట్టడి జరగడం హర్షణీయం. అయితే ఇక్కడ వ్యవస్థలో తగిన డిమాండ్ లేకపోతే సరఫరాల వ్యవస్థ పునరుద్ధరణ జరిగినా ఆర్థిక రికవరీలో మున్ముందు తగిన ఫలితాలు కనిపించవు. పైగా ఆర్థిక వ్యవస్థలో మరోదఫా మందగమన సమస్యలు తలెత్తుతాయి. 2012లో తలెత్తిన ఇదే తరహా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా సరఫరాల సమస్యలు రాకుండా భారీ ఉద్దీపనల ప్రకటనలు జరిగాయి. అయినా కంపెనీలు పెట్టుబడులకు పెద్దగా ముందుకురాలేదు. ఫలితంగా తక్కువ వేతనాలు, ఉపాధి కల్పన తగ్గడం తద్వారా డిమాండ్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లనుంచి ఉద్దీపన ప్రకటనలు, సరళతర ద్రవ్య విధానాలు వస్తున్నాయ్. సరఫరాల పరమైన ఇబ్బందులు తొలగుతున్నాయ్. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం ఇంకా మెరుగుపడ్డంలేదు. వేతనాలూ భారీగా పెరగని పరిస్థితి ఉంది. దీనితో వస్తు, సేవలకు తగిన డిమాండ్ నెలకొనడం లేదు. రానున్నది వ్యాపార పునరుద్ధరణ ‘బడ్జెట్’ పారిశ్రామిక రంగంలో 50 శాతం భరోసా ∙డెలాయిట్ సర్వే వెల్లడి కొత్త బడ్జెట్ (2021–22 ఆర్థిక సంవత్సరం) తమ వ్యాపారాల పునరుద్ధరణకు దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన 50 శాతం మంది ప్రతినిధులు భరోసాతో ఉన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న బడ్జెట్ అంశాలు, ప్రతిపాదనలపై ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ తాజాగా నిర్వహించిన సర్వేకు సంబంధించి శుక్రవారం వెల్లడైన కొన్ని అంశాలను పరిశీలిస్తే... కొత్త బడ్జెట్‌తో ఆర్థిక రికవరీ, డిమాండ్ వృద్ధి నెలకొంటాయని 70 శాతం పారిశ్రామిక వర్గం భావిస్తోంది. వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచడం వల్ల ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగతాయని సర్వేలో పాల్గొన్న కొందరు పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్లో చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. డిమాండ్ పెరుగుదలకు బడ్జెట్లో ప్రధానంగా చర్యలు ఉంటాయని 50 శాతం భావిస్తున్నారు. వస్తు, సేవల సరఫరాల్లో ఇంకా నెలకొన్న ఆంక్షలు, వినియోగదారులో నెలకొన్న ఆర్థిక, ఆరోగ్య సంబంధిత ఆందోళనల ప్రభావం వినియోగంపై ప్రభావం చోపుతోంది. వినియోగంపై కాకుండా పొదుపులవైపే వారి అధిక దృష్టి ఉంది. ఇది డిమాండ్‌ను కోవిడ్-19 ముందస్తు స్థాయిల్లోనే నిలబెడుతోంది. పన్ను మినహాయింపులు పెంచడం వల్ల వ్యక్తిగత ప్రైవేటు వినియోగం పెరుగుతుంది. ఇది మరిన్ని పెట్టుబడులకూ దారితీస్తుంది. ఆదాయం, డిమాండ్ వృద్ధి లక్ష్యాలుగా ఉపాధి కల్పన ప్రత్యేకించి నైపుణ్యం తక్కువగా ఉన్నవారికి ఉద్యోగ కల్పనపై బడ్జెట్ దృష్టి పెట్టే వీలుంది. భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు, విధానాలు, మౌలిక రంగం పురోగతికి తీసుకునే చర్యలు తయారీ రంగానికి కేంద్రంగా భారత్ ఆవిర్భవించడానికి చొరవలు, డిజిటలైజేషన్ ప్రోత్సాహకాలు దేశాభివృద్ధికి దోహదపడతాయి. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, మౌలిక, విద్యుత్, టెలికమ్యూనికేషన్ పరిశ్రమలు ప్రధానంగా తమ పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ) వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది. లఘు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత రుణ పరమైన లభ్యత లభిస్తుందని, ఇది వారి వ్యాపారాలు త్వరిత గతిన గాడిన పడ్డానికి దోహదపడతాయని సర్వేలో పాల్గొన్న ఆయా రంగాల 50 శాతం మంది ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 180 మంది నుంచి అభిప్రాయ సేకరణ : ‘‘పారిశ్రామిక రికవరీ వేగానికి 2021 కేంద్ర బడ్జెట్ చర్యలు ఉంటాయా’’ అన్న శీర్షికన ఆన్లైన్లో డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితుల కల్పన వంటి అంశాలతో కూడిన 12 ప్రశ్నలను సర్వేలో సంధించారు. తొమ్మిది పరిశ్రమల నుంచి 180 మంది ప్రతినిధులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలు ఇవీ... మౌలిక రంగంలో వ్యయాలు పెరగాలి. ప్రత్యేకించి ఉపాధి కల్పన విషయంలో ప్రోత్సాహకాలు కల్పించాలి. మధ్య పేద తరగతి ప్రజలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఆదాయ, ఆర్థిక సహాయాలను కొనసాగించడమే కాకుండా, ఈ దిశలో మరిన్ని చర్యలు ఉండాలి. ఎంజీఎన్ఆర్ఈజీఏ మరిన్ని నిధులు కేటాయించాలి. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడమేకాకుండా, కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన గ్రామీణ కారి్మకులకు సైతం ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. చౌక గృహ నిర్మాణ రంగానికి మద్దతు నివ్వాలి. ఇప్పటికీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్న, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం తన మద్దతు కొనసాగించాలి. ప్రజారోగ్య వ్యయాలను పెంచాలి. ఆయా చర్యల ద్వారా పన్ను యేతర ఆదాయాలు మరింత పెరగడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులను సమకూర్చాలి. రాష్ట్రాల హేతుబద్ధమైన వ్యయ ప్రణాళిలకు కేంద్రం మద్దతు ఉండాలి. తద్వారా 2021-22లో ఎకానమీ వృద్ధి రేటును 10 శాతంపైగా సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును జీడీపీలో 6.2 శాతానికి కట్టడి చేయగలుగుతాం. డిమాండ్ - సరఫరా విధానాలపై వ్యత్యాసం! సరఫరాల వైపు విధానాల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, వస్తు సేవలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాదారులే లక్ష్యంగా పన్ను కోతల వంటి ఉద్దీపన చర్యలు ప్రకటించడం. తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించడం. ఇక వినియోగదారుల అవసరాలు, వారి డిమాండ్లకు అనుగుణంగా పన్ను కోతలు తదితర చర్యలు తీసుకోవడం ఆయా డిమాండ్ చర్యలను తీసుకోవడడం ద్వారా ఆర్థిక పురోగతికి బాటలు వేయడం. రికవరీ బాగుంది : ఆర్థిక రికవరీ తగిన సంతృప్తికరమైన బాటలో నడుస్తోందని ఇటీవలి గణాంకాలు, వ్యాపార సంకేతాలు తెలియజేస్తున్నాయి. స్వావలంభన భారత్, ఉత్పాదన అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి పథకాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి దోహదపడుతున్నాయి. మౌలిక రంగంలో వ్యయాల వల్ల తమ వ్యాపారాలకు గట్టి మద్దతు లభిస్తుందని సంబంధిత పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. - సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా పార్ట్నర్ -
రూ.8.4 లక్షల కోట్ల రుణాల పునర్వ్యవస్థీకరణ
ముంబై: ఒక్కసారి రుణ పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తూ ఆర్బీఐ ఇటీవల పరపతి విధాన కమిటీ భేటీలో నిర్ణయం తీసుకోగా.. ఈ కారణంగా బ్యాంకులు సుమారు రూ.8.4 లక్షల కోట్ల మేర రుణాలను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో ఇది 7.7 శాతం అవుతుందని పేర్కొంది. ఒకవేళ రుణాల పునరుద్ధరణకు అవకాశం లేకపోతే ఈ రూ.8.4 లక్షల కోట్ల రుణాల్లో సుమారు 60 శాతానికి పైగా ఎన్ పీఏలుగా మారొచ్చని అంచనాకు వచ్చింది. పునర్ వ్యవస్థీకరణ బ్యాంకుల లాభాలను కాపాడుతుందని, చేయాల్సిన కేటాయింపులు తగ్గుతాయని పేర్కొంది. కరోనా కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికి రెండు విడతల పాటు మొత్తం ఆరు నెలలు (2020 మార్చి నుంచి ఆగస్ట్) రుణ చెల్లింపులపై మారటోరియం (విరామం)కు అవకాశం ఇచ్చింది. మూడో విడత మారటోరియం కాకుండా పునర్ వ్యవస్థీకరణకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసిన వినతుల నేపథ్యంలో ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అన్నిరంగాలకు చెందిన అన్ని రుణాలకు కాకుండా పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఒక్కో ఖాతాను విడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. గత సంక్షోభ సమయాల్లో మాదిరిగా కాకుండా ఈ విడత కార్పొరేట్, నాన్ కార్పొరేట్, చిన్న వ్యాపార సంస్థలు, వ్యవసాయ రుణాలు, రిటైల్ రుణాలకు ఈ విడత పునర్ వ్యవస్థీకరణలో అధిక వాటా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో పునర్వ్యవస్థీకరించిన రుణాల్లో 90 శాతం కార్పొరేట్ రుణాలేనని పేర్కొంది. ఈ విడత (ఆగస్ట్ తర్వాత) పునర్వ్యస్థీకరణ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్లు నాన్ కార్పొరేట్ విభాగాల నుంచే ఉంటాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. కార్పొరేట్ లో ఎక్కువ రిస్క్ కార్పొరేట్ విభాగంలో రూ.4 లక్షల కోట్ల రుణాలు కరోనా ముందు నుంచే ఒత్తిడిలో ఉన్నాయని, ఇవి మరో రూ.2.5 లక్షల కోట్ల మేర పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అంచనాగా ఉంది. ‘‘కార్పొరేట్ విభాగంలో పునర్ వ్యవస్థీకరించే రుణాల మొత్తం రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.6.3 లక్షల కోట్ల వరకు ఉంటాయి. బ్యాంకులు అనుసరించే విధానాలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ విభాగంలోని రుణాల్లో 53 శాతం అధికరిస్క్ తో కూడినవే. మరో 47 శాతం రుణాలకు మధ్యస్థ రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఎయిర్ లైన్స్, హోటల్స్, విచక్షణారహిత వినియోగ రంగాల్లో ఎక్కువ రుణాలను పునరుద్ధరించాల్సి రావచ్చు. అయితే విలువ పరంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, నిర్మాణ రంగానికి చెందిన రుణాలు ఎక్కువగా ఉండొచ్చు. నాన్ కార్పొరేట్ విభాగంలో పునరుద్ధరించాల్సిన రుణాల్లో సగం ఎంఎస్ఎంఈ విభాగం నుంచి ఉంటాయి. మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో కేటాయింపులు 16–17 శాతం తగ్గుతాయి’’అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో వివరించింది. -
ఇన్ఫ్రా రంగం ప్రతికూలం–ఇండ్ రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రేటింగ్ ఎజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసర్చ్ (ఇండ్–రా) 2017–18లో మౌలిక రంగం ప్రతికూలంగా ఉంటుందని తెలిపింది. టోల్ రోడ్లు, బొగ్గు ఆధారిత విద్యుత్, పవన విద్యుత్ విభాగాలకు ఎదురుగాలి తప్పదని ఇండ్–రా ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ ఫైనాన్స్ సీనియర్ డైరెక్టర్ వెంకట్రామన్ రాజారామన్ తెలిపారు. ఇన్ఫ్రా రంగం క్రెడిట్ ఔట్లుక్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నివేదిక ప్రకారం.. ప్రభుత్వ విధానాలు, ప్రయాణికుల వృద్ధి కారణంగా విమానయాన రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. సోలార్, పోర్టులు, ట్రాన్స్మిషన్ రంగాలు స్థిరంగా ఉంటాయి. -
వచ్చే ఏడాది ఇన్‌ఫ్రాకి గడ్డుకాలమే
♦ రోడ్లు, థర్మల్ పవర్‌ని వీడని కష్టాలు ♦ ఎయిర్ పోర్టులు, రేవుల పరిస్థితి కొంత బెటర్ ♦ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ మౌలిక వసతుల రంగం వచ్చే ఏడాది కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. కీలకమైన బీవోటీ రోడ్డు ప్రాజెక్టులు, ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు గాడిలో పడటానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి మొత్తం ఇన్ఫ్రా రంగానికి నెగిటివ్ రేటింగ్ ఇచ్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డెరైక్టర్(ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ ఫైనాన్స్) వెంకటరమణ్ రాజారామన్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఇన్ఫ్రా రంగ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విండ్, సోలార్ ఎనర్జీ, ఎయిర్‌పోర్టు, సీపోర్టులకు మాత్రం ఈ ఏడాదిలాగే వచ్చే సారి కూడా స్టేబుల్ రేటింగ్‌ను ఇచ్చినట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులు చేపట్టిన చాలా కంపెనీలు సీడీఆర్, ఎస్డీఆర్ ప్యాకేజీలకు వెళ్లడటంతో వాటికి నిధుల కొరత కష్టంగా ఉందన్నారు. టోల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్‌లో 37% అత్యధిక వాటా (ఆదాయంలో 13%) కలిగిన కార్ల సంఖ్యలో, అలాగే ఆదాయంలో 54% వాటా(ట్రాఫిక్‌లో 27%) కలిగిన మల్టీ యాక్సిల్ వెహికల్స్‌లో వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో కేంద్రం వచ్చే ఏడాది 60% పైగా ఈపీసీ పద్ధతిలోనే కాంట్రాక్టులను అప్పచెప్పొచ్చని అంచనా వేసింది. ఇక విద్యుత్ రంగ విషయానికి వస్తే డిమాండ్‌ను మించి యూనిట్ల స్థాపన జరగడంతో టారిఫ్ రేట్లు తగ్గుతున్నాయన్నారు. తగ్గిన విమాన ఇంధన ధరలతో దూర ప్రయాణీకులు ఇప్పుడు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతుండటంతో ఈ రంగంలో కొంత ఆశావాహక పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ-కామర్స్ పుణ్యమా అని పోర్టులు కూడా ఈ ఏడాది కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేయొచ్చని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. -
25,500 స్థాయికి పుత్తడి తగ్గొచ్చు
ఇండియా రేటింగ్స్ అంచనా - ఈ ఏడాది అంతర్జాతీయ ధరలకు - సమానంగా దిగిరాకతప్పదని విశ్లేషణ ముంబై: దేశీయంగా పసిడి ధర ఈ ఏడాది(2014-15)లో ఇప్పటి అంతర్జాతీయ ధరకు సమానంగా దిగివస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ గురువారం అంచనావేసింది. ఈ ధర 10 గ్రాములకు రూ.25,500, రూ.27,500 స్థాయికి పడుతుందని పేర్కొంది. ప్రస్తుత తీరు: అంతర్జాతీయ ధరతో పోల్చితే, దాదాపు రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ అధిక ప్రీమియంతో ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర ఉంది. స్పాట్ మార్కెట్లో పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దాదాపు రూ.30,000 స్థాయిలో కదలాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా పసిడి దిగుమతులపై కేంద్రం 10% కస్టమ్స్ సుంకాలను అమలుచేస్తోంది. ఆభరణాల దిగుమతులకు సంబంధించి ఈ రేటు 15%గా ఉంది. క్యాడ్ కట్టడి నేపథ్యంలో దేశీయంగా సుంకాలు తగ్గించేస్తే... ప్రీమియంలు పడిపోయి, పసిడి ధర అంతర్జాతీయ ధరకు సమాన స్థాయికి వచ్చే అవకాశం ఎలానూ ఉంది. ఆయా అంశాలను పక్కనబెడితే, కేవలం విధానపరమైన విశ్లేషణకు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో ప్రాధాన్యత ఇచ్చింది. విశేషాలు ఇవీ... * ప్రస్తుతం నెమైక్స్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 1,300 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ ధర 1,150-1,250 డాలర్లకు తగ్గవచ్చు. * దీంతో బంగారం ధరకు ‘ప్రతికూల అవుట్‌లుక్’ను ఇస్తున్నాం. * అమెరికా, యూరోజోన్ జీడీపీలు మరింత పటిష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. పసిడిలో పెట్టుబడులు క్యాపిటల్ మార్కెట్లకు తరలే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరింత పడిపోవచ్చు. *అమెరికా ఆర్థికాభివృద్ధి, సహాయక చర్యల ఉపసంహరణ, వడ్డీరేట్ల పెంపు.. ఇవన్నీ బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరిచేవే. *ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు సైతం తగ్గే అవకాశం ఉంది. * అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో జీడీపీ వృద్ధి రేట్లు అంచనాలకన్నా తగ్గినా, కొన్ని దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగినా, చైనా ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితులు ఏర్పడినా... బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1,300 డాలర్లను దాటే అవకాశం ఉంది.