సాక్షి,ముంబై: ఆర్థికాభివృద్ధికి గాను కేంద్రం ఇకపై తన దృష్టిని సరఫరాల పరమైన సమస్యల నుంచి నుంచి డిమాండ్ వైపు ఇబ్బందులపైకి మరల్చాలని రేటింగ్స్ సూచించింది. 2021-22 బడ్జెట్‌లో ఈ మేరకు చర్యలు ఉండాలని సూచించింది. ముఖ్యాంశాలు చూస్తే...
- మహమ్మారి కరోనా దేశంలో సమస్యలు సృష్టించడం ప్రారంభించినప్పటి నుంచీ కేంద్రం తన దృష్టిని దాదాపు సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికే కేటాయించింది. డిమాండ్ వైపు సవాళ్లను తొలగించడానికి అంతగా ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు ఈ విధానం మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది.
- సరఫరాల వైపు సమస్యల పరిష్కారానికి ప్రయతి్నంచడం మంచిదే. ఇందులో తప్పేమీ లేదు. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం ఆర్థిక వ్యవస్థ క్షీణిత, రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి కట్టడి జరగడం హర్షణీయం. అయితే ఇక్కడ వ్యవస్థలో తగిన డిమాండ్ లేకపోతే సరఫరాల వ్యవస్థ పునరుద్ధరణ జరిగినా ఆర్థిక రికవరీలో మున్ముందు తగిన ఫలితాలు కనిపించవు. పైగా ఆర్థిక వ్యవస్థలో మరోదఫా మందగమన సమస్యలు తలెత్తుతాయి.
- 2012లో తలెత్తిన ఇదే తరహా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా సరఫరాల సమస్యలు రాకుండా భారీ ఉద్దీపనల ప్రకటనలు జరిగాయి. అయినా కంపెనీలు పెట్టుబడులకు పెద్దగా ముందుకురాలేదు. ఫలితంగా తక్కువ వేతనాలు, ఉపాధి కల్పన తగ్గడం తద్వారా డిమాండ్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లనుంచి ఉద్దీపన ప్రకటనలు, సరళతర ద్రవ్య విధానాలు వస్తున్నాయ్. సరఫరాల పరమైన ఇబ్బందులు తొలగుతున్నాయ్. అయితే ఉపాధి అవకాశాలు మాత్రం ఇంకా మెరుగుపడ్డంలేదు. వేతనాలూ భారీగా పెరగని పరిస్థితి ఉంది. దీనితో వస్తు, సేవలకు తగిన డిమాండ్ నెలకొనడం లేదు.
రానున్నది వ్యాపార పునరుద్ధరణ ‘బడ్జెట్’ పారిశ్రామిక రంగంలో 50 శాతం భరోసా ∙డెలాయిట్ సర్వే వెల్లడి
- కొత్త బడ్జెట్ (2021–22 ఆర్థిక సంవత్సరం) తమ వ్యాపారాల పునరుద్ధరణకు దోహదపడుతుందని పారిశ్రామిక రంగానికి చెందిన 50 శాతం మంది ప్రతినిధులు భరోసాతో ఉన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న బడ్జెట్ అంశాలు, ప్రతిపాదనలపై ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డెలాయిట్ తాజాగా నిర్వహించిన సర్వేకు సంబంధించి శుక్రవారం వెల్లడైన కొన్ని అంశాలను పరిశీలిస్తే...
- కొత్త బడ్జెట్‌తో ఆర్థిక రికవరీ, డిమాండ్ వృద్ధి నెలకొంటాయని 70 శాతం పారిశ్రామిక వర్గం భావిస్తోంది.
- వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచడం వల్ల ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగతాయని సర్వేలో పాల్గొన్న కొందరు పేర్కొన్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నారు. డిమాండ్ పెరుగుదలకు బడ్జెట్‌లో ప్రధానంగా చర్యలు ఉంటాయని 50 శాతం భావిస్తున్నారు.
- వస్తు, సేవల సరఫరాల్లో ఇంకా నెలకొన్న ఆంక్షలు, వినియోగదారులో నెలకొన్న ఆర్థిక, ఆరోగ్య సంబంధిత ఆందోళనల ప్రభావం వినియోగంపై ప్రభావం చోపుతోంది. వినియోగంపై కాకుండా పొదుపులవైపే వారి అధిక దృష్టి ఉంది. ఇది డిమాండ్‌ను కోవిడ్-19 ముందస్తు స్థాయిల్లోనే నిలబెడుతోంది. పన్ను మినహాయింపులు పెంచడం వల్ల వ్యక్తిగత ప్రైవేటు వినియోగం పెరుగుతుంది. ఇది మరిన్ని పెట్టుబడులకూ దారితీస్తుంది.
- ఆదాయం, డిమాండ్ వృద్ధి లక్ష్యాలుగా ఉపాధి కల్పన ప్రత్యేకించి నైపుణ్యం తక్కువగా ఉన్నవారికి ఉద్యోగ కల్పనపై బడ్జెట్ దృష్టి పెట్టే వీలుంది.
- భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం, ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు, విధానాలు, మౌలిక రంగం పురోగతికి తీసుకునే చర్యలు తయారీ రంగానికి కేంద్రంగా భారత్ ఆవిర్భవించడానికి చొరవలు, డిజిటలైజేషన్ ప్రోత్సాహకాలు దేశాభివృద్ధికి దోహదపడతాయి.
- లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, మౌలిక, విద్యుత్, టెలికమ్యూనికేషన్ పరిశ్రమలు ప్రధానంగా తమ పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది.
- లఘు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత రుణ పరమైన లభ్యత లభిస్తుందని, ఇది వారి వ్యాపారాలు త్వరిత గతిన గాడిన పడ్డానికి దోహదపడతాయని సర్వేలో పాల్గొన్న ఆయా రంగాల 50 శాతం మంది ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
180 మంది నుంచి అభిప్రాయ సేకరణ : ‘‘పారిశ్రామిక రికవరీ వేగానికి 2021 కేంద్ర బడ్జెట్ చర్యలు ఉంటాయా’’ అన్న శీర్షికన ఆన్‌లైన్‌లో డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితుల కల్పన వంటి అంశాలతో కూడిన 12 ప్రశ్నలను సర్వేలో సంధించారు. తొమ్మిది పరిశ్రమల నుంచి 180 మంది ప్రతినిధులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
తీసుకోవాల్సిన చర్యలు ఇవీ...
మౌలిక రంగంలో వ్యయాలు పెరగాలి. ప్రత్యేకించి ఉపాధి కల్పన విషయంలో ప్రోత్సాహకాలు కల్పించాలి. మధ్య పేద తరగతి ప్రజలకు ప్రస్తుతం కల్పిస్తున్న ఆదాయ, ఆర్థిక సహాయాలను కొనసాగించడమే కాకుండా, ఈ దిశలో మరిన్ని చర్యలు ఉండాలి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మరిన్ని నిధులు కేటాయించాలి. ఇది గ్రామీణ ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడమేకాకుండా, కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన గ్రామీణ కారి్మకులకు సైతం ఎంతో ప్రయోజనం కల్పిస్తుంది. చౌక గృహ నిర్మాణ రంగానికి మద్దతు నివ్వాలి. ఇప్పటికీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న చిన్న, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం తన మద్దతు కొనసాగించాలి. ప్రజారోగ్య వ్యయాలను పెంచాలి. ఆయా చర్యల ద్వారా పన్ను యేతర ఆదాయాలు మరింత పెరగడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రాలకు మరిన్ని నిధులను సమకూర్చాలి. రాష్ట్రాల హేతుబద్ధమైన వ్యయ ప్రణాళిలకు కేంద్రం మద్దతు ఉండాలి. తద్వారా 2021-22లో ఎకానమీ వృద్ధి రేటును 10 శాతంపైగా సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును జీడీపీలో 6.2 శాతానికి కట్టడి చేయగలుగుతాం.
డిమాండ్ - సరఫరా విధానాలపై వ్యత్యాసం!
సరఫరాల వైపు విధానాల గురించి క్లుప్తంగా చెప్పాలంటే, వస్తు సేవలకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాదారులే లక్ష్యంగా పన్ను కోతల వంటి ఉద్దీపన చర్యలు ప్రకటించడం. తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించడం. ఇక వినియోగదారుల అవసరాలు, వారి డిమాండ్‌లకు అనుగుణంగా పన్ను కోతలు తదితర చర్యలు తీసుకోవడం ఆయా డిమాండ్ చర్యలను తీసుకోవడడం ద్వారా ఆర్థిక పురోగతికి బాటలు వేయడం.
రికవరీ బాగుంది : ఆర్థిక రికవరీ తగిన సంతృప్తికరమైన బాటలో నడుస్తోందని ఇటీవలి గణాంకాలు, వ్యాపార సంకేతాలు తెలియజేస్తున్నాయి. స్వావలంభన భారత్, ఉత్పాదన అనుసంధాన ప్రోత్సాహకాలు వంటి పథకాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి దోహదపడుతున్నాయి. మౌలిక రంగంలో వ్యయాల వల్ల తమ వ్యాపారాలకు గట్టి మద్దతు లభిస్తుందని సంబంధిత పారిశ్రామిక వర్గాలు
భావిస్తున్నాయి. - సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్
Comments
Please login to add a commentAdd a comment