ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) ఒన నివేదికలో పేర్కొంది. భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల కాలంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకూ) 374.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మార్చి నెలలో 26 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదవుతాయని అంచనావేసింది.
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) జీడీపీలో 2.8 శాతంగా ఉంటుందని ఇండ్–రా అంచనావేసింది. విలువలో ఇది 23.6 బిలియన్ డాలర్లు. ఈ లెక్కలే నిజమైతే, క్యాడ్ ఈ స్థాయికి చేరడం 13 త్రైమాసికాల్లో ఇదే తొలిసారి అవుతుంది. క్రూడాయిల్ ధరల తీవ్రత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సవాలని పేర్కొంది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దిగుమతుల బిల్లు 606 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ దిగుమతుల విలువ 550 బిలియన్ డాలర్లుగా ఉంది.
చమురు దిగుమతుల భారం
నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల విలువ 155.5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2022–23లో ఎకానమీ రికవరీ వేగవంతం వల్ల చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022 ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ ఐదు శాతం పెరుగుతుందన్నది అంచనా. మిగిలిన అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని భావించిన పక్షంలో ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 165 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. చమురు ధరలు పెరిగే కొలదీ భారత్ దిగుమతుల భారం మరింత తీవ్రం అవుతుంది.
శాశ్వత ప్రాతిపదికన చమురు ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదలకు చమురు దిగుమతుల భారం 15 బిలియన్ డాలర్లు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 0.4 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. క్యాడ్ సమస్యకు ఈ పరిణామాలు దారితీయవచ్చు. చమురు అధిక ధరల వల్ల రూపాయి కూడా మరింత బలహీనపడే వీలుంది. చమురు దిగుమతుల ధరల తీవ్రత వాణిజ్యలోటును మరింత పెంచే అంశం. ఆయా అంశాలు విదేశీ మారకానికి సంబంధించి దేశానికి ప్రతికూలంగా మారతాయి. కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతంలోటును నమోదుచేస్తుందని ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అంచనావేసినప్పటికీ, చమురు ధరల తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment