Omicron Variant impact to be less severe on Indian Economy - Sakshi
Sakshi News home page

ఎకామనీపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ అంతంతే!.. పటిష్ట వృద్ధి లిస్ట్‌లో భారత్‌: ఆర్థిక శాఖ

Published Mon, Dec 13 2021 8:54 AM | Last Updated on Mon, Dec 13 2021 9:20 AM

Omicron Variant impact to be less severe on Indian Economy - Sakshi

  • జీడీపీ జోరుకు పగ్గాల్లేవ్‌ 
  • పటిష్ట వృద్ధిని సాధించనున్న దేశాలలో భారత్‌ 
  • ఆర్థిక శాఖ తాజా సమీక్ష 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దుష్ప్రభావాల తదుపరి పటిష్ట వృద్ధిని అందుకోనున్న కొద్దిపాటి ప్రపంచ దేశాలలో భారత్‌కూడా ఒకటని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ఇటీవల పలు దేశాలలో తలెత్తుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం దేశీయంగా తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. ఇందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన వేగవంత వ్యాక్సినేషన్‌ సహకరించనున్నట్లు తాజా ఆర్థిక సమీక్షలో తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కోవిడ్‌–19 దెబ్బకు పలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కుదేలైన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

 

8.4 శాతం అప్‌ 
Economy Of India
 ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్‌)లో రియల్‌ జీడీపీ 8.4 శాతం ఎగసింది. కరోనా మహమ్మారికి ముందు అంటే 2019–20 ఏడాది ఇదే కాలంలో వృద్ధితో పోలిస్తే ఇది రెట్టింపని నెలవారీ సమీక్షలో ఆర్థిక శాఖ వివరించింది. కోవిడ్‌–19 నేపథ్యంలోనూ వరుసగా నాలుగు త్రైమాసికాలపాటు ఆర్థిక పురోభివృద్ధిని సాధించిన దేశాలలో భారత్‌ ఒకటని వెల్లడించింది. గతేడాది(2020–21) క్యూ3, క్యూ4లతోపాటు.. ఈ ఏడాది క్యూ1, క్యూ2లను ప్రస్తావించింది. సర్వీసుల విభాగంలో నమోదైన రికవరీ, తయారీ, వ్యవసాయ రంగాలు సాధించిన నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించినట్లు పేర్కొంది. తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్న అంశాన్ని రికవరీ ప్రతిఫలిస్తున్నట్లు వివరించింది. భారీ వ్యాక్సినేషన్, సమర్థవంత ఆర్థిక నిర్వహణ, స్థూల, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఉత్తేజితం చేయడం వంటి మద్దతిచ్చినట్లు తెలియజేసింది.
 

మరింత స్పీడ్‌ 
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ మరింత పటిష్టపడనున్నట్లు తాజా సమీక్షలో ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యూ2లో ఇందుకు పలు సంకేతాలు(హెచ్‌ఎఫ్‌ఐలు) వ్యక్తమైనట్లు పేర్కొంది. సమీక్షలో ఆర్థిక శాఖ ఇంకా ఇలా వివరించింది.. ‘కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ గ్లోబల్‌ రికవరీకి తాజా సవాళ్లను విసురుతోంది. అయితే ప్రాథమిక దృష్టాంతాల ప్రకారం దేశీయంగా అంతంతమాత్ర ప్రభావాన్నే చూపగలదని అంచనా. వేగవంత వ్యాక్సినేషన్‌ ఇందుకు కారణంకానుంది. కోవిడ్‌–19వల్ల గతేడాది తగిలిన దెబ్బనుంచి దేశం వేగవంతంగా పుంజుకుంటోంది. క్యూ2లో ఇది ప్రదర్శితమైంది.

ఈ ఏడాదికి జీడీపీ 9.5 శాతం ఎగిసే వీలున్నట్లు తాజా సమీక్షలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) అభిప్రాయపడింది. మహమ్మారికి ముందు ఏడాది అంటే 2019–20తో పోలిస్తే ఇది 1.6 శాతం అధిక వృద్ధికి సమానం. గతేడాది నమోదైన క్షీణత నుంచి బయటపడి పటిష్ట రికవరీ సాధిస్తున్న అతికొద్ది ప్రపంచ దేశాలలో భారత్‌ ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు వ్యవసాయం దన్నునిస్తోంది. పుంజుకున్న ఆహార ధాన్యాల దిగుబడి, ఖరీప్, రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు, గ్రామీణ ప్రాంత ఆదాయాలు మెరుగుపడటం వంటి అంశాలు సహకరిస్తున్నాయి.

చదవండి: సింగపూర్‌ నుంచి వచ్చేవారికి తప్పిన ‘ రిస్క్‌’ ! కేంద్రం కొత్త ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement