Omicron Effect On Hyderabad Metro: మెట్రో ప్రయాణాలపై కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ కలకలం నేపథ్యంలో పీకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న మెట్రోకు తాజాగా మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. స్కూల్-కాలేజీలు, కొన్ని ఆఫీసుల వేళల మినహా.. మిగతా అన్ని టైంల్లో రైళ్లు అరకొర ప్రయాణికులతో దర్శనమిస్తున్నాయి. దీంతో మెట్రో ఆదాయంపై ప్రభావం పడుతోంది!.
ఇక ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో గుంపు ప్రయాణాలకు బదులు.. సొంత వాహనాలు, రైడ్‌లు బుక్ చేసుకుంటున్నవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలతో హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటకపోవడం తీవ్రతను తెలియజేస్తోంది. కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు రూట్లలో 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో కనాకష్టంగా మూడు లక్షల లోపే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతూనే.. ఆఫర్ల ద్వారా ప్రయాణికులను రాబట్టేందుకు మెట్రో ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇవీ కూడా కారణాలే!
అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం లేకపోవడం, సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో సిటీజన్లు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రోకు ఆశించిన స్థాయిలో ప్రయాణికుల ఆదరణ పెరగడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మరోవైపు ఐటీ, బీపీఓ, కేపీఓ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయడం కూడా మెట్రో రద్దీ గణనీయంగా తగ్గేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
గట్టెక్కేదెప్పుడో?
► మహా నగరంలో మెట్రో ప్రారంభం నుంచి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. గత నాలుగేళ్లుగా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నిర్మాణ వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు పెరగడంతోపాటు గతంలో తీసుకున్న రుణవాయిదాలు, వాటిపై వడ్డీ చెల్లింపులు, స్టేషన్లు, రైళ్లు, డిపోల నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు కూడా సంస్థకు భారంగా పరిణమిస్తున్నాయి.
► మెట్రో నష్టాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరచూ ఉన్నతస్థాయిలో సమీక్షా సమావేశాలు జరుపుతున్నా... ఆర్థిక సాయం అందజేసే అంశంపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో మొదటిదశలో పెండింగ్‌లో ఉన్న ఎంజీబీఎస్–ఫలక్‌నుమా సహా రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రూట్లలో మెట్రో ప్రాజెక్టు ఎప్పుడు సాకారం అవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారింది.
► వచ్చే ఏడాది జనవరి నుంచి పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే అవకాశాలుండడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కు చేరుకుంటుందని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తుండడం విశేషం. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో మూడు మార్గాల్లో సుమారు 10 లక్షల మంది జర్నీ చేస్తారని దశాబ్దం క్రితం సిద్ధంచేసిన మెట్రో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో అంచనా వేశారు. అందులో సగం మార్కును ఇప్పటికీ చేరుకోకపోవడం విశేషం.
చదవండి: Hyderabad.. మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్!
Comments
Please login to add a commentAdd a comment